శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులకు సాయిరామ్. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదులోని సరూర్ నగర్ నివాసిని. నాకు బాబా ఇచ్చిన ఒక అమూల్యమైన అనుభవాన్ని "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా మీ అందరితో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.
నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రోడ్డుమీద ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఎదురుగా బాబా గుడి ఉంటే అక్కడికి నన్ను తీసుకుని వెళ్లారు. నా చేతికి రక్తం కారుతుంటే ఒక బాబా భక్తుడు ఊదీని నా చేతికి పూసి కట్టు కట్టాడు. మరుసటిరోజు కట్టు విప్పి చూస్తే గాయం తాలూకు మచ్చ కూడా లేదు. అప్పటినుండి నాకు బాబా మీద నమ్మకం పెరిగి బాబా భక్తుడిగా మారిపోయాను. ఇంకొక అద్భుతమైన బాబా లీలను మీకు వివరిస్తాను.
నేను దిల్‌సుఖ్‌నగర్ బాబా మందిరంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. మాములుగా మార్నింగ్ అండ్ నైట్ షిఫ్ట్ లు ఉంటాయి. అలా ఒకసారి నాకు నైట్ షిఫ్ట్ పడింది. ఆరోజు రాత్రి సుమారు పన్నెండు గంటల సమయమై ఉంటుంది. నాకు దాహంగా ఉండటంతో లోపలికి వెళ్ళాను. నీరు త్రాగిన తరువాత ఎందుకో ఒకసారి అలా బాబామూర్తి వైపు చూసాను. అద్భుతం! మహాద్భుతం! తెల్లటి వస్త్రాలు ధరించి అభయహస్తం చూపిస్తూ మెట్లపై కూర్చుని ఉన్నారు బాబా. ఎంతో అందమైన ముఖారవిందం. చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదు. కలా! నిజమా! అనిపించింది. అలాగే చూస్తూ ఉన్న నా కళ్ళనుండి ఆనందభాష్పాలు ధారాపాతమయ్యాయి. "బాబా! అభయహస్తముద్రలో మీ నిజరూప దర్శనం చూస్తున్నాను, నా జన్మకిది చాలు! చాలు బాబా! చాలు! నన్ను నీ సేవలోనే తరించేలా అనుగ్రహించు బాబా!" అని వేడుకున్నాను. అంతలోనే అదృశ్యమయ్యారు బాబా. తెల్లవారాక గుడిలోని సభ్యులందరికీ చెప్పాను. "బాబా దర్శనభాగ్యాన్ని పొందావు, ఎంతటి అదృష్టవంతుడివి!" అని అందరూ అంటుంటే చాలా సంబరపడిపోయాను. ఇన్నాళ్ల తరువాత మీతో ఈ అనుభవం పంచుకుంటుంటే ఆనాడు బాబా నాపై చూపిన ప్రేమకి హృదయం ద్రవించిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా బాబా దయ.
ఓం సాయిరాం.
🕉 sai Ram
ReplyDelete