సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

"నేనుండగా నీకు భయమెందుకు?" అంటూ బాబా ప్రత్యక్షమయ్యారు


భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు...

అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నాకు ఈమధ్య బాబా చూపిన అద్భుతమైన లీలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నాడు శ్యామా కాశీ, ప్రయాగ యాత్రకు వెళ్ళే సందర్భంలో బాబా, "నేను కాశీ, ప్రయాగ దర్శించి, నీకంటే ముందుగానే గయ చేరగలను" అని శ్యామాకు మాట ఇచ్చారు. అలాగే శ్యామా అయోధ్య, కాశీ యాత్రలు ముగించి గయ చేరి ఒక  పూజారింట బసచేశారు. అక్కడ శ్యామాకు సాయిబాబా చిత్రపటం రూపంలో దర్శనమిచ్చారు. బాబా చిత్రపటాన్ని చూడగానే శ్యామా కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారాయి. అలా బాబా తమ మాట నిలుపుకున్నారు. 

మళ్ళీ అదే లీలను పునరావృతం చేస్తూ బాబా నాకు ఒక అనుభవాన్ని ప్రసాదించారు. ఈ లీల చదివితే సాయిచరిత్రలో బాబా భక్తుల కోసం చేసిన ప్రతి ప్రతిజ్ఞ ఈనాటికీ ఎంత అక్షరసత్యమో మీకు తెలుస్తుంది. ఈ అనుభవం శ్రీరామనవమిరోజు జరిగింది. 

నేను భువనేశ్వర్‌లో ఉద్యోగం చేస్తూ ఉండగా, మావారు ఈశాన్యరాష్ట్రాలలో ఉన్న 'సిల్చిర్' అనే ఊరిలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఈమధ్యనే ఆయనకు భువనేశ్వర్ బదిలీ అయ్యింది. ఆయన అక్కడనుండి ఇక్కడికి వచ్చినరోజే నాకు భువనేశ్వర్ నుంచి 'శంబల్పూర్‌'కి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. నేను, మావారు చాలా సంవత్సరాలుగా వేరు వేరుగా ఉంటున్నాము. ఏదో బాబా దయవలన ఆయనకి ఇక్కడికి బదిలీ అయ్యిందని అనుకునేంతలో ఇలా జరిగేసరికి ఇద్దరం ఫీల్ అయ్యాం. అలా వేరుగా ఉండడం నాకు ఇష్టం లేదు.  పోనీ ఉద్యోగం మానేద్దామనుకుంటే, పిల్లలు ఇంకా స్థిరపడలేదు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఒక అబ్బాయి వైజాగ్‌లో ఉన్నాడు, మరో అబ్బాయి కలకత్తాలో ఉన్నాడు. మేము భువనేశ్వర్‌లో ఉన్నాం. ఇటువంటి పెద్ద సిటీల్లో ఉండటమంటే మాటలు కాదు. చాలా ఖర్చులు ఉంటాయి, మావారి ఒక్కరి సంపాదనపై కష్టం అవుతుంది కదా! అందుకే ఇక తప్పని పరిస్థితిలో చాలా దుఃఖంతో నేను శంబల్పూర్ వెళ్లి జాయిన్ అయ్యాను. కానీ క్వార్టర్ ఖాళీగా లేకపోవడంతో సెలవు పెట్టి భువనేశ్వర్ వచ్చేశాను. 15 రోజుల తరువాత క్వార్టర్ ఇచ్చారు. అప్పుడే శ్రీరామనవమి పండుగ వచ్చింది. నేను శ్రీరామనవమి తరువాత అక్కడికి వెళదామని అనుకున్నాను. అందుకని మావారిని వెళ్లి ఇల్లు రెడీ చెయ్యమని చెప్పాను. అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఇంట్లో చాలా చెత్త వేసి వెళ్లారు. మావారు మొత్తం క్లీన్ చేయించి, చెత్త అంతా బయట పడేసి కాల్చేయమన్నారు. పనివాళ్ళు మొత్తం క్లీన్ చేశారు. 

ఆరోజు శ్రీరామనవమి. నేను భువనేశ్వర్‌లో బాబా ముందు కూర్చొని, "బాబా, నువ్వు లేకుండా నేను అంతదూరం ఎలా వెళ్లను? నాకు ఇంత పరీక్ష ఎందుకు పెట్టావు?" అని చాలా వికలమైన మనసుతో బాధపడుతున్నాను. పాపం, బాబా నా బాధ చూడలేకపోయారు. నేనేకాదు, ఎవరు దుఃఖపడినా బాబా చూడలేరు. వెంటనే అద్భుతమైన లీల చూపించారు.
అదే సమయంలో అక్కడ శంబల్పూర్‌లో ఇల్లు క్లీన్ చేస్తుండగా, ఒక పెద్ద బాబా ఫోటో (పైన ఉన్న ఫోటో చుడండి) మావారి కంటపడింది. అంతే, మావారి కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. మావారు నాకు వెంటనే ఫోన్ చేసి, "నీ దుఃఖాన్ని దూరం చెయ్యడానికి నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు" అని చెప్పారు. మొబైల్లో ఫోటో కూడా తీసి నాకు పంపారు. మట్టిలో మాణిక్యంలాగా, రాజాధిరాజు యోగిరాజైన శ్రీసాయి ఎంతో దర్జాగా మహారాజులా సింహాసనంపై ఆసీనులై, "నేనుండ భయమేల?" అంటూ ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. అది మా ఇద్దరికీ ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఏమో? ఇంతవరకు ఏమీ తెలియలేదు. ఆ ఫోటో రూపంలో బాబా శ్రీరామనవమిరోజున మా ఇంటికి వచ్చారు. సాయిచరిత్రలో బాబా ఫోటో రూపంలో రెండుసార్లు వెళ్లారు. ఒకసారి శ్యామాకు, ఒకసారి హేమాద్‌పంత్‌కు. ఇంకా ఎన్నోసార్లు ఇలా బాబా ఎంతోమందికి అనుభూతి ఇచ్చివుంటారు. కానీ ఈ సమయంలో, అదీ శ్రీరామనవమిరోజు ఆ రూపంలో బాబా నన్ను ఆశీర్వదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు.

“సాయిచరిత్ర అక్షరసత్య గ్రంథము". “ప్రాణ్ జాయ్, పర్ వచనం న జాయ్" అని తులసీరామయణంలో ఉన్నట్లు, బాబా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న రోజులలో, అదీ శ్రీరామనవమిరోజు బాబా నాకు ఇలా ఋజువు చేసి చూపించారు. ఇప్పుడు నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉన్నాను. బాబానే మళ్ళీ నన్ను మావారి దగ్గరికి చేరుస్తారని నాకు నమ్మకం  ఉంది.

మనం శ్రద్ధ-సబూరి కలిగివుంటే బాబానే అన్నీ చూసుకుంటారు.




1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo