సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1480వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి దయవల్ల దొరికిన పోయిన బండి
2. సమస్యలు తీర్చి నమ్మకం కుదిర్చిన బాబా

సాయి దయవల్ల దొరికిన పోయిన బండి

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు మంజుల. మాది గుంటూరు. నేను సాయిబాబాను తల్లిగా, తండ్రిగా, ఇంకా సర్వము ఆయనే అన్న భావనతో కొలుస్తాను. నాకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఆ తండ్రే. నేను ఆయన్నే తలుస్తాను, జపిస్తాను, నమ్ముతాను. 2023, ఫిబ్రవరి 18న శివరాత్రి. ఆరోజు పొద్దున్నే నేను, మావారు నిద్రలేచి శివరాత్రి కదా తొందరగా గుడికి వెళ్ళొద్దామని బయలుదేరాము. తీరా బయటకొచ్చి చూస్తే మా ఇంటి ముందు ఉండాల్సిన స్కూటర్ కనపడలేదు. మావారు ఒక అడ్వకేట్. నేను ఒక ప్రైవేటు ఉద్యోగిని. మాకు ఒక అమ్మాయి. తను పీజీ చేసేందుకు ప్రిపేరవుతుంది. మావారు రోజూ ఉదయం నన్ను, మా పాపని దించి తన కోర్టుకు వెళ్లి, సాయంత్రం మళ్లీ మిమ్మల్ని ఇంట్లో దింపి, మళ్ళీ ఆఫీసుకు వెళ్లి రాత్రి ఇంటికొస్తారు. మాకు బండి లేకపోతే క్షణం గడవదు. అలాంటి మా బండి పోయేసరికి మా మనసంతా వికలమైపోయింది. ఎలాగో ఇద్దరం శివాలయానికి వెళ్లి దర్శనము, అభిషేకం చేసుకుని వచ్చాం. కానీ ఏదో బాధగా అనిపించి, "సాయిరామ్ తండ్రీ! అసలే పిల్ల పెళ్ళి ఖర్చులకి డబ్బులు సరిపోతాయో, లేదోనని మదనపడుతుంటే ఇప్పుడు ఈ విపత్తు ఏమిటి తండ్రి" అని బాధపడ్డాము. అన్నట్టు మా పాపకి పెళ్లి నిశ్చయమైంది. అది కూడా ఆ నాయనా అనుగ్రహమే. మంచి కుటుంబం, మంచి అబ్బాయి.

నేను బాబాను నమ్ముతాను. అందుకే సమస్యను ఆయనకే వదిలేసి, "మా బండి మాకు దొరికితే, 108 ప్రదక్షిణలు చేసి, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ రోజంతా మేమందరం అన్యమనస్కంగానే ఉన్నాము. మరుసటిరోజు ఫిబ్రవరి 19 ఉదయానికి కూడా అలాగే ఉన్నాము. ఆరోజు మధ్యాహ్నం మావారు 'మన బండి దొరకద'ని ఎవరో అన్నారంటే, "నేను బాబాను నమ్ముతానండి. ఆయనే చూసుకుంటార"ని చెప్పాను. అలాగే నా తండ్రి మమ్మల్ని అనుగ్రహించారు. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆరోజు రాత్రి 8:30కి మావారు ఫోన్ చేసి మన బండి దొరికింది అని చెప్పగానే నా ప్రాణం లేచి వచ్చింది. అసలు విషయమేమిటంటే, మావారి ఆఫీసు కింద ఉండే అబ్బాయి ఇంటి దగ్గర ఎవరో బండి అమ్ముతామని అంటే వెళ్లి చూశాడు. ఆ అబ్బాయి ఆ బండి స్టోరేజ్ బాక్సులో ఉన్న మావారి విజిటింగ్ కార్డు చూసి, "ఇది మా లాయరుగారి బండి, నువ్వు అమ్ముతున్నానంటావేంటి? నువ్వు ఎవరు?" అని అడిగేసరికి ఆ వ్యక్తి కంగారుపడి బండి వదిలేసి అక్కడినుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మావారికి ఫోన్ చేసి, "లాయరుగారు మీ బండి మా ఇంటి దగ్గర ఉంది. దానిలో పెట్రోల్ లేదు" అని చెప్పాడు. మావారు వెళితే అతను జరిగిందంతా చెప్పి మా బండిని మాకు అప్పగించాడు. ఇదంతా నా తండ్రి దయకాక మరేమిటి? ఈవిధంగానే ఆ తండ్రి మా వెన్నంటే ఉండి మా బిడ్డ కళ్యాణం నిర్విఘ్నంగా, సంతోషంగా జరిగేలా, అలాగే మా పాపకు మంచి కాలేజీలో మంచి బ్రాంచిలో పీజీ ఫ్రీ సీట్ వచ్చేలా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఆయన నా కోరికను నెరవేరుస్తురన్న నమ్మకంతో మళ్ళీ నా అనుభవాలను మీ అందరితో పంచుకుంటానని ఆశిస్తున్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్ఫణమస్తు!!!

సమస్యలు తీర్చి నమ్మకం కుదిర్చిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్నవారికి మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి. నేను ఒక సామాన్య సాయి భక్తురాలని. అలాంటి నాకు సాయిబాబాపై మరింత నమ్మకం కలిగేలా చేసింది మా మేడం అంజలి. ఆమె నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు నా గురించి సాయిబాబాకి ప్రార్థన పెట్టించింది. ఆయన దయతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మా మేడం నన్ను పారాయణ గ్రూపులో జాయిన్ చేసింది. నేను ఇప్పుడు ప్రతి గురువారం బాబా జీవితచరిత్ర చదువుతున్నాను. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒక రెండు నెలలు నాకు, మా చిన్నపాపకి నెలసరి రాలేదు. ఇక డాక్టర్ దగ్గరకి వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు గురువారం. "బాబా! మాకు నెలసరిగా సవ్యంగా రావాలి. అలా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత రెండు రోజులకి మా పాపకి నెలసరి వచ్చింది. మరో రెండు రోజులకి నాకు కూడా నెలసరి వచ్చింది. అలా బాబా దయవల్ల డాక్టర్ దగ్గరకి వెళ్లకుండానే మా సమస్య తీరింది. "కృతజ్ఞతలు బాబా".

2023, ఫిబ్రవరి 18, మహాశివరాత్రి నాడు మా పెద్దపాపకి కొంచెం కడుపునొప్పి వస్తుంటే హాస్పిటల్‍కి తీసుకెళ్ళాను. డాక్టర్ చూసి స్కానింగ్ తీయాలి అన్నారు. రిపోర్టు ఎలా వస్తుందో అని భయపడి, "బాబా! రిపోర్టు నార్మల్‍గా వస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపటికి రిపోర్టు వచ్చింది. డాక్టర్ చూసి, "సమస్య ఏమీ లేదు" అని చెప్పింది. ఇలా ఎన్నోసార్లు బాబా దయవల్ల చిన్న చిన్న సమస్యలు తీరాయి. బాబా ఎప్పటికీ నాయందు ఉంటారని నమ్మకం నాకు కుదిరింది. "ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీసాయినాథర్ఫణమస్తు!!!

3 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo