శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
హైదరాబాదు నుండి సాయిభక్తురాలు సాయిశ్రుతి తన రీసెంట్ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.
రెండురోజుల సెలవు తర్వాత హ్యాపీ మూడ్ లో 2018, నవంబర్ 8వ తేదీ ఉదయాన ఆఫీసుకి వెళ్ళాను. మొదటి గంట సమయం బాగానే జరిగింది. తరువాత నేను ఒక క్లయింటుతో మాట్లాడవలసి వచ్చింది. నిజానికి పని సరిగా చేయలేదని అతను చాలా కోపంగా ఉన్నాడన్న విషయం నాకు తెలియక, పని ఎంతవరకు జరిగిందన్న వివరాలను ఫోన్లో క్లయింటుకి వివరించడానికి ఒప్పుకున్నాను. క్లయింటుకి ఫోన్ చేసి కేవలం పలకరించాను, అంతే! ఇక అతను అరవడం మొదలుపెట్టాడు. అతను చాలా కోపంగా ఉన్నాడని, కనీసం నేను చెప్పేది వినే స్థితిలో కూడా లేడని నాకర్థమయ్యింది. అసలే నేను కంపెనీలో కొత్తగా జాయిన్ అయి ఉండటంవల్ల చాలా భయపడిపోయాను. అతనికేమి చెప్పాలో, నా మాటలను వినేలా అతన్ని ఎలా ఒప్పించాలో నాకర్థం కాలేదు. బాబాని తలచుకొని, "బాబా! నాకు చాలా భయంగా ఉంది, నేను అతనితో మాట్లాడలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి బాబా!" అని ప్రార్థించాను. నిజంగా నన్ను నమ్మండి, అతను చాలా గర్వంగానూ, చాలా కోపంగానూ ఉన్నాడు. అతని అరచిన అరుపులకు భయంతో నోట మాటరాక బాబా సహాయాన్ని అర్థించాను. నేను ఏ క్షణాన బాబాని తలచుకున్నానో అదే క్షణాన ఆ క్లయింట్, "ఒక్కనిమిషం వెయిట్ చేయండి" అని చెప్పి, మళ్ళీ ఒక నిమిషం తరువాత నాతో, "క్షమించండి. నేను మీతో అమర్యాదగా మాట్లాడాను. నాకు తెలుసు, మీ తప్పేమీ లేదు. కేవలం పని ఎంతవరకు అయిందో చెప్పడానికే మీరు ఫోన్ చేశారు. సరే, మిగిలిన పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి" అని ఎంతో ప్రశాంతంగా, మర్యాదగా మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయాను. రెప్పపాటుకాలంలో బాబా అతన్ని అంత ప్రశాంతంగా ఎలా మార్చేశారో నాకు అర్థం కాలేదు. కానీ, నేను పిలవగానే నన్ను కాపాడటానికి బాబా వచ్చారు. ఇదంతా చదువుతూ ఉంటే మీకు సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ అతను ఆ కోపంలో పిచ్చిగా మాట్లాడిన మాటలకి తేడా వస్తే నా జాబు కూడా పోయేది. అటువంటి పరిస్థితినుండి బాబా నన్ను కాపాడారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఎటువంటి సమస్యలు లేకుండా సాయంత్రానికి పని పూర్తి చేయడంతో అదే వ్యక్తి నన్ను మెచ్చుకున్నాడు. అంతా బాబా దయ. చాలా చాలా కృతజ్ఞతలు బాబా!
శిరిడీ చేరడానికి ముందే బాబా నా సమర్పణ తీసుకున్నారు.
నవంబర్ 9 సాయంత్రం మేము శిరిడీకి బయలుదేరాము. సాయంత్రం 5.30 కి మేము రైలు ఎక్కాము. ఉదయం నుండి నాకు ఆహారం లేదు. సమయం లేక ఆఫీసునుండి స్టేషనుకి నేరుగా వచ్చి ట్రైన్ ఎక్కేసాను. నాతో 6 కేకుముక్కలున్న ప్యాకెట్ ఒకటి ఉంటే వాటిలో మా కుటుంబసభ్యులలో ముగ్గురికి మూడు కేకుముక్కలు ఇచ్చాను. మిగిలిన వాటిలో నుండి మాతోపాటు కూర్చున్న వ్యక్తికి ఒకటి ఇచ్చాను. ఇంకా మిగిలిన రెండు కేకుముక్కలు చూసి పరాకుగా, "బాబా! ఒకటి మీకు, ఒకటి నాకు" అనుకున్నాను. మరుక్షణం, "ఇది తినడానికి బాబా ఎలా వస్తారు?" అనుకున్నాను. మా అమ్మ, "నేను దీనిని లోపల దాచిపెడతాను, నీకు తినాలనిపించినప్పుడు తిను" అని చెప్తూ ఉంది. ఇంకా ఆమె మాటలు పూర్తికాలేదు, అంతలో ఏడాదిన్నర వయస్సున్న ఒక చిన్నబాబు వచ్చి కేకు వైపు చూస్తున్నాడు. వెంటనే మా అమ్మ మిగిలిన ఆ కేకుని ఆ బాబుకి ఇచ్చింది. నిజానికి బాబాయే ఆ బాబు రూపంలో వచ్చి కేకు తీసుకున్నారు. బహుశా ఆ బాబు మా తరువాత రెండు, మూడు బెర్తుల వద్ద ఉండి ఉండొచ్చు. కానీ బాబాయే ఆ పిల్లాడి రూపంలో కేకు తీసుకున్నారని నా గట్టి నమ్మకం. "బాబా! మళ్ళీ పిలవగానే వచ్చారు. ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ ఇలాగే మీరు నాకు తోడుగా ఉండాలి బాబా!"
ఓం సాయిరాం.
🕉 sai Ram
ReplyDelete