సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శివాజీనగర్‌ శ్రీ సద్గురు సాయినాథ్ మందిరంలో జరిగిన మరికొన్ని బాబా లీలలు


శివాజీ నగర్ బాబా టెంపుల్

పూణేలోని శివాజీనగర్‌లో రస్నేచాల్ వద్దనున్న పురాతనమైన బాబా మందిరం గురించి నిన్న తెలుసుకున్నాము. ఆ మందిరంలో బాబా దంతం బాబా పాదుకల క్రింద స్థాపించబడి ఉండటంతో మంచి ఆధ్యాత్మికశక్తితో ఈ ఆలయం అలరారుతూ ఉంది. అక్కడ చాలామంది భక్తులు అనేక అనుభవాలు కలిగి ఉన్నారు. వాటిలో కొన్నిటిని దిగువ ఇస్తున్నాము.
బాబా దంతం ఉన్నది ఈ పాదుకల క్రిందనే

వ్యసనపరులను బాబా క్షమించరు.

మొదటి లీల:

ఒక మద్యపాన వ్యసనపరుడు తాగినమత్తులో తూలుతూ తరచూ ఈ మందిరానికి వస్తూ ఉండేవాడు. ఇతర భక్తులు అతనిని ఆ స్థితిలో మందిరానికి రావద్దని, ఎక్కువకాలం బాబా సహించకపోవచ్చని తరచూ హెచ్చరిస్తూ ఉండేవారు. కానీ వారి హెచ్చరికలను అతడు పట్టించుకునేవాడుకాదు. ఒకరోజు అతను మత్తులో అటూయిటూ తూలిపోతూ ఆలయంలోకి వచ్చి, బాబా పాదుకలపై శిరస్సు ఉంచాడు. ఆ మరుక్షణంలో అతను నేలపై పడి మూడుసార్లు దొర్లాడు. భక్తులు అతన్ని పైకి లేపి ఏమి జరిగిందని ప్రశ్నించగా, షాక్‌లోనే అతను, "నేను బాబా పాదుకలపై శిరస్సు ఉంచిన సమయంలో బాబా చాలా బలంగా నన్ను చాచి తన్నారు. దానితో నేను క్రింద పడిపోయాను" అని చెప్తూనే కంగారుగా బయటకు పరుగుతీసాడు. తరువాత మరెప్పుడూ తిరిగి రాలేదు.

రెండవ లీల:

ఒకప్పుడు ఒక యువకుడు ఉద్యోగం కోసం ఆలయానికి వచ్చాడు. అతను కాషాయరంగు వస్త్రాలు ధరించి, పొడవాటి జుట్టు, పొడవైన గడ్డం మరియు ఒత్తైన మీసాలు కలిగి ఒక సాధువువలె కనిపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో పూజారి అవసరం ఉండటంతో మందిర కమిటీ వాళ్ళు అతను ఆలయానికి మంచి సేవలను ఇస్తాడని భావించి అతనిని పూజారిగా నియమించి, అతను ఉండడానికి ఆలయ ప్రాంగణంలో ఒక గదిని కూడా ఇచ్చారు.

కొన్నిరోజుల తరువాత ఆలయానికి వచ్చే కొందరు భక్తులు అతడు ఆలయం వెలుపల కూర్చుని గంజాయి సేవించడం గమనించి, ఆ అలవాటు మానుకోమని, లేకుంటే బాబా కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అతడు వారి హెచ్చరికలను పట్టించుకోకుండా అలానే ప్రవర్తిస్తుండేవాడు. ఆ తరువాత ఒకరోజు ఉదయం భక్తులు కాకడ ఆరతికి వచ్చి చూస్తే ఆలయం మూసి ఉంది; పూజారి లోపలే ఉన్నాడు. ఆరతికి  సమయం అవుతూ ఉండటంతో తలుపులు బాదారు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. పూజారి పరిస్థితి చిందరవందరగా ఉంది. భక్తులు అతనిని, "మీకు ఏమి జరిగింద"ని అడిగారు. అతను చేతులు ముడుచుకుని, "సర్! నేను ఇకపై ఇక్కడ పనిచేయను. నిన్న రాత్రి నేను గంజాయి పొగత్రాగి నిద్రపోయాను. మీరు ఆరతికోసం వచ్చేటప్పటికి గాఢనిద్రలో ఉన్నాను. అప్పుడు ఎవరో నా జుట్టు పట్టుకొని జాడించి, తీవ్రంగా అటుఇటు ఊపుతూ నన్ను మేల్కొలిపారు. నన్ను క్షమించండి! నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండాలంటే నాకు భయంగా ఉంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. 

సోర్స్: శ్రీ సాయి సాగర్ మ్యాగజైన్, దీపావళి సంచిక 2001.

మూడవ లీల:

ఈ మందిరానికి సంబంధించిన మరో అద్భుతమైన అనుభవాన్ని భువనేశ్వర్ మాధవిగారు ఇలా తెలియజేస్తున్నారు:

మొన్న విజయదశమికి నేను భువనేశ్వర్ నుండి శిరిడీ వెళ్లి వచ్చేటప్పుడు ఈ మందిరాన్ని దర్శించాను. అప్పుడు అక్కడ ఎన్నో ఏళ్లుగా కమిటీ మెంబర్ గా ఉన్న తివారిగారు మాటలలో ఒక ఆసక్తికరమైన బాబా లీలను ఇలా చెప్పారు: "రెండు మూడేళ్ళ క్రితం, అంటే బహుశా 2015లో అనుకుంటా, మేమంతా పల్లకి యాత్ర చేసుకుంటూ శిరిడీ వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని నడుచుకుంటూ తిరిగి పూనా చేరుకున్నాము. అప్పటికి బాగా రాత్రి అయింది. పల్లకిని మందిరంలో ఉంచాలని మందిరం వద్దకు చేరుకొని చూస్తే, మూసి ఉన్న రెండు చెక్కతలుపుల మధ్యలో రెండు దీపాలు వెలుగుతున్నట్లుగా కనిపించాయి. చెక్కతలుపులకు మంటలు అంటుకున్నాయేమోనని కంగారుగా వెళ్లి తాళాలు తీసి తలుపులు తెరిచేసరికి మేము చూస్తుండగానే ఆ రెండు జ్యోతులు నేరుగా వెళ్లి బాబా కళ్ళలో కలిసి పోయాయి. మేమంతా బాబా మహిమకు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. ఇప్పటికీ ఇక్కడ చాలామందికి బాబా దివ్యదర్శనం జరుగుతుంది".

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo