సాయిబంధువు భరత్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:
నా పేరు భరత్. నేను చెన్నైలో ఉంటాను. చాలా సంవత్సరాలుగా నేను బాబా భక్తుడిని. సాయిబాబానే నాకు అన్నీ. నేను బాబాని ఎప్పుడూ 'తాతా' అని పిలుస్తాను. నేను మొదటిసారి నా అనుభవాలను ఇలా బ్లాగ్‌లో పంచుకుంటున్నాను. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటిలో కొన్నింటిని మాత్రం మీతో పంచుకుంటున్నాను.
నా మొదటి అనుభవం:
నాకు ICICI బ్యాంకులో అకౌంట్ ఉన్నది. 2017, మే 19న నేను మా ఇంటిప్రక్కన ఉన్న కెనరా బ్యాంకు ఎటిఎం నుండి 3,000 రూపాయలు విత్‌డ్రా చేశాను. అన్నీ 100 రూపాయల నోట్లే వచ్చాయి. నేను కౌంట్ చేసుకోకుండా అలానే పర్సులో పెట్టుకొని అక్కడనుండి వచ్చేశాను. నేను ఇంటికి రాగానే ఆ పర్సు అలానే నా భార్యకి ఇచ్చాను. తాను లెక్కపెట్టి, 1,800 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పింది. నేను మరలా ఇంకోసారి లెక్కచూసి, ICICI కస్టమర్ కేర్ సెంటర్‌కి ఫోన్ చేసి కంప్లయింట్ చేశాను. 10 రోజుల తరువాత, "మా వైపు నుండి ప్రాబ్లం ఏమీ లేని కారణంగా మేము మీకు నష్టం వచ్చిన 1,200 రూపాయలు ఇవ్వలేము" అని బ్యాంకువాళ్ళు మెసేజ్ పెట్టారు. నేను మళ్ళీ కస్టమర్ కేర్ సెంటర్‌కి కంప్లయింట్ చేశాను. ఇలా 3, 4 సార్లు కంప్లయింట్ చేయడం జరిగింది. వాళ్ళు నన్ను వేచి ఉండమని చెప్పారు. ఇంక చివరికి ఈ విషయాన్ని మా 'సాయితాత'కి జూన్ 29వ తేదీన అప్పగించాను. అప్పుడు నేను సాయికి ఒకటే చెప్పుకున్నాను, “ఈ డబ్బు నేను సరైన రీతిలో సంపాదించి ఉంటే నాకే చెందుతుంది, లేకపోతే వదిలేయండి తాతా" అని. "నా డబ్బులు నాకు తిరిగి అందితే నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటాను" అని మనసులో అనుకున్నాను. కొద్దిరోజులకి ఈ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ జూలై 31వ తేదీన ICICI బ్యాంకువారు నా 1,200 రూపాయలు నా అకౌంట్‌లో వేయడమే కాకుండా, నాకు జరిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా మరో 6,200 రూపాయలు కూడా నా అకౌంట్‌లో వేశారు. కొద్ది క్షణాలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. సాయికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సాధారణంగా ఇలా జరగదు. ఒకసారి మనం పెట్టిన కంప్లయింట్ క్లోజ్ చేశాక బ్యాంకువాళ్ళు దానిని మళ్ళీ ఓపెన్ చేసి సాల్వ్ చెయ్యరు. ఒకవేళ చేసినా, మన అమౌంట్ మనకు ఇస్తారేమోగానీ, నష్టపరిహారం చెల్లించడం అనేది మాత్రం జరగదు. ఇదంతా కేవలం బాబా కృప వల్లనే సాధ్యమైంది.
నా రెండవ అనుభవం :
2006వ సంవత్సరంలో నేను నెల్లూరులో ఉన్నప్పుడు మొదటిసారిగా శిరిడీకి హైదరాబాద్ మీదుగా వెళ్లాలని అనుకున్నాము. మాకు రాత్రి 9.10 గంటలకు ట్రైన్ ఉన్నది. మేము 9 గంటలకి స్టేషన్‌కి చేరుకుని, ప్లాట్‌ఫాంపై ఉన్న ఒక బెంచిపై కూర్చొని ఉండగా, ఒక వృద్ధుడు వచ్చి మా కోచ్ నెంబర్ అడిగారు. నేను టికెట్ చూసి చెప్పగానే అతను పెద్ద స్వరంతో, "మీ కోచ్ ఇక్కడికి రాదు. మీరు ఆ చివరికి వెళ్ళాలి" అని చెప్పారు. మేము కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా అక్కడికి బయలుదేరాము. నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వృద్ధుడు ఎక్కడా కనపడలేదు. కొన్ని సెకన్లలోనే అతను ఎలా మాయమయ్యారో కూడా అర్థం కాలేదు. మేము అతను చూపిన చోటుకి చేరిన 30 సెకండ్లకే మా ట్రైన్ వచ్చింది. వెంటనే ట్రైన్ ఎక్కి క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. అక్కడ స్నానాలు చేసి తయారవుతుంటే, ‘ఎన్నో ఏళ్ళపాటు పాదరక్షలు లేకుండా బాబా నడిచిన ఈ పవిత్రమైన నేలపై నేను కూడా పాదరక్షలు ధరించకుండా నడవాలి’ అని ఒక ఆలోచన వచ్చింది. బయటికి వచ్చి 20 అడుగులు వేసేసరికి ఎండ వేడికి నా కాళ్ళు మండిపోయాయి. ఇంక నావల్ల కాదని, వెనక్కి వెళ్లి చెప్పులు వేసుకొని బయటికి వచ్చాను. సాయి నన్ను పాదరక్షలు లేకుండా నడవనీయలేదు. ఆయనకు నా మీద ఎంతో ప్రేమ. ఆయన తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే చూడలేరు. ముందుగా అనుకున్నట్లుగానే పలుమార్లు బాబా దర్శనం చేసుకొని, భారమైన మనసుతో శిరిడీ నుండి తిరిగి వచ్చాము. ఎవరైతే ఇప్పటివరకు శిరిడీ దర్శించలేదో ఆ సాయిభక్తులకి నేను చెప్పేది ఒక్కటే, జీవితంలో ఒక్కసారైనా శిరిడీయాత్ర తప్పక చేయండి.
నా మూడవ అనుభవం:
ప్రతిరోజూ నేను ఆఫీసుకి వెళ్ళేటప్పుడు నా సహోద్యోగిని నాతోపాటు నా వెహికల్‌పై తీసుకెళ్తూ ఉంటాను. ఒకరోజు నేను అతనిని ఎక్కించుకోవడానికి బండి ఆపగా, అక్కడే ఉన్న ఒక అతను, "బండి బ్యాక్ టైరుకి మేకు గుచ్చుకొని ఉంది" అని చెప్పాడు. నేను బండి ఆపి చూడగా నిజంగానే టైరుకి ఒక స్టీల్ మేకు ఉంది. రిపేర్ చేయించుకొనే సమయం కూడా లేకపోవడంతో, 'ఏ సమస్యా లేకుండా ఆఫీసుకి చేరుకోవాల'ని నేను సాయిని వేడుకున్నాను. ఇద్దరం అదే బైక్‌పై ఏ ఇబ్బందీ లేకుండా ఆఫీస్ చేరుకున్నాం. ఆఫీస్ చేరాక రిపేర్ చేయించడానికి నాకు చాలినంత టైం ఉన్నప్పటికీ నేను చేయించుకోలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక నేనే నా కిట్‌తో రిపేర్ చేసుకున్నాను. బాబా దయతో నాకు ఏ ఇబ్బందీ కలుగలేదు. అంతా మంచే జరిగింది.
నా నాలుగవ అనుభవం:
నేను 2012లో తీసుకున్న నా 'యునికార్న్ డాజ్లర్ బైక్'ని బాబా ఇచ్చిన బహుమతిగా సదా భావిస్తాను. ఇది నన్ను ఏ సమస్యా కలుగకుండా చాలాసార్లు కాపాడింది. ఒకరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ఇంటికి దగ్గరలో బైక్ క్లచ్ వైర్ కట్ అయింది. దాంతో నేను గేర్ కూడా మార్చలేకపోయాను. అదే స్పీడ్‌లో నా బండి సరిగ్గా మెకానిక్ షాప్ ముందు వచ్చి ఆగింది. నేను చాలా సంతోషంగా బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. ఇంకొకసారి నా బైక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపాను. తీరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక స్టార్ట్ చేద్దామంటే ఎంతకీ బైక్ స్టార్ట్ కాలేదు. వెంటనే నేను బాబానే ప్రార్థించాను. మరుక్షణం అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ నాకు పక్కనే ఉండే మెకానిక్ షాప్ చూపించారు. అక్కడ, "బ్యాటరీ మార్చాలి, అంతే" అన్నారు, వెంటనే మార్చేశాను.
నా ఐదవ అనుభవం:
ఒకసారి మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళాము. సినిమా అయ్యాక మేమంతా ఇంటికి రిటర్న్ అవుతూ మధ్యలో చూసుకుంటే నా పర్సు కనపడలేదు. అందులో రెండు క్రెడిట్ కార్డులు, ఒక డెబిట్ కార్డు, కొంచెం డబ్బులు కూడా ఉన్నాయి. నేను బాబాను తలచుకొని మళ్ళీ థియేటర్‌కి వెళ్లి, నేను అంతకుముందు కూర్చున్న సీటులో కూర్చున్న అతన్ని అడిగాను. అతను తనకేమీ తెలియదన్నాడు. నేను ఇంక ఆశ వదులుకున్నాను. ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చి కుర్చీ క్రింద చూడగా నా పర్సు అక్కడే ఉంది. ప్రతిసారీ షో అయిన తరువాత ఒక 10, 15 మంది వచ్చి వాక్యూమ్ క్లీనర్‌తో థియేటర్ శుభ్రం చేస్తారు. వాళ్ళకి నా పర్సు కనపడకపోవడం నిజంగానే ఆశ్చర్యం. ఇది అంతా బాబా లీల మాత్రమే.
నేను ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 'శ్రీసాయి సచ్చరిత్ర' వింటూ ఉంటాను. సాయి పాటలు వింటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి, నా మనసుకి ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. సాయి నాకు మంచి జీవితం, కుటుంబం, సమాజంలో గౌరవం అన్నీ ఇచ్చారు. ఆయన ఋణం నేను తీర్చుకోలేను. నేను సాయిని వేడుకునేది ఒక్కటే, అందరూ మంచి నడవడికతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని; ఇంకా, నా తల్లిదండ్రులను బాగా చూసుకోమని. సాయి ప్రేమతో పోల్చడానికి ఈ విశ్వంలో ఏదీ సరిపోదు. "సాయీ! మీరు నాపై చూపించే ఇంతటి అపారమైన ప్రేమని నేను ఎలా తిరిగి ఇవ్వగలను? మేము మీకోసం ఏమీ చేయనప్పటికీ, మీరు మా నుండి ఏమీ ఆశించక, ఎలా ఇంతటి అపారమైన ప్రేమని చూపగలుగుతున్నారు? ఒక్కమాట అయినా మాట్లాడకుండా ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఉంటారు. మీరు లేని నా జీవితం ఊహించుకోలేను సాయీ. నన్ను ఎప్పుడూ మీ పాదాల వద్ద ఉండేలా ఆశీర్వదించండి సాయీ. నా శ్రద్ధ సబూరిలు ఇంకా రెట్టింపు అయ్యేలా దీవించండి. సాయీ! నేను ఒక మంచి వ్యక్తిగా చివరిశ్వాస వరకు నలుగురికీ ఉపయోగపడేలా చూసుకోండి. ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి సాయీ."
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!