సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కలలో బాబా చేసిన వైద్యం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అందరికీ సాయిరాం. నా పేరు సత్య సౌజన్య. నేను సంబల్ పూర్ నివాసిని. నేను మాధవి మేడం గారి ద్వారా మీ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ చూసాను. బాబా అనుగ్రహం మీ అందరికీ ఉందని, అందుకే ఈ బ్లాగ్ బాబా కృపతో చాలా బాగా నడవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


నేను కడుపుతో ఉన్నప్పుడు ఏడవ నెలలో చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. 105 డిగ్రీలు ఉండేది. నన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పుడు మా అమ్మ నా చేతిలో ఒక చిన్న వెండి బాబా విగ్రహం పెట్టింది. నేను, మా అమ్మ, చెప్పాలంటే మా ఇంట్లో అందరమూ బాబాను నమ్మేవాళ్ళమే. ఆస్పత్రిలో నాకు సెలైన్ మాత్రమే ఎక్కించారు. ఎందుకంటే నాకు, కడుపులో ఉన్న బేబీకి ఏమీ కాకూడదని. ఇలా రెండురోజులు జ్వరం తగ్గలేదు. "బాబా! నువ్వే చూసుకోవాలి" అని అమ్మ బాబా నామస్మరణ చేస్తూనే వుంది. ఎంతకీ జ్వరం తగ్గక పోయేసరికి అమ్మ ఒక తెలుగు హోమియోపతి మందుల బుక్ తీసి, "బాబా! మా అమ్మాయికి ఏమి మందు వేయాలో నువ్వే చెప్పాల"ని ఒక పేజీ తెరచి చూసింది. దానిలో టైఫాయిడ్ జ్వరం మందు( bapttisa 200.హోమియోపతి) వెయ్యమని వచ్చింది. ఆశ్చర్యం! అప్పుడే నా రక్త పరీక్షలో టైఫాయిడ్ అని నిర్ధారణ అయ్యింది. మా నాన్నగారు హోమియోపతి వైద్యులు అయినందువలన ఆ మందు ఇస్తే వేసుకున్నాను. అసలు కడుపుతో ఉన్నప్పుడు అల్లోపతి మందులు ఇవ్వాలంటే వైద్యలు కూడా ఆలోచిస్తారు. అలాంటిది బాబాపై ఉన్న నమ్మకంతో బాబా ఇచ్చి‌న సూచన ప్రకారం ఆ మందు వేసుకున్నాను. అప్పటికి నేనింకా ఆస్పత్రిలోనే వున్నాను, వాళ్ళు కేవలం సెలైన్ మాత్రమే ఎక్కిస్తున్నారు. జ్వరం వలన మూడురోజులు అస్సలు నిద్ర లేదు. అమ్మ ఇచ్చిన బాబా విగ్రహం నా చేతిలో అలానే ఉంది. మూడురోజుల తరువాత కొంచెం నిద్ర పట్టింది. అప్పుడు ఒక కల వచ్చింది. కలలో బాబా నా గుండెపైన రోలు పెట్టి ఏదో నూరుతున్నారు. బాబా ఒకసారి ఆకుపచ్చరంగులో, ఒకసారి పసుపుపచ్చరంగులో, ఒకసారి ఏదో మట్టిరంగులో  ఇలా ఏమిటేమిటో నూరి నాచేత త్రాగిస్తున్నారు. నేను, "బాబా! నాకు వద్దు" అంటున్నాను. బాబా, "జ్వరం పోవాలిగా, నోరు మూసుకొని నేనిచ్చే మందు వేసుకో!" అని బలవంతంగా నాచేత త్రాగించారు. నిజంగా, నన్ను నమ్మండి, అద్భుతమైన కల అది. ఒక గంట తరువాత నాకు మెలకువ వచ్చింది. చూస్తే నా జ్వరం మొత్తం పోయింది. టెంపరేచర్ నార్మల్ గా ఉంది. తరువాత ఏ కష్టమూ లేకుండా నాకు పాప పుట్టింది. ఇది జరిగి ఇప్పటికి నాలుగు సంవత్సరాలయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. బాబా నన్ను ఎంత అనుగ్రహించారో మాటల్లో చెప్పలేను. మనం రోజూ అష్టోత్తరంలో చదువుతాము కదా, "ఓం ఆరోగ్యక్షేమదాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః", అవి అక్షరసత్య నామాలు. ఆ విధంగా బాబా నన్ను కాపాడారు. సాయి చరిత్రలో భీమాజీ పాటిల్ ను బాబా కలలో ఎలా రక్షించారో మనం చదివాము కదా! అందుకే మాధవి మేడం చెప్పినట్లు మన జీవితాలే సాయి చరిత్రలు. మనం పుట్టినరోజు నుంచి చనిపోయేరోజు వరకు వచ్చే అన్ని సమస్యలకు సమాధానం - 'సాయిచరిత్ర' అని నేను గట్టిగా నమ్ముతాను.

సేకరణ: శ్రీమతి  మాధవి, భువనేశ్వర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo