సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 579వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయవల్ల తీరిన సమస్యలు
  2. మహామహిమాన్వితమైన సాయి ఊదీ


బాబా దయవల్ల తీరిన సమస్యలు

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయినాథునికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. నేను సౌదీలో నివాసం ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. సంవత్సరంన్నర వయసున్న మా పాప ఆరాధ్య సాయి వరప్రసాదం. ఒకరోజు తన అరిచేతులు పసుపుపచ్చగా కనిపించాయి. ఏమిటి ఇలా ఉన్నాయని తన అరికాళ్ళు, కళ్ళు, నాలుక చూశాను. అరిచేతులు అరికాళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయి. వెంటనే నాకు తెలిసిన పిల్లల డాక్టర్ కి ఫోన్ చేసి, విషయం చెప్పాను. తను, "ఫోటో తీసి పంపించమ"ని చెప్పారు. నేను అలాగే చేశాను. తాను ఆ ఫోటోలు చూసి, "పసుపురంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ"ని చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి నాకు భయమేసింది. ఈ విషయం తెలిసి మా వారు తనకు తెలిసిన పిల్లల డాక్టర్ కి ఫోటోలు పంపించారు. అవి చూసిన డాక్టర్ ఇంటికి రమ్మని చెప్తే, పాపను తీసుకుని వెళ్ళాము. డాక్టర్ పాపని చూసి, "అవును, కాళ్లుచేతులు పచ్చగా ఉన్నాయి. కిడ్నీ, లివర్ సమస్యలేమైనా ఉంటే కష్టం. కారోటేనేమియా అనే సమస్య కూడా అయి ఉండొచ్చు. చాలావరకు సమస్య ఉండకపోవచ్చు కానీ, ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు చేయిద్దాం. రోజు పాపకి క్యారెట్ ఇస్తూ ఉండండి. విరోచనం మాత్రం లేత పసుపురంగు రాకూడదు" అని చెప్పారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మరుసటిరోజు పాప విరోచనం లేత పసుపురంగులో అయ్యింది. దాంతో నాకు చాలా భయం వేసింది. వెంటనే అన్ని టెస్టులు చేయించమంటే, చేయించాము. నేను బాబాని ప్రార్థించి, "పదకొండు వారాలు సాయి దివ్యపూజ చేస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ గా వచ్చాయి. పాపకి ఐరన్, కాల్షియం తక్కువగా ఉన్నాయని తెలిసింది. భయపడినట్లు లివర్ వంటి పెద్ద సమస్యలు ఏవీ లేవు. అంతా బాబా దయ అనుకుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

రెండవ అనుభవం:

మావారు డెంటల్ డాక్టర్. సంవత్సరంన్నర క్రితం రియాద్ లోని ఒక కాలేజీలో మావారు పనిచేశారు. ఆ తర్వాత అక్కడినుంచి వేరే చోటుకి వచ్చి, ఒక డెంటల్ క్లినిక్ లో ఉద్యోగం చేస్తున్నారు. సౌదీలో ఉద్యోగం చేయాలంటే, సౌదీ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సర్టిఫికెట్ ని మళ్ళీ మూడేళ్ళకి రెన్యువల్ చేయించుకోవాలి. ఇప్పుడు లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల నుంచి మావారు సౌదీ కమ్యూనిటీకి వెళ్లి సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు, "మేము రెన్యువల్ చేయము, నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లో కేవలం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు మీరు క్లినిక్ లో వర్క్ చేస్తున్నారు" అని చెప్తున్నారు. చాలామంది డాక్టర్లకి చేశారుకానీ మావారికి చేయలేదు. అప్పుడు మావారు తాను అదివరకు పనిచేసిన కాలేజీకి ఫోన్ చేసి అడిగితే, వాళ్లు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో మావారు నేరుగా కాలేజీ హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. అక్కడ అంతా కొత్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్లు, "మాకు ఏమీ తెలియదు, మేము ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వము" అని చెప్పేశారు. దాంతో మావారు కాలేజీ డీన్ ని సంప్రదించారు. అతను మరుసటిరోజు రమ్మని చెప్పారు. సరేనని మావారు మరుసటిరోజు వెళితే, 5 గంటలు వెయిట్ చేయించి మావారు ఇచ్చిన లెటర్ పై డీన్ 'ఇది నాకు సంబంధించినది కాదు' అని రాసి సంతకం చేశారు. చేసేదిలేక మళ్ళీ మావారు హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. వాళ్ళు మళ్ళీ అదే సమాధానం చెప్పారు. ఆ సమయమంతా మావారు బాబాని స్మరిస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "అన్నదానం చేస్తానని, రెండు కొబ్బరికాయలు కొడతానని బాబాకి మ్రొక్కుకొమ్మ"ని  చెప్పాను. తర్వాత నేను 'మావారు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ పని జరగటం లేద'ని బాధపడి, సెల్ ఫోన్ తీసి, బాబాని ప్రార్థించి, సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్ లో చూశాను. "నీ కోరికకు అతుక్కుపోకు. శ్రీసాయిబాబాని తలుచుకో. నీ పని జరుగుతుంది" అని బాబా సమాధానం వచ్చింది. దాంతో నాకు ధైర్యం వచ్చి, మావారికి ఫోన్ చేసి, "ఇంకోసారి డీన్ ని కలిసి మాట్లాడమ"ని చెప్పాను. నేను "పని పూర్తయ్యేలా అనుగ్రహించమ"ని బాబాకి చెప్పుకున్నాను. వెంటనే మావారు డీన్ ని కలిసి, "హెచ్. ఆర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వట్లేద"ని చెప్పారు. ఆయన "సరే,  నేను వాళ్లకి ఫోన్ చేసి చెప్తాన"ని వెంటనే హెచ్.ఆర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి మాట్లాడారు. దాంతో వాళ్ళు, "ప్రక్రియ మొదలుపెట్టి, రెండురోజుల్లో మీకు సర్టిఫికెట్ పంపుతాము" అని చెప్పారు. చెప్పినట్లుగానే టీచింగ్ & క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మా వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో బాబా దయవల్ల సౌదీ లైసెన్స్ రెన్యువల్ అయింది. అనుకున్నట్లుగా మావారు ఒక వారం సచ్చరిత్ర పారాయణ చేసారు. "బాబా మీకు శతకోటి వందనాలు. నాపై, నా కుటుంబంపై మీ దివ్యప్రేమానుగ్రహాలు సదా ఉండాలని కోరుకుంటున్నాను".


మహామహిమాన్వితమైన సాయి ఊదీ

నా పేరు 'సాయి'. నేను ఒక సాయి భక్తురాలిని.  ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలను చదివి నేను ఎంతగానో సంతోషిస్తుంటాను. 2020, సెప్టెంబర్ 25 రాత్రి ఉన్నట్టుండి మా డాడ్ తుమ్మడం మొదలుపెట్టారు. అవి తగ్గుతూనే దగ్గు మొదలయ్యింది. ఎంతకీ దగ్గు తగ్గలేదు. అలా ఇదివరకెప్పుడూ జరగలేదు. అందువలన నాకెంతో ఆందోళనగా అనిపించి బాబాని తలుచుకుని, "సాయిదేవా! మాకు నీవు తప్ప ఎవ్వరూ లేరు. దయచేసి 'డాడ్' దగ్గడం ఆపేసి, హాయిగా నిద్రపోయేలా చేయి" అని వేడుకుంటూ, నీళ్లలో ఊదీ కలిపి,  ఊదీ మంత్రాన్ని చదివి డాడ్ కివ్వడానికి వెళ్ళాను. డాడ్ 'వద్దు' అన్నారు. నేను మనసులో బాబానే స్మరిస్తూ, "తండ్రి! దయచేసి డాడ్ ఈ నీళ్లు తాగేలా చేయి, తన పరిస్థితి మెరుగుపడేలా చేయి" అని వేడుకున్నాను. కాసేపటికి డాడ్ ఒప్పుకుని, నీళ్లు తాగారు. పదినిమిషాల్లో దగ్గు ఆగిపోయి, హాయిగా నిద్రపోయారు. మహామహిమాన్వితమైన సాయి ఊదీ వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా బాబా ఎన్నో రకాలుగా నన్ను అనుగ్రహిస్తూ, "నేను నీతోనే ఉన్నాను" అని తెలియజేస్తూ ఉన్నారు. "సాయిదేవా! నీ ఆశీర్వాదం ఎప్పుడూ నీ బిడ్డలమైన మా అందరిమీద ఉండాలి. నా భయాలు, బాధలు, భారం అంతా నీ పాదాల చెంత విడుస్తున్నాను. నాకు నీవు తప్ప ఇంకో దిక్కులేదు. ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండేలా అనుగ్రహించు".

సాయి శరణం.



7 comments:

  1. please baba cure my depression.baba please bless with positive thinking.be with me.

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba ma pyna daya chupinchaya ma korikalani tirchu thandri

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo