సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 16వ భాగం....


అనుక్షణం అండగా నిలిచే బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను బాబాకు చిన్న భక్తురాలిని. నేనెప్పుడూ బాబా బిడ్డగా అనుభూతి చెందుతూ ఉంటాను. ఇటీవల నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

ఈమధ్య మేమొక పుట్టినరోజు వేడుకకు వెళ్లి తిరిగి కారులో వస్తున్నప్పుడు దారిలో ఒకచోట ఒక ఎడ్లబండి ప్రక్కనుండి వెళ్ళాము. ఆ సమయంలో చాలా పెద్ద శబ్దం వినిపించింది. "ఆ శబ్దమేమిటి? ఎవరికైనా ఏదైనా హాని జరిగిందా?" అని అనుకున్నాము. కొంతసేపటికి ఒక  పోలీసు ఆఫీసరు యూనిఫాంలో బైక్ మీద మమ్మల్ని అనుసరిస్తూ రావడం గమనించాము. అతను మా కారును ఆపి బయటకు రమ్మన్నాడు. నేను అతన్ని చూస్తూనే భయపడిపోయి, "బాబా! మాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. అతను, "మీ కారు నా బైక్ ని గుద్దింది. నా కాలికి గాయమైంది. నా బైక్ కూడా కొంచెం డామేజ్ అయింది" అని చెప్పాడు. ఆ సమయంలోనే బైకుకి వున్న ఒక చిన్న పిన్ను మా కారు టైరుకి తగిలి బరస్టయ్యింది. అదే మాకు వినిపించిన పెద్ద శబ్దం. ఎవరికీ పెద్ద హాని కాలేదని తెలిసి మేము కాస్త ఊపిరి పీల్చుకున్నాము. ఆ పోలీసు ఆఫీసరు కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. మేము కారు మరమ్మత్తు చేయించుకుని ఇంటికి చేరుకున్నాము. బాబా మా చెడుకర్మలను పెద్ద ప్రమాదం జరక్కుండా కొద్ది డబ్బుతో తొలగించారు. "థాంక్యూ సోమచ్ బాబా!"

రెండవ అనుభవం:

మావారు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తనకి తగినంత అనుభవం ఉండడంతో మేనేజర్ ప్రమోషన్ కోసం మేము ఎదురుచూస్తుండేవాళ్ళం. మావారు పనిచేస్తున్న చోట మేనేజరుగా ఉన్న వ్యక్తి వేరే చోటికి వెళ్లడంతో మావారే కొన్నిరోజులు టీం హెడ్ గా వ్యవహరించారు. కాబట్టి తనకే మేనేజరుగా ప్రమోషన్ వస్తుందని ఆశిస్తుండేవారు. కాకడ హారతి సమయంలో బాబా చాలా ప్రశాంతంగా ఉంటారని, ఆ సమయంలో మనం అడిగిన కోరికలను కరుణతో నెరవేరుస్తారని 'సాయి ప్రేమ'లో వ్రాసి ఉంది. అందువలన నేను 11 రోజులపాటు క్రమం తప్పకుండా కాకడ హారతికి వెళ్లి బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే అనుకోకుండా కొత్త మేనేజరుని అపాయింట్ చేయడంతో, బాబా సరైన సమయంలో మాకు శ్రేయస్కరమైనది అనుగ్రహిస్తారని తెలిసినా కాస్త నిరాశపడ్డాము. కొన్నిరోజులకి వేరే చోట మేనేజర్ పొజిషన్లో మావారికి అవకాశం వచ్చింది. అలా బాబా అద్భుతమైన రీతిలో మా కోరికను నెరవేర్చారు. మంచి కంపెనీలో మేము ఊహించని మంచి జీతాన్ని బాబా అనుగ్రహించారు. ఒకవేళ పాత కంపెనీలోనే మేనేజర్ ప్రమోషన్ వచ్చినా ఇంత మంచి జీతం వచ్చేది కాదు. అంతా బాబా కృప. బాబా తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. ఆయన ఎంతో ఉత్తమంగా ఆలోచించి మన కోరికలు నెరవేరుస్తారు. ఈ కోరిక నెరవేరితే మావారు 11 రోజులు కాకడ హారతికి హాజరవుతారని నేను బాబాకి మ్రొక్కుకున్నాను. మావారు సాయిభక్తుడు కానప్పటికీ బాబా కృపవలన 11 రోజులు హారతికి వెళ్లారు. బాబా మావారి కర్మలను తొలగించి తన ప్రేమలో పడేలా చేస్తున్నారు. నిదానంగా మావారు బాబాని ఇష్టపడుతున్నారు. ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న ఈ కోరికను కూడా బాబా నెరవేరుస్తున్నారు.

మూడవ అనుభవం:

ఒకప్పుడు నాకు చంకలో నొప్పి వస్తుండేది. దానితో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. బాబాని ప్రార్థించి, ఆ చోట ఊదీ రాసి, కొంచెం నీటిలో కలుపుకుని త్రాగాను. బాబా కృపవలన ఆ నొప్పి తగ్గిపోయింది. మరోసారి మా పాప బుగ్గలపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా బాబాని ప్రార్థించి ఊదీ రాయడంతో ఆ మచ్చలు పూర్తిగా తొలగిపోయాయి.

నాల్గవ అనుభవం:

ఇటీవల వేరే సిటీలో ఉన్న మా కుటుంబసభ్యులను కలవడానికి టికెట్లు బుక్ చేయాలనుకున్నాను. అయితే నేను అనుకున్న తేదీలలో టిక్కెట్లు దొరకలేదు. బాబా ప్రణాళికలు అమోఘమైనవి. ఆయన మా వివాహ వార్షికోత్సవం, సెలవుదినాలు కలిసివచ్చేలా మా ప్రయాణాన్ని మలిచారు. మా కుటుంబసభ్యులంతా చాలా గొప్పగా మా వివాహ వార్షికోత్సవాన్ని జరిపారు. అందరూ మాపై ఎంతో ప్రేమను కురిపించారు. నిజానికి మా మధ్యన ఎప్పుడూ భేదాభిప్రాయాలుండేవి. కానీ ఈ ప్రయాణం మా మధ్య ఉన్న అపార్థాలను తుడిచేసి మళ్లీ అందరినీ ఒకటి చేసింది. ఇలాగే ఎప్పుడూ మా కుటుంబమంతా సంతోషంగా కలిసి ఉండాలని ఆశిస్తున్నాను. మా వివాహ వార్షికోత్సవాన్ని నేను, నా భర్తే చేసుకోదలచినా బాబా అందరితో కలిసి చేసుకునేలా ఏర్పాటుచేసి కుటుంబమంతా మళ్లీ ఒక్కటయ్యేలా చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo