సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వాచ్‌మెన్ రూపంలో కావలి కాసిన సాయినాథుడు.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. బాబా ఆశీస్సులు, ప్రేమ సదా ఎల్లప్పుడూ అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిన్నతనంలో జరిగిన ఒక అద్భుతమైన లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ లీల చాలా సంవత్సరాల క్రితం జరిగినది. ఇక వివరాల్లోకి వెళ్తే... మా నాన్నగారు ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశారు. 1963లో ఆ ఉద్యోగం నుండి పదవీవిరమణ అయ్యారు. తరువాత మేము అక్కడ నుండి పూణేకు వెళ్ళాము. మా నాన్న పూణే నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, పూణేలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శిరిడీకి దగ్గరగా ఉంటుందని. అప్పట్లో ప్రైవేటు బస్సులు లేవు, అందువలన ప్రొద్దున ఆరు గంటలకి ట్రాన్స్‌పోర్ట్ బస్సు ఎక్కితే మధ్యాహ్న ఆరతి సమయానికి శిరిడీ చేరుకొనే వాళ్ళం.

మా కుటుంబంలో మా నాన్నమ్మ, మా నాన్నగారు ఇద్దరూ మంచి సాయిభక్తులు. మా నాన్నమ్మకు ఒక ఇల్లు కొనాలనే కోరిక ఉండేది. కానీ అనుకోకుండా తన కోరిక తీరకుండానే మరణించింది. ఆమె పోయిన తరువాత ఆమె కలను నెరవేర్చడానికి మా నాన్న పూణేకు దగ్గర్లో ఒక స్థలాన్ని కొన్నారు. ఆ కాలంలో ఒకటే బస్సు ప్రొద్దున సిటీకి వెళ్లి సాయంత్రం వస్తుండేది. కనుక ఆ సమయంలో మాత్రమే మార్కెట్‌కు వెళ్లి ఇంటి నిర్మాణం కోసం కావలసినటువంటి వస్తువులని కొనుగోలు చేయాల్సి వచ్చేది. వాటిని బస్సులో తీసుకొని వెళ్లి అక్కడ దించేవారు. ఆ ప్రాంతంలో కాస్తంత దొంగల బెడద ఉంది. మేము ఉన్న ప్రదేశానికి ఇంటి నిర్మాణం జరుగుతున్న స్థలం చాలా దూరంలో ఉండేది. కాబట్టి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని ఎవరైనా దొంగలు దోచుకుని వెళ్తారేమోనని కాస్త ముందు జాగ్రత్తగా అమ్మ ఆలోచించి స్థలం ప్రక్కన ఉన్న ఇంటి వాళ్లకు కాస్త గమనిస్తూ ఉండమని  చెప్పింది.

కొన్నిరోజుల తర్వాత అమ్మ వారిని కలిసింది. వారు చెప్పిన మాటలను వింటూ  ఆశ్చర్యపోవటం మా అమ్మ  వంతు అయ్యింది. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారంటే.. "మీరు పెట్టిన వాచ్‌మెన్ ఎంతో మంచివాడు. అతడు రాత్రంతా మెలకువగా ఉంటూ, "అల్లామాలిక్ - అల్లామాలిక్" అంటూ మీ స్థలం చుట్టూ పచార్లు చేస్తూ ఉన్నాడు. తలకు బట్ట కట్టుకొని, గడ్డంతో, ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సుతో ఉన్న ఒక ముసలివ్యక్తి మీ స్థలానికి కాపలాగా ఉండగా మీకు దిగులు అసలు అవసరం లేదు" అని. నిజానికి మేము వాచ్‌మెన్ ని పెట్టలేదు. లోకాన్నంతా కావలికాసే ఆ సాయినాథుడు మా స్థలానికి కాపలాగా ఉన్నాడని అర్థం చేసుకున్న అమ్మ పట్టరాని ఆనందంలో తడిసి ముద్దైపోయింది. అసలు తన ఆనందానికి అవధుల్లేవు. లోకరక్షకుడైన ఆ సాయినాథుడు తనకు రక్షగా ఉన్నాడని ఎంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేను. మా నాన్నమ్మ కోరిక సాయిబాబా రక్షణలో నెరవేరింది. మా నాన్నమ్మ లేకపోయినా ఆమె కోరిక మాత్రం బాబా  తీర్చారు. బాబా ప్రేమ అటువంటింది. "మీ ప్రేమ మా కుటుంబం మీద సదా ఉన్నందుకు ధన్యవాదములు బాబా!"

ఓం సాయిరాం.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo