1. సాయినాథుని నమ్ముకుంటే - మన కష్టాలు గట్టెక్కినట్లే!
2. సాయితండ్రి చూపుతున్న కరుణ
3. క్రెడిట్ కార్డులు కనిపించేలా చేసిన బాబా
సాయినాథుని నమ్ముకుంటే - మన కష్టాలు గట్టెక్కినట్లే!
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. 2022, జూన్ 17 ఉదయం బాబా నాపై చూపిన దయ నేను ఎప్పటికీ మరిచిపోలేనిది. అప్పటికి నెల రోజుల ముందు నుండి మేము ఆర్థిక సమస్యలతో అధిక ఒత్తిడికి గురవుతూ ఉండేవాళ్ళం. నిజానికి నా కూతురుని, కుమారుడిని హైదరాబాదులో చదివించే ఆర్థిక స్తోమత నాకు ఉన్నప్పటికీ ఆ సమయంలో వాళ్లిద్దరికి ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది అయింది. సుమారు పదిహేను రోజుల పాటు నేను నమ్మిన బాబాను తలుచుకుని, "ఎలాగైనా సరే ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించి, నా కొడుకు, కూతుర్లకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడు తండ్రి" అని మనసులో వేడుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా 2022, జూన్ 17, గురువారం సాయంత్రం దగ్గలో ఉన్న బాబా మందిరానికి వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, "బాబా! శనివారం నాడు నా కొడుకుని హైదరాబాదులోని స్కూలులో విడిచి రావలసి ఉంది. కానీ అక్కడ కట్టడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. ఎలాగైనా నీవే కాపాడు తండ్రి" అని సాయిని ప్రాధేయపడి ఇంటికి వచ్చాను. ఆ రాత్రి సరిగా నాకు నిద్రపట్టలేదు. ఉదయం లేచి యధావిధిగా ఫోను చేతిలో పట్టుకుని 'బ్యాంకు అకౌంటులో ఎన్ని డబ్బులున్నాయో, ఇంకా ఎంత డబ్బు అవసరం అవుతుందో' అని నా ఫోన్‍లో ఉన్న బ్యాంకు యాప్ ఓపెన్ చేశాను. అక్కడున్నది చూసి రెండు నిమిషాల వరకు నాకు ఏమీ తోచలేదు. చాలా ఆశ్చర్యకరమైన సందర్భమది. ఒక లక్ష నలభైఏడువేల రూపాయలు నా బ్యాంకు అకౌంటులో జమ అయి ఉండటం చూసి నా నోట మాట రాలేదు. వెంటనే నా భార్య దగ్గరకు వెళ్లి బాబా కృపాకటాక్షాల వలన డబ్బులు వచ్చాయి అని ఆనందంగా చెప్పాను. ఆమె కూడా చాలా ఆనందించింది. అసలు విషయమేమిటంటే, రెండు సంవత్సరాల క్రితం నేను ఒక లోన్ కోసం దరఖాస్తు చేసి ఉన్నాను. నాతోపాటు చాలామంది అప్లై చేసారు. అందరమూ ఆ విషయం గురించి మర్చిపోయాము. అలాంటిది సాయిని నమ్ముకున్నందుకు ఆ లోన్ ఇన్నాళ్ల తర్వాత నా ఒక్కడికి మంజూరైంది. సద్గురు శ్రీసాయినాథుని నమ్ముకుంటే చాలు, మన కష్టాలు గట్టెక్కుతాయి అనడానికి నిదర్శనం ఈ అనుభవం. నేను, నా కుటుంబం ఆ సాయినాథునికి ఎల్లవేళలా ఋణపడి ఉంటాము. ఆయన ఆశీర్వాదంగా వచ్చిన డబ్బుతో నా పిల్లలు మంచి విద్యాభ్యాసాన్ని, మంచి ప్రవర్తనను పొందాలని బాబాను కోరుకుంటున్నాను.
తరువాత నా కొడుకుని తీసుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ నారాయణ స్కూలు హాస్టల్లో చేర్పించి వచ్చాను. మరుసటిరోజే నా కొడుకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "నాకు బాగా గొంతునొప్పిగా ఉంది. ఏమీ తినడానికి కూడా రావడం లేదు" అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే 'చిన్నప్పటినుండి ఇంటి దగ్గర తప్ప హాస్టల్లో ఉండే అలవాటు లేని బాబు ఇప్పుడు హాస్టల్లో ఎలా ఉంటాడో?' అని దిగులు పడుతున్న నా భార్య బాబు చెప్పింది విని తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే నేను, నా భార్య ఆ సాయినాథునికి దణ్ణం పెట్టకుని, "బాబా! బాబుని జాగ్రత్తగా చూసుకోండి. వాడి గొంతునొప్పిని తగ్గించండి" అని వేడుకున్నాము. ఆ సాయినాథుని కృపవలన మరుసటిరోజే బాబు గొంతునొప్పి తగ్గిపోయింది. "సాయినాథా! మీకు సాష్టాంగ నమస్కారాలు. నా కొడుకు హాస్టల్లో ఉండే ఇబ్బందులను అధిగమించి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచిగా విద్యాభ్యాసం చేసుకునేలా చూడు తండ్రి".
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయితండ్రి చూపుతున్న కరుణ
ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు నీలిమ. మాది విజయనగరం. నేను బాబా భక్తురాలిని. ప్రతి విషయంలో బాబా 'నేనున్నాన'ని నన్ను కాపాడుతున్నారు. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగు ద్వారా మీకు తెలియపరిచాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకసారి నాకు తీవ్రమైన పన్ను నొప్పి వచ్చింది. ఆ కారణంగా నా ముఖమంతా వాచిపోయి, భరించలేని నొప్పికి నా కళ్ళ నుండి కన్నీళ్లు వాటంతటవే వచేస్తుండేవి. డాక్టరుకి చూపిస్తే, "జ్ఞానదంతంకి ఇన్ఫెక్షన్ అయింది. దాన్ని తీసేయాలి. కాకపోతే ఆ దంతం పూర్తిగా పైకి రాలేదు కాబట్టి చిన్న సర్జరీ చేసి ఆ దంతాన్ని తొలగించాలి" అని చెప్పి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మూడు రోజులకు మందులు రాసిచ్చారు. నాకు చాలా భయమేసి, "బాబా! నన్ను నువ్వే కాపాడాలి. ఆపరేషన్ అవసరం లేకుండా నాకు నయమయ్యేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్ధించాను. బాబా దయవలన ఆపరేషన్ అవసరం లేకుండా మందులతోనే నాకు నయమైంది.
ఒకసారి మా చిన్నపాప సింక్ దగ్గర పని చేసుకుంటూ దాని మీద తన బలమంతా పెట్టింది. దాంతో సింకు అమాంతం తన కాలివేళ్ళ మీద పడిపోయింది. చాలా బరువైన పింగాణీ సింక్ ఒక్కసారిగా పాప కాలు మీద పడేసరికి నాకు చాలా భయమేసింది. పాప కాళ్ళు వణికిపోతున్నాయి, వేళ్ళు వాచిపోయాయి, బోటన వేలు నల్లగా అయిపోయింది. నేను చాలా కంగారు పడిపోయినప్పటికీ వెంటనే తేరుకుని బాబా ఊదీ పాపకి పెట్టి, నోటిలో కొంచెం వేసి తినిపించాను. నొప్పి తగ్గడం కోసం మందు కూడా వేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా బాబాని తలుచుకుంటూ ఆర్థోపెడిక్ డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళాను. ఆ క్లినిక్ పేరు 'సాయి ఆర్థోపెడిక్ క్లినిక్'. నేను బాబాని తలుచుకుని, "తండ్రీ! ఎటువంటి స్కానింగ్ అవసరం లేకుండా కేవలం మందులతో పాపకి త్వరితగతిన తగ్గిపోయేటట్టు చేయండి. నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. డాక్టరు మందులు రాసిచ్చారు. బాబా దయవలన ఆ మందులతో పాపకి నయమైంది. ఇలా తలచుకోగానే వెనువెంటే ఉంటూ, ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు బాబా. నాపై ఇంత కరుణ చూపుతున్నందుకు కృతజ్ఞతగా నేను ఈ బ్లాగు ద్వారా నా తండ్రి సాయిబాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
క్రెడిట్ కార్డులు కనిపించేలా చేసిన బాబా
సోదరభావంతో తోటి సాయిభక్తులకు బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిస్తున్న బ్లాగు నిర్వాహకులైన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవం పంచుకుంటున్నాను. ఈమధ్య నేను ఒక తీర్థయాత్రకు వెళ్లాను. అందులో భాగంగా ఒక దేవాలయానికి వెళ్ళాము. అక్కడ ధోవతి ధరించనిదే దర్శనానికి అనుమతించరని, మా పర్సులు, క్రెడిట్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు మొదలైనవన్నీ లగేజీ బ్యాగ్‌లలో ఉంచి బస్సులోనే వదిలేయమని బలవంతం చేసారు. దాంతో మేము ధోవతీలు ధరించి మా లగేజీ బస్సులో ఉంచి దర్శనానికి వెళ్ళాము. దర్శనానంతరం మేము తిరిగొచ్చి బస్సులో బట్టలు మార్చుకున్నాం. తరువాత నేను నా బ్యాగులో పెట్టిన పర్సు, క్రెడిట్ మరియు ఐడి కార్దులు మొదలైన వాటికోసం వెతికితే క్రెడిట్ కార్డులున్న కవర్ కనిపించలేదు. దాంతో నేను చాలా నిరాశ చెంది వాటిని బస్సు క్లీనర్ తీసాడేమోనని అనుమానించాను. ఏదేమైనా నేను సహాయం కోసం నా తల్లి శ్రీశిరిడీ సాయిబాబాను అర్థించి, "నా క్రెడిట్ కార్డులు దొరికితే, నా అనుభవాన్ని ప్రియ సోదర సాయి భక్తులతో పంచుకుంటాన"ని ఆయనకి మాటిచ్చాను. బాబా దయవలన 5 నిమిషాల తర్వాత నా బ్యాగులోనే క్రెడిట్ కార్దులున్న కవర్ నాకు దొరికింది. సాయి మహరాజ్ నా ప్రార్థనను ఆలకించి నా క్రెడిట్ కార్డులను నాకు ఇచ్చారని చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నేను ఈ అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి".
శ్రీసమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sir Satchinanda sadguru sai nath maharaj ki jai 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete