సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 402వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • 'సాయిలక్ష్మి'ని ఇంటికి పంపిన సాయి

సాయిభక్తురాలు శ్రీమతి అరుణాసూధన్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

“సాయితో తమకున్న అత్యద్భుతమైన అనుభవాలను పంచుకుంటున్న భక్తులకు సాయి ఆశీస్సులు సదా ఉండుగాక!” - నా జీవితంలో కూడా ఒక అత్యద్భుతమైన అనుభవం చోటుచేసుకుంది. దాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నా పేరు అరుణాసూధన్. నేను అనంతపురం నివాసిని. సుమారుగా ఒక ఏడాది క్రిందట మా ఎదురువీధిలో ఒక తెల్లటి గోవు కనిపించింది. వెంటనే నా మనసులో, “సాయీ! ఈ తెల్లని గోవు మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది!” అనుకున్నాను. అనుకున్నదే తడవుగా, ఆనాటి సాయంత్రం ఆ గోవు మా ఇంటి ముందుకు వచ్చింది. నా మనస్సులో ఆ గోవుకు ఏదైనా పేరు పెట్టాలని అనిపించింది. తనకు ‘సాయిలక్ష్మి’ అని నామకరణం చేశాను. అప్పటినుంచి సాయిలక్ష్మి ప్రతిరోజూ మా ఇంటికి ఏదో ఒక సమయంలో రావటం మొదలుపెట్టింది. కొన్నిరోజుల తరువాత, ఒక సాయంత్రం నేను ఇంటిపనుల్లో నిమగ్నమై ఉన్నాను. సాయిలక్ష్మి వచ్చి ఇంటిముందు నిలబడిపోయింది. చాలాసేపటి తర్వాత నేను తలుపు తెరచి చూస్తే ఎదురుగా సాయిలక్ష్మి. వెంటనే గోమాతకు రోజూపెట్టే ధాన్యము, పళ్ళు, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి సాయిలక్ష్మికి పెడుతూ ఆమెను గుర్తించలేనందుకు మనసులోనే క్షమ యాచించి, “ఇలా ఎంతసేపు నిలబడుతావు తల్లీ? ఇకపై నేను పొరపాటున గమనించకపోతే ఒక్కసారి పిలువు తల్లీ, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాను” అని చెప్పాను. ఏ నిమిషాన ఆ విషయం నేను సాయిలక్ష్మికి విన్నవించుకున్నానో గానీ ఆ మరుసటిరోజు నుంచి తను వచ్చిన వెంటనే ‘అంబా’ అని అనడం మొదలుపెట్టింది. ఆమె స్వరం వినగానే నాకు శరీరమంతా గగుర్పాటు చెందేది.

సాయిలక్ష్మి ప్రతి మాసంలో మొదటిరోజు వచ్చి మొదటి తాంబూలం తీసుకొని వెళ్తూండేది. మధ్యాహ్న ఆరతి లేదా శేజ్ ఆరతి సమయానికి ఖచ్చితంగా వచ్చేది. ఇలా ప్రతిరోజూ సాయికృప వల్ల గోమాతకు సేవ చేసుకుంటూ ఉంటాను. ఇలా జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాలు గడిచాయి. కార్తీక మాసం ప్రారంభమైంది. ఎప్పటిలాగానే సాయిలక్ష్మిదే అగ్రతాంబూలం. కానీ ఈ మాసంలో ఆ తల్లి ఏ పుణ్యతీర్థంలో అభ్యంగన స్నానం చేసి వచ్చేదో గానీ, ఆ తల్లి శరీరం నుంచి, పొదుగు నుంచి, తోక నుంచి నీటిచుక్కలు ధారగా కారుతుండేవి. ప్రతిరోజూ ఆమె శరీరం చల్లగా ఉండేది. ముగ్గురమ్మల మూలపుటమ్మలా అలంకరించుకుని వచ్చేది. కార్తీకమాసమంతా నాకు ఇంటి వద్దనే సాయిలక్ష్మి రూపంలో శ్రీభ్రమరాంబిక మల్లికార్జునుల దర్శనభాగ్యం కలిగింది.

మార్గశిర మాసంలో ఒక ఏకాదశిరోజున మధ్యాహ్న ఆరతి అయిన తరువాత తలుపు తీసేసరికి సాయిలక్ష్మి సుఖాసనంలో ఉన్న సాయిలా ఇంటిముందు కూర్చుని ఉంది. ఒక్క నిమిషం నాకు సాయియే స్వయంగా అక్కడ కూర్చున్నట్టు అనుభవమయింది. వెంటనే ఆమె లేచి నిలబడింది. ఆమెకు ధాన్యము, పసుపు, కుంకుమ పెట్టాను. నాకు అమితానందం కలిగింది.

కొన్నిరోజుల తర్వాత, సాయిలక్ష్మి ఒక బుధవారంరోజున తన దూడతో పాటు మా ఇంటికి వచ్చింది. ఆ దూడ కూడా తల్లి వలె శ్వేతవర్ణంలో ఉంది. రెండిటికీ ధాన్యము, పళ్లు, పసుపు, కుంకుమ పెట్టాను. అప్పుడు నేను ఆ తల్లి కష్టం చూడలేక, “సాయిలక్ష్మీ! ఇంత చలిలో ఈ చిన్న పాపను వెంటబెట్టుకుని రాత్రిళ్లు, వేకువఝాముల్లో ఎందుకు వస్తావమ్మా? కాస్త వెచ్చని వేళలలో రా తల్లీ!” అని చెప్పాను. ఆ తల్లికి నా మాటలు ఏమని తోచాయో ఏంటో, ఆరోజు మొదలు సాయిలక్ష్మి మా ఇంటికి రావటం మానేసింది. పుష్యమాసం కూడా వచ్చింది. అయినా గోమాత జాడ లేదు. ప్రథమ తాంబూలం తీసుకోవటానికి కూడా సాయిలక్ష్మి రాలేదు. నా మనసు చాలా వ్యధ చెందింది. బాబాతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, కానీ ఆ తల్లి జాడ తెలియలేదు. ఇలా ఉండగా, ఒకరోజు సాయంకాలం మా కుటుంబీకులతో కలిసి బయటకి వెళ్ళాను. అక్కడ నాకు ఆ తల్లి సాయిలక్ష్మి దర్శనం అయింది. అంతే, నా మనసులో మాతృత్వభావన పెల్లుబికింది. అక్కడ పండ్ల దుకాణాలు ఉంటే యాపిల్ పండ్లు కొనుక్కుని ఆ తల్లికి, దూడకు తినిపించాను. ఆరోజు సాయంత్రం ఇంటినుండి ధాన్యము, పండ్లు తీసుకుని సాయిలక్ష్మి  దగ్గరికి వెళ్ళి ఆమెకు నివేదించాను. అలా ఒక మూడురోజులు చేయగలిగాను. ఆ తర్వాతరోజు అంతా సిద్ధం చేసుకున్నాక అంతదూరం వెళ్ళటానికి వీలుపడలేదు. ఆరోజునుంచి బాబాని క్షమ యాచిస్తూ సాయిలక్ష్మిని తిరిగి పంపమని వేడుకుంటుండేదాన్ని. ఏ గోమాత ఇంటి వద్దకు వచ్చినా సాయిలక్ష్మినే తలచుకునేదాన్ని. “బాబా! పిల్లి, కుక్క, గోమాతలు అన్నింటినీ పంపుతున్నావే, మరి నా సాయిలక్ష్మిని మాత్రం ఎందుకు పంపట్లేదు తండ్రీ?” అంటూ రోజూ బాబాను ప్రాధేయపడేదాన్ని.

కొన్నిరోజుల తర్వాత ఆ తల్లి మా ఇంటికి రావాలని సంకల్పం చేసుకుని శ్రీసాయిసచ్చరిత్రను పారాయణ చేయటం మొదలుపెట్టాను. కానీ ఎందుకో దీనిగురించి బాబాని అడగాలని అనుకున్నాను. గత బుధవారంనాడు(2020, ఏప్రిల్ 15), “బాబా! సాయిలక్ష్మిని ఎప్పుడు పంపుతావు? ఆ తల్లి ఎప్పుడు నన్ను కరుణిస్తుంది?” అని మనసులోనే బాబాను ప్రశ్నించి, సాయిలీలామృతం పుస్తకంలో ఒక పేజీని కళ్ళుమూసుకొని తీశాను. ఆ పేజీలో ‘శ్రద్ధ సబూరితో ఉండు’ అన్నది సారాంశం. “సరే బాబా, అలాగే ఉంటాను” అని బాబాతో చెప్పుకున్నాను.

అదే వారంలో శనివారంనాడు (18-04-2020) ఏకాదశి. నాకు ఒక వాట్సాప్ గ్రూపులో గురుచరిత్ర నిత్యపారాయణ చేసేందుకు లింక్ వచ్చింది. వెంటనే నేను అది బాబా ఆజ్ఞగా స్వీకరించి గురుచరిత్రను మొదలుపెట్టాను. గురుచరిత్ర మహిమ, సాయి ఆశీస్సుల వల్ల ఆ మరుసటిరోజు(19-04-2020) ప్రొద్దున 7.30 గంటలకు సాయిలక్ష్మి దూడతో సహా వచ్చి నాకు, మా కుటుంబీకులకు దర్శనమిచ్చింది. ఆ తల్లిని చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. తనివితీరా ఆ తల్లిని సేవించుకున్నాను. ఇలా సాయి కృప వల్ల సాయిలక్ష్మి తిరిగి వచ్చింది. ‘సాయీ!’ అంటే ‘ఓయీ!’ అంటాడు ఆ సాయినాథుడు. ఆయన లీలలకు అంతు లేదు. భక్తి శ్రద్ధలతో సాయిని అడిగితే ఆయన తప్పక ప్రసాదిస్తారు. ఇది సత్యం, సత్యం, ముమ్మాటికీ సత్యం. 

ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాన్ని ఇలా సాటి సాయిబంధువులతో పంచుకోవటానికి సహకరించిన సాయిమహరాజ్ సన్నిధి బ్లాగును నడిపిస్తున్న సాయిభక్తులకు నా నమస్సుమాంజలి.



శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు, శుభం భవతు.


7 comments:

  1. అమ్మా నేనూ ananthapuram లొనే వుంటున్నాను మీరు పంపిన ఈ లీల చదవగానే నాకు చాలా సంతోషం కలిగింది కానీ మా ఇంటి దగ్గర ఈ రోజు ఒక ఆవుకు బాగాలేక లెయ్యలేని స్థితిలో వునింది మేము దాని దగ్గరికి వెళుతుంటే తల ఒక్కటి లేపి మళ్ళి తల నెలకి వాల్చింది.పాపం దాని పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలిగింది. ఏమి చెయ్యలేని స్థితిలో కనీసం నీళ్లు కుడటగలేదు. ఈ karona ప్రభావం వలన దానికి సంబంధించిన డాక్టర్స్ కూడా అందుబాటులో లేరు.నేను బాబా ని తలుచుకొని దాని కష్టాన్ని నీవే తీర్చు తాతయ్య అని మొక్కుకున్నాను. ఇక కొద్ది గంటలకే తన తనువును విడిచింది. వెంటనే గాలి వీచటం వర్షం పడటం జరిగింది.ఓం సాయి రామ్ అని అనుకొని చాలా బాధ పడ్డాము.

    ReplyDelete
    Replies
    1. ayyo papam avunaa sai. dani atmaku baba shantini chekuralani manasaraa korukuntunnamu.

      Delete
  2. Om sri sainaathaya namaha. Om sai aarogya kshemadaaya namaha🙏🙏🙏🙏

    ReplyDelete
  3. శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo