"రామో విగ్రహవాన్ ధర్మః" ('రాముడు మూర్తీభవించిన ధర్మము') అన్నాడు వాల్మీకి మహర్షి. ఈ విశేషణంతో శ్రీరామున్నొక్కణ్ణే గాక ఇంకొకర్నికూడా కీర్తించాడాయన! 'ఏష విగ్రహవాన్ ధర్మః' అని విశ్వామిత్ర మహర్షిని సంభావించాడు. విశ్వామిత్రుడు ధర్మవిగ్రహుడు గనుక, ఆయన సచ్చిష్యుడైన శ్రీరాముడూ ధర్మస్వరూపుడయినాడు. రాముని తనతో యజ్ఞరక్షణకు పంపమని అడుగుతూ విశ్వామిత్రుడు, “రాముడు నా గుప్తమయిన రక్షణలో తన స్వతేజస్సుతో దుర్మార్గులయిన రాక్షసులనందరినీ నాశనము చేయ సమర్థుడు. ఈ రామునికి మూడులోకాల్లోనూ ప్రఖ్యాతిగలుగునట్లు నానావిధాలయిన శ్రేయస్సును ఇచ్చెదను” (వాల్మీకి రామాయణము, బాలకాండ, 19-9-10) అని దశరథునికి అభయమిచ్చాడు. ఆ ప్రతిజ్ఞలోని గంభీరతను అర్థం చేసుకోలేక, రాముని యజ్ఞరక్షణకు పంపడానికి వెనుకాడుతున్న దశరథునికి రాజగురువైన వశిష్టుడు, "రాముడు అస్త్రముల యందు సమర్థుడు కానీ కాకపోనీ, విశ్వామిత్రునిచే రక్షింపబడియున్నంత వరకు - అగ్ని హెూత్రునిచే రక్షింపబడుతున్న అమృతం వలె - ఈతనికి రాక్షసులు ఎంత మాత్రం కీడు చేయలేరు. ఈ విశ్వామిత్రుడు ఆకారంనొందిన ధర్మము ..... ఆయన తానే ఆ రాక్షసులనందరినీ సంహరింప సమర్థడయినా, నీ కొడుకుకు మేలు చేయటానికే నిన్ను యాచిస్తున్నాడు ...." అని హితవు చెప్పాడు. సద్గురుమూర్తి అయిన విశ్వామిత్రమహర్షి అనుగ్రహం అవతారమూర్తియైన శ్రీరామునికి రక్షణయై ధర్మసంస్థాపన చేసింది. ఇది “వేదైశ్చసంమితమ్" అని గ్రంథ ప్రారంభంలోనే వాల్మీకి ప్రకటించిన రామాయణంలో అంతర్లీనంగా దర్శనమిచ్చే ఆధ్యాత్మిక రహస్యం!
శ్రీరాముని ప్రతిభకు కర్తయైన విశ్వామిత్ర మహర్షి రామచరితంలో ఎలా 'గుప్తంగా' ద్యోతకమవుతాడో, అలానే శ్రీసాయినాథుని ప్రతిభకు మూలమైన శ్రీసాయిబాబా గురువు కూడా శ్రీసాయిచరిత్రలో నేపథ్యంలోనే దర్శనమిస్తారు. ఈ విషయాన్ని శ్రీసాయి నిర్ద్వంద్వంగా తెలియజెప్పారు కూడా: “నా గురువు నన్నిలా ఆశీర్వదించారు: 'నీవెక్కడున్నా సరే - ఇక్కడగాని, సప్తసముద్రాలకావల గాని - నేనెప్పుడూ నీవెంటనే వుంటాను! తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలనెలా రక్షిస్తుందని చెబుతారో అలానే, నేను నా (మనో) దృష్టి చేతనే నిన్ను కాపాడుతాను!' అని. ఈనాటి నా యీ ప్రతిభకంతకూ కర్తలువారే! ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా!" ఇది అనాదిగ, అనుశ్రుతంగా వస్తున్న ఆధ్యాత్మికసాంప్రదాయం; ఆదర్శం కూడా!
'గృహస్థ మాశ్రిత్యవర్తంతే సర్వాశ్రమా'. గృహస్థుని ఆశ్రయించుకొని మిగిలిన మూడు - బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలు - వుంటాయి. ఎందుకని? "యస్మాత్రయోప్తాశ్రమిణో జ్ఞానేనానేన చాన్యహం, గృహస్తేనైవధార్యంతే" (మనుస్మృతి); అంటే, 'గృహస్థు తక్కిన మూడు ఆశ్రమాల వారిని అన్నపానీయాలిచ్చి ప్రతిదినమూ పోషిస్తున్నాడు గనుక!" అందుకనే అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం శ్రేష్ఠమని చెప్పబడింది. కాని, గృహస్థు తన ధర్మాన్ని సక్రమంగా ఆదర్శవంతంగా ఆచరించగలిగే స్ఫూర్తిని బలాన్ని మిగిలిన మూడు ఆశ్రమాలు ఇస్తాయి. సమాజానికి ధర్మాచరణను నిర్దేశించి హితవు చేస్తున్నందునే తక్కిన మూడు ఆశ్రమాలను పోషించాల్సిన బాధ్యత గృహస్థుకుంది. గృహస్థాశ్రమం జీవులకు ఆహారాన్నందించే పంటచేను వంటిదైతే, ఆచార్యులు, ఋషిగణమూ ఆ చేనును రక్షించే కంచెవంటివారన్నమాట. కంచె బలహీనమయితే పంట నాశనమవుతుంది. అందుకనే యతిరూపధారి అయిన శ్రీసాయి అవతారకార్యంలో అసలైన ఆధ్యాత్మిక సత్సాంప్రదాయ రక్షణ, సద్గురు సంప్రదాయ స్థాపన అత్యంత ముఖ్యాంశాలుగా దర్శనమిస్తాయి.
శ్రీసాయి ఇటు హిందూ సాంప్రదాయంలోని సాధు ధర్మాచరణను, అటు ముస్లిం సాంప్రదాయంలోని ఫకీరు ధర్మాలను సంతరించుకొని ప్రకటమయ్యారు. సన్యాసి తన పూర్వాశ్రమ నామాన్ని, వివరాలను వెల్లడి చేయరాదని సత్సంప్రదాయం. "విద్వాన్ స్వదేశ ముత్స్యజ్య సంన్యాసానంతరం స్వతః కారాగార వినుర్ముక్తచోరవత్ దూరతో వసేత్” ('పరివ్రాజకుడైన విద్వాంసుడు తనకు పరిచయం గల ప్రదేశాన్ని త్యజించి ఖైదునుండి విడుదలైన దొంగవలె దూరంగా వెళ్ళి నివసించును') అని శృతి చెప్పినట్లు, శ్రీసాయికూడా తన ఊరుకానీ పేరుకానీ పుట్టుపూర్వోత్తరాలు కానీ ఎన్నడూ ఎవ్వరికీ వెల్లడి చెయ్యలేదు. హిందూ ముస్లిం సాంప్రదాయాల మేలు కలయికగ భావింపబడే సూఫీ సంప్రదాయంలోని ఫకీర్లను, 'సాయ్' అని పిలిచే ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ననుసరించి ప్రజలే ఆయన్ను 'సాయి' అని పిలిచారు. బాబా పలికారు! ఇక, శ్రీసాయి జన్మవృత్తాంతాన్ని గూర్చి 'ప్రచారం'లో వున్న కథనాలన్నీ కేవలం ఆయా కథకుల స్వకపోల కల్పితాలు, నిరాధారాలు!
శ్రీసాయి ప్రథమంగా రమారమి 1870-75 మధ్యకాలంలో సుమారు ఇరవై ఏళ్ళ యువకునిగా శిరిడీ గ్రామం బయటనున్న వేపచెట్టు పరిసరాలలో సంచరిస్తూ కనిపించారు. అప్పుడాయన పద్ధతి:
అనరగ్ని రనికేతస్స్యా గ్రామ మన్నార్థమాశ్రయేత్!
ఉపేక్షకో సంకుసుకో మునిర్భావసమాహితః||
కపాలం వృక్షమూలాని కుచేలమసహయతా!
సమతాచైవ సర్వస్మిన్నేన్ముక్తస్య లక్షణమ్||
('తన కోసం వంట, తనకంటూ ఇల్లు లేక, దేహముపట్ల, విషయాలపట్ల ఉపేక్ష కలవాడై, ఆహారము కొరకు మాత్రమే గ్రామములోనికి అడుగుపెడుతూ, ఎప్పుడూ మౌనియై బ్రహ్మధ్యానమునందు తన్మయుడై వుంటాడు. భిక్షకై మట్టిమూకుడు, నివాసానికి చెట్లనీడ, చింకిబొంతలే దుస్తులు, అన్నింటియందును సమత్వబుద్ధి, - ఇవి ముక్తుడయిన యతి యొక్క లక్షణములు') - అన్న స్మృతి వాక్యాన్ని గుర్తుకు తెస్తుంది. పగలు రాత్రి అని లేక ఆ వేపచెట్టుక్రింద ఏకాంతంగా గడిపేవారు. తనకు తానై ఎవ్వరితోనూ మాట్లాడేవారు కారు. 'మితభాషణం మౌనం' అన్నట్లు ఒకవేళ మాట్లాడినా, ఒకటి రెండు మాటల్లోనే! ఆయన దివ్య వర్ఛస్సు, సాధు పద్ధతిని గమనించి, సాధు సేవలో అనురక్తి కలిగిన గ్రామస్థులెవ్వరైనా భిక్షపెడితే స్వీకరించేవారు. గ్రామస్థుల వత్తిడిపై ఆ వేపచెట్టు ప్రక్కనే వున్న ఒక శిథిలమైన మసీదులోకి తన 'నివాసాన్ని' మార్చారు. సర్పం తనకంటూ ఒక నివాసాన్ని నిర్మించుకోక చీమలు పెట్టి వదలిన పుట్టలను ఎలా ఆశ్రయించి వుంటుందో, అలానే సాధువు కూడా తనకంటూ ఆశ్రమాన్ని, నివాసాన్ని ఏర్పరచుకోరాదని శాస్త్రం. ప్రజలు విసర్జించిన గృహాల్లోనూ దేవమందిరాల్లోనూ చెట్లక్రింద మాత్రమే యతి తల దాచుకోవాలని విధి. శ్రీసాయి తన దేహయాత్రనంతటిని అలా 'అనికేతుడు' గానే సాగించారు.
'గ్రామమన్నార్ధ మాశ్రయేత్' అని చెప్పినట్లు, భిక్షకొరకు మాత్రమే శిరిడీ గ్రామంలోకి వెళ్ళేవారు. యతి ఎవరింట్లోనూ భోజనం చెయ్యరాదని నియమం. శ్రీసాయి ఎప్పుడూ ఎవ్వరింట్లోను అడుగు పెట్టలేదు. “నప్రసజ్జేత విస్తరే" అన్నట్లు విస్తారంగా భిక్షకోసం వెళ్ళేవారు కాదు. ఐదిండ్లకడనే భిక్ష చేసేవారు. ఐదిండ్లు మాత్రం ఎందుకు? ఒక ఇంటి భిక్షతోనే తృప్తి పడవచ్చుకదా? అంటే, 'బైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాదీ భవేద్యతీ' (ప్రతిరోజు యతి పెక్కు ఇండ్లకు వెళ్ళి తెచ్చుకున్న అన్నమునే తినవలెను; ఒక్క ఇంటి అన్నమును తినరాదు) - అని ఏకాన్న భోజనానికున్న స్మృతి నిషేధం స్మృతికి వస్తుంది. తేనెటీగ ఎలాగయితే ఒకే పుష్పం నుండి గాక అనేక పుష్పాలనుండి మధువును సంగ్రహిస్తుందో, అలాగే పరివ్రాజకుడు అనేక ఇండ్లవద్ద నుండి భిక్షను స్వీకరించాలి. అందుకే భిక్షను 'మధూకరమ'ని అంటారు. ముందుగా నిర్ణయింపబడ్డ సమయానికి 'ఫలానా' స్వాములవారు, శిష్యసమేతంగా, అట్టహాసంతో భక్తుని ఇంటి ముందు వాహనం దిగి, పూర్ణకుంభంతో ఇచ్చిన స్వాగతాన్నందుకొని, పాదపూజ మొదలైన తంతు ముగిసిన తరువాత పంచభక్ష్యపరమాన్నాలతో విందుగుడిచి, 'దక్షిణ' స్వీకరించి, సందర్భానుసారం ఏదో మంత్రాన్ని భక్తుని చెవిలో అనుగ్రహించి వెళ్ళే - 'భ్రష్ట భిక్ష' కాదు బాబా ఆచరించినది! ఆ బాపతు 'భిక్ష'ను “అభిపూజిత లాభాంస్తుజుగుప్సేతైవ సర్వశః| అభిపూజిత లాభైశ్చ యతిర్ముక్త్యోపి బధ్యతే" ('తనను గౌరవించి ఇచ్చిన భిక్షాదులను యతి ఎల్లప్పుడు స్వీకరించరాదు! అట్టి భిక్షాదులవల్ల ఆ యతి ముక్తుడయినా బంధంలో చిక్కుకుంటున్నాడు') అని స్మృతి తీవ్రనిరసనాపూర్వకంగా హెచ్చరిస్తున్నది.
“భవత్పూర్వం చెరేద్వైక్ష" అని శాస్త్రం. "భవతి భిక్షాందేహి..." అంటూ భవశ్శబ్దాన్ని నిస్సంకోచంగా చెప్తూ గుమ్మం ముందు నిలచి భిక్షను యాచించవలె. శ్రీసాయి ఇంటి గుమ్మం ముందు నిలుచుని (మరాఠీభాషలో) “ఆబాదే ఆబాద్ ... రోటీలావ్" అని భిక్ష అడిగేవారు. లభించిన భిక్షను మసీదులోని ధుని (అగ్ని)లో కొంత వేసి, తక్కినది ఓ మూల వుంచేవారు. కుక్కలు, పిల్లులు తదితర జీవులు తమ ముట్టెలతో గెలికి తినేవి. వాటిని ఎన్నడూ తరిమేవారు కారాయన. తమ భోజన సమయం కాగానే, అలా ఆ జీవులు తిని వదిలేసిన ఆ ఆహారాన్నే భుజించేవారు. ఆయన ఖ్యాతి నలుమూలలా వ్యాపించి, వేల సంఖ్యలో భక్తులు తమ దర్శనార్థం వచ్చి ఖరీదయిన వంటకాలను బాబాకు నివేదించేవారు. ఆ పదార్థాలనన్నింటిని పేదసాదలకు, భక్తులకు పెట్టి తాను మాత్రం స్వయంగా తెచ్చుకున్న భిక్షాన్నాన్నే అమృతప్రాయంగా తినేవారు. ఇది చూస్తే - “భిక్షాహారీ నిరాహారీ భిక్షనైనా ప్రతిగ్రహః| అసంతోవాపి సంతోవసోమసానం దినేదినే" ('భిక్షాహారాన్ని మాత్రమే భుజించేవాడు నిరాహారి అని అనబడతాడు. భిక్షను అడగడంవల్ల ప్రతిగ్రహ దోషం అంటదు. సజ్జనుడినుండైనా, దుర్జనుడినుండైనా ఎవడు భిక్షను యాచించి భుజిస్తాడో వాడు ప్రతిదినమూ అమృతపానము చేసిన వాడగుచున్నాడు!') అనే శాస్త్రవాక్యం గుర్తుకు రాకమానదు.
ఇంతవరకు చేసిన, శ్రీసాయిచర్యలకు - శాస్త్రవాక్యాలకు గల సారూప్య విషయక చర్చ యొక్క సారాంశం, బాబా శాస్త్రనియమాలను తెలిసికొని, వాటిని విధిగా పూనికతో ఆచరించారని కాదు! నిజానికి శ్రీసాయిబాబా వంటి మహాత్ముల ఆచరణ - బోధనలే శాస్త్రాలకు ఆధారము ప్రమాణమూ కూడా!
“ఆధారశ్చైవ సాధునామ్మ"ని మనుస్మృతి. నిజానికి, ఆత్మజ్ఞానానంద పరవశులైన మహాత్ముల అనుభూతుల స్మృతులే మానవాళికందిన మహిత శ్రుతులు; వారి చర్యలే మానవధర్మశాస్త్రాలకు ఆధారస్మృతులు. తరచిచూస్తే, సకల శ్రుతిస్మృతిపురాణేతిహాసాల సారం - శ్రీ సాయిబాబా వంటి మహాత్ముల సచ్చరితల సారమే కదా!
Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
om sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏