సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 572వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:
  1. తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా
  2. సాయికృపతో నార్మల్‌గా వచ్చిన రిపోర్ట్స్
  3. బాబా కృపతో కోలుకున్న నాన్న

తల్లిలా బాధనుండి విముక్తి కలిగించి విశ్వాసాన్ని ప్రసాదించిన బాబా


కాకినాడ నుండి సాయిభక్తురాలు విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః.

ఈ బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయ. మాది కాకినాడ. సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకునే ఇలాంటి బ్లాగ్ ఒకటుందని నాకు ఈమధ్యనే మా చెల్లి ద్వారా తెలిసింది. “‘ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాకు చెప్పుకుంటే మన సమస్య తీరుతుంది” అని తనే నాకు చెప్పింది. అప్పటినుంచి ఈ బ్లాగును చదవడం మొదలుపెట్టాను. చదివినకొద్దీ చదవాలనే ఆరాటం ఇంకా ఇంకా ఎక్కువైంది. “అయినా బ్లాగులో పంచుకుంటే సమస్య ఎలా తీరుతుంది? బాబాకు ఇలాంటివేమీ అక్కర్లేదు. ఆయన పరమ వైరాగ్యమూర్తి” అని అనిపించింది. మళ్ళీ అంతలోనే, “ఇంతమందికి ఇన్ని అనుభవాలు జరుగుతున్నాయి కదా, అది నిజమేనేమో!” అనిపించింది. కానీ స్వానుభవం ఉంటేనే కదా మనకి పూర్తి విశ్వాసం కలిగేది! నాకూ అలాంటి అనుభవమే కలిగింది. అదే మీతో పంచుకోబోతున్నాను.

నా వయస్సు 53 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం నాకు ఫిస్టులా ఆపరేషన్ జరిగింది. ఇప్పటివరకు నాకు దానివల్ల ఎటువంటి నొప్పీ కలగలేదు. కానీ ఈమధ్యన మళ్లీ నొప్పి మొదలైంది. రోజురోజుకీ నొప్పి తీవ్రమై బాధ భరించలేకపోయాను. దానివల్ల నేను కూర్చోలేను, వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్లో చూసి, ఇది మళ్లీ తిరగబెడుతుందని, కొంతమందికి రెండు లేదా మూడుసార్లు ఆపరేషన్ జరిగిందని తెలుసుకున్నాను. దాంతో నాకు చాలా భయం వేసింది. అసలే కరోనాతో లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయం. ఇలాంటి పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లడం, డాక్టరుకి చూపించుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం చాలా కష్టం. అప్పుడే మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆసుపత్రికి వెళ్లకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా మీ అనుగ్రహంతో నాకు ఈ నొప్పి తగ్గిపోవాలి. అలా నా నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. తరువాత ఫేస్‌బుక్‌లో చూస్తే 'సాయి వచనాలు'లో, “నా చరిత్ర పఠనం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు, నీకు నయమగును” అనే బాబా సందేశం కనిపించింది. బాబా సూచించినట్లే చేశాను. ఇంకా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాను. బాబా అనుగ్రహంతో ప్రస్తుతం చాలావరకూ నొప్పి తగ్గిపోయింది. ఇంకా లోపల కొద్దిగా ఏమైనా ఉందేమో తెలీదు. ఆ సాయినాథుని దయవలన 100% పూర్తిగా తగ్గిపోతుంది. బాబా తమ కటాక్షాన్ని నాపై పూర్తిగా చూపించారు. కానీ ఆయన ఆ మహిమను తనపై వేసుకోరు. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కూడా తన ఉనికిని మనకు తెలియనివ్వరు. మనమే ఆయన అనుగ్రహాన్ని అనుభూతి చెందవలసి ఉంటుంది. మనం ఆయనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని అంతగా పెంచుకోవాలి. “సాయీ! మీరు తల్లిలా నన్ను కాపాడి ఇంతటి బాధనుండి విముక్తి కలిగించారు. చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు బాబా!” నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నందుకు, మీ (సాయి) కుటుంబంలో ఒకదాన్ని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.


సాయికృపతో నార్మల్‌గా వచ్చిన రిపోర్ట్స్

ఓం సాయిరాం! సాయిబంధువులకు నమస్కారం. నా పేరు చంద్రకాంత్. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా రక్తపరీక్ష రిపోర్టులు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని సాయికి చెప్పుకున్నాను. ఆ అనుభవాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను ఈమధ్య రక్తపరీక్షలు చేయించుకుంటే రిపోర్టులు అసాధారణంగా వచ్చాయి. దాంతో నాకు చాలా భయమేసింది. బాబాని తలచుకొని క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైటులో చూస్తే, "అంతా బాగానే ఉంటుంది" అని బాబా సమాధానమిచ్చారు. అప్పుడు బాబా మీద నమ్మకంతో స్కానింగ్ చేయించుకుంటే రిపోర్టు నార్మల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాను. బాబా దయవలన ఈసారి రిపోర్టులు నార్మల్ వచ్చాయి. సాయిని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన మనల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. మనకి కావాల్సింది ఆయన యందు పూర్ణమైన భక్తి మాత్రమే.

బాబా కృపతో కోలుకున్న నాన్న

సాయిభక్తురాలు శ్రీమతి లలిత తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! నేను ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మా నాన్నగారి అనుభవాన్ని పంచుకుంటాను. 2020, సెప్టెంబరు 13న మా నాన్న ఒక యక్సిడెంట్‌కి గురయ్యారు. నాన్నకి చాలా ఆయాసం ఉండటంతో పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని డాక్టర్ చెప్పారు. నేను బాబా మీద నమ్మకముంచి, "బాబా! నాన్న ఆరోగ్యం కుదుటపడేలా చూడండి. మీ దయతో నాన్న కోలుకుంటే ఈ అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా ఎంతో కృప చూపించారు. ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగుంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ ఇలాగే మాపై మీ అనుగ్రహాన్ని చూపించండి".


7 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అత్యంత ఆవశ్యకమైన సాయం అవసరమయిన ఈ సమయంలో బాబా మహత్తు తెలియాలి.నా జీవితం మొత్తం సాయి సేవా ,ప్రచారం కోసం సమర్పిస్తాను...నీ మహాత్మ్యం తో దేవుడున్నాడు అని దిక్కులు పిక్కటిల్లెలా అరచి చెప్పేలా చెయ్యి ..సమర్ధ సాయీ ! సమయమయ్యింది ఈ నా వ్యధని వధించి ..నీ మార్గంలో తొలి అడుగు వేయుటకు ..

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo