ఈరోజు భాగంలో అనుభవాలు:
- సాయి స్వప్నదర్శనంతో నన్ను అనుగ్రహించారు.
- సాయిబాబా యందు విశ్వాసం
సాయి స్వప్నదర్శనంతో నన్ను అనుగ్రహించారు.
అమెరికా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడి అనుభవం :
సాయిబంధువులందరికీ ఓం సాయిరామ్.
నేను ఐదువారాల సాయి దివ్యపూజ చేయాలన్న సంకల్పంతో 2018 జనవరిలో మొదలుపెట్టాను. మొదటి గురువారం పూజ ప్రారంభిస్తూ, "బాబా! నాకు స్వప్నంలో మీ దర్శనం ఇవ్వండి, ఆ దర్శనం ద్వారా నేను నా మనస్సులోని ఆందోళనలు, భయాలు, ప్రతికూల ఆలోచనల నుండి బయటపడేలా నన్ను ఆశీర్వదించండ"ని బాబాని ప్రార్థించాను. మూడోవారం నేను దివ్యపూజ పూర్తి చేసిన తరవాత బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. కలలో నేను నిద్రపోతున్నాను. కలలో నేను నిద్రలేచిన తరువాత నా నుదుటి మీద, ముఖం మీద ఊదీ ఉండటం చూశాను. నేను ఆశ్చర్యపోతూ నా భార్యను "నా ముఖంపై ఊదీ ఉందా?" అని అడగగా, ఆమె, "అవును, మీ ముఖంపై ఊదీ ఉంది" అని చెప్పింది. అప్పుడు నేను ఆమెను అదెలా వచ్చిందని అడిగాను. ఆమె ఏమోనంది! ఇంతలో నేను తల పైకెత్తి ఆకాశం వైపు చూశాను. ఆకాశంలో బాబా కనిపించి, నన్ను చూస్తూ నవ్వుతున్నారు. అది ఒక ఆనందకరమైన దర్శనం. వెంటనే నాకు మెలకువ వచ్చి లేచాను. కలను గుర్తుచేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను బాబాను స్వప్న దర్శనమిమ్మని ప్రార్థించాను, అలాగే ఆయన దర్శనమిచ్చి, నేను నా ఆందోళనలు, భయాలు, ప్రతికూల ఆలోచనల నుండి పూర్తిగా బయటికి వస్తానన్న సూచనగా నా నుదుటిమీద ఊదీని పూసారు. బాబా ఆశీస్సుల వలన ఆయన కృపతో నేను ఈ సమస్యల నుండి చాలావరకు బయటకు వచ్చాను. తరువాత నా మానసికస్థితి చాలా అభివృద్ధి చెందింది. నేను ఇప్పుడు ఆ సమస్యల నుండి పూర్తిగా బయటపడ్డాను. "సాయిదేవా! మీ యందు నాకు పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ అటువంటి ఆలోచనలు రాకుండా మీరు చూసుకుంటారు. సంతోషకరమైన దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. మీకు నా కోటి కోటి ప్రణామములు బాబా! ఎక్కడెక్కడో ఉన్న మీ బిడ్డలందరి అవసరాలపట్ల మీరే శ్రద్ధ వహించండి బాబా!" మనల్ని సదా గమనిస్తూ, మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఉంటారు బాబా. నిజంగా ఆయన ప్రేమమూర్తి.
సాయిబాబా యందు విశ్వాసం
సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
సాయిబాబాయే నాకు తల్లి, తండ్రి. సాయిబాబా సర్వశక్తిమంతుడు. ఊహకందని ఎన్నో లీలలు ఆయన నా జీవితంలో చేసారు.
ఒకరోజు నేను పూజగదిలో బాబాని ప్రార్థిస్తూ, హఠాత్తుగా ఒక తెల్లని పేజీలో బాబా ముఖాన్ని చూశాను. ఆశ్చర్యంగా మళ్లీ చూసేసరికి అక్కడ ఏమీ లేదు. నేను అదేదో ఊహ అయివుంటుందనుకున్నాను. తర్వాత నా సోదరి అదే పేజీలో సాయిబాబా ఫోటో ప్రింట్ చేయిస్తానని చెప్పింది. అప్పుడు నాకర్థమైంది, సాయిబాబా నాకు ముందుగానే అది సూచించారని.
నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నా కానీ, నేను కోరుకున్న ఉద్యోగం నాకు లభించేది కాదు. ఎదురు చూసి చూసి నేను బాగా నిరాశ చెందాను. ఆ సమయంలో సాయిబాబాతో నాకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రతిరాత్రి సాయిభక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా నా ప్రార్థనలను ఎందుకు వినట్లేదు? బహుశా నన్ను పరీక్షిస్తున్నారేమో!?" అనుకున్నాను. తరువాత నేను వ్రతం, సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. కానీ రోజులు గడుస్తున్నా పారాయణ పూర్తి చేయలేకపోయాను. నేను చాలా బద్ధకంగా ఉంటున్న ఆ స్థితిలో, "త్వరగా పారాయణ పూర్తి చేయి. ఇంటర్వ్యూ కాల్ వస్తుంది" అని సాయిబాబా చెబుతున్నట్లు నా మనస్సుకు అనిపించి, ఆ రోజు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి చివరి అధ్యాయాలు పూర్తి చేశాను. మరుసటిరోజే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నా ఆనందానికి అవధుల్లేవు. చివరికి అన్ని రోజుల సహనం ఫలించింది. నేను కోరుకున్న ఉద్యోగం నాకు లభించింది. అంతేకాదు, నేను ఉద్యోగం చేసే చోటే నాకు కాబోయే నా భర్తని కూడా కలుసుకున్నాను. ఎప్పుడూ ఆశను కోల్పోకండి. బాబా ఉండగా భయమెందుకు?
🕉 sai Ram
ReplyDelete