సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయినాథోపాసనకు ... సాటి మరేది?



సాయినాథోపాసనకు ... సాటి మరేది?

“ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనమ్”. 'ఉపాసకుల సౌకర్యం కోసమే ఆ పరబ్రహ్మతత్త్వానికి రూపకల్పన చేయబడింది' అని శాస్త్రం. ఎలా రూపకల్పన చేయబడింది? “ఆనందం బ్రహ్మణోరూపం”, కనుక, ‘ఆనంద స్వరూపంగా’, అని పరశురామ కల్పం మొదలయిన శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి.

“నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు!” అన్నారు శ్రీసాయి. ఆనందస్వరూపంగా ధ్యానించడమంటే, తన స్వస్వరూపాన్ని ధ్యానించడమే. అందరికీ ఇలా ధ్యానించగలిగే పరిపాకం, సామర్థ్యం ఉండదు. అందుకే తనను ఆనందస్వరూపంగా ధ్యానించమన్న బాబా, ఆ వెంటనే, “అది నీకు సాధ్యపడకపోతే, రోజూ చూసే నా యీ రూపాన్ని ధ్యానించు” అని కూడా అన్నారు.

“అక్షరావగమ లబ్ధయేయథా స్థూల వర్తుల దృషత్పరిగ్రహః|
శుద్ధబుద్ధ పరిలబ్ధయే తథా దారుమృణ్మయశిలామయూర్చనం||”

అని శాస్త్రం. అంటే, 'అక్షరజ్ఞానం కలిగించడానికై చిన్నపిల్లలకు చిన్నవీ పెద్దవీ గుండ్రనివీయైన రాళ్ళను చెక్కి చూపించేమాదిరిగానే, నిత్యము శుద్ధము, బుద్ధము ఐన పరమాత్మజ్ఞానం కలిగించేందుకు కొయ్య మట్టి రాయి మొదలైన వాటితో విగ్రహాలు చేసి పూజిస్తున్నారు' - అని. వ్యక్తిగతమైన కోరికలతో పూజించేవారు సగుణోపాసన చెయ్యాలిగానీ, నిష్కాముడైన సాధకునికి మూర్తిపూజ నిషేధమని కొందరు అనుకోవడం కద్దు! ఈ అభిప్రాయాన్ని కూడా మన పెద్దలు నిష్కర్షగా త్రోసిపుచ్చారు!

“సకామా సగుణోపాస్తిః నృణాం భోగాయ కల్పతే|
నిష్కామా చిత్త శుద్ధర్థే ఇతి శాస్త్రస్య నిశ్చయః||”

(- కోరికలు గలవారి భోగార్థమే సగుణోపాసన కల్పన చేయబడింది; నిష్కాములు కూడా చిత్తశుద్ధికోసం సగుణోపాసన చేయవలె; ఇది శాస్త్ర  నిశ్చయము!')

బాబా తాము స్వయంగా ఎన్నడూ విగ్రహారాధన చెయ్యకపోయినా, విగ్రహపూజను ఎన్నడూ నిరసించలేదు. సరికదా, ఎన్నో సందర్భాలలో ప్రోత్సహించారు కూడా! “మూర్తిపూజ మంచిదే! దానివల్ల ఏకాగ్రత కుదురుతుంది. అయినా బొమ్మ కూడా దైవమే కదా"! అన్నారు బాబా. సర్వాన్నీ భగవత్స్వరూపంగా దర్శించిన బాబాకు బొమ్మలు మాత్రం దైవం కాకుండా పోతాయా? అయితే కేవలం బొమ్మలే దైవం అని మనం భ్రమించరాదు.
 
{ఇక్కడ ఇంకో విశేషమేమంటే, బాబా చెప్పిన యీ మాట దేవాలయాలలో పూజావిధులను వివరించే ప్రమాణగ్రంథాలైన ఆగమశాస్త్రాల యొక్క – ముఖ్యంగా వైఖానస ఆగమాల – మౌళిక సిద్ధాంతం! ఈ ఆగమమతాన్ననుసరించి, ఉపాసకుడు అర్చించే దేవతావిగ్రహం దైవానికి లేదా దేవతాతత్త్వానికి ప్రతీక కాదు! విగ్రహం సాక్షాత్తూ దైవమే! ఉపాసకుడు అర్చించేది దేవత యొక్క ప్రతిమను కాదు; ఆ దేవత యొక్క ‘అర్చావతారాన్ని’! ‘అర్చ’మంటే విగ్రహము, మూర్తి అని అర్థం. దైవం విగ్రహం రూపంలో అవతరించడమే ‘అర్చావతారం’. ఆ భావనతో విగ్రహాన్ని (దైవాన్ని) పూజించడమే ‘అర్చన’. ఆ అర్చన విధులలో శిక్షణ పొంది, సశాస్త్రీయంగా అర్చన చేయగల అర్హత గల ఉపాసకుడు  ‘అర్చకుడు’.}

“న దేవో విద్యతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే|
భావేతు విద్యతే దేవః తస్మాద్భావోహి కారణమ్||”

('కొయ్యలోను, రాతియందు, మట్టిలోను దేవుడు లేడు! భావమునందే దైవమున్నాడు. దానికి భావనయే కారణమై వున్నది.')

ఉపాసనకు భావనే బలం. భావనాబలం లేక ఉపాసన ఫలించదు. శివుడు, విష్ణువు, దేవి, గణపతి, కుమారస్వామి మొదలైన దేవతామూర్తులన్నీ ఉపాసకుల కార్యార్థం కల్పించబడినవే. ఆ ఉపాసనామూర్తులకు బలం ఉపాసకుని భావనే! అంతటా నిండియున్న ఆ పరబ్రహ్మస్వరూపం ఉపాసకుడు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో – ఉపాసకుని భావనా బలాన్ని బట్టి సాక్షాత్కరించటం జరుగుతుంది. ఇది దేవతోపాసనలోని కీలకం.

ఈ విధమైన దేవతోపాసనకు, శ్రీసాయిబాబా వంటి సద్గురుమూర్తి యొక్క ఉపాసనకు ఒక భేదముంది. బాబాను ఉపాసించేటప్పుడు భక్తుని భావనకు బాబాయే బలం! ఉపనిషదాది వివిధశాస్త్రాలలో వర్ణింపబడ్డ పరబ్రహ్మతత్త్వానికి శ్రీసాయిబాబా జీవితం, ఆయన లీలలు, బోధనలు ‘సజీవ వ్యాఖ్యానాలు’. ఎక్కడ ఎవరేమి చేస్తున్నా ఏమి జరుగుతున్నా తెలిసే ‘ఎఱుక’లో వుండి, అది ఆయా భక్తులకు (సందర్భావసరాలనుబట్టి) తెలియజేయడం ద్వారా తాను సర్వకర్మసాక్షిననీ, ఏ జీవికి కలిగిన అనుభవమయినా అది తన అనుభవమేనని చెప్పడం ద్వారా సర్వజీవ హృదయాంతరస్థుడు సర్వవ్యాపియనీ, భక్తుడు ఏ కష్టంలో వున్నా తక్షణం సహాయాన్నందించి భక్తరక్షణాపరతంత్రుడనీ, పంచభూతాలను ఆజ్ఞాపించగలిగే దివ్యశక్తిచేత భూతపతి గణపతి యనీ, సకలదేవతా స్వరూపాలు, మహాత్ములు తనకంటే భిన్నం కారని అనుభవపూర్వకంగా తెలియజేయడం ద్వారా, తాము సర్వదేవతా స్వరూపుడనీ, సకల సాధుస్వరూపుడనీ – బాబా అనుక్షణం నిదర్శనాపూర్వకంగా నిరూపించారు. బాబాను ఉపాసించే భక్తులకు ఆయన రూపం చూడగానే లేక స్మరించగానే, ఆయన లీలలు, ఆ లీలల ద్వారా ప్రకటమైన ఆయన విశ్వాత్మస్వరూపం అప్రయత్నంగా అతిసుళువుగా మనసుకొస్తాయి. దీనివల్ల మనలోని భక్తిబావం ఒకవేళ బలహీనంగా వున్నా, బాబా రూపమే మన భక్తి భావనకు బలం కలిగిస్తుంది. అంతేకాకుండా సర్వజీవస్వరూపుడని ఎన్నో విధాల మనస్సుకు హత్తుకొనేట్టు బోధించిన ఆయన లీలలు, 'తన రూపంలో కూడా సాయియే వున్నారు కదా' అనే స్ఫురణను క్రమంగా ఉపాసకునిలో కలిగిస్తుంది. ఆ ‘ఆత్మవిచారం’ క్రమంగా ఆత్మానుసంధానానికి, ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది.

అంతేకాదు, ఎవరే దేవతలను ఉపాసించినా, ఆ పూజలన్నీ తనకే చెందాయని అసంఖ్యాకమైన తమ లీలలద్వారా నిరూపించడమేగాక, ఆయా దేవతోపాసనల ఫలంగా తమ దర్శన అనుగ్రహాలను ప్రసాదించారు బాబా. ఆయా భక్తుల పరిపాకాన్ని బట్టి కొందరికి బాబా ఆయా దేవతామూర్తుల ఉపాసనలో శ్రద్ధను అచంచలం చేస్తే, జస్టిస్ రేగే వంటి మరెందరో భక్తులు దేవతోపాసనతో ప్రారంభించి, సాయినాథోపాసనకు పరిణతి చెందారు.

“అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం|
దేవాన్ దేవ యజో యాంతి మద్భక్తా యాంతి మామపి||”

-అన్నారు సద్గురుమూర్తియైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో. (అంటే, 'అల్పమేధస్సులైన భక్తులకు అల్పదేవతా పూజలవల్ల అల్పఫలాలే లభిస్తాయి. ఇక నన్ను పూజించేవారికి అంతులేని మహాఫలములు కలిగి, చివరికి నన్నే పొందుతున్నారు' అని భావం.)

వివిధ ఉపాసనాదేవతలను పూజించిన వారికి, ఆయా దేవతారూపాలతో తాదాత్మ్యం చెంది, 'సర్వదేవ నమస్కారం సాయినాథం ప్రతిగచ్ఛతి' అన్నట్లు, వారిని అనుగ్రహించారు బాబా. అలాంటప్పుడు వివేకంతో బాబానే ‘అనన్యం'గా పూజించిన వారికి మరెంత ఫలమోకదా!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo