సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నీ భక్తికి మెచ్చి వచ్చాను

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
                     
చాలా సంవత్సరాల క్రితం సుభద్రచోరి అనే సాయిభక్తురాలు శిరిడీకి వెళ్లింది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె ద్వారకామాయిలో కూర్చొని ఎంతో భక్తిభావంతో బాబా నామజపం చేస్తూ, 'పూర్వం బాబా సశరీరులుగా ఉన్న రోజులలో ఇక్కడ ఎలా ఉండేదా!?' అని ఆలోచిస్తూ ఆశ్చర్యానికి లోనయ్యింది. "అపుడు బాబా ఎలా ఉండేవారు? నాకు ఎప్పుటికైనా అప్పటి రూపంతో బాబా దర్శనం ఇస్తారో లేదో కదా?" అనుకుంది.

తరువాత ఆమె శిరిడీలోని అన్ని ప్రదేశాలు దర్శించుకొని శేజ్ ఆరతికి సమాధిమందిరానికి వెళ్లింది. కానీ ఆరతికి ఇంకా అరగంట సమయం ఉన్నందున రాత్రివేళ ద్వారకామాయి ఎలా వెలిగిపోతుందో చూడాలనుకుని ఆమె మళ్ళీ ద్వారకామాయికి వెళ్లింది. ఆ సమయంలో ద్వారకామాయి నూనెదీపాల కాంతులతో, మండుతున్న ధునిమాయితో దేదీప్యమానంగా కోటిసూర్యప్రభాకాంతులతో వెలిగిపోతోంది. ఇంతలో అక్కడ బాబా తెల్లని కఫినీ ధరించి హుందాగా చేతులు వెనక్కి పెట్టుకొని నిల్చొని ఉండడం చూసి ఆశ్చర్యంతో, "బాబా, నువ్వేనా?" అని అడిగింది. అందుకు బాబా, రా తల్లీ, నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వు నన్ను, ద్వారకామాయిని చూడాలనుకున్నావు కదా! అన్నారు. సుభద్ర భక్తితో బాబా పాదాలకి సాష్టాంగనమస్కారం చేసింది. బాబా తమ దివ్యహస్తాలతో ఆమెని పైకి లేపి, “తల్లీ, నీ భక్తికి మెచ్చాను. మీ ఇంటిలో ఉండే ప్రతి ఫోటోలోనూ నేనున్నానని తెలుసుకో! నా భక్తులు వారి నమ్మకం కొద్దీ నా దగ్గరకి వస్తారు. వారి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు మౌనం వహించు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. చాలామంది నా గురించి కూడా చెడుగా మాట్లాడతారు. నాఫై ఎప్పుడూ విశ్వాసముంచు” అని చెప్పారు. శేజ్ ఆరతి మొదలవుతుందనగా బాబా వెళ్ళిపోతూ, “రేపు లెండీవనంలో కలుద్దాం” అన్నారు. 

మరుసటి ఉదయం ఆమె లెండీవనంలో ఉన్న బావి దగ్గరకి వెళ్ళింది. అక్కడ బాబా ఆమె కోసం ఎదురుచూస్తూ బావి అంచుపై కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో, "తల్లీ! ఈ బావి అన్ని ప్రధాన నదులకి కేంద్రబిందువు. కానీ దీనికి ఒక్కరు కూడా టెంకాయ సమర్పించరు. మరి నేను ప్రజలకి నీళ్ళు ఎలా ఇస్తాను? కొద్దిరోజులకి దీంట్లో నీళ్ళు కనపడవు, ఎండిపోతుంది. ఈ రావిచెట్టుని పూజించడం ఎన్నటికీ మరువకు. ఇంకా ఆ ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు అని చెప్పారు. తరువాత బాబా ఆమెకి కొన్ని ముఖ్యమైన విషయాలు, మందులు మరియు నివారణలు వంటి చాలా విషయాలు చెప్పి, "వాటిని నా అనుమతి లేకుండా ఎవరికీ చెప్పవద్దు" అని చెప్పారు. అంతేకాకుండా, ఆ విషయాలను రహస్యంగా ఉంచుతానని ఆమె వద్దనుండి మాట కూడా తీసుకున్నారు. 

తరువాత బాబా గురుస్థాన్ వైపు నడుస్తుంటే ఆమె బాబాని అనుసరిస్తూ వెళ్లారు. చివరిగా బాబా ఆమెతో, నువ్వు ఈసారి నా ప్రసాదంతో రావాలి అని చెప్పి అంతర్థానమయ్యారు. ఆమె మూడు సంవత్సరాల తరువాత తన బాబు 'చందన్ ప్రసాద్'తో కలిసి శిరిడీ వెళ్లి బాబుని బాబా పాదాలపై ఉంచింది. ఈ సంఘటన ద్వారా బాబా శిరిడీ ప్రాముఖ్యతను తెలియజేశారు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!          


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo