సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - కులాల కుళ్ళు – మతాల మళ్ళు! మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!



కులాల కుళ్ళు – మతాల మళ్ళు! 
మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!

మానవునిలోని పశు సంస్కారాలను సంస్కరించి, మానవత్వాన్ని మేల్కొలిపి, క్రమంగా దైవస్వరూపునిగా రూపొందించడమే మతం యొక్క ముఖ్య ప్రయోజనం. వివిధ దేశకాలాలలో ప్రభవించిన సద్గురుమూర్తులు ప్రవక్తలు పై ప్రయోజనాన్ని సాధించడానికి ఆయా దేశకాలాలలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల కనుగుణమైన ధర్మాలను విధివిధానాలను ఆచారవ్యవహారాలను ఏర్పరచారు. కానీ, కాలక్రమంలో మతానికి-మతానికి మనిషికి-మనిషికి మధ్య ‘అడ్డుగోడలు’ కల్పించి, మత విద్వేషాగ్నిని రగుల్కొల్పి, మానవత్వపు మనుగడకే జీవకఱ్ఱయైన మతాన్ని ఆ మతవిద్వేషాగ్నిలో సమిధలుగా చేసింది – మానవునిలోని అజ్ఞానం స్వార్థం. పర్యవసానం?... ఈనాడు మనం చూస్తున్న మతకల్లోలాలు, కరుడుకట్టిన మతమౌఢ్యం, పాశవిక హింసావాదం, వీటన్నింటి వెనుక మంట గలుస్తున్న కనీసపు మానవతా విలువలు! మానవునిలోని సమతను మమతను పెంపొందించి, మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమయిన మతమే, తద్విరుద్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు సాధనం కావడమే నిజమైన ధర్మగ్లాని! అంటే, ధర్మానికి పట్టిన జబ్బు! సమాజంలో ఈ ‘ధర్మగ్లాని’ ముదిరి శృతిమించి రాగాన (౼రోగాన౼) పడే సమయంలో మానవాళికి సన్మార్గాన్ని చూపటానికి అవతార పురుషులుదయిస్తారు. పైన ప్రస్తావించిన ధర్మగ్లానిని మాన్పి ‘లక్షలాదిమందిని’ శుభ్రమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు శ్రీసాయిబాబా.

శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి మొదలైన మహాత్ములు సర్వమతాల సారం ఒక్కటేనని, అన్ని భేదాలకతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమసత్యమని బోధించినా వారు ‘జన్మతః’ ఒక మతానికి చెందినవారని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ములు ఏ మతానికి చెందారో, ఆ మతానుయాయులు కూడా, వారి దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు, అంతటివారు ‘మా మతానికి’ చెందినవారని చాటుకుని ‘గర్వించడానికి’ మాత్రమే ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం.

అందుకే, శ్రీసాయి తమ జన్మవివరాలను ఒక ‘దేవరహస్యంగా’ వుంచారు. బాబా హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిం! సర్వమతాలలోని శ్రేష్ఠలక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి. ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే, వివిధమతాల ఛాందసవాదులు కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా ఆయనను ‘తనవాడిగా’ అనుకొనేంత కనిపిస్తుంది. ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం. మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను స్వార్థపరత్వాన్ని తమ జ్ఞానాగ్ని అనే ‘ధుని’ లో భస్మంచేసి, దానికి ఫలమైన మహిమాన్వితమైన ‘ఊదీ’ ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీసాయి. శ్రీసాయిలోని యీ అద్భుతతత్త్వాన్నే “గురుదేవ గురుదేవ దత్తావధూతా” అనే ఆరతిగీతం ఒకవైపు శ్రీసాయిని దత్తస్వరూపంగా దర్శిస్తూనే, మరోవైపు “మోమిని జన్ముని లోకాతారియలే...” అని కీర్తిస్తున్నది.

శ్రీసాయిబాబా అవతారకార్యంలో ప్రధాన అంశమైన యీ సర్వమతసమరసభావాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయిభక్తులమవలేము. సాయి తమ మతం కబీరు మతమని, కులం దైవమనీ (పర్వర్థిగర్) చెప్పారు. అలాగే శ్రీసాయిభక్తులందరూ తమ మతం (సర్వమతసారమైన) సాయిమతమనీ, కులం సాయికులమనీ సగర్వంగా నిర్ద్వంద్వంగా చెప్పుకొనగలగాలి. సాయిమందిరాలను కులమతభేదాలకతీతంగా నిర్వహించగలగాలి. అప్పుడే శ్రీసాయి తమ భౌతిక జీవితపర్యంతం ఆచరించి ఆవిష్కరించిన ఉన్నత ఆదర్శాన్ని కొంతవరకైనా అనుసరించగలిగి, శ్రీసాయికృపకు పాత్రులు కాగలం!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo