సాయి ఆశీర్వాదంతో పుట్టిన మా అందమైన పాప
పేరు వెల్లడించని ఒక సాయిబంధువు బాబా తనకిచ్చిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.
నేను బాబాపై పరిపూర్ణ భక్తివిశ్వాసాలు ఉన్న భక్తురాలిని. ఒక బ్లాగుని రూపొందించి బాబాపై మా నమ్మకాన్ని దృఢపరుస్తున్నందుకు ముందుగా బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా లేని మా జీవితాలు శూన్యం. బాబా ఏ లోటూ లేకుండా నాకన్నీ ఇచ్చారు. ఇకపోతే నా అనుభవానికి వస్తే.. మంచి తల్లితండ్రులు, ప్రేమగా చూసుకునే భర్తతో ఆనందంగా రోజులు గడిచిపోయేవి. కానీ మాకున్న పెద్ద లోటు ఏమిటంటే, మాకు సంతానం లేకపోవడం. నా గతజన్మల పాపకర్మల కారణంగా పిల్లలకోసం లక్షలు ఖర్చుచేసి చాలా చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. కానీ అవేవీ ఫలితాన్ని చూపలేదు. మా వివాహమైన నాలుగేళ్ళ తరువాత నేను 'నవ గురువార వ్రతం' చేశాను. సరిగ్గా సంవత్సరం తర్వాత మొదటిసారిగా నేను గర్భవతినయ్యాను. కానీ అనుకోకుండా 9వ వారంలో నాకు గర్భస్రావం జరిగింది. ఆ దిగులుతో నేను బాగా క్రుంగిపోయి నాకింక పిల్లలు పుడతారనే ఆశని కోల్పోయాను. అయితే ఇది జరిగిన 10 నెలల తరువాత, అంటే 2016 చివరిలో బాబా భక్తురాలైన నా స్నేహితురాలు, "ప్రతిరోజూ పరగడుపున బాబా ఊదీ తీసుకోమ"ని సలహా ఇచ్చింది. నేను తను చెప్పినట్లుగానే ఊదీ తీసుకుని, నుదుటిపై ఊదీ పెట్టుకుని, ఎప్పుడూ 'సాయి సాయి సాయి' అని స్మరిస్తూ ఉండేదాన్ని. నిదానంగా వైద్యపరంగా ఏ సమస్యలున్నా సాయి వాటిని తొలగించి నాకు సంతానాన్ని అనుగ్రహిస్తారని నా నమ్మకం దృఢపడింది.
2017 జనవరిలో ఒకరోజు స్వప్నంలో సాయి నాకు దర్శనమిచ్చి, నాకు స్వీట్స్ ఇచ్చారు. ఆరోజు నాకు కలిగిన సంతోషాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు, పట్టరాని ఆనందంతో ఏడ్చేసాను. మళ్ళీ సరిగ్గా ఒక నెల తరువాత, మరుసటిరోజు నేను ప్రెగ్నన్సీ టెస్టుకోసం డాక్టరు దగ్గరకి వెళ్లాల్సి ఉందనగా ముందురోజు రాత్రి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, పుట్టిన బిడ్డకి నామకరణం చేస్తున్నారు. నేను గర్భవతినని బాబా ఇస్తున్న శుభసూచకంగా భావించాను. బాబా అద్భుతం చేసి చూపారు. నేను నిజంగానే గర్భవతినయ్యాను. నేను, మావారు, మా కుటుంబసభ్యులు పొందిన ఆనందానికి అవధుల్లేవు. బాబా కృపతో 9నెలల కాలం సాఫీగా సాగిపోయింది. ఇప్పుడు మాకు 3 నెలల అందమైన పాప ఉంది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” బాబా దయవలన నేనిప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను. “ఈ ఆనందానికి కారణం మీరే బాబా!” దృఢమైన విశ్వాసంతో సాయిపై భారం వేస్తే ఖచ్చితంగా మన బాబా అద్భుతం చేసి చూపుతారు. అహంకారాన్ని వదిలిపెట్టి ఆయన దివ్యపాదాలపై మనసు కేంద్రీకరించి, ఆయన వాక్కులను అనుసరించి నడుచుకుంటే శుభం కలుగుతుంది. సాయి సాయి సాయి సాయి సాయి.
No comments:
Post a Comment