సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా మన ప్రతి మాటని వింటున్నారు...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి




ఢిల్లీ నుండి సాయిబంధువు సాయి హరిదాస్ గారు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు... సాయిబంధువులందరికీ సాయిరామ్. 2018 అక్టోబర్ 27న నాకు జరిగిన ఒక అందమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరికీ తెలియచేస్తాను. రోజువారీ అలవాటు ప్రకారం ఆరోజు నేను జిమ్‌కి వెళ్ళాను. ఆరోజు అక్కడ మరమ్మత్తు పనులు జరుగుతుండటం వలన అక్కడున్న రిసెప్షనిస్ట్, "దయచేసి దగ్గరలో ఉన్న రెండో బ్రాంచ్‌కి ఈ రోజుకు వెళ్ళండి" అని చెప్పింది. సరేనని నేను అక్కడకు బయలుదేరాను. హఠాత్తుగా బాబా గుర్తుకు వచ్చి, "ఇక్కడే బాబా మందిరం ఉండగా జిమ్‌కి వెళ్లడం ఎందుకు?" అని అనిపించి బాబా మందిరానికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకుని అరగంట పైగా బాబా ఎదురుగా కూర్చున్నాను. అలా కూర్చున్న సమయంలో బాబాతో, "బాబా! నాకు మీ సేవ చేసుకోవాలని ఉంది, అందుకు అనుమతించండి. చామరం వీచే సేవ చేయాలని అనిపిస్తుంది బాబా!" అని చెప్పుకున్నాను. (చామరం అంటే మీకు తెలిసేవుంటుంది. తెలియకపోయినా పరవాలేదు, మీ అవగాహన కోసమే పైన ఫోటోని కూడా జతపరిచాను). రెండు నిమిషాల తర్వాత ఆరతి మొదలు కాబోతుండగా, రోజూ అక్కడ చామరం వీచే సేవ చేసే వ్యక్తి నా ప్రక్కగా వెళ్తున్నాడు. నేను బాబాతో, "ప్లీజ్ బాబా! ఆ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి" అని ప్రార్థిస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా నాకు దగ్గరలో నిలబడి ఉన్న వ్యక్తి నాతో, "మీరు ఆ సేవ చేయాలనుకుంటున్నారా?" అని అడిగాడు. అందుకు నేను 'అవునండి' అన్నాను. వెంటనే చామరం నా చేతికందించారు. హారతి పూర్తయ్యేంతవరకు నా చేతులతో స్వయంగా బాబాకి చామరం వీచే సేవ చేసుకున్నాను. నాకెంత ఆనందం అంటే, మాటల్లో చెప్పలేను అసలు. చాలా చాలా చాలా ఆనందించాను. నిజం చెప్తున్నాను, నేనసలు షాక్‌కి గురయ్యాను. బాబా మన ప్రతి మాటని వింటున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం - బాబా ఎప్పుడూ తన భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. చాలా చాలా కృతజ్ఞతలు బాబా! ఐ లవ్ యు సాయి మాలిక్! టన్నులకొలదిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను బాబా! ఓం సాయిరామ్! బాబా మాలిక్.


నా స్వీయ అనుభవం :

నాకు కూడా ఇటువంటి అనుభవం జరిగింది. నేను 2008వ సంవత్సరంలో హైదరాబాదులో ఉన్నప్పుడు అమీర్‌పేటలోని బాబా గుడికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. ఆరతి సమయంలో బాబాకి చామరంతో వీస్తూ భక్తులు బాబాని సేవించుకుంటూ ఉంటారు. అది చూశాక నాకు కూడా ఆ సేవ చేసుకోవాలని అనిపించింది. సాధారణంగా పరిచయస్తులకే ఎక్కువగా ఆ అవకాశం దక్కుతూ ఉంటుంది. నాకేమో అక్కడ ఎవరూ పరిచయం లేకపోవటం వల్ల ఆ కోరిక నా మనస్సులోనే అలా ఉండేది. ఇలా ఉండగా కొన్నాళ్ళ తర్వాత నేను మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని ఆరతికి ఉందామని దూరంగా వెళ్లి కూర్చున్నాను. ఆరతికి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, చేతిలో చామరం పట్టుకొని బాబా దగ్గరకు వెళ్లి నిలుచున్నాడు. ఎక్కువగా అతనే ఆ సేవ చేస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి బాబా ఏమి ప్రేరణ ఇచ్చారో గాని, ఎంతోమంది నా ముందు వుండగా, వారందరినీ దాటి దూరంగా ఉన్న నా దగ్గరకు నేరుగా వచ్చి, "చామరం వీస్తారా?" అని అడిగాడు. నేను ఆనందాశ్చర్యాలతో 'సరే'నన్నాను. ఎప్పటినుండో నా మనస్సులో ఉన్న కోరికను ఆవిధంగా తీర్చినందుకు మనసులోనే బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చామరం వీస్తూ సేవించుకున్నాను. ఆనందంతో నా కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. నాలోనూ, అతనిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నది ఆ బాబానే కదా! నా మదిలో కోరిక నెరిగి అతనిలో ఆ ప్రేరణ కలిగించారు బాబా. అందరిలో ఆత్మస్వరూపుడై ఉన్న బాబా తన భక్తుల ప్రేమపూర్వకమైన కోరికలు నెరవేర్చేందుకు ఏ వ్యక్తినైనా ప్రేరేపించి వారి ద్వారా మన కోరికలు తీరుస్తారనడానికి ఇది ఒక నిదర్శనం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo