సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త అనుభవమాలిక 7వ భాగం....


సాయి నా ఉద్యోగ జీవితాన్ని నిలబెట్టారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

నేను 2013 నుంచి బాబా భక్తురాలిని. నేను సదా బాబా ఆశీర్వాదాలు అనుభూతి చెందుతూ ఉన్నాను. "బాబా! చదివేవారికి అర్థమయ్యేరీతిలో నా అనుభవాన్ని  వ్రాయగలిగేలా నాకు సహాయం చేయండి". నేను మంచి గ్రేడ్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశాక నాకు చెన్నైలోని ఒక మంచి ఎం.ఎన్.సి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇంకా మంచి అవకాశం వస్తే బెంగళూరుకి మారాను. అక్కడ ఉద్యోగం చేస్తూ ఆన్‌సైట్ లోకేషన్స్ కి కూడా తరచూ వెళ్తూ ఉండేదాన్ని. చెన్నైలో, బెంగళూరులో నాకు ఫ్రెండ్స్ గ్రూపు కూడా ఉంది. సాయి ఆశీస్సులతో అంతా సక్రమంగా సాగుతూ ఉండగా, 2017 మధ్యలో యూరప్ లో నాకు పర్మినెంట్ ఉద్యోగం వచ్చింది. నేను కూడా అప్పటికే పనిచేస్తున్నచోట ప్రమోషన్స్ వచ్చే అవకాశం పెద్దగా లేకపోవడంతో యూరప్ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. అప్పటికీ నా మేనేజర్స్ వెళ్లొద్దని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నేను  స్నేహితుల ప్రోత్సాహంతో నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. అక్కడికి వెళ్లేముందు నా క్లోజ్ ఫ్రెండుకి కూడా మంచి ఉద్యోగం అక్కడ చూపిద్దామని అనుకుని యూరప్ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక, అక్కడ ఉండటానికి, భోజనానికి చాలా ఇబ్బందిపడ్డాను. అటువంటి సమయంలో స్నేహితుడి స్నేహితుని సహాయంతో ఉద్యోగం వదులుకుని తిరిగి ఇండియాకి వచ్చేసాను. అప్పుడు నాకు భయంకరమైన నిజాలు తెలిసాయి. నా పాత కంపెనీలోని మేనేజర్స్ నాకు ప్రమోషన్ ఇవ్వాలని అనుకున్నారట. ఆ ప్రమోషన్ నా క్లోజ్‌ ఫ్రెండుకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, నా క్లోజ్ ఫ్రెండ్ నేను యూరప్ వెళ్లి తనకి ఉద్యోగం చూపిస్తే తను కూడా యూరప్ వస్తానని పైకి నాకు వాగ్దానం చేసి, లోలోపల మాత్రం నన్ను పంపించేసి ఆ ప్రమోషన్ తను కొట్టేయాలని ప్రణాళిక వేసుకుని నన్ను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేలా ప్రోత్సహించాడు. అలా నాతో ఉండి నా వెనుక అన్నీ నడిపాడు.

ప్రతి ఒక్కరికీ సహాయపడే స్వభావం నాది. ఎవరికీ 'నో' అని చెప్పను. అదే నాకు బలం, బలహీనత అయ్యింది. అలా జరిగినప్పటికీ నేను నా ఫ్రెండ్స్‌తో మామూలుగా ఉండటానికి ప్రయత్నించాను. కానీ ఏం జరిగిందో ఏమిటో తెలియదుగానీ, ఒక సీనియర్ తప్ప అందరూ నన్ను దూరంగా ఉంచేవారు. అలా ఉండగా బాబా నాకు రెండునెలల్లో బెంగళూరులో మంచి స్థాయిలో, మంచి జీతంతో ఉద్యోగాన్ని చూపించారు. అయితే రెండునెలలు ఉద్యోగం చేసాక పరిస్థితులు నచ్చక రాజీనామా చేశాను. ఎవరి సహాయమూ లేకపోవడంతో బాబాపట్ల కూడా విరక్తి చెంది, నిరాశతో చెన్నైలో మా ఇంటికి వచ్చేసాను. ఒకనెలపాటు బాబాని కూడా ప్రార్థించడం మానేశాను. మా అమ్మ తప్ప నాకు తోడుగా ఇంకెవరూ మిగల్లేదు. ఆ సమయంలో నా తప్పు నేను తెలుసుకుని, మనుషులు ఎలా మారిపోతారో తెలియజేసినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, మళ్ళీ బాబాని ప్రార్థించడం మొదలుపెట్టాను. అప్పటినుండి బాబా దయవలన మనసుకి కాస్త ప్రశాంతత చేకూరింది.

నా సీనియర్ నాకు సాయం చేస్తున్నప్పటికీ సరైన అవకాశం దొరకలేదు. నెలలు గడుస్తున్నా నాకు ఉద్యోగం రాలేదు. అమ్మ ఒక్కతే నన్ను, మా గ్రాండ్ పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఈ సమయంలోనే జాతకాలు అంటూ జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూ, వాళ్ళు చెప్పే పరిహారాలు చేస్తూ చాలా డబ్బులు కూడా నష్టపోయాము. ఇవన్నీ వద్దని సాయి దివ్య పూజ, సప్తాహ పారాయణ మొదలుపెట్టి సాయినే నమ్ముకున్నాను. ఆ పారాయణ సమయంలోనే శిరిడీ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. నేను నా 'CV'(బయోడేటా) సమాధిపై పెట్టి బాబాను ఆశీర్వదించమని ప్రార్థించాను. బాబా నా CVతోపాటు ఒక ఎర్ర గులాబీ కూడా ఇచ్చారు. అప్పటినుంచి నిదానంగా ఇంటర్వ్యూ కాల్స్ రావడం మొదలయ్యాయి. అయితే అవి అంత సంతృప్తికరంగా ఉండేవి కాదు. కొన్ని కంపెనీలు నా ప్రొఫైల్‌ని తోసిపుచ్చేవి కూడా. ఎందుకంటే, నేను చదువుకున్న ఎలక్ట్రానిక్స్‌కి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. నేను మనస్ఫూర్తిగా, "బాబా! పాత కంపెనీకి మళ్ళీ నన్ను పంపించకండి. నాకు అనుకూలమైన అవకాశాన్ని కొత్త కంపెనీలో చూపించండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఈలోగా ఇంటిదగ్గర ఖాళీగా ఉండటం ఎందుకని ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా మొదలుపెట్టాను. అలా వైఫల్యాలు ఎదుర్కొంటున్న స్థితిలో అమ్మ, మా ఆంటీ నాకు తోడుగా ఉంటూ నాకోసం బాబాని ప్రార్థిస్తుండేవారు. నేను వెబ్‌సైట్‌లో  భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! నాకేదైనా పాజిటివ్ సంకేతమిమ్మ"ని బలంగా అడుగుతుండేదాన్ని.

తరువాత నేను నవ గురువార వ్రతం చేస్తున్న సమయంలో ఒకరోజు నేను క్లాస్ నుండి తిరిగి వస్తుంటే పూనాలోని ఒక కన్సల్టెన్సీ నుంచి ఫోన్ వచ్చింది. బాబా ఇచ్చిన అవకాశంగా భావించి భాష, దూరం అనేవి దృష్టిలో పెట్టుకోకుండా నేను సరేనన్నాను. నేను ఇంటర్వ్యూకి సంబంధించిన అన్ని రౌండ్స్ 22/8/2018న విజయవంతంగా పూర్తి చేశాను. బాబాకిచ్చిన మాట ప్రకారం అదేరోజు ఈ అనుభవాన్ని వ్రాసాను. బాబా నాకు సరైన ఉద్యోగం చూపించారు, మనుషులు ఎలా ఉంటారో తెలియజేశారు. ఇంతకన్నా నేను నా సాయిని ఏమి అడగను? ఆయన నన్ను హానికరమైన పరిస్థితులనుండి కాపాడారు. ఆ సమయంలో ఇంకా చాలా అనుభవాలు జరిగాయి. కానీ, ఇప్పటికే మేటర్ ఎక్కువైన కారణంగా వాటన్నింటిని చెప్పలేక కొంతవరకే చెప్పాను. నేను నా జీవితంలో ఆరునెలల సమయాన్ని కోల్పోయాను కానీ, జీవితానికి అవసరమైన పాఠం నేర్చుకున్నాను. ఎప్పుడూ సాయి యందు విశ్వాసాన్ని కోల్పోకండి. ఆయన మన తల్లి, తండ్రి. సాయిని నమ్ముకునివుంటే ఆయన ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది. ఇంత పెద్ద అనుభవాన్ని వ్రాసినందుకు మన్నించండి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా! నా చెయ్యి ఎప్పుడూ గట్టిగా పట్టుకుని నన్ను నడిపించండి".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo