శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
- శ్రీసాయిబాబా
సాయిబంధువులకు, గురుబంధువులకు నా నమస్కారములు. నా పేరు నందకిశోర్. నేను మెహదీపట్నంలో ఉన్న ఒక హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండేవాడిని. ఒకసారి నేను డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాయడానికి నారాయణగూడ వెళ్లాల్సి వచ్చింది. రెండురోజుల ముందుగానే హాల్‌టికెట్ తీసుకుని నా కాలేజీ బ్యాగులో పెట్టుకున్నాను. పరీక్షకు ప్రిపేరై, పరీక్షకు ఇంకో రెండుగంటల సమయం ఉందనగా పరీక్ష జరిగే హాలుకి బయలుదేరుతూ ఒకసారి బ్యాగు చూసుకుంటే హాల్‌టికెట్ కనపడలేదు. మొత్తమంతా వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఎక్కడ పడిపోయిందోనని చాలా దిగులుగా అన్పించింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. "నన్ను ప్రతిసారీ ఇలాగే టెన్షన్ పెట్టి వదులుతావు బాబా!" అనుకుంటూ, "బాబా! నా రూమంతా వెతికినా ఎక్కడా హాల్‌టికెట్ దొరకట్లేదు. ఇంకో రెండుగంటల్లో పరీక్ష మొదలవుతుంది. నేను చదివినదంతా వ్యర్ధమైపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు బాబా, నాకు మాత్రం హాల్‌టికెట్ కావాలి" అని బాబాతో చెప్పుకుంటున్నాను. ఇంతలో క్రిందనుండి ఒక అయ్యప్పస్వామి భక్తుడు హాస్టల్ కి వచ్చి, "నందకిషోర్ ఉన్నారా?" అని అడుగుతూ నా రూముకి వచ్చారు. నేను, 'చెప్పండి' అని అడిగితే, "రోడ్డుమీద మీ హాల్‌టికెట్ పడిపోయి ఉందండి. అది నా కంటపడింది. దీనిని మీకు ఇద్దామని వచ్చాను, తీసుకోండి" అన్నాడు. నా ఆశ్చర్యానికి అంతులేదు. బాబా నా మాటలు విన్నారు. అడిగినంతనే నా హాల్‌టికెట్ నాకు అందించారు. "నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించడమే నా కర్తవ్యం" అన్న తమ వాగ్దానాన్ని సత్యం చేసి చూపించారు. ధన్యవాదాలు బాబా!
ఓం సాయిరాం.
🕉 sai Ram
ReplyDelete