2007లో మావారు గౌహతిలో పనిచేసేవారు. మేము అక్కడ ఒక పెద్ద బంగ్లాలో క్రింది రూములో ఉండేవాళ్ళం.
మూడు సంవత్సరాల తరువాత మావారికి అక్కడినుండి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయింది. మేము
చాలా సంతోషంగా ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకున్నాం, ఎందుకంటే మా ఊరు ఢిల్లీనే. ఆ సమయంలో ఒకరోజు రాత్రి
నాకు నిద్రలో, “గౌహతి
పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది”
అని ఒక దివ్యస్వరం వినబడింది. నేను ఆ స్వరం విన్న వెంటనే, "ఎవరు అలా
చెప్తున్నారా?" అని నిద్రనుండి లేచాను. ఎవరూ కనపడలేదు. ఆ రోజులలో గౌహతిలో వాతావరణం
కూడా మామూలుగానే ఉండేది. బాగా ఎండగా ఉండేది. బ్రహ్మపుత్ర నది కూడా మామూలుగానే
ఉంది. అందువలన నేను 'ఏదో కలలే' అనుకుని ఆ విషయం మర్చిపోయాను. 10 రోజుల తరువాత మళ్ళీ అలాగే రాత్రి
నిద్రలో, “గౌహతి
పూర్తిగా నీటిలో మునిగిపోతుంది”
అని అదే స్వరం వినబడింది. ఈసారి ఇలా వినబడుతోందని మావారికి చెప్పాను. ఎలాగూ ఢిల్లీ వెళ్లిపోతాము కదా అని మా సామాన్లు ట్రక్కులో లోడ్ చేశాం. ట్రక్కు ఢిల్లీకి రవాణా కూడా అయిపోయింది. కొన్ని సామాన్లు మాత్రం మా దగ్గర పెట్టుకున్నాము.
గౌహతి నుండి ఢిల్లీకి ట్రైనులో 5
రోజుల తరువాత వెళ్ళబోతున్నాము. ఆరోజుకు మాకు టికెట్లు ఉన్నాయి.
అంతలో అకస్మాత్తుగా గౌహతిలో మేఘాలు కమ్ముకొని, ఆగకుండా వాన కురవడం మొదలయింది. మేము వాన ఆగిపోతుందిలే అనుకున్నాము, కానీ అస్సలు ఆగలేదు. నెమ్మదిగా టౌన్ మొత్తం తుఫానులో
చిక్కుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఎలా వెళ్ళగలమని నేను చాలా వేదనలో ఉన్నాను.
అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సాయిబాబా నా దగ్గరకు వచ్చి, “నేను గౌహతిలో తుఫాను
వస్తుందని నీకు రెండుసార్లు చెప్పాను కదా! వెంటనే రైల్వేస్టేషన్‌కి వెళ్ళిపొండి, అక్కడ రూమ్ తీసుకొని ఉండండి” అని చెప్పారు. బాబాకు
మనస్సులో నమస్కరించుకొని వెంటనే మావద్దనున్న కొద్ది సామాన్లు తీసుకొని రైల్వేస్టేషన్‌కి వెళ్లిపోయాము. వెంటనే టికెట్ తీసుకొని రాజధాని ట్రైన్‌లో ఢిల్లీ వెళ్లిపోయాము. ఢిల్లీ చేరుకున్న తరువాత గౌహతిలోని మా పక్కింటివాళ్ళకు ఫోన్ చేసి, "ఎలా ఉన్నారు? మేము
వెంటనే ఢిల్లీకి రావాల్సి వచ్చింద"ని చెప్పాము. అప్పుడు వాళ్ళు, "మీరు
వెళ్ళడం మంచిదయింది. మీ బంగ్లాలో మీరు ఉన్న రూమ్స్ అన్నీ జలమయం అయిపోయినాయి. గౌహతి పూర్తిగా తుఫానులో చిక్కుకుంది. అంతా అస్తవ్యస్తం అయింది. ఆ భగవంతుడు
మిమ్మల్ని రక్షించాడు" అని చెప్పారు.
ఇదంతా విన్నాక, “గౌహతి
పూర్తిగా నీళ్ళలో మునుగుతుంది”
అన్న సాయిబాబా దివ్యస్వరం మళ్ళీ నా చెవులలో ధ్వనించింది. అప్పుడు
అనుకున్నాను, 'తననే నమ్మిన వాళ్ళకు బాబా ఎలా సహాయాన్ని అందిస్తారో' అని. స్వయంగా నా దగ్గరకు వచ్చి ఆయన
స్వరం ద్వారా సంకేతాన్ని ఇచ్చి మమ్మల్ని రక్షించారు. మమ్మల్ని కృతార్థులను చేశారు. ఆ కరుణామయునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, “హే
సాయినాథా! నీవు నీ భక్తుల గురించి ఎంత చింతన చేస్తావు! నా సంపూర్ణ జీవితాన్ని నీకే
అర్పిస్తున్నాను” అని మనసులోనే అనుకున్నాను.
సంధ్యాచౌదరి,
నోయిడా.
Om sai ram
ReplyDelete