శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఈ శతాబ్ది ఉత్సవాల సమయంలో బాబా అనుగ్రహంతో నేను 2018 అక్టోబర్ 3న శిరిడీ సందర్శించి బాబాను దర్శించి ఆయన అశీస్సులు పొందాను. అప్పటి నా అనుభవాలను సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.
బాబా అనుగ్రహంతో శిరిడీ దర్శించానని ఎందుకు అన్నానంటే, నిజంగా అక్టోబర్ లో నా శిరిడీ ప్రయాణం బాబా నిర్ణయమే. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయి చాలా రోజులుగా శతాబ్ది ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా శిరిడీ వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఆయనకి ఆ కోరిక చాలా దృఢంగా ఉంది. కానీ నవంబర్ నెలలో వెళ్లాలన్నది నా కోరిక. అదే విషయం నేను చాలాసార్లు మా ఫ్రెండ్ తో చెప్పాను. వీలయితే వాళ్ళ బాబాయికి నచ్చజెప్పమని కూడా చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయికి చెపితే ఆయన 'సరే, మీ ఇష్టం' అనేశారు కూడా. కానీ రెండు నెలల క్రితం నేను, మా ఫ్రెండ్ ఏ తేదీలలో వెళ్లాలని డిస్కస్ చేసుకుంటుండగా అనుకోకుండా బాబాయి కోసం అక్టోబరులో వెళ్ళాలా? లేక నవంబరులో వెళ్లాలా? అన్న సందిగ్ధంలో మళ్ళీ పడ్డాం. అప్పుడు మా ఫ్రెండ్, "బాబాను అడుగు, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళదామ"ని అన్నాడు. సరేనని నేను బాబాను అడిగాను. ఆయన సమాధానం అక్టోబర్ అని వచ్చింది. ఇక వేరేమీ ఆలోచించకుండా బాబా నిర్ణయానికి కట్టుబడి మేము అక్టోబరులో ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకున్నాము. అలా మా శిరిడీ ట్రిప్ ని బాబాయే నిర్ణయించారు. బాబాయిగారికున్న దృఢమైన కోరికను తీర్చి ఆయన మనస్సుకు సంతోషాన్నిచ్చారు బాబా.
ఇక ఎప్పుడెప్పుడు అక్టోబర్ నెల వస్తుందా, శిరిడీలో ఎప్పుడు అడుగుపెడతామా, ఎప్పుడు బాబా దర్శనం చేసుకుంటామా, అన్న ఆరాటంతో కాలం సాగింది. అయినా ఆ ఎదురుచూపులో ఒక మధురానుభూతి మనసును పులకింపజేస్తుండేది. మొత్తానికి రెండు నెలలు గడిచి అక్టోబర్ నెల వచ్చింది. ప్రయాణంలో ఎక్కువ సమయం బాబా ధ్యాసతోనే సాగింది. 3వ తేదీ ఉదయం 4.30కి ఔరంగాబాదు చేరుకుంది మేము వెళ్తున్న ట్రైన్. అప్పటినుండి మరో మూడు గంటలలో శిరిడీలో ఉండబోతున్నామన్న ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ట్రైన్ దిగి బస్సు ఎక్కి ఎదురుగా బాబాను చూస్తూ, ఆయన స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. ఆసమయంలో ఒక గురుబంధువు "ఈరోజు తన పుట్టినరోజని, బాబా గురువుగారి బ్లెస్సింగ్స్ తీసుకోమ"ని మెసేజ్ పెట్టారు. గం. 7.15 నిమిషాలకి మన సాయి తండ్రి నడయాడిన పుణ్యభూమి శిరిడీ చేరుకున్నాము. బాబాను తలచుకుంటూనే శిరిడీలో అడుగుపెట్టి, బాబా పాదస్పర్శతో పునీతమైన ఆ నేలను తాకి నమస్కరించుకున్నాను. ఇంక నా ఆనందాన్ని పదాలలో వ్రాయలేను. ఆ ఆనందంతో నేరుగా వెళ్లి ముందుగా 'ధూళి దర్శనం' చేసుకున్నాము. అన్నాళ్ల ఎదురుచూపు ఫలించి చక్కటి బాబా దర్శనమైంది. తరువాత రూమ్ కి వెళ్లి నేను, మా ఫ్రెండ్ ఒకతను స్నానం చేసి, ఇంకో ఫ్రెండ్ తో, "నువ్వు, బాబాయి స్నానాలు చేసి రెడీ అవ్వండి. ఈలోగా మేము టైం వ్యర్ధపరచుకోవడం నాకిష్టం లేదు. అందుకే చావడిలో బాబా దర్శనం చేసుకొని, తరువాత 'సాయిపథానికి' వెళ్లి గురువుగారి దర్శనం కూడా చేసుకొని వస్తాం" అని చెప్పి మేము బయటకు వచ్చి ముందుగా చావడికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని ఆ గురుబంధువుని బ్లెస్ చేయమని బాబాను ప్రార్థించాను. తరువాత సాయిపథానికి వెళ్లి గురువుగారి దర్శనం చేసుకున్నాను. బాబా, గురువుగారి దర్శనం కావడంతో సంతృప్తిగా అనిపించింది. తరువాత గురువుగారిని కూడా గురుబంధువుని బ్లెస్ చేయమని ప్రార్థించాను.
తరువాత రూమ్ కి వెళ్లి అందరం కలిసి మధ్యాహ్న ఆరతికని క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళాము. అప్పటికే 11.30 దాటడంతో ఆరతికి క్యూలోనే ఉండిపోతామని మేమంతా అనుకున్నాము. కానీ బాబా అనుగ్రహ వర్షాన్ని కురిపించారేమో! నేరుగా తీసుకొని వెళ్లి సమాధిమందిరంలో కూర్చోబెట్టారు. మేమంతా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాము. ఆరతి తరువాత చక్కటి దర్శనం కూడా లభించింది. ఆ దర్శనంలోనే నాకప్పగించిన సాయిబంధువుల ప్రార్థనలన్నింటినీ బాబాకు సమర్పించుకున్నాను. ఆ ప్రార్థనలలోని ఒక సాయిబంధువుకు అక్టోబర్ 11న పెళ్లి ఉండగా, పాపం వాళ్ళు గత రెండు నెలల నుండి ఎంతగా ప్రయత్నిస్తున్నా డబ్బు సర్దుబాటు కాలేదు. అందువలన వాళ్ళు చాలా ఆందోళనపడుతూ ఉన్నారు. రెండవ తేదీన ఆ అమ్మాయి వాళ్ళ అక్క నాకు ఫోన్ లో శిరిడీలో బాబాని ప్రార్ధించమని చెప్పారు. భక్తులకు శ్రేయస్కరమైనప్పుడు, వాళ్లకు అత్యవసరమైనప్పుడు బాబా అనుగ్రహంలో ఆలస్యమనేదే ఉండదు. నేను బుధవారం నాడు బాబాని ప్రార్ధిస్తే శుక్రవారం నాటికి బాబా దయవలన వాళ్లకు డబ్బు సర్దుబాటు అయిపోయింది. ఇంక వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. బాబా అనుగ్రహంతో ఆమె పెళ్లి అనుకున్న తేదీలో బాగా జరిగింది.
🕉 sai Ram
ReplyDelete