సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి కృప - 1వ భాగం....


హైదరాబాదు నుండి శ్రీమతి అర్చన తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు...

చిన్నతనంలోనే బాబా అనుగ్రహం:-

నా పేరు అర్చన. చిన్నతనంలోనే నాకు బాబాతో పరిచయం అయింది. నాకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు నా స్నేహితురాలు వేరే మతం గురించి చెప్తూ, నన్ను ఆ మతంలోకి మారమని చెప్పేది. ఒకరోజు నా స్నేహితురాలి  అమ్మమ్మ  నన్ను పిలిచి, "నీకు ఒక గొప్ప దేవుడి ఫోటో ఇస్తాను, ఆయన్ని పూజించు. వేరే ఆలోచనలేమీ పెట్టుకోకు" అని చెప్పి, బాబా ఫోటోను నాకు ఇచ్చింది. నేను ఆ ఫోటోను ఇంటికి తెచ్చి మా పూజామందిరంలో పెట్టుకున్నాను. ఒకరోజు నేను ఒక మామిడికాయను కోసి ప్లేటులో పెట్టుకుని పూజగదిలోకి వెళ్ళి ఆ ప్లేటును బాబా ముందు పెట్టి, "బాబా! నువ్వు ఈ మామిడికాయ తినాలి" అని చెప్పి, పూజగది తలుపులు మూసివేశాను. కొంత సమయం తరువాత ప్రసాదం తీసుకోవటానికి వెళ్తే, అక్కడ ప్లేట్ కనిపించలేదు. ఆ విషయం మా ఇంట్లో అందరితో చెపితే ఎవరూ నమ్మలేదు. "ఏదో చిన్నపిల్ల, తనే తినేసి అలా చెప్తోంది" అనుకున్నారు. అలా బాబా నన్ను చిన్నతనంలోనే అనుగ్రహించారు. ఆ తరువాత నా జీవితంలో ఎన్నో బాబా లీలలు, అనుగ్రహాలతో నా చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్నీ చక్కగా సాగాయి. వాటిలో 2018, ఏప్రిల్ నెలలో జరిగిన నా అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.


మ్రొక్కిన మ్రొక్కును మరచినా, ప్రేమతో బాబా ఋణవిముక్తురాలిని చేయుట:-

నేను పెళ్ళికాకముందు, "శిరిడీలో పెళ్ళి చేసుకుని, 50,000 రూపాయలు బాబా హుండీలో వేస్తాను" అని మ్రొక్కుకున్నాను. పెద్దవాళ్ళు అన్నీ మాట్లాడుకొని నా పెళ్ళి నిశ్చయం చేసిన తరువాత నేను మా అమ్మకి నా మ్రొక్కు గురించి చెప్పాను. 'ఇప్పుడు చెప్తే బాగోదు, మగపెళ్ళివారు ఒప్పుకుంటారో, లేదో' అని భయపడుతూనే మా అమ్మ నా మ్రొక్కును గురించి వాళ్ళకు చెప్పింది. కానీ వాళ్లు, "మాకు ఉన్నది ఒకే అబ్బాయి. పెళ్ళి బాగా చేయాలని మా ఆశ. అందువలన పెళ్లి ఇక్కడే జరిపిద్దాం. కావాలంటే పెళ్లి అయ్యాక శిరిడీ వెళతారు" అన్నారు. ఇక చేసేదిలేక మా పెళ్ళి గుంటూరులోనే జరిపించారు. పెళ్లి అయిన వెంటనే శిరిడీ వెళ్ళటం కుదరలేదు. కొన్నాళ్ళకు వెళ్ళాముగానీ, మ్రొక్కు తీర్చుకోలేదు. క్రమంగా నేను ఆ మ్రొక్కు సంగతే మరచిపోయాను.

2018, ఏప్రిల్ 15న మా పెళ్ళిరోజు. అందువలన ఏప్రిల్ మొదటివారంలో మావారిని, "ఇంకో వారంలో మన పెళ్ళిరోజు వస్తుంది కదా! మనం శిరిడీ వెళ్దామ"ని అడిగాను. ఆయన, 'చూస్తాను' అన్నారు. నాకు కనీసం రెండు రోజులైనా శిరిడీలో ఉండి బాబాని ప్రశాంతంగా చూసుకోవాలని ఉంది. కానీ మావారికి ఆఫీస్ వర్క్ ఉండటం వలన, "15న శిరిడీ వెళ్లి, మళ్ళీ అదేరోజు రిటర్న్ అవుదాం" అన్నారు. 14 రాత్రి బయలుదేరి 15న బాబా దర్శనం చేసుకుని, అదేరోజు సాయంత్రం రిటర్న్ అయ్యేలా టికెట్స్ బుక్ చేయమని ఆయన చెప్పారు. "సరే, ఏం చేస్తాం? బాబా ఒక్కరోజుకే నాకు అవకాశం ఇస్తున్నారు" అని అనుకుని టికెట్స్ బుక్ చేయడానికి నేను ట్రావెల్స్ దగ్గరకి వెళ్లాను. 14 రాత్రి బయలుదేరడానికి టికెట్స్ దొరికాయి, కానీ 15 రిటర్న్ అవడానికి టికెట్స్ అనుకూలంగా లేవు. మావారికి ఫోన్ చేసి ఆ విషయం చెపితే, ఆయన కొంచెం కష్టంగానే, "అయితే 16న రిటర్న్ చేయించు" అన్నారు. నేను చాలా సంతోషంగా టికెట్స్ బుక్ చేయించాను. టికెట్స్ బుక్ చేసిన మరుక్షణం రోడ్డు వైపు తిరిగి చూసేసరికి దూరంగా వెళ్తున్న ఒక బస్ వెనుక పెద్ద బాబా ఫోటో కనిపించింది. అలా బాబాను చూడగానే, ‘నువ్వు కోరుకున్నట్లు శిరిడీలో రెండు రోజులు ఉండేలా అనుగ్రహించాను, ఇక సంతోషంగా శిరిడీకి రా!’ అని బాబా నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. నా సంతోషానికి హద్దులు లేవు. తీరా బయలుదేరేరోజు మావారికి జ్వరం. దాంతో తను కాస్త నీరసంగా ఉన్నారు. బాబుకు కూడా దగ్గు ఎక్కువగా వస్తోంది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నువ్వే దిక్కు, నువ్వే చూసుకో!" అని చెప్పుకున్నాను. ఆ తరువాత అందరం కలిసి శిరిడీ బయలుదేరాము. ఏప్రిల్ 15న మేము ధూప్ ఆరతికి వెళ్ళాము. నేను ప్రతి నెలా జీతం రాగానే 1,000 రూపాయలు బాబాకి తీసి, తరువాతే నేను వాడుకుంటాను. అలా ప్రోగుచేసిన డబ్బును మావారికి ఇచ్చి హుండీలో వేయమన్నాను. ఎంత ఉంటుందో కూడా నేను లెక్కపెట్టలేదు. ఆరతి, దర్శనం అయ్యాక మావారు డబ్బు హుండీలో వేసి వచ్చిన తరువాత, "అర్చనా! నువ్వు ఇచ్చిన డబ్బు 50,000 దాకా ఉంటుంది కదా!" అన్నారు. "ఏమో, నేను లెక్కపెట్టలేదు" అన్నాను. కానీ, తరువాత నాకు నా 50,000 రూపాయల మ్రొక్కు సంగతి గుర్తుకు వచ్చింది. నేను మర్చిపోయినా, పెళ్లికి ముందు నేను మొక్కుకున్న మొత్తాన్ని ఇలా నా పెళ్లిరోజున స్వీకరించడమే కాకుండా, "నాకు నా డబ్బు అందింది" అని మావారి నోటితో చెప్పించారు బాబా. 

నేను శిరిడీలో పెళ్ళి చేసుకోవాలని కూడా మొక్కుకున్నాను కదా! ఒక చిన్న సూత్రం నా గొలుసుకి కట్టుకుని, బాబాను కిటికీ ద్వారా దర్శించుకుంటాం కదా, అక్కడ బాబాకు ఎదురుగా నిల్చుని మావారి చేత నా మెడలో వేయించుకున్నాను. అలా ఆ మ్రొక్కు కూడా  తీర్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం మ్రొక్కుకున్న మ్రొక్కులను మనం మర్చిపోయినా బాబా మాత్రం వాటిని మనం నేరవేర్చేలా చేసి మనల్ని ఋణవిముక్తులను చేస్తారు. ఆయనకు తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధో! ప్రతిక్షణం వారి శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉంటారు.


ఎంతగానో ఇష్టపడే ఫోటోను బాబా తమ ఆశీస్సులతో అనుగ్రహించుట:- 

ఆ తరువాత ద్వారకామాయి, చావడి కళ్లారా తృప్తిగా దర్శించుకున్నాను. ద్వారకామాయిలో బాబా కూర్చొని ఉండే ఫోటో అంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలని నాకు ఎప్పటినుండో కోరిక. హైదరాబాదులో చాలా షాపుల్లో చూశానుగానీ, నాకు అంతగా నచ్చలేదు. కాబట్టి శిరిడీలో ద్వారకామాయి ఎదురుగా ఉన్న షాపులో అటువంటి ఫోటో కోసం వెతికాను. ఒక ఫోటో నాకు బాగా నచ్చి, రేటు మాట్లాడుకుని ప్యాక్ చేయిస్తుండగా, షాప్ అతను నాతో, "ఈ ఫోటోకి గంధం పెట్టొచ్చుగానీ, కుంకుమ మాత్రం పెట్టవద్దు. కుంకుమ పెడితే ఫోటో పాడవుతుంది" అన్నారు. నాకు చాలా బాధేసింది. 'ఏమిటి బాబా ఇలా అయింది?' అని అనుకున్నాను. అంతలో వేరే గ్లాస్ ఫ్రేమ్ చూశాను. "అది బాగుంది, అలాంటి ఫ్రేమ్ కావాలి" అని అడిగాను. కానీ అతను అక్కడంతా వెతికి, "అలాంటి ఫ్రేములో ఈ ఫోటో లేదు" అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. అయితే ఇంతలో వేరే అతను వచ్చి, పైకి వెళ్లి గ్లాస్ ఫ్రేముతో ఉన్న ద్వారకామాయి బాబా ఫోటో తెచ్చి నాకు ఇచ్చి, "దీనికి కుంకుమ కూడా పెట్టుకో దీదీ!" అన్నాడు. చాలా చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఆ ఫోటోను ద్వారకామాయికి తీసుకొని వెళ్తే, అక్కడ ఉన్నతను బాబా దగ్గర నా బాబా ఫోటో పెట్టి, నాకు తిరిగి అందిస్తూ ఫోటోతో పాటు రోజాపూలగుత్తి కూడా ఇచ్చారు. అలా బాబా నేను ఎంతగానో ఇష్టపడే ఫోటోను తమ ఆశీస్సులతో నాకు ప్రసాదించారు. నేను చాలా అదృష్టవంతురాలిని.

మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో...



1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo