- సంశయాన్ని తీర్చిన బాబా
- ఎదురొచ్చి అనుగ్రహించిన బాబా
- బాబా ఆశీస్సులతో కోవిడ్ నుండి విముక్తి
సంశయాన్ని తీర్చిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి మహరాజ్ సన్నిధి నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు అనుభవంలో, “నేను సాయిభక్తురాలిని కాను, నాకు సాయిభక్తులకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటీ లేవు” అని చెప్పాను. కానీ బాబా ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులకు ఉండవలసిన లక్షణాలను రోజూ కొద్దికొద్దిగా నాకు నేర్పుతున్నారు. నా కోరికలు తీరకపోతే బాబాను నిందించే అల్పమైన స్థాయి నుండి, “మీ ఇష్టం బాబా, మీ ఇష్టప్రకారమే కానివ్వండి” అనే స్థాయికి బాబా దయవల్ల వచ్చాను. నాలో వచ్చిన ఈ మార్పుని చూసి నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఇంకా మారాలి. ఇంకా ఇంకా బాబా ప్రేమను పొందాలి, బాబాకు ఇంకా దగ్గరవ్వాలి అని కోరుకుంటున్నాను. “ప్లీజ్ బాబా! మీకు ఇష్టం వచ్చినట్టు నన్ను మలచండి బాబా!” ఇక నాకు బాబా ప్రసాదించిన అనుభవాలకు వస్తే...
మొదటి అనుభవం: ఒకసారి నేను, “పనిచేయని ల్యాప్‌టాప్‌కి ఊదీ రాసి ‘ఈ బ్లాగులో పంచుకుంటాను’ అని మ్రొక్కుకుంటే సమస్య తీరింది” అని ఒక సాయిబంధువు పంచుకున్న అనుభవాన్ని ఈ బ్లాగులో చదివాను. అది చదివి, “నిజంగా అలా జరుగుతుందా?” అని నేను కొంచెం సంశయించాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సంశయాన్ని నివృత్తి చేసే అనుభవం ఒకటి నాకు కలిగింది. దాదాపు 3, 5 నెలల పాటు నా ల్యాప్‌టాప్‌ని వాడని కారణంగా అది సరిగా పనిచేసేది కాదు. గంటలో చేయాల్సిన పనికి దాదాపు 3,4 గంటల సమయం పట్టేది. ఛార్జింగ్ పూర్తిగా పెట్టినా కూడా గంటలోపే ల్యాప్‌టాప్ ఆఫ్ అయిపోయేది. ‘ల్యాప్‌టాప్ కొని 6 సంవత్సరాలు అయింది కదా, బ్యాటరీ పాడయివుంటుంది’ అనుకున్నాను. ల్యాప్‌టాప్ తీసుకుని కంప్యూటర్ రిపేర్ షాపుకి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. దాంతో, 3,500 రూపాయలు పెట్టి క్రొత్త బ్యాటరీ వేయించి, సంతోషంతో ఇంటికి వచ్చి ఛార్జింగ్ పూర్తిగా పెట్టి ల్యాప్‌టాప్ ఆన్ చేశాను. కానీ పాత సమస్యే పునరావృతమైంది. అప్పుడు బ్లాగులో చదివిన ఆ సాయిబంధువు అనుభవం గుర్తుకువచ్చి, నేను కూడా బాబాను తలచుకుని, ల్యాప్‌టాప్‌కి ఊదీ రాసి, ‘ల్యాప్‌టాప్ సరిగా పనిచేస్తే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన’ని మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ మరుసటిరోజు నుంచి నా ల్యాప్‌టాప్ ఏ సమస్యా లేకుండా పనిచేయసాగింది. “థాంక్యూ బాబా!”
రెండవ అనుభవం: పై అనుభవం బాబా ప్రసాదించిన తరువాత కూడా ఈ బ్లాగులో అనుభవాన్ని పంచుకోవడం గురించి నాలో ఇంకా సంశయ స్వభావం కొంచెం అలాగే ఉండిపోయింది. దాన్ని పోగొట్టడానికి ఈసారి బాబా అద్భుతమే చేశారు. నేను 2017లో Ph.D లో చేరాను. అప్పటినుండి నాకు రీసెర్చ్ వర్క్ ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియక అంతా అయోమయంగా ఉండేది. నా రీసెర్చ్ వర్కులో సహాయం చేయమని మా మేడంగారిని అడిగితే, ఆవిడ కొంతవరకు చెప్పి, మా సీనియర్ మేడంని అడగమనేవారు. కానీ, ఎంత అడిగినా ఆమె నాకు స్పష్టంగా చెప్పేవారు కాదు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. రీసెర్చ్ వర్కులో నాకు మార్గనిర్దేశం చేయమని నేను చాలామంది సార్‌లను, మేడంలను సంప్రదించాను. కానీ వారంతా సహాయం చేస్తామని చెప్పేవారేగానీ ఎవరూ నాకు సహాయం చేసేవారు కాదు. ఇక లాభంలేదు అనుకుని, 2021, జనవరిలో, ‘నేను చేస్తున్న ఉద్యోగం మానేసి Ph.D పైనే దృష్టిపెట్టాలి’ అనుకున్నాను. అనుకున్నట్టే ఉద్యోగం మానేశాను కూడా. తరువాత ధైర్యం చేసి మళ్ళీ మా మేడంగారిని రీసెర్చ్ వర్క్ కోసం సంప్రదిస్తే, మళ్ళీ ఆవిడ కొన్ని మెథడ్స్, ప్రొసీజర్స్ కోసం మా సీనియర్ మేడంని అడగమన్నారు. ‘మళ్ళీ అడిగినా ఆవిడ చెప్పదు, ఇక ఇంతే’ అనుకున్నాను. అప్పుడు నేను బాబాను స్మరించుకుని, “బాబా! ఇన్ని సంవత్సరాలు నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో మీకు తెలుసు. (నిజానికి ఇన్ని సంవత్సరాలూ Ph.D కోసం సాయం చేయమని నేను బాబాను అడగలేదు.) సీనియర్ మేడం గనుక ఈసారి సరిగ్గా రెస్పాండ్ అయి, నాకు మెథడ్స్, ప్రొసీజర్స్ చెప్తే నా అనుభవాన్ని ఖచ్చితంగా సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో వెంటనే పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. మ్రొక్కుకున్నాగానీ, 100% నమ్మకంతో కాదు. ‘ఈమె ఎలాగూ చెప్పదు’ అనే ఎక్కువ శాతం అనిపించేది. కానీ ఆశ్చర్యంగా, నేను ఆమెకు కాల్ చేసి, “మేడంగారు మిమ్మల్ని అడగమన్నారు” అని చెప్పగానే, ‘కొన్ని ప్రొసీజర్స్, మెథడ్స్ నీ మెయిల్‌కి పంపిస్తాను’ అని చాలా సానుకూలంగా స్పందించారు. నిజానికి ఇంతకుముందు ఎన్నోసార్లు నాకు సహాయం చేయమని ఆమెని అడిగేదాన్ని. మేడంగారు అడగమన్నారని చెప్పినా ఆమె నాకు ఏమీ చెప్పేది కాదు. నన్ను చాలా చులకనగా చూసేవారు. ఎంతో ఏడ్చేదాన్ని. కానీ ఈసారి ఆమె సానుకూలంగా రెస్పాండ్ అవటం చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. బాబా చూపిన కరుణకు ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ విధంగా బాబా నాకు గుణపాఠం చెప్పి మిగిలిన సంశయాన్ని కూడా తీర్చారు.
సాయిబంధువులారా! నాలాగా మీకు కూడా ‘ఈ బ్లాగులో మ్రొక్కుకుంటే పని అవుతుందా, లేదా’ అనో, ‘భక్తుల అనుభవాలు చదివి నిజమా, కాదా’ అనో సంశయించవద్దు. బాబా ఊదీని, ఈ బ్లాగ్ మహత్యాన్ని పరీక్షించదలచి నేను ఓడిపోయాను. తగిన గుణపాఠం నేర్చుకున్నాను. “నన్ను క్షమించండి బాబా. నాలోని ఈ చంచల మనస్తత్వాన్ని, ఇలా ప్రతి విషయాన్ని సంశయించే గుణాన్ని, అహంకారాన్ని పూర్తిగా తొలగించి, మీపై భక్తి, విశాసం, ప్రేమ పెంపొందేలా ఆశీర్వదించండి బాబా. వెంటనే ఈ అనుభవాన్ని పంచుకుంటానని చెప్పి సుమారు 2 నెలలు పైగా పంచుకోకుండా వాయిదా వేశాను. అందుకు నన్ను మన్నించండి బాబా. నా Ph.D లో మీరే గైడుగా ఉండి నాకు సహాయం చెయ్యండి బాబా. నాకు అంతా అయోమయంగా ఉంటోంది. ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటున్నాను బాబా. నా ఈ పరిస్థితిని తొలగించండి. మీరే మీకు ఇష్టమైన మార్గాన్ని నాకు చూపించండి బాబా ప్లీజ్”.
మూడవ అనుభవం: నెల రోజుల వయసున్న మా అక్కావాళ్ళ బాబుకి కంటిసమస్య ఎదురైనప్పుడు కూడా, “అంతా సరిచేయండి బాబా, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అనుకున్నాను. దానిని కూడా నేను వాయిదా వేశాను. “నన్ను క్షమించండి బాబా. బాబుకి ఇంకొకసారి టెస్ట్ చేయించమన్నారు. ప్లీజ్ బాబా, అది కూడా సరిచేసి, బాబు ఆరోగ్యంగా, ఆనందంగా, మీ నీడలో పెరిగే అవకాశాన్ని కల్పించండి బాబా”.
“బాబా! కొన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న మానసికవ్యధ మీకు తెలుసు. ఎటూ నిర్ణయం తీసుకోలేక నడిసముద్రంలో ఉన్న పడవలాగా ఉంది నా జీవితం. నా జీవితాన్ని మీకు ఇష్టమైన ఒడ్డుకు చేర్చండి, ప్లీజ్ బాబా. నాలో ఉన్న ప్రతికూల ఆలోచనలను, బద్ధకాన్ని పోగొట్టండి బాబా. నన్ను మీ బిడ్డలా సగర్వంగా జీవించేలా చేయండి బాబా. నాకు ఉన్న ఆ సమస్యను కూడా మీకు ఇష్టమైన రీతిలో త్వరగా పరిష్కరించండి బాబా. నా సమస్య తీరాక ఆ అనుభవాన్ని మళ్ళీ ఇదే బ్లాగులో మన సాయిబంధువులతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బాబా. త్వరగా పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఎదురుచూస్తుంటాను బాబా”.
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఎదురొచ్చి అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నా అనుభవాలను బ్లాగులో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమ్.ఎస్. చదువు కోసం మా అమ్మాయిని అమెరికా పంపే నిమిత్తం ఎస్.బి.ఐ లో లోన్‌కి అప్లై చేయడానికి వెళ్తున్నపుడు బ్యాంకుకి సమీపంలో కొంతమంది బాబా ఫోటోతో నాకు ఎదురువచ్చారు. అది నాకు శుభసూచకంగా అనిపించింది. కానీ లోన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు నేను, "బాబా! నువ్వే ఎదురొచ్చావు. అంతా సవ్యంగా జరిగేలా నువ్వే చూడాలి. భారమంతా నీదే" అని బాబాను ప్రార్థించాను. కరుణామయుడైన బాబా సమస్యలన్నీ దాటిస్తూ, సమయానికి లోన్ వచ్చేలా చేశారు. ఈ కరోనా కాలంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా బాబా ఊదీ పెట్టుకుని, ఆయననే ప్రార్థిస్తూ అన్నింటినీ అధిగమిస్తున్నాము. "ధన్యవాదాలు బాబా. మా అమ్మాయిలిద్దరినీ చల్లగా చూడండి బాబా. నేను మిమ్మల్ని కోరిన కోరిక ఏమిటో మీకు తెలుసు. ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు జరిగేటట్లు చూడు తండ్రీ, సాయినాథా!"
బాబా ఆశీస్సులతో కోవిడ్ నుండి విముక్తి
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను 1912 నుండి సాయిభక్తురాలిని. నేను అప్పటినుండి ఇంగ్లీష్ బ్లాగు అనుసరిస్తున్నాను. ప్రస్తుతం ఈ తెలుగు బ్లాగును అనుసరిస్తున్నాను. ఇది ఎంతో చక్కని బ్లాగు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. రెండు నెలల క్రితం మా అమ్మాయికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను ఎంతో బాధతో 'మా అమ్మాయికి ఆరోగ్యాన్ని ప్రసాదించమ'ని బాబాను వేడుకొని, ఆయన ఆశీర్వాదంతో మా అమ్మాయికి నయమవుతుందని నమ్మకముంచాను. డాక్టరైన మా అబ్బాయి మా అమ్మాయికి చికిత్స మొదలుపెట్టాడు. మా అమ్మాయి 14 రోజులు గృహనిర్బంధంలో ఉంటూ మా అబ్బాయి ఇచ్చిన మందులు వాడింది. బాబా ఆశీస్సులతో తనకు నయమైంది. బాబా తనని కాపాడారు. బాబా దయవల్ల ఇప్పుడు మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు తండ్రి. మీ అమృతహస్తంతో మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరు మాతో ఉండండి. ఐ లవ్ యు బాబా. ప్రస్తుతం భారతదేశమంతా కరోనా మహమ్మారి వలన అల్లాడిపోతోంది. మేము ఎంతో భయాందోళనలకు గురవుతున్నాము. ప్రజలందరినీ మీరే రక్షించాలి బాబా. దయచేసి రోగులందరికీ అండగా ఉండి వారిని కాపాడండి. మీ భక్తులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి".
Om sai ram i am feeling very happy. Thank you you printed my sai's leela.today it got. I am waiting for many days, om sai ram ❤❤❤💙💚💛💕
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteJAI SAIRAM
ReplyDeleteJAI SAIRAM
JAI SAIRAM
Om Sri Sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDelete748 days
ReplyDeletesairam
Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tolginchu thandri
ReplyDeleteBaba pain mng kalla taggipovali thandri
ReplyDelete🏵🌟❤🌺🙏🙏OmSaiRam🙏🌺❤🌟🏵
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete