శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
కుశాల్‌చంద్ పార్ట్ 1 ను గత గురువారం నాడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రచురించాము. నేడు రెండవ భాగాన్ని ప్రచురిస్తున్నాము. ఎవరైనా ముందు భాగాన్ని చదవాలనుకుంటే కుశాల్‌చంద్ పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.....
కుశాల్‌చంద్ |
సాయితో పెనవేసుకున్న అనురాగబంధం - ఏ జన్మదో ఈ ఋణానుబంధం.
శ్రీసాయి దేహధారిగా ఉన్నప్పుడు ఆయన దర్బారులోని భక్తమండలిని నిశితంగా అవలోకిస్తే అనేక విధాలుగా వారు బాబాతో ప్రేమ అనే బంధంతో ముడిపడిన విధానం అద్భుతంగా గోచరిస్తుంది.
సమర్థ సద్గురునాథుడైన శ్రీసాయి సన్నిధానం కోసం ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా త్యజించి తమ జీవితాలను సాయి సాన్నిహిత్యంలో పునీతం చేసుకున్న భక్తులు కొందరైతే, రకరకాల కోరికలు ఇష్టాలను తీర్చుకోవడానికి మొదటగా బాబా వద్దకు వచ్చినా, ఆయన సన్నిధిలో కుండపోతగా వర్షించే ఆనందానుభూతిలో తడిసి జ్ఞానసూర్యుని ప్రేమకక్ష్యలో చిక్కుకుపోయిన భక్తులు ఇంకొందరు. పై రెండువిధాలుగా కాక తమ ప్రాపంచిక జీవితంలో తలమునకలవుతూనే ఎటువంటి ఐహిక ఆధ్యాత్మిక ఆశలు లేనప్పటికీ సాయిని తమ జీవితంలో అత్యంత ప్రీతిపాత్రునిగా భావించి, ఆరాధించి తరించిన భక్తులు మరికొందరు! అందరిపై శ్రీసాయినాథుడు సమదృష్టి సారించినప్పటికీ లౌకికంగా కొందరిపై శ్రీసాయి చూపించిన ప్రత్యేక ప్రేమాభిమానాలు కించిత్తు ఆశ్చర్యం కలిగించక మానవు. అటువంటి అపార ప్రేమాభిమానాలు పొందిన భక్తులలో రహతాకు చెందిన శ్రీచంద్రభాన్‌శేఠ్, శ్రీకుశాల్‌చంద్‌లను ప్రముఖంగా పేర్కొనవచ్చు.
ముఖ్యంగా శ్రీకుశాల్‌చంద్‌పై బాబా చూపించిన అభిమానం - కుశాల్‌చంద్ తమ దర్శనానికి రావడం కొద్దిరోజులు ఆలస్యం చేస్తే అతనిని చూడడానికి బాబా చూపే ఆరాటం, స్వయంగా తానే పరామర్శించడానికి వెళ్లడం చూస్తే సర్వాంతర్యామి, సకల జీవస్వరూపుడు అయిన శ్రీసాయిలో కనిపించే మాతృప్రేమకు నిదర్శనంగా అనిపించక మానదు.
సాయి మమతను చూరగొన్న భాగ్యశాలి - భక్తి ప్రేమలు సమ్మిళితమైన సుగుణశీలి
అంతటి అదృష్టాన్ని స్వంతం చేసుకున్న శ్రీ కుశాల్‌చంద్, శ్రీచంద్రభాన్‌శేఠ్‌ల జీవిత విశేషాలను, బాబాతో వారి అనుబంధాన్ని పరిశీలిద్దాం.
శ్రీచంద్రభాన్‌సేఠ్, శ్రీకుశాల్‌చంద్‌సేఠ్ రహతాకి చెందిన ప్రఖ్యాత సాండ్ కుటుంబానికి చెందినవారు. వీరి ఆధీనంలో నడిచే వివిధ వ్యాపారసంస్థలు మహారాష్ట్రలో విఖ్యాతమైనవి. ఆ రోజుల్లో వీరికి రెండువేల ఎకరాల భూమి, అహ్మద్‌నగర్, తంబూరి ప్రదేశాలలో కాటన్ మిల్లులు ఉండేవి. అంతేగాక అహ్మద్‌నగర్, ఔరంగాబాదు, సేలు, జాల్నా, నిజాం రాష్ట్రాలలో వీరికి చెందిన వివిధ వ్యాపారసంస్థలు ఉండేవి. అంతటి ధనిక కుటుంబానికి శ్రీశివరాం రామచంద్రసేఠ్ కుటుంబ పెద్ద. ఆయన రెండవ కుమారుడే శ్రీచంద్రభాన్‌శేఠ్. చంద్రభాన్‌శేఠ్ అన్నగారి కుమారుడు శ్రీకుశాల్‌చంద్. మొదట శ్రీచంద్రభాన్‌సాండ్‌తో మొదలైన శ్రీసాయి అనుబంధం కుశాల్‌చంద్ తో బాగా బలపడింది. ఈ కుటుంబసభ్యులపై శ్రీసాయి ప్రేమాభిమానాలు అపారం. వీరి కుటుంబానికి శ్రీసాయి ప్రసాదించిన అనుభవాలను సాండ్ కుటుంబసభ్యులతో 'సాయిపథం' సత్సంగసభ్యులు జరిపిన ఇంటర్వ్యూను కూడా తరువాత భాగంలో మీ ముందు ఉంచుతున్నాము.
శ్రీసాయి కుశాల్‌చంద్ ఇంటికి తరచుగా వచ్చేవారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. శ్రీచంద్రభానుశేఠ్ 1911లో దివంగతులైనప్పటికీ శ్రీకుశాల్‌చంద్ కోసం బాబా రహతా వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబా దర్శనానికి ఒక వారం పది రోజులు పని ఒత్తిడి వలన రాలేకపోయినట్లయితే స్వయంగా బాబానే ఆయనను చూడటానికి వెళ్లేవారు, లేదా ఎవరైనా భక్తులను కుశాల్‌చంద్‌ని తీసుకురమ్మని పంపేవారు. అలాంటి కొన్ని సంఘటనలు ఇక్కడ చూద్దాం. ఒకసారి మధ్యాహ్న ఆరతి తర్వాత బాపూసాహెబు జోగ్, వామనరావు పటేల్ (సాయి శరణానంద) వద్దకు వచ్చి బాబా రహతాలో కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారని, తను తన భార్య అక్కడికే బయలుదేరామని, వామనరావు కూడా రావాలనుకుంటే రావొచ్చని చెప్పాడు. అప్పుడు బాపూసాహెబు జోగ్, శ్రీమతి జోగ్, వామనరావు పటేల్ ముగ్గురూ బండిలో రహతాలోని కుశాల్‌చంద్ ఇంటికి వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను అత్యంత భక్తిశ్రద్ధలతో లోపలికి ఆహ్వానించి, పూజించాడు. కుశాల్ ఒక ప్లేటునిండా పండ్లు తీసుకువచ్చి బాబా ముందు పెట్టగా, వామనరావు ఒక అరటిపండును ఒలిచి బాబా చేతిలో ఉంచాడు. బాబా సగం పండు తిని, మిగిలిన దానిని ప్రసాదంగా వామనరావుకి ఇచ్చారు. కొంతసమయం అక్కడ గడిపాక బాబా బండిలో శిరిడీకి వచ్చేశారు.
చంద్రభాన్‌సాండ్ |
అలాగే ఒక మధ్యాహ్నం బాబా కాకాసాహెబ్ దీక్షిత్‌ను పిలిచి, "రహతాకు టాంగాలో వెళ్లి కుశాల్‌భావుని తీసుకునిరా, తను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. బాబా నిన్ను చూడాలంటున్నారని, తొందరగా రమ్మంటున్నారని చెప్పు" అని అన్నారు. బాబా ఆజ్ఞను సవినయంగా స్వీకరించి టాంగాలో రహతాకు వెళ్లి కుశాల్‌చంద్‌ను కలిసి తను వచ్చిన పనిని, బాబా చెప్పమన్న మాటలను చెప్పాడు శ్రీదీక్షిత్. ఆ మాటలను వినగానే శ్రీకుశాల్‌చంద్ సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోతూ, "నేను ఇందాక నిద్రపోతుంటే నిద్రలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా కనిపించి ఇవే మాటలు చెప్పారు. వెంటనే బాబాను చూడాలని శిరిడీ బయలుదేరాను. కానీ గుర్రం లేకపోవడం వలన రాలేకపోయాను. ఈ విషయం బాబాకు తెలియజేయమని ఇంతకుమునుపే నా కుమారుడిని శిరిడీకి పంపించాను" అన్నాడు. ఇప్పుడు బాబా మీకోసం టాంగాను పంపించారని, కావాలంటే అందులో రావచ్చని కాకాసాహెబ్ చెప్పగా కుశాల్‌చంద్ కాకాసాహెబుతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.
పై రెండు ఉదాహరణలు బాబాకు, కుశాల్‌చంద్ కుటుంబానికీ మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధానికి తార్కాణాలు. బాబా సమాధి చెందే కొద్దిరోజుల ముందు కూడా రహతా వెళ్లి కుశాల్‌చంద్ కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారని తెలుస్తున్నది. శ్రీసాయి అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో దేహత్యాగం చేసినప్పుడు ముస్లిం భక్తులతో పాటుగా బాబాను కబరిస్థాన్‌లో సమాధి చేయాలని పట్టుపట్టిన వారిలో కుశాల్‌చంద్ ఒకరు. బాబా ప్రేమామృతాన్ని తనివితీరా గ్రోలిన కుశాల్‌చంద్ బాబా లేని లోకంలో తనెందుకు అనుకున్నాడో ఏమో, బాబా సమాధి చెందిన సరిగ్గా నెల రోజులకు అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమయ్యారు.
రేపటి భాగంలో శ్రీకుశాల్‌చంద్ కుటుంబసభ్యులతో "సాయిపథం" ఇంటర్వ్యూ..
సాండ్ కుటుంబ వంశవృక్షం |
No comments:
Post a Comment