సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 372 వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఆరవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి నేను రెయిలింగ్ బయట కూర్చుని ఉన్నాను. అప్పుడు భక్తులు బాబాను, “ప్రజలకు బొబ్బలొస్తున్నాయి. అవి వారికి గొప్ప కష్టాన్ని కలిగిస్తున్నాయి. మీకే ఒకవేళ బొబ్బలొస్తే మీరేం ఉపచారాలు చేస్తారు?” అని అడిగారు. అప్పుడు గ్రామంలో ప్లేగు వ్యాపించి ప్రజలు మరణిస్తున్నారు. “దానికి మందేం ఉంటుంది? అదెలా వచ్చిందో అలాగే పోతుంది" అని బాబా చెప్పారు. అయినప్పటికీ భక్తుల అర్థింపుపై వారు, “ఒకవేళ మీకేమైనా చేయాలనిపిస్తే, దూదిని కాల్చి ఆముదంలో (బహుశా కుసుమనూనె అని చెప్పారేమోగానీ నాకది సరిగా గుర్తులేదు) ముంచి బొబ్బల మీద పెడితే అవి తగ్గిపోతాయి. ఆ జబ్బును నేను నా శరీరం మీదకు తీసుకున్నాను. గ్రామంలో ఏడుగురు మరణిస్తారు. తరువాత అది సమసిపోతుంది" అని అన్నారు. 

ఆ తరువాత వారు చెప్పిన విధంగానే జరిగింది. ఈ మధ్యలో రెండు మూడుసార్లు నాకు నెమలిపింఛాల విసనకర్రతో బాబాకు విసరటానికి (చామరంతో వీచటానికి) అవకాశం దొరికింది. బాబాను నేను మూడువేళలా దర్శనం చేసుకునేవాడిని. అయిదారు రోజులు ఇట్టే గడిచిపోయాయి. అప్పుడు నేను బొంబాయి తిరిగి వెళ్ళటం గురించి ఆలోచించాను. బయలుదేరేటప్పుడు నాకు బాబా చిత్రపటాలు చిన్నది ఒకటి, పాకెట్ సైజుది ఒకటి లభించాయి. అప్పుడు ఇతర భక్తుల వలెనే వాటిని బాబా చేతికిచ్చి, వారి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలన్న కోరిక నామనసులో మెదిలింది. కానీ ఆ సమయంలో అది నెరవేరలేదు. తరువాత మధ్యాహ్నంపూట బాబా అనుమతి తీసుకున్నాను. ఆయన నా చేతిలో గుప్పెడు ఊదీని పెట్టారు.

"------తరువాత నేను బాబా స్మరణ ప్రారంభించాను" 


తరువాత నేను ఎడ్లబండిలో కోపర్గాం స్టేషనుకు బయలుదేరాను. బండివాడు ఒక పిల్లవాడు. నది దగ్గరకు రాగానే ఆ పిల్లవాడు, “ఇక్కడ జామతోట ఉంది. అక్కడ మంచి జామపళ్ళు దొరుకుతాయి. నేను దిగి మీకోసం కొన్ని తీసుకువస్తాను. మీరు ఇంటికి తీసుకువెళ్దురుగాని" అన్నాడు. నేను, “ఇప్పుడు అవి తెచ్చి ఏం ప్రయోజనం? పోనీ దాంట్లోంచి కొన్ని నీకు ఇస్తాను. నీవు వాటిని తీసుకెళ్లి బాబాకు సమర్పించాలి. అలా చేస్తానంటే తీసుకొని రా" అన్నాను. సరేనని అతను బండిని నిలిపి, జామపళ్ళు తేవటానికి వెళ్ళాడు. 

నేను లఘుశంకకి క్రిందకి దిగాను. ఆ పని పూర్తి చేసుకొని బండివాడి కోసం చూస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నా కాళ్ళకున్న కొత్త చెప్పులు చేస్తున్న కిర్రు కిర్రుమనే శబ్దానికి బండికున్న ఎడ్లు బెదిరి వెనక్కి తిరిగి సామానుతో సహా శిరిడీవైపు పరుగుపెట్టాయి. నేనూ, ఇంకో అతనూ కలిసి బండిని వెంబడించి దాన్ని ఆపే ప్రయత్నం చేశాం. కానీ మా శ్రమ వ్యర్థమైంది. మొదట బయలుదేరినచోటుకే ఆ బండి వెళ్ళిపోయింది. నేను బండివాడి కోసం చాలాసేపటివరకూ చూశానుగానీ, అతను రాకపోవటంతో నేను కోపర్గాం వైపు నడవటం మొదలుపెట్టాను. 

కొంతదూరం వెళ్లేసరికి ఎదురుగా టాంగాలో ఇద్దరు పోలీసులను వెంటబెట్టుకొని బండివాడు రావటం కనిపించింది. నన్ను చూసి వాళ్ళు టాంగా నుండి కిందికి దిగారు. ఎడ్లబండిని అమ్ముకుని, డబ్బు తీసుకొని పారిపోతున్నానని అతను నా మీద ఆరోపణను చేసి నన్ను పోలీసులకు అప్పగించాడు. సిపాయిలు నన్ను కోపర్గాం రమ్మన్నారు. పోలీసులు తమలో తాము మాట్లాడుకొనే మాటలను బట్టి నేరాన్ని ఒప్పుకోమని వాళ్ళు నన్ను ప్రోద్బలం చేయబోతున్నారని పసికట్టాను. వాళ్ళ దృష్టిని మళ్ళించి నేను, “నా మీద చేయి వేశారంటే ఖబడ్దార్, జ్ఞాపకం పెట్టుకోండి. నేను లాయరుని. మీ సంగతి తేల్చుకుంటాను" అని అన్నాను. ఆ మాటలు వారిమీద బాగా పనిచేశాయి. పోలీసులు అవాక్కైపోయి నన్ను పోలీసుస్టేషనుకి తీసుకెళ్ళారు. 

అక్కడ వారి పైఅధికారి వారిని మెచ్చుకొని, “శభాష్! మీరు నేరాన్ని కనిపెట్టటం మాత్రమేకాక నేరస్తుణ్ణి కూడా పట్టుకొచ్చారు" అన్నాడు. పోలీసులు ఆ అధికారికి బండి అమ్మకం విషయం చెప్పగానే అధికారి నా పర్సునీ, జేబునీ వెతికాడు. కానీ అందులో బండి ధరకుగానీ లేదా ఎద్దుల ధరకుగానీ సరిపడ్డ డబ్బు వారికి చిక్కలేదు. పైగా నా సామాను కూడా ఆ బండిలోనే ఉండిపోయింది. అతను ఒక నిర్ణయం తీసుకొని పోలీసులతో, "ఇతన్ని తిరిగి తీసుకెళ్ళండి. దారిలో బండి వివరాలు తెలియకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం" అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నన్ను తీసుకొని పోలీసులు టాంగాలో బయలుదేరారు. 

దారిలో ఒక హోటల్లో ఉపాహారం తీసుకోవటానికి  వాళ్ళు ఆగారు. ఈ విచిత్ర సంఘటనలో చిక్కుకోవటంతో నాకు దిక్కుతోచక సాయిబాబాను స్మరించటం ప్రారంభించాను. “సాయిబాబా నిజంగా దేవుడే అయితే ఈ సంఘటన సానుకూలంగా సమసిపోవాలి" అని అనుకున్నాను. పోలీసులు హోటలు నుంచి బయటకు వచ్చేసరికి నేను బయట అరుగుమీద కూర్చొని నామస్మరణలో తల్లీనమై ఉన్నాను. చాలా సమయం గడిచిపోవటం వల్ల చీకటిపడిపోయింది. దాంతో పోలీసులు నా చేతిలో ఒక చాకు పెట్టి, “ఈ చాకును ఒక చేత్తో పట్టుకో. రాత్రిళ్ళు ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటుంది'' అన్నారు. 

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo