సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1222వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన వరాలను కుమ్మరిస్తున్న బాబా
2. చెప్పినట్లే వింతను చూపిన బాబా
3. రిజర్వేషన్ టిక్కెట్లిచ్చి శిరిడీకి రప్పించుకున్న బాబా

అడిగిన వరాలను కుమ్మరిస్తున్న బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని మన ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఈ మధ్య మేము భూమి రిజిస్ట్రేషన్ కొరకు మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్లూ కలర్ పేపరుపై ప్రింట్ ఇచ్చారు. తరువాత మేము రిజిస్ట్రేషన్‍కి వెళితే, "డాక్యుమెంట్లు బ్లూ పేపరుపై ఉండకూడద"ని తహసీల్దార్ గారు అన్నారు. దాంతో 'రిజిస్ట్రేషన్ వాయిదా పడుతుందేమోన'ని నాకు చాలా భయమేసి సార్‍తో మాట్లాడుతున్నంతసేపు సాయి నామస్మరణ చేస్తూ, "డాక్యుమెంట్లు ఓకే చేసి, రిజిస్ట్రేషన్ పూర్తయితే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను బాబా" అని మనసులోనే బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యం! నేను బాబాను వేడుకున్నంతనే తహసీల్దార్ గారు డాక్యుమెంట్లు ఓకే చేశారు. అలా బాబా దయవలన గురువారం నాడు రిజిస్ట్రేషన్ పూర్తయింది.


ఒకసారి నాకు విపరీతంగా వీరేచనాలు అయ్యి చాలా నీరసించిపోయాను. టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదు. ఆ రోజు సాయంత్రం చేయాల్సి ఉన్న కొంత పని చేద్దామంటే అస్సలు ఓపిక లేకపోయింది. కొద్దిసేపటి తరువాత బాబా ఫోటో దగ్గర ఉన్న అగరుబత్తి పొడిని ఊదీగా భావించి నుదుటన ధరించాను. అంతే, కొద్దిసేపట్లో విరేచనాలు తగ్గాయి. పని చేసుకోవడానికి కావాల్సిన శక్తి కూడా వచ్చి బాబా దయవలన ఆ పని పూర్తి చేశాను.


మాకున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి మొక్కుబడులు తీర్చుదామంటే సమయం కుదిరేది కాదు. పైగా చేతిలో డబ్బులు ఉండేవి కావు. అప్పుడు నేను బాబాను, "ప్లీజ్ బాబా! డబ్బులు సమకూర్చి, వేములవాడ రాజన్నస్వామి మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం ఇవ్వండి" అని వేడుకున్నాను. మరుసటి గురువారానికి బాబా డబ్బులు సమాకూర్చారు. ఇంకా అదేరోజు మేము వేములవాడ రాజన్నస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాము. అంతా బాబా ఆశీర్వాదం.


మా పొలంపైన చెరువు కట్ట ఉంది. ఒకసారి భారీ వర్షాలకు ఆ కట్ట గండి పడి చాలా నష్టం వాటిల్లింది. మేము కట్టకు పడిన గండిని పూడ్చేస్తామంటే అడ్డుకున్నారు. అనవసరమైన గొడవలు జరిగాయి. ఈ విషయమై నేను, "సమస్యని పరిష్కరించమ"ని శ్రీసాయిబాబాని వేడుకున్నాను. ఆయన దయవలన చాలావరకు సమస్య పరిష్కారమైంది కానీ పూర్తిగా సమసిపోలేదు. "బాబా! చాలారోజుల నుండి మిమ్మల్ని అడుగుతున్నాను. తొందరగా సమస్యను పరిష్కరించండి. మీ కృపకోసం శ్రద్ద, సబూరీలతో ఎదురు చూస్తున్నాను.  మీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను సాయినాథా. ఆ గండిని పూడ్చి, కట్టను పేరుస్తారని నమ్మకంతో ఉన్నాను బాబా. ప్లీజ్... ప్లీజ్.. మమ్మల్ని ఆదుకో ఆపద్భాంధవా శ్రీసాయిబాబా. సమస్యని పరిష్కరించి మాకు మేలు చేయండి బాబా".


నాకు చాలారోజులు నుండి శ్రీహనుమాన్ జయంతి సమయంలో హనుమాన్ దీక్ష స్వీకరించి మాల ధారణలో ఉన్న హనుమాన్ స్వాములకు వివిధ రకాల వంటకాలతో మధ్యాహ్నం భిక్ష పెట్టాలని ఆశ ఉండేది. ఈ సంవత్సరం పొలం దగ్గర బోర్ పడి వడ్లు మంచిగా పండాయి. నేను బాబాని, "హనుమాన్ స్వాములకు భిక్ష పెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయ చూపారు. 2022, మే 17 మంగళవారం రోజున నా కోరిక నెరవేరింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా! మేము అడిగిన వరాలన్నీ కుమ్మరిస్తున్నందుకు మీ పాదాలకు శతకోటి వందనాలు సాయినాథ. ఇలాగే ఎల్లప్పుడూ మీ పూర్తి అనుగ్రహం మాపై ఉండాలి బాబా". మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


చెప్పినట్లే వింతను చూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా నా తండ్రి సాయినాథునికి అనంత కోటి ప్రణామాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను రోజూ ఎంతో ఇష్టంగా ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. కానీ ఇప్పుడే నా అనుభవం వ్రాస్తానని అనుకోలేదు. ఇంకో కోరిక తీరాక వ్రాద్దామని అనుకున్నాను. కానీ ఆలస్యమవుతుందని ఇప్పుడే బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించగలరు. 2022, మేలో నా ఫోన్ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. సరేనని, కొత్త ఫోన్ కొనుక్కున్నాను. కొన్నిరోజులకి నా చేతికి ఉండే ఉంగరం కనిపించలేదు. అప్పటికి నాలుగు రోజుల ముందునుంచి నేను బయటకెక్కడికీ వెళ్లలేదు. అలాంటిది ఆ ఉంగరం ఎలా పోయిందో, ఎక్కడ పోయిందో తెలియక నేను ఇల్లంతా వెతికాను. కానీ ఆ ఉంగరం దొరకలేదు. కొద్దిరోజుల వ్యవధిలోనే రెండు వస్తువులు పోవటమేమిటిని బాధపడుతూ, 'బాబా చరిత్ర పారాయణ చెయ్యటం లేదు, అందుకేనేమో ఇలా అయింది' అనుకోని వెంటనే సాయి లీలామృతం పారాయణ చేయడం మొదలుపెట్టాను. తర్వాత బాబా ప్రశ్నలు-జవాబులు అనే పుస్తకం తీసి చూస్తే, "నువ్వు నా పటాన్ని పూజించు. రెండు రోజుల్లో నీకు ఒక వింత చూపిస్తాను" అని వచ్చింది. సరిగా రెండు రోజుల తర్వాత ఒక బ్యాగులో కనపడకుండా పోయిన నా ఫోన్ దొరికింది. తర్వాత వారం రోజులకి నేను పూర్తిగా ఆశ వదిలేసుకున్న ఉంగరం మా కారు సీటులో ఇరుక్కుని కనపడింది. దాదాపు 10 రోజులుగా మేము అదే కారులో రోజూ తిరుగుతున్నాము. అలాంటిది ఆ ఉంగరం అక్కడ ఉండటం ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అంతుపట్టలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


రిజర్వేషన్ టిక్కెట్లిచ్చి శిరిడీకి రప్పించుకున్న బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేనొక బాబా భక్తురాలిని. మాది నరసరావుపేట, గుంటూరు జిల్లా. నేను, మా అమ్మ, పాప ముగ్గురం 2022, మే 27న శిరిడీ వెళ్లదలచి 15 రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్నాము. ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆరోజు బాబాకి పూజ చేస్తూ కూర్చున్నాను. అంతలో నాకు ఫోన్ వచ్చిందని మా పాప నా మొబైల్ తెచ్చి నాకు ఇచ్చింది. అందులో 'ixigo' నుంచి 'మీ టిక్కెట్లు కంఫర్మ్ కాలేదు' అని మెసేజ్ ఉంది. 3:45కి ట్రైన్ అంటే 12:30కి వచ్చిన ఆ మెసేజ్ చూసి నాకు చాలా బాధ కలిగింది, కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే పాప, అమ్మలతో సీట్స్ లేకుండా అంత దూర ప్రయాణం చాలా ఇబ్బంది అవుతుంది. పైగా అమ్మకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అందువలన నేను బాబాను, "ఎలాగైనా మాకు టిక్కెట్లు ఏర్పాటు చేయండి బాబా. అదే జరిగితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకుని ఆయన మీద నమ్మకంతో ప్రయాణాన్ని ఆపకుండా బయలుదేరాను. మేము రైల్వేస్టేషన్‍కి చేరుకున్నాక జనరల్ టికెట్లు తీసుకుని ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నాం. ఇంతలో బాబా అద్భుతం చేశారు. సుమారు 3:15 ప్రాంతంలో మాకు తెలియని వాళ్ళు మా దగ్గరకి వచ్చి, "మా దగ్గర రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నాయి. మీకు ఏమైనా కావాలా?" అని అడిగారు. అంతా విచారించి సాయే మాకు ఆ టిక్కెట్లు పంపారని సంతోషంగా తీసుకున్నాము. తరువాత జనరల్ టిక్కెట్లు రిటర్న్ చేసేశాము. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అంతా బాబా దయ. చాలా ప్రశాంతంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. నమ్ముకున్న వారికి అన్నీ సమాకూర్చే దైవమా సాయినాథా థాంక్యూ దేవా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo