సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 418వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి పిలిస్తే పలికే దైవం...
  2. బాబా ఉండగా మనకి భయం ఎందుకు?

సాయి పిలిస్తే పలికే దైవం...

సాయిభక్తురాలు శ్రీమతి వేదవతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నా పేరు వేదవతి. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచరుగా పనిచేస్తున్నాను. గత సంవత్సరం, అంటే 2019లో మా మామగారు ఒక సాయిలీలామృతం పుస్తకం నాకు ఇచ్చారు. మావారు సప్తాహపారాయణ చేశారు. కానీ నేను పనిచేసే స్కూల్ మా ఇంటి నుంచి 66 కి.మీ. దూరంలో ఉండటం వలన సప్తాహపారాయణ చేయలేక రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేస్తుండేదాన్ని. బాబా కృపవలను నేనిప్పుడు 11వ సారి పారాయణ చేస్తున్నాను. శ్రీగురుచరిత్ర కూడా 3 సార్లు పారాయణ చేశాను.

మొదటి అనుభవం: 

నాకు గత 15 రోజులుగా చాలా సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. కాన్యులా అమర్చి, రోజుకు రెండు ఇంజెక్షన్స్ చొప్పున 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ చేశారు. తరువాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోమని డాక్టర్ చెప్పారు. స్కానింగ్ చేయించుకున్నాను కానీ, రిపోర్టులు ఎలా ఉంటాయో అని చాలా భయమేసింది. బాబాపై భారం వేసి, “సాయీ! నేను మీ బిడ్డను. మీరు కాక నన్ను ఎవరు రక్షిస్తారు సాయీ? దయచేసి నన్ను కాపాడండి సాయీ” అని మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నాను. రిపోర్టులు వచ్చిన తరువాత మావారు ఆ రిపోర్టులను తీసుకెళ్ళి డాక్టరుకు చూపించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన డాక్టర్, “సమస్య ఏమీ లేదు. కిడ్నీలో చిన్న రాళ్లు ఉన్నాయి. అవి కూడా రోజుకు 5 లీటర్ల నీళ్ళు త్రాగితే తగ్గిపోతాయి” అని చెప్పారు. మావారు ఈ విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పగానే ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

2వ అనుభవం: 

ఇప్పుడు ఉంటున్న ఇంటిలో మేము అద్దెకు చేరి 7 సంవత్సరాలు అయ్యింది. హఠాత్తుగా ఒకరోజు ఇంటి ఓనరు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎంతోకాలంగా ఉంటున్న ఇల్లు, పరిసరాలు, సౌకర్యాలను విడిచి వేరే చోటకి వెళితే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో అని కలవరపడి, “బాబా! అమ్మకు ఈ వీధి అయితే రక్షణగా ఉంటుంది. దయచేసి ఓనరు మనసు మార్చండి బాబా!” అని ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో ఆ ఓనరు మనసు మార్చుకుని మమ్మల్ని అక్కడే ఉండమన్నారు. “థాంక్యూ సో మచ్ బాబా!”

మావారు తనకోసం, మా బావగారి కోసం, మా ఆడపడుచు కోసం 40 రోజుల పాటు బాబాకు 108 ప్రదక్షిణలు చేశారు. బాబా అనుగ్రహంతో అందరూ ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడ్డారు. పిలిస్తే పలికే దైవమైన మన బాబా గురించి ఎంతని చెప్పగలను? ఆ తండ్రి ప్రేమకు కృతజ్ఞురాలినై అనుక్షణం ఆయనను తలచుకుంటూ ఉంటాను.

బాబా ఉండగా మనకి భయం ఎందుకు?

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సాయిరాం! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. సాయిలీలలు ఎన్ని వ్రాసినా చాలా తక్కువే అనిపిస్తుంది. ఇంట్లోని మనిషిలాగా నేను అన్నిటికీ అడుగడుగునా బాబా మీద ఆధారపడతాను. ఒక్కోసారి ‘నేను బాబాని బాగా విసిగిస్తున్నానేమో’నని అనిపిస్తుంది. మరలా అంతలోనే, “ఇంట్లో తండ్రికి కాక ఇంకెవరికి చెప్పుకుంటాము?” అని నా మనసుకి సర్దిచెప్పుకుంటాను. అలా ఒక చిన్నపిల్లలాగా నా కోరికలన్నీ బాబాని అడిగి నెరవేర్చుకుంటుంటాను. “బాబా! నా కోరికలు స్వార్థం అయితే నన్ను క్షమించండి. మీ పాదాల వద్ద సేవచేసుకునేలా నన్ను ఆశీర్వదించండి”. ఇక నా అనుభవానికి విషయానికి వస్తే.. 

మావారికి ఈమధ్య బ్లడ్ షుగర్ ఎక్కువయిందేమో అని అనుమానం వచ్చింది. పరీక్షలు చేయించుకుందామంటే కొరోనా కారణంగా సాధారణ వైద్యపరీక్షలు కూడా చేయించుకోవడం కుదరని పరిస్ధితులు. అందువల్ల ఇంట్లో ఉన్న బ్లడ్ షుగర్ మీటర్ లో చెక్ చేస్తే షుగర్ చాలా ఎక్కువగా ఉన్నట్లు చూపించింది. దానితో నేను చాలా కంగారుపడి, “బాబా! మావారి షుగర్ లెవెల్ తగ్గేలా చేయండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ మావారి నోట్లో బాబా ఊదీని వేయడం ప్రారంభించాను. బాబా దయవలన కొద్దిరోజుల్లోనే షుగర్ టెస్ట్ చేయించుకునే అవకాశం వచ్చింది. మావారు అన్ని పరీక్షలూ చేయించుకున్నారు. బాబా అనుగ్రహంతో, బాబా ఊదీ మహిమతో షుగర్ రీడింగ్ అంతకుముందు కన్నా చాలా తక్కువ వచ్చింది. మేము ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. బాబా ఉండగా మనకి భయం ఎందుకు? అన్నీ బాబానే చూసుకుంటున్నారు. “బాబా! తెలిసీ తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి”.


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo