సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1486వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రార్ధించినంతనే కరుణించే బాబా
2. బాబా కృప

ప్రార్ధించినంతనే కరుణించే బాబా

ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళై మూడు సంవత్సరాలైంది. కాలేజీలో టాపర్‍నైన నేను పెళ్లైయ్యాక కరోనా మరియు ప్రెగ్నన్సీ కారణంగా ఉద్యోగ విషయంలో ఏ ప్రయత్నాలు చేయక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ 'ఏదో ఒక ఉద్యోగం చేయాలి, నా భర్తకి తోడుగా ఉంటుంద'ని అనుకునేదాన్ని కానీ, కుదిరేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు మావారు, "నీకు టాలెంట్ ఉంది. పై చదువులు చదవాలంటే చదువుకో" అని అన్నారు. మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల "ఎమ్.ఎస్.సి మ్యాథమెటిక్స్ చదవాలనుంద"ని మావారితో చెప్పి ఆ కోర్సుకి సంబంధించిన కాలేజీలకు కాల్ చేయడం మొదలుపెట్టాను. ఒక్క కాలేజీవాళ్ళు కూడా నా కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకు ఏం చేయాలో అర్థంకాక బాబాతో, "ఏ కాలేజీ వాళ్ళైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే, మీ అనుగ్రహాన్ని సాయి బంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. అలా అనుకోని నా గదిలో నుండి బయటకి వచ్చేసరికి మావారు, "ఉస్మానియా యూనివర్సిటీవాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి, అప్లికేషన్ ఫారం డీటెయిల్స్ చెప్పారు" అని చెప్పారు. నిజంగా ఇది బాబా లీల. "ధన్యవాదాలు బాబా".

పుట్టుకతోనే మా పాపకున్న ఒక అనారోగ్య సమస్య వల్ల దొగడటం, నడక, ఆహారం తీసుకోవడం మొదలైన అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. తనకి 15 నెలలప్పుడు నేను బాబాను, "బాబా! నా పాపకి మంచిగా నడక వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. అద్భుతం! బాబాకి చెప్పుకున్న కొద్దిరోజులకే పాప నడవడం మొదలుపెట్టింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఒకసారి మా పాపకి బాగా విరోచనలై చాలా నీరసించిపోయింది. వెంటనే నేను పాపకి బాబా ఊదీ పెట్టి, "పాపకి విరోచనాలు తగ్గి ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, ఆ క్షణం నుండి పాప ఆరోగ్యం కుదుటపడుతూ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే నా బిడ్డ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేట్టు ఆశీర్వదించండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంతలో  మా మామయ్యగారికి బాగా విరోచనాలై ఆయన కూడా చాలా నీరసించిపోయారు. నాకు పెళ్ళైన తర్వాత ఈ మూడేళ్లలో ఆయన అనారోగ్యం పాలైంది లేదు. ఎప్పుడూ ఉత్సాహంగా తన పని తను చేసుకుంటూ సరదాగా ఉండేవారు. అలాంటి ఆయన అలా అనారోగ్యంతో బాధపడుతుంటే, చూసి నాకు చాలా బాధేసి, "బాబా! మా మామయ్యగారి ఆరోగ్యం బాగైతే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న కొన్ని నిమిషాలలోనే మా మామయ్యగారి ఆరోగ్యం కుదుటపడింది. అయితే రెండు రోజుల తరవాత నా భర్తకి విరోచనాలై చాలా డల్ అయిపోయారు. ఆ స్థితిలో కూడా వర్క్ ఇంపార్టెంట్ అని ఆయన ఆఫీసుకి వెళ్ళారు. నేను, 'మావారికి ఆరోగ్యం బాగుంటే, నా అనుభవం పంచుకుoటాను' అని అనుకున్నాను. దయతో నా బాబా మావారిని కాపాడారు. తరువాత రెండురోజులకి మా అమ్మ అనారోగ్యం పాలై మూడు రోజులు జ్వరం, నీరసం, కడుపునొప్పితో చాలా బాధపడింది. అప్పుడు కూడా నేను, 'అమ్మ అనారోగ్యం తగ్గితే, నా అనుభవాన్ని పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల అమ్మ కోలుకుంది. పైన చెప్పిన అన్నీ సందర్భాలలో మావాళ్ల ఆరోగ్యం గురించి బాబాను వేడుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ ఉంటే, మందులతో బాబా దయవల్ల అందరికీ నయమై ఇప్పుడు అందరూ బాగున్నారు. "ప్రార్ధించినంతనే కరుణించినందుకు చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే నా కుటుంబాన్ని సదా కాపాడండి బాబా".

మా అత్తయ్యగారు తన పుట్టినరోజునాడు మా మామయ్యగారు తనని విష్ చెయ్యలేదని బాగా ఏడ్చి రచ్చరచ్చ చేసారు. ఆయన్ని తిడుతూ మధ్యలో నన్ను, మావారిని కూడా తిట్టారు. మేమేమో కేకు తేవాలి, గుడికి తీసుకెళ్లాలి అని అనుకుంటుంటే ఎంతసేపటికి ఆమె కోపం తగ్గలేదు. దాంతో మా మూడ్ అంత పాడైపోయింది. మాములుగా మా అత్తయ్యగారు మంచివారు. కాకపోతే ఆమె గతంలో చాలా పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఒక కొడుకుని పోగొట్టుకున్నారు. ఇంట్లో ఎవరి సహకారం లేకపోగా ఆమెని తిట్టేవాళ్ళు. ఇప్పుడు మారారు అనుకోండి. అవన్నీ గుర్తొచ్చి అప్పుడప్పుడు ఆమె అలా ప్రవర్తిస్తుంటారు. సరే నేను, "బాబా! మా అత్తయ్యగారు శాంతపడి కేకు కట్ చేయడానికి రావాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా అద్భుతం చేసారు. మూడు గంటలపాటు ఎంతో కోపంగా ఉన్న అత్తయ్య శాంతించి కేకు కట్ చేసారు, గుడికీ వచ్చారు. ఇదంతా బాబా దయ. ఇకపోతే, అత్తయ్య పదవీ విరమణ చేసే రోజున నేను ఆమె మూడ్ ఎలా ఉంటుందో అన్న భయంతో, 'ఆమె పదవి విరమణ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా, ప్రశాంతంగా, ఆనందంగా జరిగితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా యవల్ల కార్యక్రమం చాలా చక్కగా జరిగింది, అందరూ సంతృప్తి చెందారు. "ధన్యవాదాలు బాబా. ఏదన్నా తప్పుగా వ్రాసున్నా, ఏవైనా  అనుభవాలు పంచుకోవడం మర్చిపోయినా క్షమించండి బాబా. నన్ను, నా భర్తని, నాబిడ్డని సదా కాపాడండి బాబా. ఈమధ్య నా ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదు. ప్లీజ్! నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా".

ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!

బాబా కృప

ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు శ్రీనివాస్. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం. నేను ఒక సాయి భక్తుడ్ని. నేనిప్పుడు నా మొదటి అనుభవం మీతో పంచుకోబోతున్నాను. మా అబ్బాయి వర్షిత్ ఐదవ తరగతి చదువుతున్నప్పుడు నవోదయ పరీక్షకు అప్లై చేసి, నాలుగు నెలలు కోచింగ్ కోసం కోచింగ్ సెంటర్ వాళ్లతో మాట్లాడి డబ్బులు కూడా కట్టాను. అయితే కరోనా కారణంగా కోచింగ్ రెండు, మూడు నెలలు మాత్రమే నడించింది. 2021, ఏప్రిల్ 30న బాబు నవోదయ పరీక్ష వ్రాసాడు. ఇంటికి వచ్చాక ప్రశ్నాపత్రం చూసుకుంటే గణితంలో మార్కులు తక్కువ వస్తాయని తెలిసి, 'బాబుకు నవోదయలో సీటు వస్తుందా, లేదా' అని కంగారుపడ్డాము. మనసులోనే బాబాకి, "మా బాబుకు నవోదయ సీటు వస్తే, మా ఊర్లో జరుగుతున్న మీ మందిర నిర్మాణానికి నా వంతు చందా ఇస్తాను" అని మ్రొక్కుకున్నాను. అయితే నవోదయ సీటు విషయం గురించి ఎవర్ని అడిగినా "సీటు రావడం కొద్దిగా అనుమానమే" అన్నారు. దానికి తగ్గట్టు ఆ సంవత్సరం నవోదయ పరీక్ష ఫలితాలు రావడం ఆలస్యం కావడం మమ్మల్ని మరింత కంగారుకు గురిచేసింది. ఎట్టకేలకు జూలై నెల రెండో వారంలో నవోదయ ఫలితాలు ఆన్లైన్లో విడుదలయ్యాయి. మనసులో బాబాను తలుచుకొని రిజల్ట్స్ చూస్తే, మా బాబు నవోదయాకి ఎంపిక అయ్యాడు. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మా ఇంట్లోని వాళ్లంతా చాలా సంతోషపడ్డారు. మరుసటిరోజు బాబా గుడికి వెళ్లి బాబాకి మొక్కుకున్నట్లుగా గుడి నిర్మాణానికి నా వంతుగా 5,000 వేల రూపాయలు చందాగా ఇచ్చాను. "కృతజ్ఞతలు బాబా".

ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo