సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 365వ భాగం.


ఖపర్డే డైరీ - యాభయ్యవ భాగం.

శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే -వి.బి.ఖేర్

శ్రీమతి లక్ష్మీబాయి ఖపర్డే జీవిత చరిత్రను తెలుసుకుంటున్నప్పుడు దాదాసాహెబ్ ఖపర్డే నేపథ్యాన్ని గురించి ఆలోచింపచేయగల ఓ సందర్భం దొరికింది. దీనికి మూలం ఖపర్డే కుమారుడైన బి.జి. ఎలియాస్ బాబాసాహెబ్ ఖపర్డే మరాఠీలో రాసి 1962లో ప్రచురించిన శ్రీ జి.యస్.ఖపర్డే జీవిత చరిత్ర.

దాదాసాహెబ్ జీవిత చరిత్రలో లక్ష్మీబాయి ఖపర్డే బాల్యం గురించిన వివరాలు లేవు. భార్యగా, తల్లిగా, గృహిణిగా మాత్రమే మనకు ఆమె గురించి తెలుస్తోంది. లక్ష్మీబాయి ఏదో వానాకాలం చదువు చదువుకొందనటంలో అనుమానమేం లేదు. ఆమెకు చదవటం వచ్చు గానీ రాయటం రాదు. అంటే ఆమె విద్యావంతురాలు కాదని కాదు. నిజానికి ఆమె చాలా సంస్కారవంతురాలు. రామాయణ, మహాభారతాలూ, పాండవ-ప్రతాపం, శివలీలామృతాలలోని కథలను ఆమె చదివింది. కీర్తనకారుల ద్వారా విన్నది కూడా. దాదాసాహెబ్ ఖపర్డే సంసారం చాలా పెద్దది. వాళ్ళింట్లో, దాదాసాహెబ్, ఆయన భార్యా, ముగ్గురు కొడుకులూ, వారి భార్యలూ, వారు ఆశ్రయమిచ్చిన కుటుంబాలవారూ, చదువుకుంటూ వారి సాయాన్ని పొందుతున్న 12-15 మంది విద్యార్థులూ, ఇద్దరు వంటవాళ్ళూ, వారి భార్యలూ, ఇద్దరు గుమాస్తాలూ, ఒక వాచ్‌మన్, ఎనిమిది మంది గుర్రాల కాపలాదారులు, ఇద్దరు రెండెడ్లబండి తోలేవాళ్ళూ, ఒక గోవుల కాపరీ, ఇద్దరు పనివాళ్ళూ, రోజుకి ముగ్గురు అతిథులతో కలిసి సగటున 50 మంది ఉండేవారు. అలాంటి సంసారంలో అంతటి బాధ్యతను వహిస్తున్న లక్ష్మీబాయి అందరిపై  సమానమైన శ్రద్ధ చూపించేది. పెద్ద, చిన్న తారతమ్యాన్ని ఆవిడ చూపించేది కాదు. తన పిల్లలతో సహా ఇంట్లో ఉన్న అందరి పిల్లలకూ ఆమె స్వయంగా వండిపెట్టేది. అందులో ఎవరికి అనారోగ్యం వచ్చినా ఆమె స్వయంగా సేవ చేసేది. 

ఒకసారి నీల్‌కారి అనే విద్యార్థి తొడమీద పెద్ద కురుపు లేచి బాగా జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరాడు. లక్ష్మీబాయి ఆసుపత్రికి అతని కోసం ఆహారం తీసుకొని వెళ్ళి తానే అతనికి తినిపించేది. అతనికి అనారోగ్యం అలాగే రెండునెలలు కొనసాగింది. అతను ఆమె పట్ల తన జీవితాంతం ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నాడు. “లక్ష్మీబాయి నా తల్లి కూడా చేయలేనంతగా సర్వమూ చేసింది. ఆమె దయలేకపోతే నేను చనిపోయి ఉండేవాడిన"ని చెబుతూండేవాడు అతను. ఇలాంటి ఉదాహరణలు ఇంకెన్నో ఉన్నాయి. అదేవిధంగా ఖపర్డే ఆశ్రయమిచ్చిన బాలకృష్ణలేలే అనే అతని భార్య సీమంతాన్ని లక్ష్మీబాయే ఏర్పాటు చేసింది. గర్భిణీ స్త్రీకి ఇష్టమైన వంటకాలన్నిటితో పళ్ళాన్ని నింపి, దాన్ని ఆమెకిచ్చి, ఆమెకు చీరను కట్టబెట్టి బహుమతిని కూడా ఇచ్చింది. ఇందులో క్రొత్తేమీలేదు. ఇది లక్ష్మీబాయి సహజ లక్షణం. జి.ఎస్.ఖపర్డే డైరీ ఆగష్టు ఎనిమిదవ తారీఖున “సీమంతం వల్ల ఈరోజు భోజనం ఆలస్యమైంది” అని రాశాడు. గృహకృత్యాలు నిర్వహించే క్రమంలో ఆమెకు కోపం చాలా అరుదుగా వచ్చేది. అప్పుడు ఆమెను చూసి అంతా భయపడేవారు. ఆమెకు ఎప్పుడైనా కోపం వస్తే ఆమెకు ఎదురు చెప్పటానికి కుటుంబంలో ఎవరికీ ధైర్యం ఉండేది కాదు.

లక్ష్మీబాయికి నాటువైద్యం కూడా తెలుసు. ముఖ్యంగా కామెర్లకి ఆమె వద్ద దివ్యౌషధం ఉండేది. అది ఆమెకి కుటుంబ సాంప్రదాయాన్ననుసరించి తన అత్తగారి వద్దనుంచి సంక్రమించింది. ఆమె ఇచ్చే ఒక్క మోతాదుతోనే కామెర్లు నయమైపోయేవి. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామస్తులకందరికీ తెలియటం వల్ల రోజుకి సుమారు నలుగురయిదుగురయినా ఆ మందు కోసం వచ్చి ఉచితంగా దానిని పొందేవారు. లక్ష్మిబాయి తరువాత ఆమె కోడలు ఈ  సాంప్రదాయాన్ని  కొనసాగించింది.

ఆరోజుల్లోని ఆచారం ప్రకారం లక్ష్మీబాయి దాదాసాహెబ్ ఖపర్డేని అతి చిన్న వయస్సులోనే వివాహమాడిందన్న విషయం స్పష్టం. అప్పుడు ఆమె మామగారు బ్రిటిష్ హయాంలో మామ్లేదారుగా ఉంటూ హోదానీ, ఐశ్వర్యాన్నీ అనుభవిస్తుండేవాడు. తరువాత దాదాసాహెబ్ లాయరై ప్రాక్టీసు మొదలుపెట్టి అతి తక్కువ వ్యవధిలోనే పేరు సంపాదించి ప్రాక్టీసుని బాగా పెంచుకొన్నాడు. తన భర్త ఇంట్లో ఆమె ఐశ్వర్యంతో నిండిన వాతావరణంలో గడిపిందని చెప్పొచ్చు. అంతేకాక, ఆమె సహజంగా వితరణబుద్ధి కలది కనుక డబ్బుని యధేచ్ఛగా ఖర్చు పెట్టేది. ఇదెలా పనిచేసిందో చూద్దాం. ఇంట్లో ఉన్న యాభైమందికీ సరిపడేంత భారీయెత్తున ఇంట్లో వంటకాలు చేసేవారు. నలుగురైదుగురికి సరిపడే వంటకాలు ఎప్పుడూ మిగిలిపోయేవి. 

ఆమె పిల్లలు కాలానుగుణంగా మారే ఫ్యాషన్లను అనుసరించి తయారయేవారు. ఆమె తన పిల్లల్ని నేత బట్టలుగానీ, చినిగిన బట్టలుగానీ వేసుకోనిచ్చేది కాదు. వాళ్ళు ఎప్పుడూ 9-10 అంగుళాల వెడల్పు అంచుతో ఉన్న సిల్కు ధోవతులూ, సిల్కు చొక్కాలు వేసుకొనేవారు. కొత్త బట్టలైనా సరే, ఏ కొంచెం చినిగినా అవి వెంటనే పారేసేవారు. పాత్రలతో పాలను కొలిచి అందరికీ చాలా సమృద్ధిగా ఇచ్చేవారు. నెయ్యి ప్రతి ఆధరువులోనూ విడివిడిగా వడ్డించకుండా మూడు కప్పుల్లో అతిచిన్న సేవకుడి దగ్గర్నుంచీ కుటుంబంలోని ప్రతివాళ్ళకీ భోజనంలో ఒక భాగంగా వడ్డించబడేది. కుటుంబమంతటికీ మామూలు రోజుల్లో కూడా కారపు పిండివంటలూ, తీపి పథార్థాలతో భోజనం చాలా ఉత్తమశ్రేణిలో ఉండేది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo