సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శిరిడీ వెళ్లలేకపోయినందుకు భక్తురాలు పడిన బాధ - బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం.....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలికి 2018, అక్టోబర్ 18న బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవం:

నేను హైదరాబాద్ లో ఉండగా నా తల్లిదండ్రులు మా సొంత ఊరిలో ఉంటున్నారు. అక్టోబర్ 16 సాయంత్రం వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ వస్తే 17వ తేదీన మేము శిరిడీకి వెళ్లాలని అనుకున్నాము. అందుకోసం నేను 17 నుండి 20 వరకు సెలవు పెట్టాను కూడా. కానీ 17వ తేదీకి టిక్కెట్లు దొరకలేదు. దానితో నేను చాలా నిరాశకు లోనయ్యాను. మనసంతా ఒకటే దుఃఖం. శిరిడీ వెళ్ళడానికి ఎలాగూ టికెట్స్ దొరకలేదు కాబట్టి సెలవులు వ్యర్థపరుచుకోవడం ఎందుకని 17వ తేదీ ఉదయం మా సొంత ఊరికి బయలుదేరాను. కానీ శిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు మనసంతా ఒకటే బాధ. ఊరు వెళ్ళాక కనీసం మరుసటిరోజు సాయంత్రమైనా విజయవాడ నుండి శిరిడీ వెళదామని చాలా ప్రయత్నించాను. ఈసారి 18వ తేదికి తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ 19 వచ్చింది. irctc డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తెలిసిన వ్యక్తి ద్వారా టికెట్స్ కన్ఫర్మ్ చేయించేందుకు మా అంకుల్ చాలా ప్రయత్నించారు. కానీ, "నా అనుమతి లేనిదే శిరిడీలో ఎవరు అడుగుపెట్టలేర"ని బాబా చెప్పారు కదా! ఈసారి కూడా నా ప్రయత్నాలు ఫలించలేదు. దానితో నా గుండె బద్దలైపోయింది. నేను శిరిడీ రావడం బాబాకి ఇష్టం లేదని, నాపై ఆయనకు ప్రేమలేదని కుమిలిపోయాను. శిరిడీ వెళ్ళలేకపోయినందుకు రెండు రోజులు ఏడుస్తూనే ఉన్నాను. గుండెలనిండా ఈ బాధతోనే నేను నా తల్లిదండ్రుల వద్ద ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఆ బాధ నుండి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. మా అమ్మ, "మనం తరువాత వెళదాం. ఇప్పుడు చాలా జనం ఉంటారు. అందువలన గంటల తరబడి దర్శనం కోసం క్యూలో నిలబడి ఉండాలి. పైగా నీవు ఆశించిన విధంగా ఎక్కువసేపు దర్శనం కూడా చేసుకోలేవు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు బయటకు తోస్తూ ఉంటారు" అని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ నాకు దుఃఖం ఆగలేదు. కానీ, బాబా నావద్దకు వచ్చారు. ఇక్కడే, ఉన్నచోటనే ద్వారకామాయిలో ఉన్న అనుభూతిని నాకు కలిగించారు. అదెలాగో చెప్తాను.

మా ఇంటికి దగ్గరలో ఒక బాబా మందిరం ఉంది. అక్కడ మాకంతా పరిచయమే. మా అమ్మ రోజూ 2 చపాతీలు చేసి ఆలయంలో బాబాకు ఇస్తూ ఉంటారు. అదికాక మా ఊరిలో ఇంకో బాబా మందిరం కూడా ఉంది. అక్కడ 50 అడుగుల పెద్ద బాబా విగ్రహం ఉంది. అది చాలా ప్రసిద్ధి చెందినది. అక్కడికి చాలామంది యాత్రికులు కూడా వస్తుంటారు. మా అమ్మ, "సాయంత్రం ఈ రెండు మందిరాలకు వెళ్దాం, పెద్ద బాబా టెంపుల్ లో ఈరోజు పల్లకి సేవ కూడా ఉంటుంద"ని చెప్పింది. ఆమెను నిరాశపరచడం ఎందుకని నేను సరేనని చెప్పాను. ముందుగా మేము ఎప్పుడూ వెళ్లే మందిరానికి వెళ్లొచ్చిన తరువాత పెద్ద మందిరానికి వెళ్ళాము. అప్పటికీ నేనింకా శిరిడీ వెళ్ళలేకపోయినందుకు విచారంగానే ఉన్నాను. ఆలయ సమీపానికి వెళ్లి చూసేసరికి ఆలయం అత్యంత సుందరంగా అలంకరించబడి ఉంది. బాబా కోసం ఎన్నో అలంకరణలు చేసారు. ప్రతి ఒక్కరూ బాబాను చాలా స్పెషల్ గా చూడటం, ఆయనని ప్రత్యేకంగా అనుభూతి చెందేలా చూడటానికి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తారో చూశాక నా మూడ్ కొంచెం మారింది. మందిరం లోపలికి వెళ్లి చూస్తే బాబా ఎంతో అందంగా ఉన్నారు. దృష్టి మరల్చుకోలేక అలా బాబా ను చూస్తూ ఉండిపోయాను. దర్శనానంతరం మేము పల్లకీ సేవకోసం వేచి ఉన్నాము. కొద్దిసేపటికి పల్లకీ సేవ మొదలైంది. నేను కూడా పల్లకీతో పాటు వెళ్ళాను. పల్లకీ మోసే అవకాశం బాబా నాకు కూడా ఇచ్చారు. 5 నిమిషాలకన్నా ఎక్కువ సమయం నా భుజాలపై బాబా పల్లకీ మోసే భాగ్యం బాబా నాకిచ్చారు. 15 నిమిషాల పాటు రోడ్డు మీద బాబాని పల్లకీలో ఊరేగించి మళ్ళీ ఆలయంలోకి తీసుకొచ్చి బయట ఉన్న 50 అడుగుల బాబాకి ఆరతి ఇచ్చారు. ఆ తరువాత మేము లోపలికి వెళ్లి శేజ్ ఆరతికోసం వేచి ఉన్నాము. ఆరతి కోసం డ్రమ్స్ ఏర్పాటు చేసారు. ఆ డ్రమ్స్ మోగిస్తూ ఆరతి చేస్తూ ఉంటే నేను ఇక్కడ లేను, శిరిడీలో నాకిష్టమైన ద్వారకామాయిలో కూర్చొని ఆరతి పాడుతున్న అనుభూతి కలిగింది. మీరు నమ్మలేరు, పూర్తి 20 నిమిషాలు నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియట్లేదు. నేను ఆరతి పాడుతూ ఉన్నాను, నా కళ్ళకి ఏమీ కనపడటం లేదు. నా చెవులకు మ్రోగుతున్న డ్రమ్స్, భక్తులు పాడుతున్న ఆరతి పాట తప్ప వేరేమీ వినపడటం లేదు. నా కళ్ళు మూతబడ్డాయి. నా కళ్ళ ముందు ద్వారకామాయి, సమాధి మందిరంలో బాబా మూర్తి కనపడుతూ ఉన్నాయి. నా కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కాసేపటికి కళ్ళు తెరిస్తే నేను శిరిడీలో లేనని అనుభవమైంది. కానీ అంతకుముందున్న ఆ విచార భావన నాలో లేదని గ్రహించాను. బాబా నన్ను శిరిడీ తీసుకొనివెళ్లి తమ దర్శనం చేయించి రెండు నిమిషాలలో మళ్ళీ ఇక్కడికి తెచ్చారని అర్ధమైంది. తరువాత మేము ఒక చిన్న బాబా విగ్రహాన్ని ఊయలలో పడుకోబెట్టాము. నేను ఉయ్యాల ఊపుతూ బాబాని నిద్రపుచ్చాను. ఇది ఒక అందమైన అనుభవము, పదాలలో సరిగా వర్ణించలేను.

తరువాత మా అమ్మ, "నువ్వు శిరిడీలో ఉన్నట్లయితే కనీసం పల్లకీని తాకగలిగే దానివి కాదు, కానీ ఇక్కడ 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం నీ భుజాలపై పల్లకీని మోశావు. నీ స్వహస్తాలతో ఊయల ఊపుతూ బాబాని నిద్రపుచ్చావు. ఒకసారి ఆలోచించు ... ఇవన్నీ నువ్వు శిరిడీలో చేయగలవా? ఇప్పటికీ నీకు బాధగా ఉందా? నువ్వు ఆయనను దర్శించుకోవడం, ఆశీస్సులు పొందడం ఆయనకు ఇష్టం లేదని నీకు ఇప్పుడు కూడా అనిపిస్తుందా?" అని నన్ను ప్రశ్నించింది. నాకు నోట మాట రాలేదు. ఎందుకంటే వాటికి నా దగ్గర సమాధానం లేదు. పైగా నేనింకా బాబా ఇచ్చిన ఆ అద్భుతమైన ఆధ్యాత్మికానందంలో ఉన్నాను, అస్సలు మాట్లాడే స్థితిలో లేను.

"బాబా! అద్భుతమైన ఆనందాన్ని మీరు నాకు ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు".

ఓం సాయిరామ్!

ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్తా....

2 comments:

  1. Goosebumps experience!!! Can relate to the blissful tears flowing for Him. Thank you for sharing. SaiRam

    ReplyDelete
  2. sayiram, 50 feet baba statue yekkada vundi cheppagalaru.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo