శ్రీసాయిబాబా మహాసమాధి చెంది ఎంతోకాలం కాకుండానే భారతీయ ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఒక భాగమయ్యారు. ఈనాడు దేశం మొత్తం మీద పెద్ద నగరాలలోనూ, పట్టణాలలోనే కాకుండా పల్లెపల్లెలా, వాడవాడలా సాయిమందిరాలు వెలిసాయి. ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. వాటి గురించిన వివరాలను, వాటి ప్రాముఖ్యతను పాఠకులకు అందించాలనే సంకల్పంతో 'మందిర పథం' శీర్షికన 'సాయిపథం' పబ్లికేషన్స్‌లో ప్రచురించారు. అందులోనుండి పూనాలోని 'శివాజీనగర్ మందిరా'నికి సంబంధించిన ఈ అద్భుతమైన సమాచారాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము. ఈ సమాచారాన్ని 'సాయిపథం' ప్రథమ సంపుటం నుండి సేకరించడమైనది. బాబా, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆ సాయిమందిర వివరాల్లోకి వెళదాము...
ప్రస్తుతం పూనాలో ఉన్న ఎన్నో సాయిబాబా మందిరాలలో ఒక ప్రత్యేక చరిత్ర ఉన్న "శివాజీనగర్ మందిరం" గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ మందిరం శివాజీనగర్ చివరనున్న 'ముతానది' ఒడ్డున 'రస్నేచాల్' సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది నీరు మందిరం వరకు వస్తూ ఉండటంతో, అడ్డుగా గోడనొకదాన్ని కట్టి రోడ్డు నిర్మించారు. ఈ మందిరానికి వచ్చే భక్తులు బాబా దర్శనంతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారు.
శ్రీ దామోదర్‌పంత్ రస్నే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందిన ధన్యజీవి. 1945లో దామోదర్‌పంత్ కుమారుడు నానాసాహెబ్ రస్నే తన గృహ సముదాయం (రస్నేచాల్)లోని రెండు గదులను బాబా మందిరంగా రూపొందించి నిత్య నైవేద్యాలతో పూజలు క్రమం తప్పకుండా జరిపించేవాడు. ఉదయం ఆరతి, సాయంత్రం ఆరతి నిర్వహించడం మొదలైన తరువాత అధికసంఖ్యలో భక్తులు వచ్చి బాబా దర్శనం చేసుకోవడం ప్రారంభించారు.
ఖేడ్ కు చెందిన శ్రీనికమ్ పోలీసు శాఖలో జమేదారుగా పని చేసేవాడు. ఇతను ఆధ్యాత్మిక చింతన గలవాడు. శ్రీ నానాసాహెబ్ రస్నే పిలుపునందుకొని తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి తన జీవితాన్ని మందిరసేవకే అంకితం చేశాడు. ఇతను మందిర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడమేకాక, అతని దగ్గరున్న 'బాబా పవిత్రదంతాన్ని' మందిరానికి బహుకరించాడు. దీనితో ఈ మందిరం యొక్క చరిత్రే మారిపోయింది. దేశం నలుమూలల నుండి అసంఖ్యాకంగా భక్తులు రాసాగారు. ఈ పవిత్రదంతం నికమ్‌కు ఎలా లభ్యమైందో తెలిపే ఉదంతం అత్యంత ఆసక్తికరమైనది.
పరమపావనుని దంత-ఉదంతం
ఆద్యంతం ఆసక్తిదాయకం
శిరిడీకి చెందిన కాశీబాయికి నీఫాడ్ గ్రామానికి చెందిన యువకునితో వివాహమయ్యింది. దురదృష్టవశాత్తు వివాహమైన కొద్దిమాసాలకే ఆమె భర్త మరణించాడు. భర్త మరణించేనాటికి ఆమె గర్భవతిగా ఉండటంతో ఆ తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడికి 'మాధవ్' అని పేరు పెట్టింది. మాధవ్‌కు సంవత్సరం వయసు ఉన్నప్పుడు నీఫాడ్ నుండి శిరిడీ వచ్చి తన తండ్రి వద్ద నివసించసాగింది. వ్యవసాయకూలీగా తన జీవనం సాగించేది. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాలలో పని చేయవలసి రావడంతో మాధవ్ ఆలన పాలన పెద్ద సమస్యగా తయారైంది. చివరికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఉదయమే మాధవ్‌ని తీసుకెళ్లి బాబా మసీదు (ద్వారకామాయి)లో వదిలి పొలానికి వెళ్ళిపోయేది. తిరిగి సాయంత్రం పని అయిన తరువాత మసీదుకు వెళ్ళి పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్లేది. ప్రతిదినం ఇంటికి వెళ్లే ముందు బాబాకు నమస్కరించడం మాత్రం మరిచిపోయేది కాదు. ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్‌కు ఐదు సంవత్సరాల వయస్సు నుండి, బాబా వాడికి ప్రతిదినం ఒక రూపాయి ఇస్తుండేవారు. మాధవ్ బాబాకు ఏవో చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు.
ఇలా గడుస్తుండగా ఒకరోజు కాశీబాయి మసీదుకొచ్చి బాబాతో, "బాబా! మీరు అందరికీ రోజూ రూ. 50, 30, 15 వంతున డబ్బు ఇస్తుంటారు. మీకు చిన్న చిన్న పనులు చేసే మాధవ్‌కు మాత్రం ఒక్క రూపాయే ఇస్తారెందుకని?" అడిగింది. బాబా, "కాశీబాయీ, నీ కొడుక్కి తక్కువ ఇస్తున్నానని నాకు తెలుసు. కానీ కొంతకాలం తరువాత తక్కిన వారికి మానివేసినా, నీ కొడుక్కి మాత్రం ఇవ్వడం మానను. నీలాంటి ఆధారంలేని వారందరికీ నేనే దిక్కు, నేనే యజమానిని!" అన్నారు. కాశీబాయికి బాబా మాటలు అర్థం కాలేదు. "నా యజమాని నా భర్త కదా? ఆయనెప్పుడో చనిపోయాడు!" అని అంది. దీనితో బాబా కోపించి పెద్దగా అరవడం ప్రారంభించారు. కాశీబాయి భయపడి మసీదు నుండి పారిపోయింది. ఆ తర్వాత మసీదుకి రావడం మానుకుంది. రెండు మూడు రోజుల తర్వాత కాశీబాయిని బాబా పిలవనంపారు. ఆమె మాధవ్‌ను తీసుకొని మసీదుకు వచ్చింది. బాబాతో మాట్లాడటానికి భయపడి మౌనంగా నిలబడింది. బాబా ఆమెను ప్రేమగా పలకరించారు. బాబాకు కొంతకాలంగా పన్ను ఒకటి కదులుతూ ఉండేది. బాబా ఆ పంటిని తీసి ఒక గుడ్డముక్కలో ఉంచి దానిపై ఊదీ వేసి మూటకట్టి కాశీబాయికిచ్చి, "ఈ తాయెత్తు నీదగ్గర ఉంచుకో, నీకు మంచి జరుగుతుంది!" అని చెప్పారు. కాశీబాయి సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది.
మాధవ్ పెరిగి పెద్దవాడయ్యాడు. బాబా తాయెత్తు వారింటికి వచ్చినప్పటి నుండి బాగా కలిసివచ్చి వారికి ఏలోటూ లేకుండా పోయింది. మాధవ్‌ను అందరూ మాధవరావ్ అని పిలవసాగారు. మాధవరావు తాయెత్తు తన చేతికి కట్టుకొని పవిత్రంగా చూసుకునేవాడు. కాశీబాయి చనిపోయిన తర్వాత నీఫాడ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఒకసారి మాధవరావు తీవ్ర అనారోగ్యానికి గురయినప్పుడు బాబా కలలో కనిపించి, "ఈరోజు మీ ఇంటికి వచ్చే నికమ్ అనువానికి నీ చేతికి కట్టుకున్న తాయెత్తును ఇవ్వు!" అని ఆదేశించారు. నికమ్‌కు కూడా బాబా కలలో కనిపించి, "మాధవరావు దగ్గరనున్న తాయెత్తు తీసుకో"మని చెప్పారు. నికమ్ మాధవరావు ఇంటికొచ్చి తాయెత్తు తీసుకున్నాడు. ఆ తాయెత్తు అతని దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత అది శివాజీనగర్ మందిరానికి చేరింది. ఈ విధంగా బాబా పవిత్ర దంతం కాశీబాయి నుండి ఆమె కొడుకు మాధవరావుకు, మాధవరావు నుండి నికమ్‌కు, నికమ్ నుండి శివాజీనగర్ మందిరానికి వచ్చింది. అంటే తిరిగి తిరిగి అది బాబా చెంతకే వచ్చిందన్నమాట. మందిర నిర్వాహకులు ఆ పవిత్రదంతాన్ని బాబా విగ్రహం ముందున్న పాదుకల క్రింద భద్రపరిచారు. బాబా శరీరంలోని ఒక భాగమైన ఆ దంతం ఈ మందిరంలో ఉండటం వలన సాయిభక్తులకిది బాబా ప్రత్యక్ష సన్నిధితో సమానం.
ఈ మందిరాన్ని సందర్శించే వారిలో, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వారి ఆశీర్వాదాలు పొందిన భక్తుడు 'శ్రీ నానాసాహెబ్ అవస్థే' ఒకరు. 1950లో ఈ మందిర అభివృద్ధి కోసం 'శ్రీ సాయిదాస మండలి' అను సంస్థ స్థాపించబడింది. మండలి సభ్యులు మందిరానికి మరమ్మతులు చేసి, మందిరం ముందు ఒక 800 చదరపు అడుగుల విశాలమైన హాలు నిర్మించారు. ఇక్కడ గురుపూర్ణిమ, శ్రీరామనవమి, బాబా పుణ్యతిథి(విజయదశమి) పండుగలు వైభవంగా జరుగుతాయి.
వరదాయి సాయిని, వరదనీరంటునా?
ఇక్కడ ఈ మందిరానికి సంబంధించిన అద్భుతమైన లీల ఒకటి అవశ్యం చెప్పి తీరాలి. తేదీ12.07.1961న పాన్షర్ డాము క్రుంగి దానిలోని నీరు వెలుపలకు ప్రవహించి పూనా నగరాన్ని ముంచివేసింది. అక్కడున్న ఇళ్ళు చాలావరకు కూలిపోయి అపార నష్టం సంభవించింది. శ్రీ సాయి మందిరమున్న శివాజీనగర్ లోతట్టు ప్రాంతమైనందున మందిర గోపురం పైన 20, 25 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచింది. తరువాత కొన్నిరోజులకు వరద వెనకకు తీసిన తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. సాయిమందిరం మొత్తం మట్టిలో కూరుకొని పోయింది. ఈ మట్టిని తొలగించి మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చే కార్యక్రమం అతి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అయినా మండలి సభ్యులు, సాయిభక్తులు అమితోత్సాహంతో పనిచేసి నాలుగైదు రోజులలో పని పూర్తిచేశారు. అప్పుడు వారికి అగుపడిన దృశ్యం అద్భుతం!! "నిత్య పూజలందుకుంటున్న బాబా రంగుల చిత్రపటం చెక్కుచెదరక, పూర్వంవలే జీవకళ ఉట్టిపడుతోంది". ఈ పటం ఎన్నోరోజులు వరద నీటిలో మునిగి ఉన్నదంటే ఎవరూ నమ్మలేరు. మందిరం ప్రక్కనున్న ఔదుంబర వృక్షం కూడా కళకళలాడుతూ కనిపించింది. అది కనీసం ప్రక్కకు కూడా ఒరగలేదు. ఈ అద్భుతలీలతో బాబా సంపూర్ణ అనుగ్రహం ఈ మందిరంపై ఉన్నదని అందరూ విశ్వసించారు. తర్వాత మండలి సభ్యులు అందమైన బాబా పాలరాతి విగ్రహాన్ని తయారుచేయించి మందిరంలో ప్రతిష్ఠింపచేశారు. వరదకు తట్టుకొని నిలిచిన బాబా రంగులపటం కూడా నిత్యపూజలు అందుకుంటున్నది.
ధన్యవాదములు .సాయిరాం.
ReplyDelete