ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి ఎల్లప్పుడూ తన భక్తులతో ఉంటారనేది సత్యం
2. బాబా దయవల్ల తగ్గిన భరించరాని బాధ
3. తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదించే బాబా
సాయి ఎల్లప్పుడూ తన భక్తులతో ఉంటారనేది సత్యం
సాయి బంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు శ్రీజ. మాది వైజాగ్. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా తల్లిదండ్రులు సాయిని నమ్ముకున్నవాళ్ళు. వాళ్ళు ఎల్లప్పుడూ నేను బాగా చదువుకోవాలని, మంచి దారిలో నడవాలని కోరుకుంటూ నా పూర్తి బాధ్యతను సాయికి అప్పగించారు. నేను కూడా నా చిన్నప్పటినుండి సాయిని నమ్ముకుని చదువు, ఉద్యోగం మొదలైన అన్ని విషయాలలో తప్పనిసరిగా సాయి అనుమతి తీసుకునే నా ప్రతి అడుగు వేసాను, వేస్తున్నాను. నా జీవితంలో నేను ఆనందంగా గడిపిన క్షణాలన్నీ సాయి నాకు ప్రసాదించినవే. సాయి ఎల్లప్పుడూ తన భక్తులతో ఉంటారనేది సత్యం. నేను ఇప్పుడు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను.
ఆస్తిపాస్తులు, బంగారం వంటివేమీ లేని మధ్యతరగతి కుటుంబంలోని ఆడపిల్ల పెళ్లి ఎంత కష్టమో అందరికీ తెలిసినదే. అలాంటిది మేము కలలో కూడా ఊహించని విధంగా సాయి నా పెళ్లి జరిపించారు. ఆది కూడా అమ్మానాన్నలకు ఏ విధమైన కష్టం కలిగనివ్వకుండా! బాబా నాకు ఒక మంచి భర్తని, అడగకుండానే ఒక మంచి పుత్రుణ్ణి(తనకిప్పుడు ఐదు సంవత్సరాలు) ప్రసాదించారు. "సాయీ! నిన్ను నమ్ముకున్న వారి బాధ్యతలను నీవే నిర్వర్తిస్తావు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం తండ్రి".
సాయి కటాక్షం వల్ల ఈ మధ్యనే నేను నా చదువు పూర్తి చేశాను. ప్రస్తుతం నేను ఎనిమిది నెలల గర్భవతిని. అనుకోకుండా ఒకరోజు నేను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును చూడటం, అందులోని భక్తుల అనుభవాలు చదవడం జరిగింది. వాటిని చదువుతున్నప్పుడు నేను నాకు తెలియకుండానే ఒక రకమైన అనుభూతిని పొందుతున్నాను. ఇంకా సాయి నాతోనే ఉన్నారన్న నా విశ్వాసం మరింత దృఢమవుతోంది. ప్రతిరోజూ అన్ని సాయి లీలలు అందజేస్తున్నందుకు బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.
ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎనిమిది నెలల గర్భిణినైన నేను ఎండల వేడిని తట్టుకోలేకపోయాను. దానికి తోడు రాత్రుళ్ళు కరెంట్ పోతుంటే గాలి లేక నేను చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అలా ఒక మూడు రోజులు గడిచాక నేను బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి, సాయి పాదాలు పట్టుకుని, "సాయీ! నేను గాలి లేక అల్లాడిపోతున్నాను. కరెంటు వచ్చేలా అనుగ్రహించు తండ్రి" అని అనుకున్నాను. అంతే, పది నిమిషాల్లో కరెంటు రావడం, నేను నిద్రలోకి జారుకోవడం జరిగిపోయాయి. "బాబా! నేను మీకు మాటిచ్చినట్లు నా అనుభవం బ్లాగులో పంచుకున్నాను. ఆలస్యమైనందుకు క్షమించు తండ్రి".
2022, జూన్ రెండో వారంలో నా భర్త నన్ను చూడటానికి వచ్చి, వెళ్లారు. అలా ఆయన ఎప్పుడు వచ్చి వెళ్లినా ఇంటికి చేరకోగానే నాకు ఫోన్ చేసేవారు. కానీ ఆ రోజు ఎంతసేపటికీ ఆయన నాకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా భయమేసి సాయిని వేడుకుని బ్లాగులో పంచుకుంటానని చెప్పుకున్నాను. తర్వాత మావారి స్నేహితునికి ఫోన్ చేస్తే, మావారు ఇంటికి చేరుకున్నారని, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండడం వల్ల నా కాల్ చూసుకోలేదని తెలిసింది. "సాయీ! అందరినీ చల్లగా కాపాడు తండ్రి".
బాబా దయవల్ల తగ్గిన భరించరాని బాధ
ఓం సమర్ధ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నాపేరు రమాదేవి. నేను ఒంగోలు నివాసిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ఒకరోజు విపరీతమైన తలనొప్పి, కడుపులో మంట కారణంగా నేను భరించలేని బాధను అనుభవించాను. టాబ్లెట్లు, సిరప్‍లు వాడుతున్నప్పటికీ ఐదు రోజుల వరకు తగ్గలేదు. మావారు, పిల్లలు(వాళ్ళు మాకు దగ్గర్లో లేరు) హాస్పిటల్‍కి వెళ్లమని గొడవ చేసారు. కానీ హాస్పిటల్‍కి వెళ్లాలంటే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, రెండు సంవత్సరాల క్రితం పేగుల్లో సమస్య ఉందని నాకు ఆపరేషన్ చేసారు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్‍కి వెళితే ఎండోస్కోపీ చేస్తారేమోనని భయపడ్డాను. అప్పుడు బాబా పటం ముందు నిల్చొని, "బాబా! నాకీ బాధ తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను స్వామి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి నా బాధ చాలావరకు తగ్గుముఖం పట్టి, మరుసటిరోజుకి పూర్తిగా తగ్గిపోయింది. సాయినాథుని కృపవలన నేను బాగానే ఉన్నాను. "సాయినాథా! ఎప్పుడూ మీ నామస్మరణతో గడిపే మా కుటుంబానికి అనారోగ్యాలు, ఆర్ధిక బాధలు లేకుండా చేసి ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడుతూ ఉండు స్వామి. తప్పులుంటే క్షమించండి బాబా".
తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదించే బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు యశోద. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తూ సాయి అనుగ్రహాన్ని మా అందరిపై కురిపిస్తున్న సాయికి వందనాలు. 2022, జూన్ రెండో వారంలో మా అమ్మాయికి గ్యాస్ట్రిక్ నొప్పి, కడుపునొప్పి చాలా ఎక్కువగా వచ్చాయి. వాటికి తోడు వాంతులు, విరేచనాలు, జ్వరం కూడా ఉండేసరికి అమ్మాయి చాలా ఇబ్బందిపడింది. నేను వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! అమ్మాయికున్న బాధలన్నీ తగ్గి, రేపు ఉదయానికి తనకి నయమైతే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత బాబా ఊదీ అమ్మాయికి పెట్టి, కొద్దిగా ఊదీ నీళ్లలో కలిపి తాగించాను. మరుసటిరోజు ఉదయానికల్లా అమ్మాయి బాధలన్నీ తగ్గి చాలా ఉత్సాహంగా తన పనులు తను చేసుకుంటూ కనిపించింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బాబా దయ ఇంత తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని తెలుసుకున్న నా కళ్ళు ఆనందంతో చెమర్చాయి. "మీకు శతకోటి ప్రణామాలు బాబా. మీ అనుగ్రహం ఎప్పటికీ మా మీద ఇలాగే ఉంచి, సదా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమాపణలు బాబా".
Om sai ram
ReplyDeleteOm sai ram your Leela's are great to us.your blessings we want .
ReplyDeleteOme sri sai ram
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete