శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని ఒక సాయి బంధువు 'రెండేళ్ళ నిరీక్షణ తరువాత బాబా తనకు జాబ్ ఇచ్చిన అనుభవాన్ని' మనతో పంచుకుంటున్నారు.
సాయి బంధువులందరికీ నమస్కారం.
బాబా కృపతో నాకు 2015వ సంవత్సరంలో వివాహం అయింది. పెళ్ళైన తరువాత నేను నా ఐటి జాబ్ కి రాజీనామా చేసి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. 2017 దాక చాలా పరీక్షలు వ్రాసాను కానీ ఒకదాంట్లో కూడా పాస్ కాలేకపోయాను. నేను చాలా కష్టపడి ప్రిపేర్ అయి పరీక్షలు వ్రాసినా కూడా ప్రతిసారీ కేవలం 1 లేదా 0.5 మార్కు తేడాతో ఫెయిల్ అయ్యేదాన్ని. నేను చాలా నిరాశకులోనై బాబా ముందు కూర్చొని చాలా ఏడ్చేదాన్ని. 2017 మధ్యవరకు నా భర్త, మా పేరెంట్స్ నాకు చాలా అండగా నిలబడ్డారు. కానీ తరువాత నేను నమ్మకం కోల్పోయేసరికి వాళ్ళు కూడా ఆశను కోల్పోయారు. మనపై ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ స్థితిలో మనస్సు విరిగిపోయి బాబాపై కూడా నా కోపాన్ని చూపించేదాన్ని. అయనను తిట్టి, ఆ ఉద్రేకంలో బాబా ఫోటోను కూడా బయట విసిరేసాను. "నిజంగా నేను చేసింది తప్పే దయచేసి మీ బిడ్డనైన నన్ను క్షమించండి బాబా". ఎప్పుడు ఆ సంఘటనను తలచుకున్నా నేను పడే బాధని, అప్పటి నా పరిస్థితిని మాటల్లో చెప్పలేను.
కొన్ని రోజులకి నా తప్పు తెలుసుకొని 2017 సంవత్సరాంతంలో బాబాపై పరిపూర్ణ విశ్వాసంతో నవ గురువార వ్రతం మొదలుపెట్టాను. బాబా దయతో పరిస్థితులన్నీ మారిపోయాయి. మేమంతా ఆశ్చర్యపోయేలా నేను వ్రాసిన పరీక్షలన్నింటిలో పాసయ్యాను. తరువాత ఉండే ఇంటర్వూస్ వంటివి పూర్తై ఇంకా నా ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఉండగా మేము 2018 జనవరి 13న శిరిడీ ప్రయాణం పెట్టుకున్నాం. "బాబా! నీ దగ్గరకి వచ్చే లోపలే నా రిజల్ట్స్ వచ్చేలా చేయండ"ని బాబాని ప్రార్ధించాను. కానీ నేను కోరుకున్నట్లుగా ఏమి జరగలేదు. ఆ దిగులుతోనే శిరిడీకి బయలుదేరాను. కానీ బాబా తన బిడ్డల్ని ఎన్నడూ దిగులుతో ఉండనివ్వరు కదా! మేము ప్రయాణంలో ఉండగానే నా రిజల్ట్స్ వచ్చాయి. బాబా కృపతో నేను వాటిలో పాసయ్యాను. ఫిబ్రవరి 2వ వారంలో జాయిన్ అవ్వమని కూడా చెప్పారు.
సాయిబంధువులందరికీ నా విన్నపం ఒక్కటే. దయచేసి మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి, సరైన సమయంలో బాబా తన సహాయాన్ని మనకందిస్తారు. రెండు సంవత్సరాల ఎదురు చూపుల తరువాత నాకీ ఫలితం దక్కింది. నన్నెవరూ నమ్మలేని స్థితిలో కూడా బాబా నన్ను వదిలిపెట్టలేదు. ఎవరు నడుచుకోని విధంగా నేను ఆయనపట్ల ప్రవర్తించినప్పటికీ అయన నన్ను విడవలేదు. అదే మన బాబా అంటే. మనం చేసే పెద్ద పెద్ద తప్పులను సైతం అయన కన్నతల్లిలా సహిస్తారు. మనస్ఫూర్తిగా ఆయనని ప్రేమించి మీవంతు ప్రయత్నం మీరు చేయండి. అలా చేస్తే తరువాతి అనుభవం మీదే అవుతుంది. అందరకి ధన్యవాదాలు.
ఓం సాయిరామ్!!!
Yes I have also such experience omsrisairam jaigurudatta
ReplyDelete🕉 సాయి రామ్
ReplyDelete