సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా వచనాలు నిత్యసత్యాలు


నాడు సంస్కృతం చదవడం రాదన్న నానాసాహెబ్ నిమోన్కరుతో బాబా, "ఫర్వాలేదు, ఈ మసీదుతల్లే నీకు సంస్కృతం నేర్పుతుంది. భాగవతం చదువు" అన్నారు.  అతడలాగే భాగవతం చదవడం ప్రారంభించాడు. కొద్దికాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై, దీక్షిత్, జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలను వివరించగలిగేవాడు. అదేవిధంగా, ఈనాడు బాబా ఒక భక్తునికి హిందీ పుస్తకం ఇచ్చి అతనికి హిందీ నేర్పించారు.

నాడు బాబా, "నేనెవరినుండైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే, దానికి పదిరెట్లు తిరిగి ఇవ్వవలసి వుంటుంది” అని చెప్పారు. ఈనాడు ఒక భక్తుని వద్ద 20 రూపాయలు దక్షిణ తీసుకొని, 20,000 రూపాయలు (వేయి రెట్లు) అనుగ్రహించారు బాబా. 

పై రెండు వచనాలను క్రింది భక్తుని అనుభవాల ద్వారా 'తమ వచనాలు ఎప్పటికీ నిత్యసత్యాల'ని బాబా నిరూపించారు.


సాయిబంధువు శ్రీనివాస్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు...

2002వ సంవత్సరంలో నాకు ఇండోర్‌కి బదిలీ అయింది. నేను రైలులో రామగుండం నుండి భోపాల్‌కి 2AC బోగీలో ప్రయాణిస్తున్నాను.  మరుసటిరోజు ఉదయం నేను ప్రయాణిస్తున్న రైలు మహారాష్ట్రలోని ఒక స్టేషన్‌లో ఆగింది. స్టేషన్ పేరు సరిగా  గుర్తులేదుగానీ అది మహారాష్ట్ర అని మాత్రం తెలుసు. అప్పుడు నేను నా బెర్త్‌పై కూర్చొని ఉన్నాను. నా ముందు ఒక పెద్దమనిషి కూర్చొని ఉన్నారు.

ఒక్కసారిగా ఒక స్త్రీ మా బోగీలోనికి ప్రవేశించింది. (సాధారణంగా AC బోగీలోనికి బయటివారిని ఎవరినీ అనుమతించరు.) ఆమె నా దగ్గరకి వచ్చి, నన్ను 'సాయిగీత' అనే పుస్తకం తీసుకోమని అడిగింది. నేను 'ధర ఎంత?' అని అడిగితే, తను, "ఎక్కువేమీ కాదు, కేవలం 20 రూపాయలే" అని చెప్పి, పుస్తకం తీసుకోమని అన్నది. నేను డబ్బులు ఇచ్చి పుస్తకం తీసుకున్నాను. నా ముందు కూర్చొని ఉన్న పెద్దమనిషి ఇదంతా గమనిస్తూ, ఆమె వెళ్ళిపోయాక, "ఆమె ఎందుకు నిన్ను మాత్రమే అడిగి వెళ్ళిపోయింది? ఇక్కడ నేను కూడా ఉన్నాను కదా?” అని నన్ను అడిగారు. 'నాకు తెలియద'ని  సమాధానం చెప్పాను. ఆ పుస్తకం 600 పేజీలు గల 'సాయిగీత' గ్రంథం. హిందీ ముద్రణలో ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాకు హిందీ చదవడం అంతగా రాదు. కానీ, బాబా దీవెనతో నేను 'సాయిగీత' చాలా సులభంగా చదివి అర్థం చేసుకోగలిగాను. బాబా నాకు హిందీ నేర్పుతున్నారని అనిపించింది. ఇప్పుడు నేను హిందీలో ఏదయినా చదవగలుగుతున్నాను. 'సాయిగీత' చదివాక నాకు బాబాపై ఉన్న శ్రద్ధాభక్తులు రెట్టింపు అయ్యాయి. 


రెండవ అనుభవం: 

మా పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి (1997లో) నా భార్య మొదటిసారి గర్భవతి అయింది. కానీ రెండు నెలలకి తనకి గర్భస్రావం అయినది. 2000వ సంవత్సరంలో తను మళ్ళీ రెండవసారి గర్భం దాల్చినపుడు తనను పరీక్షించిన వైద్యులు, "తన గర్భసంచి చిన్నగా ఉంది, అందులో బిడ్డ పెరగడం కష్టం" అని చెప్పారు. కానీ మేము బాబాపై భారం వేశాం. బాబా ఆశీర్వాదంతో  నా భార్య 7 నెలలకి ఆడపిల్లని ప్రసవించింది. బిడ్డ 1కేజీ బరువు మాత్రమే ఉండడంతో పాపను 21 రోజులు ఇంక్యుబేటర్‌లోనే ఉంచారు. తరువాత పాప కోలుకుంది. కానీ మూడున్నర సంవత్సరాలు దాటినా నిల్చోవడం, నడవడం చేసేది కాదు. నాకు బాబాఫై ఉన్న నమ్మకం చెదరలేదు. బాబా నా నమ్మకాన్ని వమ్ము కానీయలేదుఇప్పుడు పాప పరుగులు తీస్తోంది.


మరో అనుభవం : 

2005వ సంవత్సరంలో మా కుటుంబమంతా శిరిడీకి వెళ్ళాము. అది నేను మూడవసారి శిరిడీ వెళ్ళడం. అందరం ద్వారకామాయికి వెళ్ళాక,  బాబా రాతిపై కూర్చున్న పటం ఎదురుగా కూర్చొని నేను ధ్యానం చేస్తూండగా, కొంతసేపటికి ఒక పిల్లి వచ్చి నా ఒడిలో కూర్చుంది. నా ధ్యానం పూర్తయినా కూడా అది నా చేతిపై నిద్రపోతూ ఉంది. 'నాకు దర్శనానికి వెళ్లాలని ఉంది, కానీ పిల్లికి ఎలా చెప్పను?' అని అనుకున్నంతలో, అది లేచి నాకు ఎదురుగా ఒక మూలన కూర్చొని ఉన్న ఒక అబ్బాయి వద్దకు వెళ్ళిపోయింది. అతను బాబాలాగా బట్టలు ధరించి ఉన్నాడు. అతను నావైపు చూసి చిన్నగా నవ్వారు. నేను కూడా నవ్వాను.

తరువాత సమాధిమందిరంలో బాబా దర్శనం చేసుకొని బయటకి వస్తుండగా, అంతకుముందు ద్వారకామాయిలో నవ్విన అతను నాకు ఎదురుపడి, "నాకు టీ త్రాగటానికి డబ్బులిస్తావా?“ అని అడిగాడు. నేను అతనికి 20 రూపాయలు ఇచ్చాను. తరువాత ఊదీ తీసుకోవాలని అక్కడనుండి వెళ్ళిపోయాను. ఇది జరిగిన తరువాత నాకు ఇండోనేషియా నుండి ఫోన్ కాల్ వచ్చింది, నాకు 20,000/- ఇంక్రిమెంట్ పెరిగింది అని. ఇది అంతా బాబా లీల అని అప్పుడు తెలుసుకున్నాను.

ఇప్పుడు నేను సింగపూరులో పెద్ద కంపెనీకి మంచి జీతంతో పనిచేస్తున్నాను. (నేను సింగపూరులో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు.) నా కుటుంబం కూడా నాతోనే ఉంది. ఇదంతా బాబా దయవల్లనే జరిగింది. మాకు బాబానే అన్నీ.


ఈ లీల విషయంలో నా అనుభవం:

శ్రీనివాస్‌గారు పంచుకున్న ఈ మూడు చక్కటి అనుభవాలు చదివాక, 'టైటిల్ ఏమి పెట్టాలి?' అన్న సందేహం వచ్చింది. ఒక అనుభవానికి ఒక అనుభవానికి సంబంధం లేదు. మూడింటికి సరిపోయేలా టైటిల్ ఏమి పెట్టాలన్నది అర్థం కాలేదు. శ్రీనివాస్‌గారు చివరిలో 'బాబానే మాకు అన్నీ' అన్నారు కదా! అదే టైటిల్ పెడదామని అనుకున్నాను కానీ, అది ఎందుకో సరైనదిగా అని అనిపించలేదు. ఆ విషయాన్ని మరచిపోయి ఒక గంట తరువాత బాబాకి సంధ్య ఆరతి ఇస్తూ ఉన్నాను. ఆ సమయంలో నాకు ఈ టైటిల్ గురించి నా మనసులో ఏ ఆలోచన కూడా లేదు. కానీ ఆరతి ఇస్తూ ఉండగా బాబానే స్వయంగా, "బాబా వచనాలు నిత్యసత్యాలు" అన్న టైటిల్ నాకు స్ఫురింపజేశారు. ఆలోచిస్తే, శ్రీనివాస్‌గారి అనుభవాలకి ఈ టైటిల్ ఎంత చక్కగా సరిపోయింది! ఇది బాబా నాకు ఇచ్చిన అనుభవం. నిజానికి నేను ఈ టైటిల్ విషయం బాబాను అడగలేదు కూడా. అయినా బాబా నాకు ఈ టైటిల్ సూచించి 'నేనెప్పుడూ నీకు తోడుగా ఉన్నాను' అని నిరూపించారు.

"బాబా! ఇలాగే ఎల్లవేళలా మీరు నాకు తోడుగా ఉండాలి. మీరే నా సర్వస్వం, నా ప్రాణం. హృదయపూర్వకంగా మీకు నా శతకోటి ప్రణామములు దేవా!"

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo