శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఓం సాయిరామ్. నా పేరు అర్చన. నేను హైదరాబాదు నివాసిని. మన జీవనప్రయాణంలో బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం కష్టాలలో ఉన్నపుడు ఆయన మనకి ఏదో ఒక రూపంలో సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని అర్ధం చేసుకుని నమ్మకంతో నిబ్బరంగా ఉండగలిగితే ఎంతో బాగుంటుంది. కానీ, మనం ఆ కష్టసమయంలో నమ్మకంతో ఉండలేక ఆందోళనపడుతూ ఉంటాం. ఇక నా విషయానికి వస్తే, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నాకు పాప పుట్టాక తనని వదిలి ఆఫీసుకి వెళ్ళటం కష్టంగా వుండేది. "ఏదో ఒక సహాయం చేయండి బాబా" అని చెప్పుకున్నాను. కొన్నిరోజులకి బాబా దయవల్ల ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజర్, టీమ్ అందరూ బెంగుళూరులో ఉండటం వలన నేను ఆఫీసుకి వెళ్లినా, వెళ్లకపోయినా పట్టించుకునేవాళ్లు కాదు. అలా పరిస్థితి నాకు అనుకూలంగా ఉండేలా బాబా ఏర్పాటు చేసారు. కానీ వేరే టీమ్‌లో ఉన్నవాళ్లు నేను ఆఫీసుకి రావటం లేదని మా మేనేజర్ కి ఫిర్యాదు చేసారు. పైగా నేను కూడా పిల్లల్ని, ఇంటిపనులను చూసుకుంటూ ఆఫీసు వర్క్ ఎక్కువగా చేయలేకపోయేదాన్ని. ఈ రెండు కారణాల దృష్ట్యా నాకు రేటింగ్(-అంటే మన పెర్ఫార్మన్స్ బట్టి మనకిచ్ఛే ర్యాంకింగ్), శాలరీలో హైక్, ఇన్సెంటివ్ మూడు సంవత్సరాలనించి ఇవ్వటంలేదు. నిజానికి రేటింగ్ సరిగా లేకపోతే కంపెనీనించి తొలగించేస్తారు. కానీ బాబా దయవల్ల ఉద్యోగం ఉంది.
మధ్యలో ఒకసారి, మా టీమ్‌లో నాతోపాటు వేరే బెంగుళూరు అతను ఒకరు వర్క్ చేస్తూ ఉండేవాడు. అతను ఉండబట్టి రెండో వాళ్లు అంటే, నేను అవసరం లేదు అన్నారు. నేను కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేసినా కానీ హైదరాబాద్ ప్రాజెక్ట్ అంటే చాలా కష్టం. హైదరాబాద్ ప్రాజెక్ట్ అయితే మేనేజర్ ఇక్కడే ఉంటారు కనుక తప్పకుండా ఆఫీసుకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మా పాప స్కూల్ లో జాయిన్ కాలేదు. అందువలన నేను తప్పక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. "ఎలా బాబా?" అని టెన్షన్ పడుతూ, "ఈ ప్రాజెక్ట్ మార్చవద్దు బాబా!" అని చెప్పుకునేదాన్ని. బాబా కృప వలన ఆ సమయంలో వేరే ప్రాజెక్ట్ డెవలపర్ రాజీనామా చేసాడు. దానితో మా టీమ్‌లో ఉన్న అతను ఆ రాజీనామా చేసిన ప్రాజెక్ట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అందువలన మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "ఈ ప్రాజెక్ట్ మొత్తం నువ్వే చూసుకో" అని చెప్పారు. అలా బాబా దయతో ఆ ప్రాజెక్టులో నేను కొనసాగాను.
తరువాత కూడా 2, 3 సార్లు మా మేనేజర్ గారు, "టీమ్‌లో మీరు ఒక్కరే హైదరాబాదులో ఉన్నారు, మిగతా అందరూ బెంగుళూరులో ఉన్నారు. కనుక మీరు ఏదైనా హైదరాబాద్ ప్రాజెక్ట్ చూసుకోండి" అని చెప్పారు. అలా అతను చెప్పేవారు కానీ, బాబా దయవలన పెద్దగా ఒత్తిడి చేసేవారుకాదు. పైగా అన్నిరకాల అవకాశాలు ఇచ్చేవారు. మా డైరెక్టర్‌కి సాధారణంగా ఇంటినుండి పనిచేయడం ఇష్టం ఉండదు. అలాంటిది నన్ను ఒత్తిడి చేయకుండా 2 సంవత్సరాలు ప్రాజెక్ట్‌లో ఉంచారు.
కానీ నెలక్రితం హఠాత్తుగా ఆన్‌సైట్ వాళ్లు, "మన ప్రోడక్ట్ వేరే కంపెనీ కొనుక్కుంది. అందువల్ల మీరింక వేరే ప్రాజెక్ట్ చూసుకోండి" అన్నారు. అప్పటివరకు కొత్త టెక్నాలజీలు నేర్చుకోని కారణంగా, కొత్త ప్రాజెక్ట్ చూసుకుంటే అక్కడ వర్క్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో అని నాకు టెన్షన్ మొదలైంది. టెస్టింగ్ సైడ్ కానీ, టీచింగ్ సైడ్ కానీ మారదామని ఎప్పుడు అనుకున్నా, సాయి ప్రశ్నావళిలో, "తప్పుడు నిర్ణయాలు తీసుకోకు" అని వచ్చేది. ఇంకా తెలిసిన వాళ్లు కూడా 'మారవద్దు' అనే చెప్పేవారు. ఈ టెన్షన్స్ మా వారికి చెప్తే, "ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకో" అన్నారు. ప్రస్తుత కంపెనీలో నా చివరి రేటింగ్ అస్సలు బాగాలేదు కాబట్టి ఎవరూ తీసుకోరని ఒక నెలపాటు విపరీతమైన టెన్షన్ పడ్డాను. పోనీ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ పరిస్థితిలో ప్రశ్నావళిలో బాబాని అడిగితే, "నీ భారమంతా గురువు మీద వేసి నిష్టగా ఉండు. నీకు కావలిసిన కూడు, గుడ్డ ఇస్తారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు వస్తాయి" అని వచ్చింది. నేను అడిగిన ప్రతిసారీ ఇలాంటి మెసేజెసే వచ్చేవి. ఆ మెసేజ్‌తో ధైర్యం వచ్చినా, బెంచ్ మీద రోజులు గడిచేకొద్దీ టెన్షన్ మళ్ళీ మొదలైపోయేది. అప్పుడు, "నీకు బాబా మీద నమ్మకం లేదు. అందుకే నీ పని అవ్వటం లేదు. నమ్మకం పెట్టి చూడు" అని మెసేజ్ వచ్ఛేది. అయినా నిబ్బరంగా ఉండలేకపోయేదాన్ని. రోజూ బాబాని ప్రాజెక్ట్ గురించే వేడుకుంటూ ఉండేదాన్ని.
ఇలా ఉండగా 2018 నవంబర్ 16న ఒక టెస్టింగ్ మేనేజర్, ఒక డెవలప్‌మెంట్ మేనేజర్ నన్ను కలవమన్నారు. మొదట టెస్టింగ్ మేనేజర్‌ని కలిసాను గానీ, "అతను చాలా స్ట్రిక్ట్, పని అవకపోతే ఊరుకోరు, అరుస్తారు" అని కాస్త ఆందోళనపడ్డాను. అయితే అతను రిక్వైర్‌మెంట్ చెప్పి, తరువాత మళ్ళీ అతనే, "మీరు డెవలపర్ కదా! ఈ వర్క్ మీకు కష్టం లెండి, వద్దు" అన్నారు. కొంచెం నిరాశపడ్డాను. కానీ, అంతలో డెవలప్‌మెంట్ మేనేజర్ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారు. "ఖాళీగా ఉండేకన్నా 3 నెలలు నా దగ్గర వర్క్ చేయండి, తరువాత చూద్దాం" అన్నారు. సబ్జెక్టుకి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నా చివరి రేటింగ్ గురించి అడిగితే, నేను తక్కువ అని చెప్పాను. అందుకతను, "పర్వాలేదులెండి. ఒక్కోసారి అలా జరుగుతాయి" అన్నారు. తరువాత ఇంకా ఏవో ప్రశ్నలు అడుగుతుంటే "మా మేనేజర్‌ని అడగండి" అని చెప్పాను. అతను సరేనని మా మేనేజర్‌తో మాట్లాడారు. కానీ, తరువాత నాకు ఏ వివరాలూ చెప్పలేదు. నేను చాలా బాధపడ్డాను. తరువాత ఇంటికి వస్తూ నిల్చొని ఉన్న బాబా విగ్రహం ఉందేమో చూద్దామని ఒక షాపుకి వెళ్ళాను. అక్కడ ఒక చక్కటి బాబా విగ్రహం ఉంది. తీసుకుందామనుకుంటూ, "బాబా! మీరు ఏదైనా మిరాకిల్ చేస్తే ఈ విగ్రహం రూపంలో మీరు వచ్చిన వేళావిశేషం అనుకుంటాను" అని అనుకున్నాను. కానీ, షాపులో బేరం కుదరక విగ్రహం తీసుకోకుండానే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక లాగిన్ అయ్యి చూసుకుంటే వచ్చిన మొదటి మెయిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ నుండే! అందులో, "సోమవారం నుంచి ప్రాజెక్టులో జాయిన్ అవ్వండ"ని ఉంది. ఇంక నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే మా బాబుని తీసుకుని షాపుకి వెళ్లి ఆ బాబా విగ్రహాన్ని తెచ్చుకున్నాను.
తరువాత నవంబర్ 19 సోమవారంనాడు ఆఫీసుకు వెళితే, మేనేజర్, "మా స్టాఫ్ ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు, అతను వచ్చేవరకు మీరు అక్కడ వేచి ఉండండి" అని ఒక చోటు చూపించారు. ఇక మళ్ళీ నాకు టెన్షన్ మొదలైంది. టెన్షన్ పడుతూనే ఆ చోటుకి వెళ్లి, అక్కడ బాబాని చూసి ఆశ్చర్యపోయాను. బాబాని చూడగానే కాస్త ధైర్యం వచ్చి, "బాబా! వర్క్ అంటే కష్టపడైనా చేస్తాను గాని, ఇంటర్వ్యూ అంటే నాకు భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చేయండి" అని చెప్పుకున్నాను. మధ్యాహ్నం 3 అవుతున్నా ఇంటర్వ్యూ చేయాల్సిన అతను రాలేదు. మేనేజర్ "సరే, మీరు రండి" అని నన్ను ఒక కేబిన్‌కు తీసుకొని వెళ్లారు. ఆశ్చర్యం! అక్కడ కూడా బాబా ఉన్నారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలలో దేవుడి ఫోటోలు అలాంటివి కనపడవు. అలాంటిది నా బాబా నాకు తోడుగా ఉన్నానన్నట్లు అడుగడుగునా దర్శనం ఇస్తూ నాకు ధైర్యాన్ని కలిగిస్తున్నారనిపించింది. తరువాత మేనేజర్, "మీరు వర్క్ హేండిల్ చేసుకోగలరు కదా?" అని అడిగారు. నేను "ఎస్" అన్నాను. అతను వెంటనే, "సరే, మీరు ప్రాజెక్టులో జాయిన్ అయిపోండి" అని అన్నారు. ఇంటర్వ్యూ లేకుండా నన్ను కన్ఫర్మ్ చేసేసారు. ఇలా అడుగడుగునా బాబా నాకు తోడుగా ఉండి నాకు రేటింగ్ సరిగా లేకపోయినా సరే, అది ఒక సమస్య కాదన్నట్లు నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. మన కష్టాలు చూస్తూ బాబా ఊరుకోలేరు. ఏదో రూపంలో జవాబు ఇస్తారు. మనల్ని కాపాడతారు. మూడు నెలల ఈ ప్రాజెక్ట్ అయిన తరువాత కూడా బాబా ఇలాగే నన్ను కాపాడతారని నా నమ్మకం.
జై సాయిరామ్! జై జై సాయిరామ్!!
Sai prashnavali Elsa cheyyali
ReplyDeletesai prashanavali app untundi sai. adi download chesi mobile vesukondi sai.
Delete