సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కలలో డాక్టరుగా బాబా - అనారోగ్యానికి చేసిన వైద్యం


నేను ఒక సాయి భక్తురాలిని. మాది కాకినాడ. బాబా నామీద కురిపించిన కరుణారసవర్షాన్ని మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను తిరగని ఆస్పత్రి లేదు, చేయని ప్రయత్నము లేదు. కానీ డాక్టర్లందరూ నా వ్యాధి నయం కావడానికి సమయం పడుతుందనే చెప్పేవారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాను.

ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు మా పక్కింటి వాళ్ళు 'సాయి' ఛానల్‌లో ప్రసారమవుతున్న 'అర్పణం' కార్యక్రమంలో పాల్గొని, బాబాకు గోధుమలు అర్పణం చేయడానికి వెళ్తూ, "మీరు కూడా వస్తారా?" అని నన్ను అడిగారు. "ఏమో! ఏం జరుగుతుందో చూద్దామ"ని అర్పణం కార్యక్రమానికి వెళ్లి  గోధుమలను అర్పణంచేసి, "బాబా! నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. నేనెప్పుడూ మీకు మ్రొక్కలేదు, ఇదే మొదటిసారి. అన్నిరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయాను బాబా! చాలామంది మీ గురించి, మీ లీలల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. మీరు నా ఈ ఆరోగ్యాన్ని బాగుచేయగలరా? బాబా! ఇక్కడంతా మీరు మంచి వైద్యుడని అంటున్నారు. నామీద కాస్త దయ ఉంచు తండ్రీ!" అని బాబాకి నా బాధని  చెప్పుకుని ఇంటికి వచ్చాను.

ఆరోజు రాత్రి నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా తెల్లని వస్త్రాలను ధరించి నా మంచం ప్రక్కనే నిలబడి నాతో, "నీ కడుపులో సమస్య ఉంది. అది ఇప్పటితో తీరిపోతుంది. ఇక నువ్వు దిగులుపడాల్సిన పనేమీ లేదు. అంతా నేను చూసుకుంటాను, నీవు నిశ్చింతగా ఉండు" అని చెప్పారు. తరువాత నేను బాబాని తదేకంగా చూస్తూ ఉన్నాను. బాబా తమ చేతులు నా కడుపులో పెట్టి ఏదో చేస్తున్నారు. తన చేయంతా రక్తసిక్తమై ఉంది. కానీ నేను మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా బాబానే చూస్తూ, తను మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాను. "నేను అంతా సరిచేశాను. నువ్వు దిగులుపడకు. ఇప్పటినుండి నీకు ఆరోగ్య సమస్యలు రావు. నీవు నా నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు" అని చెప్పారు. కొన్ని సెకండ్ల వ్యవధి తర్వాత చూస్తే బాబా కనిపించలేదు. నాకు కొంచెం కొంచెంగా మెలకువ వచ్చి లేద్దామంటే పడుకున్న చోటునుంచి కాస్తంత కూడా లేవలేకపోయాను. అప్పటివరకూ జరిగినదంతా కలా! నిజమా! అని తేల్చుకోలేకపోయాను. కానీ, నా ఆరోగ్యం కుదుటపడిందని అనిపించింది. తర్వాత రోజు మామూలుగా నేను  చెకప్ కోసం వెళ్లాల్సి ఉండి, హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్లు చూసి, "ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు, నీవు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు" అని చెప్పారు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అర్ధమయ్యింది, నిజంగానే రాత్రి నా కలలో బాబా డాక్టరుగా వచ్చి ఆపరేషన్ చేసి నా అనారోగ్యాన్ని దూరం చేశారని. తరువాత మాఇంట్లో వాళ్లందరికీ కల గురించి చెప్పాను. అందరూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. నేను అందరిలాగా పూజలు, వ్రతాలు, హారతులు ఏవీ చేయలేదు. కేవలం ఒక్కసారి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగాను, అంతే! దానికే కలలో ఒక డాక్టరులా వచ్చి, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి డాక్టరుగా, దేవుడిగా నా మనసులో పూర్తి భక్తివిశ్వాసాలను నింపి వెళ్లారు బాబా. "బాబా! మీ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. మీరు నామీద కురిపించిన కరుణారసవర్షానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. సదా మీ కృపాదృష్టి నామీద ఇలాగే ఉంచండి!"


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo