సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మృత్యు కోరల్లో చిక్కుకున్న భక్తుని రక్షించిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సాయి మహారాజ్ సన్నిధి అనే ఈ బ్లాగ్ ను బాబా ఆదేశానుసారం ఈ లీలతో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా ఈ లీల ప్రచురించమని బాబాయే సూచించారు.
సృష్టి స్థితి లయ కారకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి  స్వరూపమే సాయినాధుడు. పంచభూతాలను (నింగి, నేల, గాలి, నీరు, నిప్పు) తన స్వాదీనంలో ఉంచుకున్న యోగీశ్వరుడు మన సాయిబాబా. ఈ బ్రహ్మాండంలో తాను నిండి ఉండి, భక్త రక్షణార్ధం సప్త సముద్రలనైనా దాటి వస్తానని బాబా అన్నారు. అయితే పంచ భూతాలలో ఒకటైన “నీరు”లో తన భక్తుడికి ప్రాణగండం ఉందని గ్రహించి, తన భక్తుని కంటికి రెప్పలా ఎలా కాపాడారు ఈ లీల ద్వారా తెలుస్తుంది.

నా పేరు సుధాకర్, ఊరు పెందుర్తి. నా చిన్ననాటి నుండి నాకు బాబాపట్ల భక్తి ఉండేది. బాల్యం నుండి నాకు అంతా బాబానే. రోజూ బాబాను పూజిస్తూ ఎప్పుడూ బాబా బాబా అంటూ ఉండేవాడిని. అలా నాకు బాల్యంలోనే ఆధ్యాత్మిక భావాలు అలవడ్డాయి. నేను చాలా చూరుకుగా, తెలివిగా అన్నింటిలో నాదైన శైలితో అందరితో కలివిడిగా ఉంటూ ఉండేవాడిని. నలుగురికి సహాయపడే మనస్తత్వం, ఆపదలో ఆదుకునే గుణం, అదే కదా!! బాబా గారు మనకు నేర్పించింది

1996లో నేను డిగ్రీ చదువుతున్న రోజులలో జరిగిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. అప్పట్లో నేను చాలా చలాకీతనంతో ట్యూషన్ సెంటరులో అందరి కంటే బెస్ట్ స్టూడెంట్ గా ఉండేవాడిని. అదృష్టం కొలది మా గురువుగారికి సుమారుగా అంటే ఒక ఐదు సంవత్సరాలు అటు ఇటుగా నా వయస్సే. నా చలాకీతనం చూసి నా అద్వర్యంలో ఒక విహారయాత్ర ప్లాన్ చేయాలనీ అయన నిర్ణయించుకున్నారు. అది ఏమిటంటే, 30మందితో ఒక బస్సులో వెళ్లి రెండు రోజులు అరకులో ఉండి, చుట్టుప్రక్కల అందమైన ప్రదేశాలు దర్శించడం. అనుకునట్టే యాత్రకు సర్వం సిద్ధం అయ్యింది, అయితే నాలో ఏదో తెలియని ఆవేదన. దానికి కారణం నా స్నేహితులు(ఆరుగురు) నాతో కలసి మా సంతోషంలో భాగస్వామ్యం కాకపోవడం. వాళ్ళను రమ్మంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన వాళ్ళు మాతో రావడానికి సిద్ధపడలేదు. దాంతో నేను నిరాశ చెందాను. కానీ వెంటనే తేరుకొని "టూర్ నా అధ్వర్యంలో జరుగుతుంది. డబ్బే సమస్య అయితే, నేను చూసుకుంటాను. మీరు రండి" అని వాళ్ళను ఒప్పించాను. అలా మా విహారయాత్రకు మేమంతా సిద్ధం అయ్యాం.

హోటల్లో టిఫిన్స్ కట్టించుకొని ప్రయాణం మొదలు పెట్టాం. డిసెంబర్ నెల శీతాకాలం కావడంతో చాలా చలిగా ఉంది. ప్రకృతి అంతా పచ్చని చీర ధరించినట్లు చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఎత్తైన కొండలు, జలపాతాలు, వాగులు అన్ని కనువిందు చేస్తున్నాయి. ఆ చక్కటి ప్రకృతి సోయగాలు చూసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గమ్యన్ని చేరాము. బొర్రాగుహలను దర్శించినప్పుడు అక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసింది. (1996లో అది తెరిచి ఉండేది. ఇప్పుడు అది క్లోజ్ చేసారు). అక్కడకు వెళ్ళాలంటే గతుకులు, రాళ్ల దారిన కొండ దిగి కిందికి వెళ్ళాలి. కొండపై నుండి జలపాతం క్రిందికి పడుతూ ఉంటుంది. కొంతదూరం నీళ్ళు రాళ్ల మీదగా సమాంతరంగా ప్రవహించి, మళ్ళీ క్రిందకి పడతాయి. నిజంగా ఆ ప్రదేశం ఒక అద్భుతం.

సుమారు మా అందరిది 20 సంవత్సరాల వయస్సు.  యువ రక్తం. ఆడుతూ, పాడుతూ జలపాతం చేరుకున్నాము. స్నేహితులలో జలపాతం దగ్గర రాళ్ల మీద కూర్చొని అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న వారు కొందరు అయితే, ఫొటోలకు పోజులు ఇస్తూ ఆనందములో కొందరు ఉంటే, స్నానం కోసం సిద్ధం పడేవారు ఇంకొంత మంది.  కాని నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్, "చలికాలం, నీరు చాలా కూల్ గా ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే లేనిపోని హెల్త్ ప్రోబ్లమ్స్ వస్తాయి" అన్నాడు. అందువలన నేను, నా ఫ్రెండ్ కొంచం దూరంగా సమాంతరంగా ఉన్న చోట నీటిలో కాళ్ళు ఉంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. కొంతసేపటి తరువాత మేము కొందరు స్నానాలు చేస్తున్న వైపు  నడుస్తూ  మోకాళ్ళ లోతు నీరు ఉన్న చోటుకు చేరుకున్నాము. ఇంకా ముందుకు వేళ్ళడము ప్రమాదం అని మాకు అనిపించింది. కారణం  లోతు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. ఎన్నో ఏళ్ళగా అక్కడ రాళ్ల మీదగా నీరు ప్రవహిస్తూ ఉండటము మూలంగా అక్కడ ఎక్కువుగా నాచుపట్టి జారుగా ఉంది. అటువంటి చోట షూస్ వేసుకొని నడుస్తున్న నేను హఠాత్తుగా జారి పక్కనే లోతుగా ఉండే ప్రదేశంలోకి పడిపోయాను. నాకు ఈత రాదు. అక్కడ వెడల్పు తక్కువగా, పొడవు ఎక్కవగా, లోతు ఎక్కువగా ఉంది (నిజానికి నేను బయటకు వచ్చిన తరువాత తెలిసినది ఏమిటంటే, ఆ చోట లోతు సుమారు 50 అడుగులు లోతు ఉంటుందట. అంతే కాదు అది చాలా ప్రమాదకరమైన ప్రదేశమట).

నాపక్కనే ఉన్న నాఫ్రెండ్ మోహన్ నన్ను కాపాడటానికి తన చేయి అందించాడు. నాకు అతని చేతి వ్రేళ్ళు తాకాయి కాని చేయి అందలేదు. అంతలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన నేను ఈ ఒడ్డు నుండి మధ్యకు నేట్టివేయబడ్డాను. అప్పటికే నేను ఒకసారి మునిగి తేలను. వెంటనే మోహన్ నన్ను కాపాడటానికి నీటిలోకి దూకి వెనక నుండి నన్ను పట్టుకున్నాడు. కాని నేను భయంతో కంగారులో అతని మెడ పట్టేసుకున్నాను. ఆ చర్యతో ఇక మేము ఇద్దరం బ్రతకమని తనకి అర్ధం అయ్యిందట. ఇంతలో మేము ప్రవాహ వేగానికి అవతల ఒడ్డుకు చేరాం. వెనుక నుండి నేను అతని గొంతు వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండడంతో ఏమి చేయాలో తోచక మోహన్ కాలితో తనకు ఎదురుగా ఉన్న రాయిని బలంగా తన్నాడు. ఆ ఫోర్సుకి నేను అతని మెడ విడిచిపెట్టి ఇవతలి ఒడ్డుకు చేరాను. ఒక్కసారిగా ఇద్దరూ ఊపిరి పిల్చుకున్నట్టు అనిపించినప్పటికి ఇంకా ప్రమాదంలొనే ఉన్నాము. మోహన్ వెనకకు తిరిగే సమయానికి నేను రెండవ మునక వేయబోతున్నాను. అప్పటికి నాకు స్పృహ ఉంది. జరుగుతున్నదంతా తెలుస్తూ ఉంది. రెండవ మునక తరువాత మళ్లీ తేలినప్పుడు నాకు అనిపించింది, నాకు ఈత రాదు నేను చనిపోతున్నానని. ఎందుకంటే, మాములుగా ఈతరానివాళ్ళు నీటిలో పడిపోతే కేవలం రెండుసార్లు మాత్రమే మునిగితెలుతారని, మూడవసారి పైకి తెలరని నాకు అవగాహన ఉంది. సరే, ఇంతలో నేను నీటిలో మూడోసారి కూడా మునిగిపోయాను. ఆ సమయంలో నా మనస్సులో జరిగిన సంఘర్షణ అంత ఇంత కాదు. 'ఈ జలపాతం అనే మృత్యువు తన నోటిని తెరుచుకొని నన్ను మ్రింగడానికి సిద్ధంగా ఉంద'ని అర్ధం అవుతుంది. ఈతరాదు కదా నీళ్ళు మింగేసాను. చాలా లోతుకు వెళ్లిపోయాను. ఇక నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనిపించింది. ఇంతలో నీటి లోపల నాకు మా అమ్మగారి రూపం కనిపించింది. మనసులోనే ఆమెకు నమస్కరిస్తూ, అమ్మ నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది నన్ను క్షమించు. మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే నీవే నా తల్లిగా ఉండాలమ్మా అని కడసారి ప్రత్యక్ష దైవం అయిన అమ్మకి నమస్కరించుకున్నాను. ఆతరువాత నీటిలోనే సాయిబాబా ఎంతో చక్కని రూపంతో దర్శనమిచ్చారు. బాబా ఇవి నా చివరి క్షణాలు కదా! అని ఆయనకు నమస్కరించుకున్నాను అంతే మరుక్షణం ఏమి జరిగిందో మీరు నమ్మలేరు. అంతా క్షణాలు మీద జరిగింది.

తన భక్తులు ఆపదలో ఉంటే కరుణామూర్తి సాయి చూస్తూ ఊరుకుంటారా! అమాంతం తన అమోఘమైన శక్తితో నన్ను పైకి లేపారు. పైకి వచ్చేటప్పటికి ఎవరైతే ధనం లేక రాలేమన్నారో ఆ ఆరుగురు స్నేహితులు నా చుట్టూ ఉన్నారు. నేను మునిగిపోవటం చూసి, వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకి నన్ను కాపాడారు. నేను నీళ్ళు బాగా త్రాగేసాను కానీ, స్పృహలోనే ఉన్నాను. నన్ను ఒడ్డుకు చేర్చి ప్రధమ చికిత్స చేసారు. నేను చేసిన సహాయమే నన్ను కాపాడింది. ఆ ఆరుగురిని ధన సహాయం చేసి తీసుకురాకపోతే ఆ క్షణమే నా జీవితం ముగిసిపోయేది. వారి ఋణం నేను ఎప్పటికి తీర్చుకోలేను. అందుకే అంటారు చేసిన పుణ్యం ఊరికే పోదని. అది ఎప్పుడో ఒక్కప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకుంటుంది అని. నిజంగా ఆ సమయంలో నా స్నేహితులు లేకుంటే నన్ను కాపాడే దిక్కు కూడా లేదు. మృత్యు కోరల్లో చిక్కుకున్న నాకు చివరి క్షణంలో నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి నా చావు చీటిని చింపేసి నా స్నేహితుల రూపంలో నన్ను కాపాడారు బాబా. భక్తుల రక్షణే తన కర్తవ్యమైన మన బాబా, నాకు రానున్న మృత్యువును తన సర్వజ్ఞత్వంతో తెలుసుకొని నన్ను ప్రేరేపించి నా ఆరుగురి స్నేహితులకు ధన సహాయం చేయించి మరి నాతో తీసుకు వెళ్ళేలా చేసారు. ముందు నుండే పరిస్తితులన్నీ బాబా మలుస్తూ వచ్చారు. ప్రాణభిక్ష పెట్టిన నా సాయికి మనః పూర్వకంగా నమస్కరించడం తప్ప ఏమి చేయగలను?

మా తాతగారి అనుభవం:

ఆయన ఒకరోజు ఉదయం 5 లేక 5.30 గంటల ట్రైన్ కి క్యాంపుకి వెళ్ళవలసి ఉంది. అయన 4 గంటలకి లేచి పనులన్నీ పూర్తీ చేసుకొని బయటకు వచ్చి తాళం వేస్తూ ఉండగా ఒక ఫకీర్ వచ్చి భిక్ష అడిగారుఇంత తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భిక్షకు రావడమేమిటి? వింతగా ఉందే అని తనలో తానే ఆలోచించుకుంటూ అయన ఇంటి లోపలికి వెళ్లి బిక్ష తెచ్చి అతనికి ఇచ్చారు. భిక్ష తీసుకొని ఫకీర్ వెళ్ళిపోయారు. తరువాత మా తాతగారు ఇంటికి తాళాలు వేసి స్టేషన్ కి వెళ్లేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. కొద్ది సేపటి తరువాత మిస్ అయిన ట్రైన్ ప్రమాదానికి గురైంది. అప్పుడు అర్ధం అయ్యింది వేళ కాని వేళ ఫకీర్ లా భిక్షకు వచ్చి, ఆలస్యం అయ్యేలా చేసి తనని బాబా కాపాడారని.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo