సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు కుశాల్‌చంద్


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయి భక్తుడు కుశాల్‌చంద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాభక్తునికి గురించి స్మరించుకొనే ప్రయత్నంలో ఈ ఆర్టికల్  ప్రచురిస్తున్నాము.


కుశాల్‌చంద్

సాయిబాబాకు  కొందరిపట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు ఉండేవి. శిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్‌ని ఎంత అభిమానంగా చూసుకునేవారో, రహతాకు చెందిన 'చంద్రభాన్ శేట్  మార్వాడి' పై కూడా అంతే అభిమానాన్ని కనబరిచేవారు. శేట్ మరణించాక, అతని అన్న కొడుకైన కుశాల్‌ను బాబా ఎంతో ప్రేమించేవారు. అహర్నిశలూ అతని యోగక్షేమాల గురించి తెలుసుకునేవారు. బాబా షిరిడీ విడిచి ఎక్కడికీ  వెళ్లేవారు కాదు. అప్పుడప్పుడు రహతా  లేదా నీంగాఁవ్ వైపు వెళ్తుండేవారు. కుశల్‌చందును చూడాలనిపిస్తే వెంటనే రహతాకు బయల్దేరి వెళ్లేవారు. ఒకవేళ వెళ్ళటానికి వీలుకాకపోతే కుశల్‌చందును బాబా తన చెంతకే రప్పించుకునేవారు. ఒక్కోసారి టాంగాలోనూ, ఒక్కోసారి ఎద్దులబండిపై తన సన్నిహితులతో కలిసి బాబా రహతాకు వెళ్లేవారు. రహతా ప్రజలు గ్రామ పొలిమేరలో బాజాభజంత్రీలతో బాబాకు ఘనస్వాగతం పలికేవారు. బాబాకు సాష్టాంగనమస్కారాలు చేసి గ్రామంలోకి ఆహ్వానించేవారు. తరువాత మహావైభవంగా బాబాను ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు. కుశాల్‌చంద్ బాబాను తన ఇంటికి ఆహ్వానించి, బాబాను ఉచితాసనంపై కూర్చుండబెట్టి పూజించేవాడు. అనంతరం బాబాకు భోజనం పెట్టేవాడు. భోజనాలయ్యాక ఇద్దరూ ప్రేమోల్లాసాలతో కబుర్లు చెప్పుకునేవారు. అనంతరం వారిని బాబా ఆశీర్వదించి శిరిడీకి బయలుదేరేవారు. అప్పుడు కూడా రహతావాసులు బాబాను గ్రామ పొలిమేరవరకు గౌరవాభిమానాలతో సాగనంపేవారు.

కుశాల్‌చంద్ ఇంట్లో బాబా ఆశీనులైన ప్రదేశం

ఒక్కోసారి బాబాకు రహతా వెళ్లడం వీలయ్యేది కాదు. అటువంటప్పుడు కుశాల్‌చందునే మసీదుకు రప్పించేవారు. లేదా, కల ద్వారా కుశాల్‌చందుకు అనుభవం కలిగించి తన వద్దకు బాబా రప్పించుకునేవారు. సాధారణంగా తెల్లవారుఝామున వచ్చే కలలు నిజం అవుతాయని అంటారు. అది నిజమే కావచ్చు కానీ, బాబా స్వప్నాలకు కాలనియమం లేదు. ఒకనాటి సాయంకాలం బాబా కాకాసాహెబు దీక్షిత్‌ను పిలిచారు. రహతా వెళ్లి చాలారోజులైందనీ, కుశాల్‌ను చూడాలని ఉందనీ, కాబట్టి అతనిని తీసుకురమ్మని దీక్షిత్‌తో చెప్పారు. కాకాసాహెబు టాంగాను తీసుకుని రహతాకు బయలుదేరాడు. కుశాల్‌చందును కలుసుకుని బాబా రమ్మంటున్నారని చెప్పాడు. అది విని కుశాల్‌చంద్  ఆశ్చర్యపోయాడు. తాను మధ్యాహ్న భోజనం చేసి నిద్రపోతుండగా తనకు కలలో బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని ఆదేశించారని, కాబట్టి శిరిడీ వచ్చే హడావిడిలో ఉన్నానని కుశాల్ చెప్పాడు. సరిగ్గా తనకు కుశాల్‌ను తీసుకురమ్మని చెప్పినట్లే, బాబా కుశాల్‌కు కూడా కలలో కనిపించి చెప్పారన్నమాట అనుకున్నాడు కాకాసాహెబ్. తన గుర్రం సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆ సంగతి చెప్పడానికి బాబా వద్దకు తన కుమారుడిని పంపానని, అంతలో మీరు వచ్చారని కుశాల్ కాకాతో అన్నారు. ఇద్దరూ కలిసి బాబా వద్దకు వెళ్లారు. కుశాల్‌చంద్ బాబాను దర్శించుకుని ఎంతో ఆనందించాడు.
    
పారమార్థిక జీవితంలో మనిషి కర్తవ్యం ఏమిటో, మానవ వికాసానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో  ఆచరించి చూపారు బాబా. వాటిని ఇతరులను ఆచరించమన్నారు. ఒకసారి కుశాల్‌చందుకు కూడా బాబా అలాంటి అనుభవాన్ని స్వయంగా కలిగించారు. బాబా సహించని వాటిలో సోమరితనం ఒకటి. మనిషికి రాయిలా ఒకచోట పడివుండే గుణం అచ్చిరాదని బాబా చెప్పేవారు. 84 లక్షల జన్మల తరువాత లభించిన మానవజన్మను ఫలప్రదం చేసుకోవాలంటే బ్రతికున్నంతకాలం ఏదో పని చేస్తూనే ఉండాలని బోధించేవారు.

కుశాల్‌చంద్ చాలాసార్లు బాబాను దర్శించుకునే వంకతో వచ్చి మసీదులోనే ఉండిపోయేవాడు. రోజుల తరబడి అలాగే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలంపాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌ను బాబా దగ్గరకు పిలిచారు.

"కుశాల్‌చంద్! నీకు కొంత పొలం ఉంది కదా? అందులో ఏ పంటలూ పండించడం లేదా?" అని బాబా అడిగారు.

"లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు" అని కుశాల్‌చంద్ చెప్పాడు.

"భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా బాబూ! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను" అని బాబా అతనికి చెప్పారు.

కుశాల్‌చంద్ పొలం మొత్తం దున్ని, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ, "దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్?" అని అడిగారు. కుశాల్‌చంద్ తాను నిలువుగా దున్నానని చెప్పగానే, "ఈసారి అడ్డంగా దున్ని చూడు, తప్పకుండా దొరుకుతాయి!" అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్ అలా కూడా చేసి, లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. "సరే! దొరక్కపోతే ఏం చేస్తాం? ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి,  అందులో మిరపవిత్తనాలు చల్లు!" అని బాబా సూచించారు. కుశాల్‌చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరపపంట అన్నదే లేదు. కుశాల్‌చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్  తనకు వచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు.

"లంకె బిందెలు ఎదురుగా పెట్టి దొరకలేదని అబద్ధం చెబుతావేమయ్యా? ఇవే లంకెబిందెలు. సుఖం, కోరికలు, సంపద, కీర్తి, ప్రతిష్ట ఏదైనా సరే అయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిది సంపద దక్కదు. సాధన చేయనిది ఏదీ సాధ్యం కాదు. మనిషిగా  పుట్టినందుకు ఏదో పని చేయాలి. భక్తి మంచిదే. కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డగుణం. పనీపాటా చేసుకుంటూ, "ఓం సాయి శ్రీ సాయి" నిత్యం స్మరించుకో! ఇక నువ్వు చేసే పనికి ఆటంకం ఉండదు. నా భక్తులు నిత్య చైతన్యంతోనే ఉండాలి. అర్థమైందా?" అన్నారు బాబా. బాబా విపులంగా బోధించేసరికి కుశాల్‌చందులోని బద్ధకం, సోమరితనం, ఎగిరిపోయాయి. ఆ తర్వాతకాలంలో సాయిభక్తుల్లో కుశాల్‌చంద్  అగ్రగణ్యునిగా వినుతికెక్కారు.

కుశాల్‌చంద్ పైన బాబా చూపిన ప్రేమ అపారం. వీరి కుటుంబానికి బాబా ప్రసాదించిన అనుభవాలు అనిర్వచనీయం. బాబా ప్రేమామృతాన్ని తనివి తీరా రుచి చూసిన కుశాల్‌చంద్, బాబా లేని లోకంలో తాను ఎందుకనుకున్నాడో ఏమో గాని, సరిగ్గా బాబా సమాధి చెందిన నెల రోజులకు, అంటే 15-11-1918వ తేదీన సాయిలో ఐక్యమైనాడు.

సోర్స్: కుమారు అన్నవరపు గారు రచించిన సాయి భక్త సుధా.   

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు 

సాయిభక్తులకు మనవి. బాబా మీకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటే మీ అనుభవాలను క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడికి లేదా వాట్సాప్ నెంబరుకి పంపించండి.
saimaharajsannidhi@gmail.com
+918096343992

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo