శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నంద్యాల నుండి సాయిబంధువు రఫీ తన అనుభవాలను వాట్సాప్ ద్వారా పంపించారు. చక్కటి అనుభవాలను తన మాటలలోనే చదివి ఆనందించండి.
సాయిబంధువులందరికీ సాయిరామ్. నా పేరు రఫీ. నా ఇష్టదైవం బాబా. ఫేస్‌బుక్‌లో "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా భక్తులు పంచుకుంటున్న అనుభవాలు చూసాక, "బాబా నాకు కూడా ఎన్నో అనుభవాలు ఇచ్చారు కదా! వాటిని నేను కూడా అందరితో పంచుకోవాల"ని అనిపించింది. ఆయన నన్ను ఎన్నో కష్టాల నుండి కాపాడారు. వాటినన్నింటినీ మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా, "బాబా నన్ను తన భక్తుడిగా ఎలా మార్చుకున్నారు?" అనే అనుభవం చెప్తాను. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక గురువారంరోజు ఉదయం నేను బాగా అల్లరి చేస్తుంటే అమ్మకి కోపమొచ్చి నన్ను కొట్టింది. నేను అలిగి బయటికి వచ్చేస్తుంటే మా ఇంటి ప్రక్కనే ఉన్న పెద్దావిడ ఎదురైంది. నేను ఆమెని 'అవ్వా' అని పిలుస్తాను. ఆ అవ్వ, "రఫీ! బాబా గుడికి వెళ్దాం పద!" అనింది. నేను అమ్మ దెబ్బలు తప్పించుకోవచ్చని తనతో వెళ్ళాను. నా జీవితంలో అదే మొదటిసారి బాబా గుడికి వెళ్ళటం. బాబా చాలా అందంగా ఉన్నాడు. ఆయనను అలా చూస్తూ ఉండాలి అనిపించింది. మేము మధ్యాహ్న ఆరతికి ఉన్నాము. ఆశ్చర్యం! ఆరతి అవుతూ ఉంటే నాకు తెలీకుండానే ఆరతి పాట పాడుతున్నాను. నాకసలు నమ్మబుద్ధి కాలేదు. తరువాత అక్కడే భోజనం చేశాను. ఇంటి నుండి అలిగి వచ్చాను కదా! తండ్రిలా నా ఆకలి తీర్చాడు బాబా. ఆ తరువాత భోజనాలు చేస్తున్న వారి గ్లాసులలో నీళ్ళు పోసే చిన్న సేవ కూడా చేసుకున్నాను. అప్పటినుండి నాకు అదే అలవాటుగా మారింది. అలా నేను ఆ బాబా గుడిలో వాలంటీర్‌గా మారిపోయి బాబా సేవలో తరిస్తున్నాను.
నా జీవితంలో బాబా చూపిన మరో చక్కటి అనుభవాన్ని కూడా చెప్తాను. ఆరోజు బుధవారం, నేను మా ఇంట్లో ఉన్న బాబా విగ్రహం దగ్గర శుభ్రం చేస్తూ అమ్మతో, "అమ్మా, రేపు గురువారం కదా! బాబాకి రొట్టె, గుత్తివంకాయ కూర చేయి, బాబా తింటాడు" అని చెప్పాను. అప్పుడు అమ్మ, "విగ్రహం రొట్టె, వంకాయ కూర తింటుందా?" అని నవ్వుకుంటూ అంది. ఆరోజు రాత్రి అంటే, తెల్లవారుఝామున గం.4.15 నిమిషాలకి సరిగ్గా శిరిడీలో కాకడ ఆరతి మొదలయ్యే సమయంలో సాక్షాత్తు బాబా నా రూపంలో వచ్చాడు. నమ్మశక్యం కావటం లేదు కదా!! ఔను! బాబానే వచ్చి అమ్మని "లే, లే, లే అమ్మా" అని పిలుస్తున్నాడు. అప్పుడు అమ్మ "ఏంటిరా?" అని అంది. అప్పుడు బాబా, "అమ్మా! నాకు ఆకలి అవుతుంది, రొట్టె, గుత్తివంకాయ కూర పెట్టు" అని అడిగారు. అమ్మ "ఒరేయ్, ఇప్పుడు ఆకలేమిటి?" అంది. అప్పుడు బాబా, "లేదు, నాకు కావాలి, నాకు ఆకలి అవుతుంది, పెట్టు. నాకు ఆరతి సమయం ఆయ్యింది, త్వరగా పెట్టు!" అని అన్నారు. అమ్మ కోపంగా కొట్టడానికి చెయ్యి ఎత్తి చూస్తే వెనకాల నేను పడుకుని ఉన్నాను. ముందర కూడా నేనే ఉండటం చూసి అమ్మ బిత్తరపోయి అలానే చూస్తూ ఉంది. ఇంతలో ముందర నా రూపంలో ఉన్న బాబా మామూలుగా తన అసలు రూపంలోకి వచ్చేసారు. అంటే సాక్షాత్తు బాబా మా అమ్మ ముందు నిలుచొని ఉన్నారు. అమ్మ ఆశ్చర్యపోయి, వెంటనే బాబా పాదాలమీద పడి, "క్షమించు బాబా!" అని వేడుకుంది. అప్పుడు బాబా, "నువ్వు నన్ను అన్నావు కదా, విగ్రహం రొట్టె, వంకాయ కూర తింటుందా? అని. ఇప్పుడు వచ్చానుగా పెట్టు ... తింటాను" అని అన్నారు. అమ్మ, "బాబా! నన్ను క్షమించు! నేను చాలా తప్పు చేశాను బాబా. నన్ను క్షమించు బాబా!" అని అంది. బాబా దానికి సమాధానంగా, "నువ్వు నన్ను అన్నావు కదా! నేను నీ కొడుకుని నా చుట్టూ తిప్పుకుంటా చూడు" అని అన్నారు. అందుకు అమ్మ, "సరే బాబా! నీ ఇష్టం" అని, మా అక్క చదువు గురించి అడిగింది. బాబా, "ఏమీ భయపడకు! మీ కుటుంబానికి అండగా నేను ఉన్నాను" అని హామీ ఇచ్చారు. నిజంగానే ఇప్పుడు మా కుటుంబం మీద బాబా దయ, కరుణ చాలా ఉన్నాయి. అప్పటినుండి ఏ ఊరు వెళ్దామన్నా అమ్మ చెప్పే సమాధానం - "నన్ను నా తండ్రి బాబా దగ్గరకు తీసుకుపో, అక్కడికి తప్ప నేనెక్కడికీ రాను" అంటుంది. అంతలా అమ్మ బాబాకు అంకితమైపోయింది. నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకు నా ధన్యవాదాలు. ఇంకా బాబా చూపించిన అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటిని కూడా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీతో పంచుకుంటాను.
ఓం సాయిరామ్.
🕉 sai Ram
ReplyDeleteRafi garu, u & ur mom are so lucky!!
ReplyDelete