సాయి వచనం:-

- శ్రీబాబూజీ.
Showing posts with label సాయిభక్తి సాధన రహస్యం. Show all posts
Showing posts with label సాయిభక్తి సాధన రహస్యం. Show all posts

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు



సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు

శిరిడీ సందర్శించి అక్కడ శ్రీసాయిబాబా సమాధిమందిరంలో నిత్యం జరిగే నాలుగు ఆరతులలో పాల్గొన్న సాయిభక్తులకు, ఆ తరువాత ఎక్కడ ఆ ఆరతులు వింటున్నా పాడుతున్నా మానసికంగా శిరిడీలో వున్న అనుభూతి కలగడం సామాన్య అనుభవం. శిరిడీయాత్ర చేయని సాయిభక్తులకు కూడా ఆ ఆరతుల బాణీలు వింటుంటే వారి హృదయాలలో అవి ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తాయి. అద్భుతమయిన శ్రీసాయిమహాత్మ్య ప్రాభావం వల్ల బాబా మహాసమాధి చెందిన అచిరకాలంలోనే దేశంలో అసంఖ్యాకంగా సాయి మందిరాలు వెలిసాయి. వాటిలోని చాలా సాయిమందిరాలలో భక్తులు శిరిడీలో మాదిరి నిత్యం నాలుగు ఆరతులు జరుపుకుంటున్నారు. ఎందరో సాయిభక్తులకు శిరిడీ ఆరతులు ‘వేదమంత్రాలవంటివి’. 'శిరిడీ ఆరతులు జరుగని సాయిమందిరాలు అసలు సాయిమందిరాలే కావ'ని మరికొందరి విశ్వాసం. ఏది ఏమైనా శిరిడీ ఆరతులు ఈనాడు సాయిభక్తి సాంప్రదాయంలో ఒక భాగమైనాయి. సాయిసంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్న యీ శిరిడీ ఆరతులు శిరిడీలో ఎలా ప్రారంభమయినాయి? వాటి రచయితలెవరు? ఆ ఆరతుల స్థూలస్వరూపమేమి? అవి వెదజల్లే భావసౌరభాల స్వరూపస్వభావాలేమి? మొదలయిన విషయాలు తెలుసుకోవాలనుకోవడం సాయిభక్తులకు సహజం!

మహారాష్ట్రదేశంలో దైవానికి ఆరతులు చేయడం – దక్షిణాదిన నిత్యదీపారాధన చెయ్యడంలాగా – చాలా సామాన్యమైన ఆరాధన విధి. దైవమందిరాలలోనూ, మహాత్ముల సన్నిధిలోనే గాక, ఇండ్లలో కూడా కుటుంబసభ్యులందరూ కలిసి ఆరతులు చేసే పద్ధతి ఈనాటికీ మనం అక్కడ చూడవచ్చు. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్, సంత్ నామ్ దేవ్, శ్రీతుకారాం మహరాజ్ మొదలయిన పాండురంగభక్తులు ఆవిష్కరించిన యీ (వార్కరీ) సాంప్రదాయం మహారాష్ట్రలో విశేషప్రాచుర్యం పొంది, క్రమేణా సామాన్య ప్రజానీకం యొక్క ఆధ్యాత్మిక జీవనస్రవంతిలో ఒక అంతర్భాగమైంది.

ఈనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులను స్థూలంగా విశ్లేషిస్తే, నాలుగు ఆరతులలోనూ కలిపి ముప్ఫై ఆరతి గీతాలున్నాయి. వాటిలో 14 తుకారాం మహరాజ్ తదితర సంత్ కవులు రచించిన ఆరతిగీతాలు, అభంగాలు. వాటిలో 5 పాటలు శ్రీతుకారాం మహరాజ్, 2 పాటలు శ్రీనామదేవ్ మహరాజ్, 2 పాటలు సంత్ జానాబాయి రచించినవి. మిగిలిన ఐదింటిలో ఒకటి శ్రీరామజనార్దనస్వామి రచించిన జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆరతి కాగా, మరొకటి శ్రీరామేశ్వర్ భట్ రచించిన తుకారాం మహరాజ్ ఆరతి; ఇవిగాక ఒక వేదసూక్తము (మంత్రపుష్పము), రెండు సాంప్రదాయక ప్రార్థనలు ఉన్నాయి. ప్రత్యేకంగా బాబాపై రచింపబడ్డ 16 ఆరతి గీతాలలో 9 పాటలు శ్రీకృష్ణజోగీేశ్వర భీష్మ, 3 పాటలు శ్రీదాసగణు మహరాజ్ రచించగా, శ్రీఉపాసనీమహరాజ్, శ్రీమాధవ అడ్కర్, శ్రీమోహినీరాజ్, శ్రీబి.వి.దేవులు ఒక్కొక్కటి రచించారు. మొత్తం 30 ఆరతిగీతాలలో 25 మరాటీభాషలోను, 3 స్తోత్రాలు సంస్కృతంలోను, 2 పాటలు హిందీలోను వున్నాయి. ఈ విధంగా యీనాడు మనం పాడుకొంటున్న శిరిడీ ఆరతులు వేరువేరు కవులు, వేరువేరు కాలాలలో – సందర్భాలలో, వివిధ భాషలలో రచించిన మధుర భక్తిరసగుళికలు!

          శిరిడీ ఆరతుల్లోని భావసౌందర్యం

సంక్షిప్తంగా ఇదీ, ‘శిరిడీ ఆరతుల’ స్థూలరూపం. ఇక ఆ ‘ఆరతుల’ ప్రాశస్త్యాన్ని, వాటిలో ప్రకటమౌతున్న అద్భుత భావసౌందర్యాన్ని, అర్థగాంభీర్యాన్ని, అవి వెదజల్లుతున్న భక్తిరస భావసౌరభాలను ఆస్వాదించడానికి యత్నిద్దాం!

దేవాలయాలలో సాంప్రదాయక అర్చన విధిననుసరించి జరుపబడే వివిధసేవలలో భాగంగా శిరిడీలోనూ యీ ఆరతులు చెయ్యడం జరుగుతున్నది. శిరిడీలో ప్రతినిత్యం భక్తులు పాడే ఆరతి పాటలను స్థూలంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. కాకడ (ఉదయ) ఆరతి; మధ్యాహ్నఆరతి; సాయంత్ర ఆరతి; శేజ (రాత్రి) ఆరతి.

కాకడ (ఉదయ) ఆరతి

అర్చన విధిలో భగవంతునికి భక్తులు భక్తిపూర్వకంగా చేసే నిత్యసేవలు సుప్రభాత సేవతో ప్రారంభమౌతాయి. సుప్రభాతం చేయడమంటే దైవాన్ని నిద్ర లేపటమన్న మాట! నవవిధ భక్తులలోని దాస్యభక్తి భావానికనుగుణంగా ఇది ఏర్పడింది. ఈ సుప్రభాత సేవే, శిరిడీ ఆరతుల్లోని ‘కాకడ ఆరతి’. కాకడ ఆరతి, స్థూలంగా – శ్రీసాయినాథుణ్ణి నిద్ర మేల్కొల్పడం! కానీ, నిద్ర, స్వప్నము, మెలకువ, ఈ మూడింటికి ఆధారమైన తురియావస్థకు కూడా అతీతుడై, సదా సర్వజీవ హృదయాలలో ‘ఎఱుక’ రూపంలో ప్రకాశిస్తున్న ఆ యోగనాథునికి నిద్రపోవడమన్నది అసలున్నదా? (బాబా మాటల్లోనే చెప్పాలంటే) “కళ్ళు తెరుచుకొని మెలకువగా నిద్రపోగలిగిన” శ్రీసాయిని మనము నిద్రలేపడమేమిటి? నిజానికి, చాలామంది భావిస్తున్నట్లు, కాకడ ఆరతి బాబాకు మేలుకొలుపు సేవ కాదు! అందుకనే కాకడ ఆరతి గీతాల్లో బాబాను నిద్రలేపడమనే భావం కన్నా “భక్తులను ఆపదలనుండి కాపాడడానికి సదా జాగరూకుడై సావధానుడుగ కూర్చునివున్న” (“అహా సుసమయా సియా గురు ఉఠోనియా బైసలే”...) శ్రీసాయిని దర్శించి స్తుతించడమనే భావమే ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఆ సుప్రభాతగీతం బాబాను నిద్రమేల్కొనమని ప్రార్థించదు! “ఓ సద్గురూ! ధ్యాన సమాధినుండి లేచి మమ్ములనుద్ధరించేందుకు మసీదుకు రండి!” (“సమాధి ఉతరోనియా గురుచలా మసీదీ కడే”...) అనే ప్రార్ధిస్తున్నది. అంతేకాదు! 'కాకడ ఆరతి' నిజానికి మేల్కొల్పుపాడుతున్నది బాబాకు కాదు! “ఓ సాధు సజ్జనులారా లేవండి! లేచి మీ హితము చేకూర్చుకొనండి!” (“ఉఠా సాధుసంత సాదా –  ఆపులాలే హిత”) అని భక్తులనే నిద్రలేపుతున్నది. ఏ నిద్రనుండి? మామూలుగ రోజూ మనం పొయ్యే నిద్ర నుండి కాదు! అరిషడ్వర్గాలతో కప్పబడి, ఎఱుకనుండి మరపులోనికి జారిన నిద్ర నుండి! ఆ నిద్ర నుండి మనస్సులను జాగరూకం చేస్తున్నది. ఎలా? “కామ క్రోధాది ప్రవృత్తి గల మనస్సును దీపపు ఒత్తిగా చేసి, వైరాగ్యమనే నేతితో తడిపి, సాయిభక్తి అనే అగ్నితో వెలిగించి” బాబాకు ఆరతి చెయ్యడం ద్వారా ఆత్మతదాకారవృత్తి యనే వెలుగులో సద్గురువు (మన అంతరంగంలో) ప్రకాశిస్తూ దర్శనమిస్తాడని (“కామక్రోధ. ....ప్రకాశ పాడియలా!") ప్రబోధిస్తున్నది. “మాలోని భక్తిభావమే ఆరతి. పంచప్రాణాలతో వెలిగే జీవభావమే కాకడజ్యోతి” అనే భావంతో ఆరతి చెయ్యాలని నిక్కచ్చిగా నిర్దేశిస్తున్నది. అంతేకాదు! ఇంతటి ఉన్నతభావాన్ని హృదయంలో జాగరూకతతో నిలుపుకొని, “ఓ సద్గురూ! నా హృదయమందిరంలో నిలిచి ఈ సమస్త జగత్తూ సద్గురు స్వరూపంగా నాకు భాసించేటట్లు చెయ్యి! ఎప్పుడూ జగత్కళ్యాణ కార్యాలు చెయ్యాలనే సద్బుద్ధిని ప్రసాదించు!” (“గురో వినతి మీకరీ హృదయ మందిరీ యా బసా సమస్త జగ్ హే గురు స్వరూపచీ ఠసో మానసా కరో సతత  సత్కృతీ మతి హిదే జగత్పావనా”) అని సాయిని మనసారా ప్రార్థించి, ఆపై మన నిత్యదైనందిన కార్యాలకు ఉపక్రమించాలి. ఈ ప్రార్థనలో ప్రకటమౌతున్న ఉత్కృష్టభావమే సాయిభక్తులకు పవిత్ర గాయత్రీమంత్రం.

“ఓ సద్గురు సాయిబాబా, ఈ ప్రపంచంలో నీవు తప్ప నాకు ఆశ్రయమిచ్చి రక్షించేవారు లేరు” (“శ్రీసద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయనాహీ భూతలీ...”) అనే ఆరతి గీతం అనన్య శరణాగతికి సోపానమయితే, “నేను నీ మసీదును ఊడ్చే చీపురున”ని (“అపనే మసీద్ కా ఝాడూ గణూహై”) శ్రీదాసగణు పలికిన పలుకుల్లోని భావం దాస్యభక్తి భావానికి పరాకాష్ట. “జయామనీ జైసాభావ తయాతైసానుభావ” అనే ఆరతిపాట 'ఎవరి భావం ఎట్లా వుంటే వారు పొందే అనుభవం కూడా అట్లాగే వుంటుంది' అంటూ, పైన చెప్పిన భావాన్ని హృదయంలో నిలుపుకోకుండా, కేవలం ఐదు ఒత్తుల దీపాన్ని యాంత్రికంగ త్రిప్పుతూ వల్లెవేతగా ఆరతిపాటలు పాడటం వ్యర్థమని కూడా హెచ్చరిస్తున్నది!

మధ్యాహ్న-సాయంత్ర ఆరతులు

“స్థిరమైన మనస్సుతో, గంభీరమైన శ్రీసాయితత్త్వంపై ధ్యానం చేద్దాం!” (“కరూనియా స్థిరమన – పాహు గంభీర హేధ్యాన....”) అంటూ సాయిబంధువులను “లెండి, రండి, రారండి!” (“ఉఠా ఉఠాహో బాన్ ధవ”) అనే ఆహ్వానంతో ప్రబోధిస్తూ ప్రారంభమవుతున్నది యీ ఆరతి. అలా సాయిపాదాల వద్ద చేరిన ‘జడచిత్తులైన’ భక్తులను 'సదా సాయి పాదధూళిలో విశ్రమించేట్లు అనుగ్రహించమని, కామవికారాలను దహింపచేయమని, వారి సర్వస్వం సాయి పదసేవకే సద్వినియోగమయ్యేటట్లు చేసి సన్మార్గంలో నడిపించమ'ని, ‘దేవాధిదేవుడు’, ‘కలియుగ అవతారమూర్తి’, ‘సగుణబ్రహ్మరూపుడు’ అయిన సాయినాథునికి చేసే ప్రార్థన౼ రెండవ ఆరతి గీతం. ఈ ఆరతి గీతం బాబాను సర్వజీవసౌఖ్యప్రదాతగా దర్శిస్తున్నది. అయితే బాబా అనుగ్రహించే సుఖం ఎటువంటిది? సామాన్య సుఖం కాదది! అది తరుగులేని ఆనందరూపమైన – అసలైన ‘సుఖము’ (“నిజసూఖ”). పై గీతం సర్వజీవులకు ఆత్మసౌఖ్యాన్ని ప్రసాదించే శ్రీసాయియొక్క ‘సమర్థ సద్గురు’ తత్త్వాన్ని వర్ణిస్తే, ఆ తరువాత గీతం సామాజికంగా బాబా నిర్వహిస్తున్న ‘కలియుగ అవతార’ కార్యాన్ని వివరిస్తున్నది. తమ ఆదర్శ జీవిత విధానం ద్వారా, అసంఖ్యాకమైన అద్భుత లీలలద్వారా, నాస్తికులను కూడా సాధకులుగా మార్చగలగడమేగాక ('అవతరసే తూయేతా ధర్మాన్ తే గ్లాని, నాస్తికా తావీతూ లావిసి నిజభజనీ, దావిసి నానాలీలా అసంఖ్యారూపాని...'), శ్రీసాయి ప్రధాన అవతార రహస్యాన్ని యీ గీతం ఇలా వర్ణిస్తున్నది: 'బాబా,  నీవు మోమిన్ వంశంలో జన్మించి ముసల్మాను రూపంలో దర్శనమిచ్చి మూఢులను ఉద్ధరిస్తున్నావు. ద్వైతభావము వీడిన నీకు హిందూ-ముస్లిం భేదము లేదు. మానవ రూపంలో అవతరించి, రెండు మతాల వారిని సమానంగా ఆదరించి వారిచే (మతభేదాల కతీతమైన) సర్వవ్యాప్తమయిన ఆత్మతత్త్వాన్ని దర్శింపచేస్తున్నావు!”

అంతేకాదు! "యవనస్వరూపీఏక్యా దర్శన త్వాధిదలే......’, ‘మోమిన వంశి జన్ముని లోక తారియల...’ అంటూ సంకుచిత మతమౌఢ్యంతో, సంకుల కులతత్త్వంతో కుళ్ళిపోతున్న సమాజానికి శ్రీసాయి ప్రసాదించిన ప్రబోధం ఈ కలియుగంలో మానవాళికందిన ‘మహితగీత’. ఈ ఆరతి గీతంలో ఇంకో విశేషమున్నది. హైందవ విధిలో శ్రీసాయి మహిమకు హారతి పాడుతున్న ఈ గీతం బాబాను "మోమినవంశజుడుగ" "యవన(ముస్లిం)స్వరూపి"గా నిష్కపటంగా కీర్తిస్తున్నది! ఇది శ్రీసాయి యొక్క మతాతీత మహావృక్షానికి కాచిన ఒక మధురఫలం! అన్యచింతనలు లేకుండా మనస్సు ఒకే రూపం ధరించడం ఆధ్యాత్మిక సాధనలో (సగుణోపాసనలో) ప్రాధమిక నియమం. సాధన విషయానికొస్తే, సాధకుని ఇష్టదైవం (ఉపాసనాదైవం) తప్ప ఇతర (అన్య) దేవతామూర్తుల చింతన కూడా ఉపాసనకు విక్షేపమే! సాధకునిలో తన ఉపాసనాదైవం పట్ల ఎంతగా ‘అనన్య’ ప్రేమ, భక్తి, శరణాగతి కలుగుతుందో, అంతగా అతడు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించగలడు. శ్రీసాయిని (ఇష్ట) ఉపాసనాదైవంగా ఎంచుకున్న సాయిభక్తులకు శ్రీసాయియే సకల దేవతాస్వరూపుడు, సకల సాధుస్వరూపుడు, సకల ధర్మస్వరూపుడు. వారికి శ్రీసాయియే పరదైవతము. ఈ దృష్ట్యా, ఉపాసనా తత్పరులైన సాయిభక్తులకు – అనన్యదేవతారాధన నిషిద్ధమే! (అయితే- ముక్కోటి దేవతలకు మూడు కోట్ల దణ్ణాలు పెడుతూ, బాబాను కూడా ఆ ముక్కోటి దేవుళ్ళలో ఒకడుగా భావించే (లౌక్య) భక్తులకు ఈ సూత్రం వర్తించదు!) ఈ కారణంగా ఆధ్యాత్మిక సాధన సిద్ధి గమ్యం మొదలయిన వాటిపట్ల ఆసక్తి, దీక్ష గల సాయిభక్తులకు మాత్రం అది ఎప్పటికైనా అనుల్లంఘనీయం. తమ యోగక్షేమాలు సంపూర్ణంగా వహించి తమను సదా కంటికి రెప్పవలె కాపాడే శ్రీసాయివంటి ‘సమర్థుడై’న సద్గురువు లభించాక కూడా సాయిభక్తులు అన్య(అనేక) దేవతారాధనలు  వ్రతాలు అభిషేకాలు గ్రహశాంతులు వాస్తుశాంతులు మొదలయిన వాటికి పూనుకోవడం ప్రోత్సహించడం కేవలం అవివేకం.  ఇది సాయిభక్తి ఉద్యమానికి పట్టిన ‘గ్రహచారం’. శ్రీసాయి చూపిన ‘శుభ్రమార్గ’ విస్తరణకు అపచారం.

అంతేకాక వివిధ దేవతామూర్తుల ఉపాసన ‘సాధన’లో ప్రారంభదశ మాత్రమేనని, ఆ ఉపాసనలన్నీ శ్రీసాయి వంటి సద్గురుమూర్తిని చూపడానికి కేవలం ‘నిమిత్తమాత్రాలని’ మహాత్ములు స్పష్టం చేస్తున్నారు. ఆయా దేవతామూర్తులను ఉపాసించే భక్తులకు వారి ఇష్టదేవతామూర్తుల రూపంలో బాబా వారికి దర్శనమివ్వడంలోని పరమార్థం ఇదే! ఈ ఉపాసనాసూత్రాన్నే రమణీయంగా ఉద్ఘాటిస్తున్నది, “శిరిడీ మాఝే పండరిపూర, సాయిబాబా రమావర.....” అని శ్రీదాసగణు మహరాజ్ రచించిన ఆరతిగీతం. ఈ ఆరతిపాట పై సూత్రాన్ని భక్తిభావయుతంగా చెబితే, శ్రీఉపాసనీమహరాజ్  రచించిన “సదాసత్ స్వరూపం..” అని మొదలయ్యే ‘శ్రీసాయిమహిమ్న స్తోత్రం’ భక్తిజ్ఞానాలనే దీపాల వెలుగులో శ్రీసాయి మహిమకు ఆరతి పడుతున్నది. శ్రీసాయిమహిమ్నస్తోత్రం లోని ‘మనోవాగతీతం మునిర్ ధ్యానగమ్యమ్’, ‘అహంభావహీనం ప్రసన్నాత్మభావం’, ‘మాయయోపహత చిత్తశుద్ధయే’, ‘సంసార జన్య దురితౌఘవినిర్గతాస్తే’, ‘కైవల్య థామపరమం సమవాప్నువంతి’ మొదలయిన శ్రీసాయి శుద్ధజ్ఞాన స్థితిని తెలిపే వాక్యాలు బాబా సద్గురుతత్త్వాన్ని వివరిస్తే, ‘జగత్సంభవ స్థాన సంహారహేతుం’, ‘స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం’, ‘కలౌ సంభవంతం’, ‘అనేకాశ్రుతా తర్క్యలీలా విలాసైః’ ‘భక్తిభద్రప్రదంతం’, ‘అఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రద’ మొదలయిన సిద్ధి వాక్యాలు బాబాలోని సిద్ధత్వాన్ని ఈశ్వరతత్వాన్ని వర్ణిస్తున్నాయి.  శ్రీసాయిని ‘ఉపాసనా దైవతంగా’, భక్తులకు ‘భుక్తి  ముక్తి ప్రదాతగా’ ఈ స్తోత్రం ప్రకటిస్తున్నది. బాబాలోని ఈ జ్ఞానసిద్ధత్వాన్ని అమోఘంగా వర్ణిస్తున్న ఈ స్తోత్రం యొక్క మకుటం ‘నమామీశ్వరం సద్గురుం సాయినాథం’ అన్నది సాయితత్త్వాన్ని వివరించే అన్ని స్తోత్రాలకు, ఆరతులకు మకుటాయమానం. అంతేకాదు! శ్రీఉపాసనీ మహరాజ్ ఆధ్యాత్మిక సాధన అత్యున్నత స్థితిలోనున్నప్పుడ శ్రీసాయి అనుగ్రహవిశేషంగా తన ధ్యాననిష్ఠలో దర్శించి, సాయిభక్తులకు అందించిన మహామంత్రమిది!

భోజనం చేసేముందు, తరువాత, నిద్రపోయేముందు, లేచిన తరువాత, విభూతి ధరించేప్పుడు, జంధ్యం వేసుకొనేటప్పుడు,.. అలా, మనం చేసే అన్ని పనులకు ఏ మంత్రం పఠించాలో, ఏ భావం మనస్సులో ధరించాలో చెప్పే మంత్రాలు తంత్రాలు మనకు కోకొల్లలుగా వున్నాయి.  కాని నమస్కారం చేసేటప్పుడు హృదయగతమైన ఏ ‘భావసూత్రం’ మన రెండు చేతులను నమస్కారంగా కట్టిపడేయాలో చెప్పే స్తోత్రాలు మాత్రం అరుదు. ఆ లోటును ఏ లోటూలేకుండా తీరుస్తున్నది శిరిడీ ఆరతుల్లోని ‘నమస్కారాష్టకం’. ఈ 'అష్టకం' బాబాకు నమస్కారం ఏ భావంతో చెయ్యాలో చెప్పడమే కాదు, మనచే అప్రయత్నంగా చేయిస్తుంది కూడా! అలా మన మనోకరణాలను కట్టి పడేసిన భక్తిభావాన్ని దేహంలోని అణువణువుకూ వ్యాపింపచేసి, తన ఐదు ద్విపదలను మనలోని ఐదుప్రాణాలతో ‘లయింప’చేసి నృత్యం చేయిస్తుంది, “ఐసా యేయీబా! సాయిదిగంబరా!” అన్న ప్రార్థనాగీతం. దైనందిన జీవితంలోని వివిధ సంబంధాల రుసరుసలు, బుసబుసలతో విసిగి వేసారిన మన మనస్సులను సాయంత్రమయ్యేసరికి, శ్రీసాయి ప్రేమామృతధారలతో స్నానం చేయించి ఎవ్వరి యెడల ద్వేషము, దేనియందు కోరిక హృదయంలో లేకుండా, 'సదా సాయినాథుని ధ్యానము జరుగుగాక! సద్గురు పాదములయందు భక్తి స్థిరముగా వుండుగాక! జగమంతా శ్రీసాయిరూపంగా గోచరించుగాక!'  (“కుణాచిహి ఘృణా... దృశ్యబాబా దిశో...") అనే కమ్మని  ‘సంకల్ప’ సంగీతంతో, అనన్య ‘శరణాగతి అనే పట్టుపాన్పుపై’ సేదతీరేట్లు చేస్తుంది – సాయంసంధ్యారతిలోని ‘రుసోమమ’.

శేజ్ ఆరతి

బాబాకు చేసే పవళింపు సేవలో భాగం శేజారతి. బాబా నిద్ర ఎంత అసాధారణమైందో, ఆయన శయ్య (పడక) కూడా అంత అలౌకికమైనదే! 'నవవిధ భక్తులే మెట్లుగా కలిగి, నిశ్చలభక్తి అనే మంచంపైన (భక్తులు అజ్ఞానంలో చేసే అపరాధాలను దయతో క్షమించే) క్షమాగుణమనే చక్కని పరుపుపై' బాబా శయనిస్తారు. ఆ శయ్య 'సద్భావాలనే పువ్వులతో అలంకరించబడి వుంది. బాబా యొక్క శయ్యామందిరంలో జ్ఞానమనే మణిదీపం వెలుగుతున్నది. ఆయన ఏకాంత సమాధికి ఏ మాత్రం భంగం రాకుండా ద్వైతభావమనే ఆ శయ్యా మందిరపు తలుపులు మూసి బిగించబడ్డాయి...'

అలాంటి శయ్యపై, “బాబా, ఇక ఏకాంతంగా చిన్మయమైన స్వసుఖ సమాధిలో నిద్రించండి!” (“ఆతా స్వామీ సుఖేనిద్రా”) అని భక్తులు ప్రార్థిస్తున్నారు. భక్తపాలన కొరకు “ఓ సద్గురూ! ధ్యానసమాధినుండి లేచి మమ్ములనుద్ధరించండి!” (“సమాధి ఉతరోనియాగురు...”) అని ఉదయమే సుప్రభాత గీతమాలపించిన భక్తులు, తాము నిద్రకుపక్రమించబోయే ముందు బాబా అనుజ్ఞఆశీర్వాదప్రసాదాలకై అర్థిస్తూ(“ఆజ్ఞస్తవహా ఆశీప్రసాద...”), తిరిగి బాబాను స్వసుఖసమాధిలో ఏకాంతంగా విశ్రమించమని ప్రార్థిస్తున్నారు! ఆ ప్రార్థన యొక్క ఆర్ద్రతతో మేను వాల్చిన భక్తులకు ‘సాయిస్మరణ’ అనే ‘మరపులేని నిద్ర’ లోనికి సునాయాసంగా జారుకొనేట్లు జోలపాట పాడుతున్నది యీ శేజారతి! ఇక 'ఓవాళూ ఆరతి...' అనే ఆరతి గీతం, ఋగ్వేదంలోని ‘నాసదీ సూక్తం’, ‘పురుషసూక్తం’ లోని కొన్ని ఋక్కుల సారం. ఇప్పటివరకు ‘శిరిడీ ఆరతుల’ లోని భావసౌందర్యాన్ని క్లుప్తంగా మాత్రమే సమీక్షించుకొన్నాం. ఆ (మరాటీ) ఆరతులలోని ప్రతివాక్యానికి క్షుణ్ణంగా అర్థం తెలుసుకొని పరిశీలనతో చింతన చేస్తే, ఇంకా ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక రహస్యాలు మనకు గోచరిస్తాయి.

ఏ సాహిత్యానికైనా భాష దేహంవంటిదైతే, భావం ఆత్మవంటిది. భావరహితమైన (అర్థం తెలియని) శబ్దసముదాయం నిర్జీవ కళేబరం వంటిది. కేవలం యాంత్రికంగా చేసే మంత్రాలు స్తోత్రాలు ఆరతులవల్ల భావప్రకంపనలకు కేంద్రమయిన మన హృదయాలు స్పందించవు. హృదయస్పందన లేని పూజ ఆత్మోన్నతిని కలిగించలేదు. అందుకే “జ్ఞాత్వా కర్మాణి కుర్వీత” అంటే, “చేసే పూజకు, చెప్పే మంత్రానికి అర్థం తెలుసుకొని చెయ్యి!” అని వేదం ఘోషిస్తున్నది.

“మంత్రోహి భావేన యుతో ఫలప్రదః౹
మౌర్వాసు సజ్జీకృత బాణవద్ధృవం౹౹
భావేన హీనస్తు వినిష్ఫలో భవేత్ ౹
కీరస్య వాగీరత రామ శబ్దవత్!!”

“ఏ మంత్రాన్నయినా అర్థం తెలుసుకొని పునఃశ్చరణ చేస్తేగాని ఫలప్రదం కాదు. భావయుతమైనప్పుడు మంత్రం చక్కగా సంధించిన బాణంలా లక్ష్యాన్ని చేరుతుంది. భావహీనమైన మంత్రం నిష్ఫలం. చిలక ఎన్నిసార్లు ‘రామ’ శబ్దాన్ని పలికినా అది వ్యర్థమే కదా?” అని శాస్త్రాలు ఉగ్గడిస్తున్నాయి. మంత్రజపమైనా భావహీనంగా చేస్తే ఫలితం సున్న అని ఆగమాలు నిర్దేశిస్తుండగా, ఇక ఆరతుల వంటి ప్రార్థనాగీతాల విషయం చెప్పాలా? ‘అనే’వాడికి, ‘వినే’వాడికి అర్థం తెలియని శబ్దాడంబరం కేవలం చిలకపలుకుల కంఠశోష; యోగి వేమన మాటల్లో చెప్పాలంటే అవి – వొట్టి ‘వెర్రికూతలు’! హృదయగతమైనపుడే ఏ ప్రార్థనైనా ఫలిస్తుంది. మనం వల్లించే మంత్రాలకు, శ్లోకాలకు, స్తోత్రాలకు, ఆరతిగీతాలకు సరైన అర్థం తెలిసినపుడే అవి మన హృదయాలలో ఆర్ద్రతను కలిగించగలవు. ఆర్ద్రత లేకుంటే అది ప్రార్థనే కాదు!

మొత్తం శిరిడీ ఆరతుల యొక్క సవివరమైన అర్థతాత్పర్యవిశేషాలు శ్రీబాబూజీ రచించిన ‘Arati Sai baba (మూలము-ఆంగ్లానువాదము-వ్యాఖ్యానము) అన్న (ఆంగ్ల) గ్రంథంలో చూడగలరు. ఆసక్తి గల భక్తులకోసం ఆ ఆంగ్ల గ్రంథం యొక్క లింక్ దిగువ ఇవ్వడమైనది.


 ౼ పబ్లిషర్స్.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - కులాల కుళ్ళు – మతాల మళ్ళు! మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!



కులాల కుళ్ళు – మతాల మళ్ళు! 
మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!

మానవునిలోని పశు సంస్కారాలను సంస్కరించి, మానవత్వాన్ని మేల్కొలిపి, క్రమంగా దైవస్వరూపునిగా రూపొందించడమే మతం యొక్క ముఖ్య ప్రయోజనం. వివిధ దేశకాలాలలో ప్రభవించిన సద్గురుమూర్తులు ప్రవక్తలు పై ప్రయోజనాన్ని సాధించడానికి ఆయా దేశకాలాలలోని సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల కనుగుణమైన ధర్మాలను విధివిధానాలను ఆచారవ్యవహారాలను ఏర్పరచారు. కానీ, కాలక్రమంలో మతానికి-మతానికి మనిషికి-మనిషికి మధ్య ‘అడ్డుగోడలు’ కల్పించి, మత విద్వేషాగ్నిని రగుల్కొల్పి, మానవత్వపు మనుగడకే జీవకఱ్ఱయైన మతాన్ని ఆ మతవిద్వేషాగ్నిలో సమిధలుగా చేసింది – మానవునిలోని అజ్ఞానం స్వార్థం. పర్యవసానం?... ఈనాడు మనం చూస్తున్న మతకల్లోలాలు, కరుడుకట్టిన మతమౌఢ్యం, పాశవిక హింసావాదం, వీటన్నింటి వెనుక మంట గలుస్తున్న కనీసపు మానవతా విలువలు! మానవునిలోని సమతను మమతను పెంపొందించి, మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమయిన మతమే, తద్విరుద్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు సాధనం కావడమే నిజమైన ధర్మగ్లాని! అంటే, ధర్మానికి పట్టిన జబ్బు! సమాజంలో ఈ ‘ధర్మగ్లాని’ ముదిరి శృతిమించి రాగాన (౼రోగాన౼) పడే సమయంలో మానవాళికి సన్మార్గాన్ని చూపటానికి అవతార పురుషులుదయిస్తారు. పైన ప్రస్తావించిన ధర్మగ్లానిని మాన్పి ‘లక్షలాదిమందిని’ శుభ్రమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు శ్రీసాయిబాబా.

శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి మొదలైన మహాత్ములు సర్వమతాల సారం ఒక్కటేనని, అన్ని భేదాలకతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమసత్యమని బోధించినా వారు ‘జన్మతః’ ఒక మతానికి చెందినవారని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ములు ఏ మతానికి చెందారో, ఆ మతానుయాయులు కూడా, వారి దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు, అంతటివారు ‘మా మతానికి’ చెందినవారని చాటుకుని ‘గర్వించడానికి’ మాత్రమే ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం.

అందుకే, శ్రీసాయి తమ జన్మవివరాలను ఒక ‘దేవరహస్యంగా’ వుంచారు. బాబా హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిం! సర్వమతాలలోని శ్రేష్ఠలక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి. ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే, వివిధమతాల ఛాందసవాదులు కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా ఆయనను ‘తనవాడిగా’ అనుకొనేంత కనిపిస్తుంది. ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం. మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను స్వార్థపరత్వాన్ని తమ జ్ఞానాగ్ని అనే ‘ధుని’ లో భస్మంచేసి, దానికి ఫలమైన మహిమాన్వితమైన ‘ఊదీ’ ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీసాయి. శ్రీసాయిలోని యీ అద్భుతతత్త్వాన్నే “గురుదేవ గురుదేవ దత్తావధూతా” అనే ఆరతిగీతం ఒకవైపు శ్రీసాయిని దత్తస్వరూపంగా దర్శిస్తూనే, మరోవైపు “మోమిని జన్ముని లోకాతారియలే...” అని కీర్తిస్తున్నది.

శ్రీసాయిబాబా అవతారకార్యంలో ప్రధాన అంశమైన యీ సర్వమతసమరసభావాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయిభక్తులమవలేము. సాయి తమ మతం కబీరు మతమని, కులం దైవమనీ (పర్వర్థిగర్) చెప్పారు. అలాగే శ్రీసాయిభక్తులందరూ తమ మతం (సర్వమతసారమైన) సాయిమతమనీ, కులం సాయికులమనీ సగర్వంగా నిర్ద్వంద్వంగా చెప్పుకొనగలగాలి. సాయిమందిరాలను కులమతభేదాలకతీతంగా నిర్వహించగలగాలి. అప్పుడే శ్రీసాయి తమ భౌతిక జీవితపర్యంతం ఆచరించి ఆవిష్కరించిన ఉన్నత ఆదర్శాన్ని కొంతవరకైనా అనుసరించగలిగి, శ్రీసాయికృపకు పాత్రులు కాగలం!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!



అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!

మౌళికమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నడూ మారవు! కానీ, శాశ్వతము సనాతనము అయిన ఆ ఆధ్యాత్మికసూత్రాల ఆచరణకు ‘సుళువులుగ’ ఆయా దేశకాలపరిస్థితులకు అనుగుణంగా మహాత్ములు యేర్పరచిన ఆచారవ్యవహారాలు మాత్రం కాలక్రమంలో మార్పుచెందక తప్పవు! మన దేహంలో సత్త్వం కోల్పోయిన నిర్జీవకణాలు ఎప్పటికప్పుడు విసర్జింపబడి, వాటి స్థానే క్రొత్త జీవకణాలు తయారవుతూ వున్నట్లు, సమాజమనే దేహంలో ఎప్పుడో యేర్పడిన బాహ్యాచారవ్యవహారాలు కాలగతిలో అర్థరహితము నిర్జీవము అయినప్పుడు, అవతారపురుషులయిన సద్గురుమూర్తులు ఉద్భవించి సమాజంలోని ఆ నిర్జీవ సంప్రదాయాలను తొలగించి, నూతన సాంప్రదాయాలను పాదుగొల్పి, ఆధ్యాత్మికతకు ప్రాణమైన సనాతన ధర్మసూత్రాన్ని కాపాడుతుంటారు. ఇది సృష్టిధర్మం; జీవధర్మం. “సంభవామి యుగే యుగే” అని శ్రీకృష్ణుడు చెప్పింది యీ సృష్టి‘ధర్మ’సూత్రం గూర్చే! కానీ ఆ సద్గురుమూర్తులు సమాజంలో ఆ ‘మార్పులను’ సాధించడానికి ఉద్యమించినప్పుడు, వారి ప్రయత్నాలు ఆయాకాలాలలో సాంప్రదాయవిరుద్ధమైన భ్రష్టాచారాలుగ పరిగణింపబడ్డాయి. అందుకే తాను బోధించేది ‘ఉపనిషత్తుల సారమైన సనాతన ధర్మాన్నే’నని గీతాచార్యుడు మళ్ళీ మళ్ళీ నొక్కివక్కాణించవలసివచ్చింది.

అలాగే, “నేను సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి కాదు వచ్చింది; దాన్ని పరిపూర్ణం చేయడానికే!” (“I come not to destroy the law, but to fulfil it”) అని ఏసుప్రభువు ప్రకటించి, ఆయన సంస్కరణలను ప్రతిఘటించిన ఆనాటి ఛాందసులను శాంతపరచే ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆ యుగపురుషులు తమతమ ‘నూతన’ మార్గాలను ఆవిష్కరించినప్పుడు, అప్పటికి జవసత్త్వాలు కోల్పోయి, కేవలం యాంత్రికంగా మిగిలిన ‘ఆచారవ్యవహారాలు మతధర్మాలే’ సత్యమని మూర్ఖంగా నమ్మిన ఛాందసులనుండి ప్రతిఘటన తప్పలేదు. అప్పట్లో అలాంటి ఛాందసులే బుద్ధభగవానుని ప్రబోధాలను ‘నాస్తిక పాషాండమతం’గా దూషించి ప్రచారం చేసారు. ఆ వెర్రి ఎంతవరకు వెళ్ళిందంటే, బుద్ధుణ్ణి ఒక దొంగగా శ్రీరాముని చేత దూషింపచేసేంత వరకు వెళ్ళింది! వాల్మీకిరామాయణం (అయోధ్యకాండ 110-34)లో శ్రీరాముడు ఇలా అంటాడు: “యథా హి చోరస్య తథాహి బుద్ధః తథాగతం నాస్తిక మత్ర విద్ది!...” అని. అంటే, 'బుద్ధుడు ఒక చోరుడు; ఆ తథాగతుని మతం నాస్తికము, గర్హ్యము'౼ అని రాముడంటున్నాడు! కొంచెం ఆలోచిస్తే, ఎవడో బుద్ధిహీనుడయిన ఛాందస వైదికమతోన్మాది, శ్రీరాముడి తర్వాత ఎంతోకాలానికి బుద్ధుడు జన్మించాడనే విషయం కూడా యోచించక, బౌద్ధమతంపైని ద్వేషంతో యీ శ్లోకం కల్పించి, ‘వాల్మీకి రామాయణం’లో చొప్పించినాడని ఇట్టే స్పష్టమవుతుంది. కానీ, అది ప్రతిఘటనలో ఒక దశ మాత్రమే. బుద్ధుని ప్రబోధాల ప్రచండ ప్రభంజనాన్ని దూషణతో ఎదుర్కొనలేమని గుర్తించిన బుద్ధిమంతులు ఆ తరువాతి కాలంలో బుద్ధుణ్ణి విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా అవతారాల జాబితాలో చేర్చి, ... సరి! అదొక పెద్ద కథ! ఇక ఆ విషయం వదలి బాబా విషయానికొద్దాం!

“ఆమ్ చా ఘరాణె నిరాళా ఆహేత్!” 'మా సాంప్రదాయమే వేరు!' అన్నారు శ్రీసాయిబాబా! వేరంటే, దేన్నుండి వేరు? ఈనాడు ఆధ్యాత్మికత పేరున, సనాతన సంప్రదాయం పేరున చలామణి అవుతున్న మూఢనమ్మకాలు, దురాచారాలు, వ్యర్ధఆచారకాండ మొదలైనవాటి నుండి వేరు! అలాంటి విశిష్ఠమైన ఒక నూతన సంప్రదాయాన్ని ఈ యుగధర్మంగా శ్రీసాయిబాబా ప్రబోధించారు. అందుకనే శ్రీసాయిబాబా భౌతికరూపంతో సంచరించిన కాలంలో ఆయనకు ఇటు హిందూ, అటు ముస్లిం మతాలకు చెందిన ఛాందసుల నుండి ప్రతిఘటన ప్రాతికూల్యం తప్పలేదు. ప్రచండమైన సాయి మహిమ యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆ ప్రతిఘటన బాబా కూడా పరమ వైదిక సంప్రదాయ ప్రవర్తకుడనే ప్రచారంగా రూపుమార్చుకొన్నది. 

బాబా యేనాడూ మంత్రోపదేశాలు చేయలేదు. సరికదా, ఇతరుల వద్దకు మంత్రోపదేశాలకై పరుగులిడటాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. అలాంటిది, ఈనాడు శ్రీసాయి పేరున ‘మంత్రోపదేశాలు’ చేస్తున్న గురుస్వాములు మన మధ్యనున్నారు. మడి మైల అంటరానితనం కులతత్వం ఉపవాసాలు మొదలైన ఆచారకాండను బాబా నిర్ద్వంద్వంగా నిరసిస్తే, ఆ దురాచారాలన్నీ యీనాడు సాయిసాంప్రదాయంలో సాయిమందిరాల్లో చొప్పించబడటం మనం చూస్తున్నాం. ‘నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను’ అన్న శ్రీసాయినే తమ ‘కులదైవం’గా చెప్పుకుంటూ, తమ వృత్తులను నిరాటంకంగా చేసుకుంటున్న జోస్యాలరాయుళ్ళు, ‘ప్రశ్నల’ పరమహంసలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పుట్టుకొస్తూనే వున్నారు. ‘సద్గురువుకు అనన్యంగా శరణాగతి’ చెందమని బాబా చెప్పిన ఉపాసన, అందరి దేవతలు ఒకటేనన్న విశాలదృక్పథం ‘పేరున’, శివరామకృష్ణగణేశదత్తమారుత్యాది రూపాలతోపాటు బాబాను కూడా చేర్చి అందరినీ మూకుమ్మడిగా పూజించే పద్ధతికి మారింది. మనస్సు వివిధ రూపాలు ధరించటం మాని, ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేక బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుందని బాబా చెప్పిన ఉపాసనారహస్యం మరవడం వల్ల ఎందరో సాయిభక్తుల పూజామందిరాలు వివిధ దేవతామూర్తుల చిత్రపటాల ప్రదర్శనశాలలుగా మారుతున్నాయి. సాయిభక్తులందరు వివేకంతో ఈ పరిణామాలను గమనించి ఆత్మవిమర్శన చేసుకుంటూ, నిజమైన సాయిసాంప్రదాయమేమిటో విచారించి తెలుసుకొని ముందుకు సాగాలి! అలా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే బూజుపట్టిన ఆచారవ్యవహారాలపట్ల మనకుండే మూర్ఖమైన మూఢవిశ్వాసమే మనలోని మహిషతత్త్వం. ఆ మూఢాచారాలను సమాజంలో ప్రచారం చేసేవారే ఆ మహిషతత్త్వం మూర్తీభవించిన మహిషాసురులు. మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమయిన ఈ మహిషతత్త్వాన్ని ఒకరూపంలో జయిస్తే అది మరోరూపంలో తలెత్తుతూనే ఉంటుంది – మహిషాసురుని ప్రతి రక్తం బొట్టులో నుండి మరో మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగ! మనలోని త్రికరణాలను ఏకం చేసి, ఒక మహిషాసుర మర్దన శక్తిగా రూపొందింపజేసుకొని, సాయిభక్తి వివేకము నిష్ట-సబూరీలనే ఆయుధాలతో పోరినపుడే ఆ మహిషాసుర మర్దనం జరుగుతుంది. అది జరిగిననాడే మనకు నిజమయిన విజయదశమి!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - గొలుసు ఉత్తరాల గోల!



గొలుసు ఉత్తరాల గోల!

మన పేరుతో పోస్టులో ఉత్తరం రాగానే ఆతృతగా “ఎక్కడనుంచబ్బా!” అనుకొంటూ అందుకొంటాము. ఇంతా చూస్తే అది ‘గొలుసు ఉత్తరం’! ఉఫ్.ఫ్.. నిత్యజీవితంలో ఎటూ వుండే సమస్యలకు తోడు ఈ గొలుసు ఉత్తరాల(లింక్ లెటర్స్)బెడద బెదిరింపు ఎక్కువౌతున్నదీ మధ్య. సాయిబాబా, వేంకటేశ్వరస్వామి, సంతోషిమాత తదితర దైవాల పేర్లు యే 11మందికో 21 మందికో తిరిగి ఉత్తరాలు వ్రాయమనీ, అలా వ్రాసిన ‘ఫలానా’ వారికి ఏవో సిరిసంపదలొచ్చాయనీ ఆశబెడుతూ, నిర్లక్ష్యంచేసి అలా వ్రాయని వారెందరో పెద్ద ఆపదలలో చిక్కుకొన్నారని బెదరిస్తూ,.. సాగే సంతకం లేని (ఆకాశరామన్న) ఉత్తరాలే – ఈ ‘గొలుసు ఉత్తరాలు’. ఇటీవల కాలంలో ఈ గొలుసు ఉత్తరాల ‘పిచ్చి’ మరీ ముదిరినట్లు కనిపిస్తున్నది. ఇలాంటి ఉత్తరాలు వస్తే ఏమి చేయాలి అన్నదానికి సాయిపథం వివరణ!

డబ్బు వస్తుందని ఆశ చూపో, ఆపదలొస్తాయని భయపెట్టో తమ పేరు ఉత్తరాలద్వారా ప్రచారం చేసుకొనే దుర్గతి ఖర్మ శ్రీసాయిబాబా వంటి దైవస్వరూపులకు లేదు. శ్రీసాయిస్వరూపం – శ్రీఉపాసనీబాబా స్తుతించినట్లు – ‘అహంభావహీనం ప్రసన్నాత్మ భావం’. అందరినీ అనుగ్రహించడమే తమ అవతారకార్యమని (“My mission is to give blessings!”) శ్రీసాయియే చెప్పారు కూడా! అంతేకాదు. తమకెప్పటికీ ఎవరి మీదా కోపం రాదని గూడా బాబా చెప్పారు. బాబా అనుగ్రహం ఎప్పుడూ అందరిమీదా కుండబోతగా వర్షిస్తూనే ఉన్నది. మన అజ్ఞానమనే గొడుగు ఆ అమృతధారలు మనమీద పడకుండా అడ్డుకొంటున్నది. అనన్యప్రేమతో శ్రీసాయిని శరణు పొందితే ఆ ‘అడ్డు’ తొలగిపోతుంది. అంతేకానీ, భయంచేత ఆశచేత కార్డు ముక్కల్లో బాబా పేరు వ్రాసి పదిమందికి పంపడం వల్ల శ్రీసాయికృపను పొందుదామని అనుకోవడం కేవలం భ్రమ. అలా తమ పేర్లు ప్రచారం చెయ్యకపోతే, – క్షుద్ర పిశాచగణాల్లా – ఆగ్రహించి ఆపదలు కలిగిస్తారని భావించడం శ్రీసాయివంటి దైవస్వరూపులను అవమానించినట్లే! ఆధ్యాత్మికతత్త్వం  సాధన మొదలయిన విషయాలలో ప్రాధమిక సూత్రాలపట్ల కూడా అవగాహన లేని మూర్ఖశిఖామణులే ఈ గొలుసు ఉత్తరాల వంటి అవివేకపు చర్యలను ప్రోత్సహిస్తుంటారు. “వారు వ్రాయమన్నదీ మనం వ్రాసేదీ కూడా శ్రీసాయినామమే కదా? వ్రాసి పంపితే మనకు పోయేదేమున్నది?” అని ఎవరైనా భావిస్తే, అది పైన చెప్పిన కారణంగా కేవలం ఆత్మవంచనే అవుతుంది. అంతే కాదు! వివేకాన్ని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని, సంతకం కూడా పెట్టలేని భీరువుల్లా ‘ఆకాశరామన్న’ ఉత్తరాలు వ్రాసే దుస్థితికి మనలను దిగజారుస్తున్న ఈ బాపతు మూర్ఖత్వాన్ని ఏ కారణంగా ప్రోత్సహించినా అది శ్రీసాయిభక్తి సంప్రదాయానికి ‘అపచారమే’ అవుతుంది. సరి! అయితే మరిలాంటి ఉత్తరాలు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి?౼ అని మమ్మల్ని అడిగిన వారికి మేము చెప్పే సమాధానం ఒక్కటే!... వెంటనే చింపి చెత్తబుట్టలో పారవేయండి!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!




పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!

“జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు!”
~శ్రీసాయిబాబా 

{బాబా మాట: “సాంగె తయాస్ మాఝె మాన్, పత్రికా ఠేవీగుండాళూన్... జన్మపత్రికా పాహూ నకా... సాముద్రికా విశ్వాసూ నకా... ఠేవీ విశ్వాస్ మజవరీ!” (“నేను చెప్పే మాట వినుకో! జన్మకుండలిని చుట్టచుట్టి అవతల పారెయ్! జాతకాలు చూడొద్దు! సాముద్రికాన్ని నమ్మొద్దు! నాపై విశ్వాసముంచు!”)} --శ్రీసాయి సచ్చరిత్ర, అధ్యాయం:29; ఓవీ 108-110.

మన జ్యోతిష్కులు చెప్పే జోస్యాల శాస్త్రంలో నిజం ఎంతో ఆ జాతవేదునకే తెలుసు! మనకు మన భవిష్యత్తు గురించి సహజంగా వుండే భయాందోళనలు, భద్రతారాహిత్యభావం, ఎలాగైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతురత, యేమాత్రం వీలున్నా ఆ ‘భవిష్యత్తు’ను మనకనుకూలంగా మార్చుకోవాలన్న ఆశ... ఇవన్నీ కలిసి మనలను జ్యోతిషాల పాలబడేలా చేస్తున్నాయి. ఏది జరగాలని నిర్ణయింపబడి వుందో అదే ‘భవిష్యత్తు’ అయినట్లయితే, దాన్ని ముందుగా తెలుసుకొనే సామర్ధ్యం జ్యోతిష్కుల కెంతమందికున్నది? ఒకవేళ వున్నా, ఆ భవిష్యత్తును మార్చగలిగే ‘శక్తి’ వారు చేసే ‘గ్రహశాంతుల’ కున్నదా? అంత తేలిగ్గా మార్చుకోగలిగింది అసలు ‘భవిష్యత్తు’ ఎలా అవుతుంది?– అనే విషయాలను గురించి మనం యోచించం! ప్రజాబాహుళ్యానికి సంబంధించినంత వరకు యీ అనాలోచిత చర్యల సంగతెలావున్నా, శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆశ్రయించిన సాయిభక్తులకు మాత్రం ఇది అనుచితమని చెప్పక తప్పదు!

కొందరడగవచ్చు: “మరి, బాబా కూడా భవిష్యత్తు చెప్పారు గదా?” అని. ఇదే ప్రశ్న శ్రీనానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి బాబానే అడిగాడు! దానికి బాబా తన సహజమైన నిగూఢరీతిన చెప్పిన సమాధానం గమనార్హం. బాబా అన్నారు: “లేదు నానా! నేను ఎట్టి చమత్కారాలు చెయ్యను! మీకు జ్యోతిష్కులు వున్నారు. వారు ఏవో గుణించి చూచి, ఓ రెండురోజుల ముందుగా భవిష్యత్తు చెప్తారు. వీనిలో కొన్ని నిజాలవుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది. బాహ్యంగా, నేను చేసేది గూడా ఒకవిధమైన జ్యోతిషంలాగా కనబడవచ్చు. అయితే, దీని ఆంతర్యం పామరులు గ్రహించలేరు. నీకు ముందు ముందు ఏమి జరగబోతుందో తెలియదు గనుక, అది నేను చెప్తే, నీకు అది ఒక చమత్కారం (మహత్తు)గా కనిపిస్తుంది. అవి నా అద్భుతశక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భయభక్తులు చూపుతావు. నేను మాత్రం మీరు చూపే భక్తిగౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి, మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను”.

చాలా సునిశితంగా పరిశీలిస్తేగాని బాబా మాటలలోని అంతరార్థం బోధపడదు. తాము ఎప్పుడూ ‘చమత్కారాలు’ చేయమనీ, మన పామరత్వము వల్లనే ఆయన చేసే పనులు ‘చమత్కారాలు’గా ‘జోస్యాలు’గా కనిపిస్తాయనీ, అటువంటి వాటికోసమే ఆయన్ను ఆశ్రయిస్తే సద్గురువును ఒక జ్యోతిష్కుని స్థాయికి దిగజార్చడమేననీ, అలా చెయ్యడం శ్రీసాయి వంటి సమర్థ సద్గురుని ఓ సద్గురువుగా కాక, ఒక జ్యోతిష్కునిగా తలచి ఆశ్రయించడంతో సమానమేనని - బాబా మాటల్లోని శ్లేష. అంతేకాదు! బాబా చెప్పిన మాటలలో మరో సత్యాన్ని గుర్తించాలి. అదేమంటే, జ్యోతిష్కులు బహుశా కొంచెం ముందుగా జరుగబోయేది చెప్పగలరేమో కానీ, - బాబా 'చెప్పింది జరుగుతుంది'!

అయితే, అలా జోస్యాలుగా ‘కనిపించే’ చర్యలనయినా బాబా ఎందుకు చేసినట్లు? సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సు కోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం.

సద్గురువు తమ భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులని, తన శ్రేయస్సుకోసం అవసరమైతే ‘విధి’నే మార్చగల సమర్థులనే విశ్వాసం బాబాయొక్క లీలల వల్ల భక్తునికి కలుగుతుంది. క్రమంగా ఆ విశ్వాసమే భక్తుని సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చెందిస్తుంది. అప్పుడే సద్గురువుకు పూర్తిగా ‘పగ్గాలప్పగించడం’ సాధ్యం. శ్రీసాయిబాబా వంటి సమర్థసద్గురువును ఆశ్రయించనంత వరకే జాతకాలు గ్రహాలు మొదలైన వాటి ప్రసక్తియని, ఒక్కసారి (శ్రీసాయి వంటి) సద్గురువును ఆశ్రయించిన తరువాత ‘గ్రహాలు’ ఏమీ చెయ్యలేవని శాస్త్రం, మహాత్ముల ఉవాచ. ఈ విషయాన్ని సూచిస్తూ బాబా ఒక భక్తునితో, “నీ ప్రారబ్దంలో నీకు సంతానమెక్కడ వుంది? నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను” అనీ, మరో భక్తునితో, “ద్వారకామాయి బిడ్డలను గ్రహాలేం చెయ్యగలవు?” అనీ అభయమిచ్చారు. మరోసారి ఒక ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి బాబాను అంగసాముద్రికశాస్త్ర దృష్ట్యా పరిశీలించాలని శిరిడీ వచ్చాడు. అతడు మసీదు చేరి ఒక మూల కూర్చోబోతుండగా బాబా తమ ప్రక్కనున్న భక్తులకు ఆ సిద్ధాంతిని చూపుతూ, “ఇతడు నా ఇంటి వాసాలను లెక్కబెట్టడానికొచ్చాడు! నా దగ్గర అతడు చూడగలిగిందేమీ లేదు. అతణ్ణి వెంటనే ఇక్కణ్ణుండి బయటకు పంపివేయండి!” (“ఓ హమారా జోపిడీ కా బాంబు గిన్ నేకో ఆయా...”) అని కోపంగా కేకలేసారు.

ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిషశాస్త్ర గ్రంథాన్ని బాబా చేతికిచ్చి, ఆయన ప్రసాదంగా దాన్ని తిరిగి తనకివ్వమని ప్రార్థించాడు. అలాంటి సందర్భాలలో బాబా తమ అనుమతిని ఇవ్వదలచుకోకపోతే, ఆ ఆశీస్సులు కోరే వ్యక్తికి ఆ వస్తువును తిరిగి ఇచ్చేవారు కాదు. అయితే భక్తులు సమర్పించిన యే వస్తువును తమ వద్ద వుంచుకొనేవారు కూడా కాదు. కనుక అటువంటి వస్తువులను (పుస్తకాలు మొ౹౹నవి) తమ ప్రక్కనున్న షామావంటి భక్తులకు ఇచ్చేసేవారు. జ్యోతిషం వంటి విద్యల్ని ఎన్నడూ ప్రోత్సహించని బాబా, ఆ జ్యోతిషగ్రంథాన్ని ఆశీస్సులకోసం తమకిచ్చిన భక్తునికి తిరిగి ఇవ్వలేదు. ఆ పుస్తకాన్ని అటు, ఇటు తిరగేసి, ఆ సమయంలో తన ప్రక్కనున్న శ్రీబూటీకి ఇచ్చివేశారు.

((జ్యోతిషం మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా బాబా చేతిగుండా వచ్చింది కదా అని శ్రీబూటీ ఆ గ్రంథాన్ని చదవడం, ఒకసారి శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ ఎన్నికలలో పోటీచేయగా సరదాగా దీక్షిత్ గ్రహబలాన్ని గుణించి ఏ సమయంలో ఎన్నికలు జరిగితే అతను గెలుపొందే అవకాశముందో చెప్పడం, ఎన్నికలు అలానే జరిగి దీక్షిత్ గెలుపొందడమూ జరిగాయి. దీన్నిబట్టి బాబా జ్యోతిషాన్ని పరోక్షంగానైనా ప్రోత్సహించినట్లే కదా? అని కొందరు భక్తలు తలచడం సహజమే! కొందరు రచయితలు యీ వివరాన్ని ఆధారం చేసుకొని అలానే వ్యాఖ్యానించారు కూడా! కానీ, తాను గెలుపొందింది కేవలం "బాబా అనుగ్రహం" వల్లనేనని శ్రీదీక్షిత్ స్వయంగా తమ డైరీలో వ్రాసుకున్నారు. అంతేకాదు! శ్రీబూటీకి ఆ పుస్తకాన్ని ఇవ్వడం అనే బాబా చర్యవల్ల, అటు శ్రీబూటీగానీ, ఇటు శ్రీదీక్షిత్ గానీ జ్యోతిషం పట్ల జోస్యాలపట్ల ఆకర్షితులు కాలేదు. కాయను బట్టి చెట్టును నిర్ణయించమని (“Judge the tree by the fruit!”) కదా ఆర్యోక్తి!))

తమకేది మంచిదో అది బాబా తప్పక చేస్తారనే విశ్వాసం సాధనాపథంలో ప్రథమ సోపానం. అది మరచి సాయిభక్తులే జ్యోతిష్కుల చుట్టు, వాస్తు సిద్ధాంతుల చుట్టూ తిరగడం; కొందరు ప్రముఖ సాయిభక్తులే జాతకాలను ప్రోత్సహిస్తూ, జోస్యాలు చెప్పడం; ఎందరో ‘వృత్తి జ్యోతిష్కుల’కు శ్రీసాయి ‘కులదైవం’ కావడం – శోచనీయం! సద్గురు చరణాలనాశ్రయించి, వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్ధించిన చేతులను హస్తసాముద్రికుల ముందు దేబిరిస్తూ చాచడం – మనం ఆశ్రయించిన సద్గురువునే అవమానించి, కించపరచడం కాదా? ప్రసిద్ధ జ్యోతిషశాస్త్ర పండితుడు శ్రీముళేశాస్త్రి (నాసిక్) ఒకసారి బాబా చేయి చూస్తానని ప్రార్థిస్తే, బాబా ఓ చిరునవ్వు నవ్వి వూరుకున్నారేగానీ, ఆ హస్తసాముద్రికుని ముందు తమ చేయి చాపలేదు! ఈ జోస్యాల ఆకర్షణలలో గ్రహశాంతుల ఊబిలో పడకుండా, వివేకంతో తమను తాము నిగ్రహించుకోగలిగిననాడు మనం శ్రీసాయి శరణాగతిపథంలో ఒక మెట్టు పైనుంటాం!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయి భక్తిపథంలో సాయి మందిరాలు




సాయి భక్తిపథంలో సాయి మందిరాలు

అద్భుతంగా అనంతంగా వృద్ధి చెందుతూ వ్యాపిస్తున్న సాయిభక్తి అనే మహావటవృక్షానికి వేసిన కొమ్మలు రెమ్మలే మనం ఈనాడు చూస్తున్న సాయిమందిరాలు. అయితే, సాయిమందిరాలు కేవలం పూజామందిరాలుగా, భజనకేంద్రాలుగా మాత్రమే కాక, శ్రీసాయిబాబా యే విశిష్ఠ సాంప్రదాయాన్ని ప్రవర్తిల్లజేయడానికి అవతరించారో, ఆ సత్సంప్రదాయానికి పట్టుకొమ్మలు కావాలి. మనకు తోచిన విధంగా మనమే ఏర్పరచుకున్న పూజావిధులు తదితర ‘తంతు’లకన్నా, శ్రీసాయి ఆవిష్కరించిన ఉత్కృష్టమైన ఆధ్యాత్మికసూత్రాలకు సాయిమందిరాలు నెలవులు కావాలి. “శిరిడీలోలాగా మందిరాన్ని ఎలా కట్టాలి? శిరిడీలోలాగా నాలుగు ఆరతులు ఎలా నిర్వహించాలి? శిరిడీలోని బాబావిగ్రహం ‘మాదిరి’ విగ్రహాన్ని ఎలా తయారుచేయించాలి? శిరిడీలో బాబా వెలిగించిన ధుని ‘మాదిరి’ అగ్నిహోత్రాన్ని మన మందిరంలో కూడా ఎలా ప్రతిష్ఠించుకోవాలి?౼ అనే అంశాలకంటే, శిరిడీని అంతటి మహామహిమాన్వితమైన క్షేత్రంగా రూపొందించటానికి కారణమైన బాబా ఆదర్శ జీవితవిధానము, ఆయన మనకందించిన ఆధ్యాత్మికసూత్రాలు, బాబా పాదుకొల్పిన విశిష్ఠ సాంప్రదాయము ప్రాముఖ్యతను సంతరించుకోవాలి. దానికి కావలసిన సాయి అనుగ్రహాన్ని అవగాహనను పెంపొందించుకొనేందుకు మనం యత్నించాలి. “ఇది మా సాయిమందిరం – అది మీ సాయిమందిరం – అది ఫలానావారి సాయిమందిరం” అని కాక, అన్నీ ‘మన సాయి’ మందిరాలేనన్న భావం మనలో బలపడాలి. మందిర నిర్వహణలో ఎవరి సమస్యలు సదుపాయాలు వారికున్నాయి. ‘మాది’ ‘మీది’ అనే హద్దులు తుడిచివేసి అందరూ పరస్పర సహకారంతో ఉద్యమించిననాడు, ఆ ‘సమస్యల’లో ఎక్కువభాగం అసలు ‘సమస్యలుగా’నే మిగలకుండా పోతాయి. ఆ శుభప్రదమైన శోభస్కరమైన పరిణామాన్ని బాబానే కలుగజేయాలి. ఆ అవగాహనతో, బాబా అనుగ్రహం కోసం ప్రార్థించడమే మనమిప్పుడు చేయగలిగింది!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమసూత్రాలు!


ఆలయ నిర్మాణంలో అసలైన ఆగమసూత్రాలు!

సమాజంలో ఆస్తికత అడుగంటి పోతున్నదని, దైవభక్తి క్షీణిస్తున్నదని ఒకప్రక్కన దైవచింతనగలవారు మహామథనపడిపోతుంటే, మరోప్రక్క పల్లెపల్లెలా దేవాలయాలు, వాడవాడలా మందిరాలు లెక్కకుమించి పుట్టుకొస్తూండడం, వాటిలో కొన్ని మరీ మహిమగల దేవాలయాల ఆదాయం అంతులేకుండా పెరిగిపోతూండడం చూస్తుంటే, ‘నిజంగా సమాజంలో దైవభక్తి క్షీణించడంలేదేమో!’ ౼ నన్న అనుమానం రాకమానదు.

తనకు ఆలయాలు కట్టించమని దేవుడు దేబిరించలేదు! దేవాలయాల నిర్మాణం ముక్తికి తిరుగులేని మార్గమని శాస్త్రాలు ఘోషించడమూలేదు. అయినా క్రొత్త దేవాలయాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పాత దేవాలయాలు దీపం పెట్టే దిక్కులేక పాడుపడిపోతూనే ఉన్నాయి. ఆలయనిర్మాణానికి ఖర్చుపెట్టిన డబ్బు చిత్రగుప్తుని చిట్టాలో పుణ్యం క్రింద (పెద్ద అక్షరాలతో) జమ అవుతుందనే విశ్వాసం, తాము పెట్టుబడి పెట్టిన దేవాలయం నిలిచి ఉన్నంతవరకు అజరామరమైన కీర్తితో పాటుగ జమ అయిన పుణ్యం తాలుకు వడ్డీ కూడా తమకు ముట్టుతూంటుందనే ఆశ – సామాన్యంగా దేవాలయనిర్మాణానికి ప్రేరకాలు. తన ఇష్టదైవం మీద ప్రీతితోకానీ ఆ దైవం ఏవో తన కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతతోగానీ ఎవరైనా మనఃస్ఫూర్తిగా ఆలయనిర్మాణానికి సంకల్పించినా, ఆ ఆలయనిర్మాణానికి ధనకనకవస్తురూపంలో వచ్చిపడే సహకారం వెనుకైనా పైచెప్పిన ప్రేరణ సామాన్యంగా దర్శనమిస్తుంది. అటువంటి ప్రేరణలో నుండి ఉద్భవించి, ధనికస్వాములు (తమ ఆదాయపు పన్ను మినహాయింపు కోసం) విదిలించిన నల్లడబ్బుతో కట్టబడ్డ అలాంటి దేవాలయాలు ఈ కలిలోని పాపాల రూపాలుగా మన కళ్ళముందు నిలుస్తున్నాయి!

ఆలయనిర్మాణంవల్ల ఒనగూడే పుణ్యాన్ని మాత్రమే వాటి నిర్మాతలు చూస్తున్నారు కానీ, ప్రజలలో సరైన ధార్మికచింతన, దైవభక్తి (భయంకాదు!) సరైన జీవితపు విలువల సాధన, అలా కట్టిన దేవాలయాల నిర్వహణ ధర్మబద్ధంగా జరుగకపోతే అది యెంత ఘోరమైన దోషమోనన్న విషయం మనం గుర్తించడం లేదు. అతిథిని ఇంటికి ఆహ్వానించి, ఆ అతిథి రాగానే అతడ్ని పట్టించుకోక అశ్రద్ధచేయడం వంటి అకృత్యమిది. ఆలయంలోకి దైవాన్ని ఆవాహనచేసి (ప్రాణప్రతిష్ఠచేసి) ప్రతిష్ఠించి, తరువాత ఆ దైవకార్యంపట్ల శ్రద్ధవహించకపోవడం దైవధిక్కారమే అవుతుంది; ‘దేవాలయంలో దీపం ఆర్పడమే’ అవుతుంది!

ఈ అనర్థానికి అసలు కారణం దేవాలయమంటే కేవలం దేవునికి కట్టించిన నివాసమేననే దురవగాహన, దేవాలయాతత్త్వాన్ని గురించి మహాత్ములు చెప్పిన సత్యాలు మరుగున పడడమూ కారణాలని తోస్తుంది. స్థూలమైన విశ్వానికి (macrocosm) సూక్ష్మరూపం (microcosm) వ్యక్తి. అయితే, యీ స్థూల-సూక్ష్మరూపాల ‘స్వ’రూపం మాత్రం ఒక్కటే. ఈ ‘అద్వైత’ స్వరూపాన్ని మనచే దర్శనం చేయించేవి ఋషిప్రోక్తాలయిన నిగమాగమాలు. వ్యష్ఠి రూపుడైన (individual consciousness) జీవుని, సమిష్ఠి రూపుడయిన (collective consciousness) ఈశ్వరునితో అనుసంధానంచేసే ప్రక్రియే యజ్ఞం. వేదసంస్కృతిలో ప్రధానపాత్రవహించిన యజ్ఞవాటికలు కాలాంతరంలో దేవాలయాలుగా రూపుదిద్దుకున్నాయి. పైన వివరించిన యజ్ఞానికి దేవాలయం సంజ్ఞారూపం. మానవుని మూలప్రకృతి ఏ కాలంలోనయినా ఒక్కటే. కనుక వ్యక్తి తన ప్రకృతిని ఏ విధంగా సంస్కరించుకొని బాహ్యజగత్తుతో సామరస్యంగా మనగలడో నిర్దేశించే మౌళికసూత్రాలు కూడా మారనివే.

ఈ అంతర్దర్శనాన్ని సాధించడానికి అవసరమైన మానవధర్మాలను, సాధనాలను ప్రబోధించే కేంద్రాలుగా దేవాలయాలు ఏర్పడ్డాయి. అందుకనే మునుపు ఆచార్య పీఠాలుగా, ఘటికాస్థానాలుగా (universities), ధర్మజిజ్ఞాసకు వేదికలుగా దేవాలయాలు వెలుగొందాయి. కాలక్రమేణా సమాజంలో తాత్త్విక జిజ్ఞాస అవగాహన కొరవడడంతో, దేవాలయాలు ఆయా ఆలయ అధిష్ఠాన దేవతలకు కేవలం అర్చనాకేంద్రాలుగా మారిపోయాయి. ఆచార్యులు అర్చకులయ్యారు. ఆచార్యపీఠాలు దేవతార్చన ‘పీటలు’గా మారిపొయ్యాయి. జిజ్ఞాసువులకు ముముక్షువులకు ‘ఆశ్రమాలు’ గా వెలుగొందిన దేవాలయాలు క్రమంగా కేవలం ఆర్తులకు అర్థార్థులకు ఆశ్రయాలయ్యాయి.

ఆలయనిర్మాణం చేబట్టే ముందు, ఆలయం నిర్మించబోయే ప్రదేశంలో మహాత్ముల చరిత్రల పఠనము, పవిత్ర ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాల అధ్యయనము, మహాత్ముల ఆశీస్సులు, సామూహిక జపధ్యానాలు కొంత కాలం పాటు జరగాలి. నిత్య సత్సంగ స్వాధ్యాయ ప్రవచనాలపట్ల ఆ ప్రాంతంలోని స్థానిక ప్రజలకు శ్రద్ధాసక్తులు కలగాలి. అలా జరుగుతూంటే క్రమంగా ఆ కేంద్రమే దేవాలయంగా పరిణతి చెందుతుంది. ఇది సాధించకుండా, దేవాలయ నిర్మాణానికి పూనుకొని, చందాలు దండిగా దండి, దండగజేయడం నిషిద్ధకార్యమే అవుతుంది. ఇదే ఆగమశాస్త్రాల్లో ఆలయనిర్మాణానికి ముందు చేయవలెనని చెప్పబడ్డ ‘స్థలశోధన’ ‘స్థలశుద్ధి’ లలోని ఆంతర్యం.

స్థూలమైన విశ్వానికి (macrocosm) అంటే విరాట్ స్వరూపానికి సూక్ష్మరూపం (microcosm) వ్యక్తియనీ, యీ రెండింటి యొక్క సమన్వయస్వరూపాన్ని దర్శింపజేసే సాధనం దేవాలయమనీ ఇంతకు మునుపు చెప్పుకున్నాం. అందువల్లనే వ్యక్తియొక్క దేహము, జీవప్రకృతికి ప్రతీకగా ఆలయనిర్మాణం కూడా సాగింది. “దేహోదేవాలయప్రోక్తః జీవోదేవస్సనాతనః” 'దేహమే దేవాలయం; అందులోని జీవుడే దేవుడు అని భావించి పూజించు' అని తమ ‘ఆత్మపూజ’ గ్రంథంలో శ్రీఆదిశంకరులు ప్రవచించారు. మానవ దేహనిర్మాణానికి ప్రకృతికి ప్రతీకగా దేవాలయాన్ని ఎలా నిర్మించాలనే సూత్రాలను చెప్పేందుకు దేవాలయ వాస్తు పుట్టింది. ఈ సత్యాన్నే “నరప్రాస్తారమితి తద్వాస్తు ప్రస్తార మిత్యపి” అని ఆ శాస్త్రమే చెబుతున్నది.

వ్యక్తి తనలోని రాగద్వేషాదులను శోధించి, అలా శుద్ధిచేయబడ్డ అంతరంగంలో అస్తవ్యస్తంగా పడివున్న తన హృదయవాసనలనే చంద్రశిలలను ఆగమసూత్రాల కనుగుణంగా తీర్చి పేర్చి నిర్మించిన హృదయమందిరంలో భగవంతుడు ఆనందంతో నర్తిస్తాడు. మనం నిర్మింప తలపెట్టిన బాహ్యమందిరం ఈ హృదయమందిరాన్ని ప్రతిబింబించే తత్త్వమయ నిర్మాణం కావాలి! అప్పుడే, “బింబాన మాభిరూపాచ్చ దేవాః సాన్నిధ్యమిచ్ఛతి” (అంటే, ‘బింబ సౌందర్యానికి, లక్షణాలకు అనుగుణంగా దేవతలు తమ సాన్నిధ్యాన్ని ఇవ్వగోరుతారు’) అన్న ఆగమశాస్త్రప్రామాణ్యం ౼ ఆధ్యాత్మికార్థంలో ౼ సిద్ధిస్తుంది.

తనపట్ల, దైవంపట్ల, సాటి మానవులపట్ల సరైన అవగాహనను సమాజంలో కల్పించడానికి ప్రయత్నించక ఆలయాలు నిర్మిస్తే ఆ దేవాలయ రాతి కట్టడాలు స్వార్థంతో కరుడు గట్టిన మనిషి హృదయాలకు ప్రతీకలుగా మాత్రమే నిలుస్తాయి. ఉన్నతసంస్కారాలనే విద్యాప్రణాళికతో ఆత్మవిద్యకు బళ్ళుగా మన పెద్దలు రూపొందించిన యీ గుళ్ళు, కులాల కుళ్ళుకు మతాల మళ్ళకు లోగిళ్ళు కారాదు! మేలుకొలుపు-బాలభోగం దగ్గరనుండి, ఆరగింపు-పవళింపు సేవలదాకా షోఢశోపచారాలు ‘జరిపించడం’ మాత్రమే కాదు దైవంపట్ల శ్రద్ధ వహించడమంటే! దైవం ధర్మస్వరూపం. స్వాధ్యాయప్రవచనాలతో కూడిన ధర్మప్రచారానికి సంస్కరణకు దేవాలయం సాధనం కావాలి.

లేకపోతే, యీనాడు మనం చూస్తున్నట్లు, దేవాలయాలు ధనికస్వాముల అధికారపాటవ ప్రదర్శనశాలలుగా, కుళ్ళు కులతత్వపు కురుక్షేత్రాలుగా, అసంతృప్త ముఠారాజకీయవాదుల అధికార పునరావాస కేంద్రాలుగా, వినోదయాత్రాస్థలాలుగా, మూఢాచారాల మత్తుమందునందించే ‘మతం’ బ్రాండు పానశాలలుగా, శృంగార సినీగీతాల ‘జ్యూక్ బాక్సులు’గా, పెళ్ళిమంటపాలుగా, మొక్కుబళ్ళు తీర్చే క్షౌరశాలలుగ మారక తప్పవు! అందుకే అన్నాడు వేమన: “దేవళములోను తీర్థంబులందును మూలమెరుగకున్న ముక్తి లేదు!” ౼ అని. వేమన యోగీంద్రుని యీ మాట ౼ ఆగమశాస్త్రాల తేట!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - ధ్యానానికి ఏ ఆసనం మంచిది? అసూయను జయించడం – అంత సులువా?




ధ్యానానికి ఏ ఆసనం మంచిది? 
అసూయను జయించడం – అంత సులువా?

శ్రమలేకుండా ఎక్కువసేపు స్థిరంగా ఏ పద్ధతిలో కూర్చొనటానికి అనుకూలమో, ఆ కూర్చొనే పద్ధతే ఆసనమంటే! ధ్యానానికి ‘ఫలానా’ ఆసనం శ్రేష్ఠమైనదనో, ‘ఫలానా’ ఆసనంలో కూర్చొని జపధ్యానాలు చేస్తే ‘ఫలానా’ సిద్ధి వస్తుందనో, ‘వెన్నెముక, మెడ, తల ఒకే సమరేఖలో వుండాలి’ అనే యోగశాస్త్రనియమాన్ని సాధించాలనో, ధ్యానం చేసుకునేప్పుడు ఆసనం మార్చకూడదనే భావంతోనో ౼ ఆసనాభ్యాసం పేర శరీరాన్ని బలవంతపెట్టడం మంచిదికాదు! శరీరం గూనిగా వంగిపోకుండా, పట్టు బిగింపు శ్రమ లేకుండా ఎక్కువసేపు ఎలా కూర్చొనగలమో చూచుకొని, ఆ ఆసనాన్ని (కూర్చునే పద్ధతిని) మన ధ్యానానికి ఎంపిక చేసుకోవాలి. మరోవిధంగా చెప్పాలంటే ఫలానా పద్ధతిలో కూర్చుని వున్నామనిగాని, అసలు కూర్చుని వున్నామని గాని స్ఫురణకు రాకుండా వుండే ఆసనమే అన్నింటిలోకి ఉత్తమమైన ఆసనం. ధ్యానం మధ్యలో ఒకవేళ ఆసనం మార్చాలని అనిపిస్తే హాయిగా మార్చుకోవచ్చు. ఆర్తి ఆర్ధ్రతలతో అభ్యాసం చేస్తూ చేస్తూ పోగా, ధ్యానంలో చిత్తచాంచల్యం తగ్గి, మనస్సు అంతర్ముఖమైతే, ఆసనసిద్ధి సహజంగా సునాయాసంగా సిద్ధిస్తుంది. ధ్యానం చేసుకొని లేవగనే దేహంలో ఎక్కడా ఏ మాత్రం బిగింపు లేకుండా హాయిగా, తేలిగ్గా వుండాలి. అదే మనం కూర్చున్న ఆసనం, చేసిన ధ్యానం సరైనదని చెప్పడానికి గుర్తు. యోగశాస్త్రగ్రంధాలలో మనం కూర్చొనే పద్ధతికి ఏ పేరు పెట్టివున్నా అది మనం పట్టించుకోనవసరం లేదు. ఏ రకంగా (ఆసనంలో) కూర్చుంటే దేహానికి మనస్సుకు సుఖంగా శ్రమరహితంగా వుండి ధ్యానం హాయిగా చేసుకోగలమో – అదే మన సంస్కారానికి సరిపడే ఆసనం. అదే ‘సుఖాసనం’! అందుకే అన్ని ఆసనాలలోకి ‘సుఖాసనం’ శ్రేష్ఠమైనదని అంటారు భగవాన్ శ్రీరమణమహర్షి!

అసూయను జయించడం – అంత సులువా?

ఆనందమయ జీవితానికి, ఆత్మజ్ఞానానికి అడ్డుగోడలైన అరిషడ్వర్గాలలో – కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలలో – చివరిది మత్సరం. మత్సరమంటే ఈర్ష్య-అసూయల కలగలుపు రూపమని చెప్పుకోవచ్చు. ఈర్ష్యాసూయలనే పదాలను రెంటినీ సామాన్యంగా మనం సమానార్థంలోనే వాడుతూ వుంటాం. కానీ, ఆ రెంటికీ సూక్ష్మమైన భేదం వుంది. తనకు చెందవల్సింది ఇతరులకు పోయిందేనన్న కించ, బాధ -ఈర్ష్య. ఏదో ఒక విషయం కోసం ఇద్దరు పోటీపడి, వారిలో ఒకరికి ఆ ఫలితం దక్కి, మరొకడికి రాకపోయినపుడు ఆ రెండోవాడు పడే బాధ ఈర్ష్య. తాను ఆశించింది పొందలేకపోయానేనన్న బాధకంటే, అది పక్కవాడు పొందాడేనన్న దుగ్ధ –ఈర్ష్య యొక్క స్వరూపం. దీనివల్ల ఒకవేళ ఇద్దరకూ ఆ ఫలితం లభించకపోతే, తనకు రాలేదని బాధ మరచిపోయి, పక్కవాడికి కూడా అది లభించలేదని లోలోపల సంతోషించడం జరుగుతుంది! ఇక అసూయ విషయం అలా కాదు. తనకెంతమాత్రం సంబంధించినది కాకపోయినా, తానేమాత్రం దానికోసం ప్రయత్నించకపోయినా, అది లేకపోవడం వల్ల తనకే మాత్రం నష్టం లేకపోయినా, ఇతరులకు ఏదైనా మేలు లాభం కలిగితే మనసులో ఊరకే కించపడే స్వభావం అసూయ!

పైన పేర్కొన్న అరిషడ్వర్గాలలో మిగిలిన వాటికి – మనలోని అహం, కోరికలు, వాసనలు, వ్యక్తిగతమైన లాభనష్టాలు, సుఖదుఃఖాలు మొదలయిన వాటి నేపథ్యంలో – కొంచెమయినా కారణం, ప్రాతిపదిక ఉంది. కనుక వాటిని కేవలం వివేకంతో జయించి పోగొట్టుకోవడం కొంచెం కష్టం. కానీ, అసూయ విషయం అలా కాదు! అది కేవలం అకారణంగా కలిగేది! ఏదైనా కారణమంటూ ఉంటే అది మిగిలిన వికారాల ఉనికిని ఆధారం చేసుకొని, వాటి నీడలా ఉంటుంది. మనలో చాలామంది ఈ వికారం (అసూయ) మనలో లేదని భ్రమపడతాం. కానీ, జాగ్రత్తగా మన మనస్సును తరచి చూస్తే – ముఖ్యంగా ఇతరులు లాభపడుతున్న వార్త వింటున్న సమయంలో – దాని ఉనికి మనకు అవగతమవుతుంది. అలా అది మన అంతరంగంలో తళుకుమన్న ప్రతిసారీ దాన్ని గుర్తిస్తూ పోతే, క్రమంగా ఆ వికారం అంతరిస్తుంది. మొదట తేలికగా పోగొట్టుకోగలిగే వికారాన్ని జయిస్తే, అభ్యాసబలంతో క్రమంగా మిగిలిన ఇతర వికారాలను గూడా గుర్తించి వదిలించుకొనే పట్టు చిక్కుతుంది.

అసూయను గూర్చి శ్రీసాయిబాబా తనదైన రీతిలో ఏం చెప్పారో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్‌తో బాబా ఇలా అన్నారు:

“అరిషడ్వర్గాలలో అసూయను జయించడం అతి తేలిక! దీనిలో మనకు వచ్చేది కానీ, పొయ్యేది కానీ ఏమీ ఉండదు. ఇతరుల మేలు, సుఖం చూసి ఓర్వలేకపోవడమే అసూయ. ఇతరులకు ఏదైనా మంచి స్థాయిగానీ ఐశ్వర్యంగానీ వస్తే, అది చూచి ఓర్వలేక వారినిగూర్చి లేనిపోని మాటలు కల్పించి దూషిస్తాం. వారికేమయినా కష్టం కలిగితే ఆనందిస్తాం. ఇది సరైనదేనా? వాడికెవడికో మేలు జరిగితే, అందువల్ల నీకొచ్చిన నష్టమేముంది? కానీ మనుషులు ఈ విషయం ఆలోచించనే ఆలోచించరు. పక్కవాడికి మేలు జరిగితే సంతోషించగలగాలి. లేదు, అది మనమూ పొందేందుకు ప్రయత్నించాలి. అంతేకాని, ఆ బాగుపడ్డవాడు మనదేం లాక్కోలేదుకదా? వాడి కర్మ ఫలితంగా అది వాడికి లభించింది. దానికి ఊరకే మనం వగచినందువల్ల లాభమేముంది? అందువల్ల, మొదట అసూయను జయించాలి!”.

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - మనోనిగ్రహానికి మరికొన్ని మార్గాలు!



మనోనిగ్రహానికి మరికొన్ని మార్గాలు!

సాయిభక్తులకు జపధ్యానాలలో ఉపయోగపడే సుళువులను గూర్చి ముందు వ్యాసాలలో కొంత తెలుసుకున్నాం. మరికొన్ని సుళువులు, జాగ్రత్తలు తెలుసుకుందామా?

వైరాగ్యలక్షణమనే భావంతో కొందరు చెప్పులు లేకుండా నడవటం మనం చూస్తుంటాము. కానీ, చెప్పులు లేకుండా నడవడం, కటికనేలమీద కూర్చొనడం పండుకొనడం సాధనకు అంత మంచిది కాదు! ధ్యానానికి కూర్చొనబోయే ముందు తప్పనిసరిగా నేలపైన చాపకాని, గుడ్డకాని, కొయ్యపీటకానీ ఆసనంగా వేసుకొని కూర్చోవాలి. దానివల్ల భూమ్యాకర్షణశక్తి యొక్క విక్షేపప్రభావం మనస్సుపై తగ్గి తేలికగా మనసు ధ్యానస్థమవుతుంది.

ఏ కారణం చేతనయినాసరే, ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు మరీ గజిబిజిగా వుంటే, నిటారుగా కూర్చొని ఊపిరితిత్తుల నిండా నెమ్మదిగా గాలిపీల్చి, నెమ్మదిగా వదలాలి. అలా అయిదారుసార్లు చెయ్యాలి. అలా చేసేటప్పుడు, శ్వాసను బలవంతంగా అదుపుచెయ్యడంగానీ, గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు శ్రమ తీసుకోవడం గానీ ఎంత మాత్రం చేయకూడదు. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు (బలవంతంగా కాకుండా) క్రమబద్ధంగా, లయబద్ధంగా వుండేట్లు చూచుకోవడమే ఒక సాధన.

మహాత్ములు, ఉత్తమసాధకులు, సన్నిహిత గురుబంధువులు తప్ప ఇతరులు - ఎవరైనా సరే - ఇచ్చిన వస్తువులు ఏవీ తీసుకోకూడదు! వారు పెట్టినదేదీ తినకపోవడం మంచిది. ఇతరులు ఉపయోగించిన వస్తువులు (చెప్పులు, గుడ్డలు, ఆసనాలు, జపమాలలు మొదలైనవి) ఏ పరిస్థితులలోను వాడకూడదు. ఇతరులనుండి మనం ఏ వస్తువునుగానీ, ఆహారాన్నిగానీ స్వీకరించినప్పుడు, ఆ పదార్థాలతో బాటు వారి మనోవృత్తుల ప్రభావాన్ని గూడా మనం గ్రహిస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలి. నిత్యజీవితంలో ఈ నియమాన్ని ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమైనప్పటికీ, ఆధ్యాత్మిక సాధనలో ఈ నియమం యొక్క అవసరం ప్రయోజనం అంత ఇంత అని చెప్పనలవి కాదు. ‘ఎవరి వద్దనుండి ఏదీ పుచ్చుకోకపోవడం’ తన నియమమని సున్నితంగా, నమ్రతగా, మర్యాదగా (ఎదుటివారు నొచ్చుకోకుండా) చెబితే సామాన్యంగా ఎదుటివారు బలవంతం చెయ్యరు. ఈ నియమం అంత అత్యుత్తమమైనది గనుకనే, అద్వైతసాధనను బోధించిన ఆదిశంకరుల వంటివారు కూడా ఈ ‘అపరిగ్రహ’ నియమపాలనకు ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. మనస్సుకు పదార్థం మీదా, పదార్థానికీ మనసు మీద ఉండే ఈ ప్రభావాన్ని ఇటీవల శాస్త్రీయపరిశోధనలలో కూడా గుర్తించడం జరిగింది! అయితే, యీ నియమపాలన వెనుకనున్న సూత్రాలకు, కులమత వివక్షతలకు (అంటరానితనం, మడి మొదలగునవి) ఎటువంటి సంబంధం లేదని సాయిభక్తులు గుర్తించాలి. ఈ ‘అపరిగ్రహ’ నియమాన్ని కొంతకాలం శ్రద్ధగా పాటిస్తూ పోతే, ఆ తరువాత ఎప్పుడైనా తప్పనిసరై ఈ నియమాన్ని ఉల్లంఘించవలసి వచ్చినపుడు మనకే అనుభవానికి వస్తుంది – విచక్షణా రహితమైన పరిగ్రహం వల్ల మనం ఎంత నష్టపోతామో!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తులకు శ్రీగురుచరిత్ర పారాయణ విధాయకమా?




సాయిభక్తులకు శ్రీగురుచరిత్ర పారాయణ విధాయకమా?

గురుభక్తి ప్రబోధాత్మకమైన ‘శ్రీగురుచరిత్ర’ సాధకులకు శిరోధార్యమైనది. అందులో వర్ణింపబడ్డ గురుమహిమ, గురుస్తుతి వంటి గురుభక్తి ప్రబోధాత్మకమైన అంశాలు ఆధ్యాత్మిక సాధన మనుగడకు ఆహారం వంటివి. ప్రాతఃస్మరణీయులైన శ్రీపాద శ్రీవల్లభస్వామి, శ్రీనృసింహసరస్వతీస్వామి వంటి మహాత్ముల చరిత్రలు సాధకులు అవశ్యం పఠింపవలసినవి. అయితే, సంత్ కబీర్, జ్ఞానేశ్వర్ మహరాజ్, తుకారాం మహరాజ్, ఏకనాథ్ మహరాజ్, శ్రీసాయిబాబా మొదలైన ఎందరో సద్గురుమూర్తులచే ‘కాలదోషం’ పట్టించబడ్డ ఎన్నో ఛాందస ఆచారాలు, దురాచారాలు, మూఢవిశ్వాసాలు (కొన్ని చారిత్రక కారణాల ప్రభావం వల్ల) ఆ గ్రంథంలో ‘చొప్పించ’బడ్డాయి. దానికి తోడు, పరిపూర్ణమైన శ్రీసాయిసంప్రదాయం దత్తసంప్రదాయంలో ‘ఒక భాగం’ మాత్రమేనని, సాయిభక్తులకు సాయిచరిత్ర కంటే శ్రీగురుచరిత్ర పారాయణే ప్రధానమనే ప్రచారం ఒకటి ఇటీవల ప్రారంభమైంది. కానీ, శ్రీసాయిబాబా తమ లీలాప్రబోధాల ద్వారా మానవాళి కందించిన మహిత సంప్రదాయానికీ, శ్రీగురుచరిత్రలో చొప్పించబడ్డ కాలదోషం పట్టిన కొన్ని సంప్రదాయ ‘అవశేషాలకు’ మధ్యనున్న వైరుధ్యం దృష్ట్యా ఎందరో సాయిభక్తులు శ్రీగురుచరిత్ర పారాయణ వల్ల కొంత భావసంఘర్షణకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో దత్తసాంప్రదాయం యొక్క పుట్టుక-పరిణామం, ఆ సాంప్రదాయం యొక్క ముఖ్యలక్ష్యాలు-లక్షణాలు, అవి శ్రీగురుచరిత్రలో ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయి, ఇవి శ్రీసాయిసంప్రదాయంలో ఎంతవరకు ఇముడుతాయి, మొదలైన అంశాలను కొంతైనా పరిశోధించి అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం! 

పరిపూర్ణ సద్గురు స్వరూపానికి పర్యాయపదం దత్తస్వరూపం. అన్ని మత సాంప్రదాయాల, ఆధ్యాత్మిక తత్త్వదర్శనాలకు మూలం సద్గురుమూర్తుల లీలాప్రబోధాలే. వేదాలు - సత్యద్రష్టలైన మహర్షుల దర్శనాలు; ఆ దర్శనాల ఆదర్శమే వైదిక మతానికి పునాదులు; హైందవ ధర్మానికి ఒరవడి - మహర్షుల నడవడి. అందుకే వేదాన్ని నిత్యం పారాయణ చేయమనీ, అలా పారాయణ చెయ్యటం ద్వారా వేదసారాన్ని గ్రహించి, తదనుగుణంగా నడచుకొమ్మని వైదికధర్మం ఉద్బోధిస్తున్నది, “వేదోనిత్యమధీయతాం, తదుతితం కర్మస్వనుష్ఠ్యతాం!”  అని. తత్త్వతః యీ వేదపారాయణ వైదిక సాంప్రదాయంలో విధించబడ్డ గురుచరిత్ర – ప్రబోధాల పారాయణే!

యూదులలో ఏసుక్రీస్తుకు ముందు ప్రభవించిన ప్రవక్తల (సద్గురువుల) జీవిత ప్రబోధాలు యూదుమతానుయాయుల పవిత్రపారాయణ గ్రంథమయితే, ఏసుప్రభువు యొక్క చరిత్ర-బోధనలు (బైబిల్) క్రైస్తవుల పవిత్రపారాయణ గ్రంథము. బైబిల్ లో ఏసుక్రీస్తును ‘రబ్బీ’ (the Master, సద్గురువు) అని ప్రస్తావించబడి వుంది. ఇక, మహమ్మద్ ప్రవక్త జీవితవిశేషాలు-బోధనల రూపమైన ఖురాన్ మహమ్మదీయులు శ్రద్ధగా పారాయణ చేసుకునే పవిత్రగ్రంథం. అంటే, అవన్నీ ఆయా మతసాంప్రదాయాలను ప్రవర్తిల్లచేసిన పరిపూర్ణ సద్గురుమూర్తుల చరిత్ర-బోధనల పారాయణన్న మాట!

తపస్సంపన్నులు, సత్యద్రష్టలు యైన మహర్షులు, సద్గురువులు, ఆచార్యులు వైదిక సంప్రదాయాన్ని ప్రభావితం చేస్తున్నంత కాలం వైదికమతం విజ్ఞానస్ఫూర్తితో విలసిల్లింది. క్రమంగా యజ్ఞయాగాది కర్మకాండ యొక్క ప్రాబల్యం పెరిగి, తాత్త్విక ఆధ్యాత్మికపరమైన గురుసాంప్రదాయం సన్నగిల్లింది. తపఃస్వాధ్యాయ నిరతి, జ్ఞానప్రబోధనా సామర్థ్యం ఆచార్యస్థానానికి అర్హతలవడం మాని, ఆచార్యపదవి కేవలం వంశపరంపరాగతమో, వారస్తవపరంగానో మిగిలింది. ఆచార్యపీఠాలు అర్చకపీఠాలుగా మారిపోయాయి. ఇలా, సమర్థమైన గురుసాంప్రదాయం గుప్తమై లుప్తమై, కేవలం జడమైన కర్మకాండ ప్రబలమైంది. కేవలం ‘తంతు’ తలకెక్కితే, ఏ మతసాంప్రదాయమైనా వి'తంతు'వు కాక తప్పదు!

ఆ పరిస్థితిలో అప్పటివరకు గుప్తవాహినియైన సరస్వతీ నదిలా ప్రవహిస్తున్న గురుసాంప్రదాయం వాసుదేవతత్త్వంగా వెలికి వచ్చి, శ్రీకృష్ణుని ద్వారా భారతీయసంస్కృతిని తిరిగి పరిప్లావితం చేసింది. సర్వజీవుల హృదయాలలో వసించే దివ్యత్వమే వాసుదేవుడు. ఈ సత్యాన్ని వారికి బోధించి, వారిచే ఆ దివ్యత్వాన్ని దర్శింపచేయడానికి ఆ వాసుదేవతత్త్వమే జీవులమధ్య అవతరించి సద్గురుమూర్తులుగా వసిస్తుంది. అలా మనమధ్య వసించే దివ్యస్వరూపులైన సద్గురుమూర్తులే వాసుదేవులు. ఇదే, తరువాతి కాలంలో భాగవతసాంప్రదాయంగా ప్రఖ్యాతమైంది.

శ్రీకృష్ణవాసుదేవుని కృషితో పెంచబడ్డ యీ భాగవతకల్పవృక్షం తరువాతి కాలాల్లో శాఖోపశాఖలై విస్తరించి, ప్రఖ్యాతమైన వివిధ భక్తి జ్ఞాన యోగ సాంప్రదాయాలకు మూలకందమైంది. జైనసాంప్రదాయాలలోని తీర్థంకరసిద్ధాంతం, బౌద్ధంలోని బోధిసత్వుల జనన సిద్ధాంతం, టిబెట్ బౌద్ధంలోని పద్మసంభవ సాంప్రదాయం, యీ వాసుదేవతత్త్వ ప్రభావం వల్ల ప్రభవించిన అవైదిక రూపాలు.

శ్రీకృష్ణనిర్యాణం తరువాత కొన్ని శతాబ్దాలకు కృష్ణవాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగాకాక, లీలామానుషవిగ్రహుడుగా ఆరాధింపబడటం ప్రారంభమై ‘వాసుదేవుడ’నేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో, (మూల) వాసుదేవతత్త్వం (గురుసాంప్రదాయం) వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిలో ముఖ్యమైనది దత్తాత్రేయతత్త్వం.

శ్రీకృష్ణనిర్యాణం తరువాత కొన్ని శతాబ్దాలకు కృష్ణవాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగాకాక, లీలామానుషవిగ్రహుడుగా ఆరాధింపబడటం ప్రారంభమై ‘వాసుదేవుడ’నేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో, (మూల) వాసుదేవతత్త్వం (గురుసాంప్రదాయం) వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిలో ముఖ్యమైనది దత్తాత్రేయతత్త్వం.

భాగవత సాంప్రదాయానికి వేదతుల్యమైన శ్రీమద్భాగవతము దత్తాత్రేయుల వారిని విష్ణుమూర్తి యొక్క 23 అవతారాలలో ఒకరిగా, యోగవిద్యను ప్రవర్తిల్లజేసిన సద్గురువుగా పేర్కొంటున్నది. భాగవత సాంప్రదాయమనే మహావృక్షం నుండి ఒక ప్రత్యేక శాఖగా బయలుదేరిన యీ దత్తసాంప్రదాయం ఉత్తర భారతదేశంలో – ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో – శాఖోపశాఖలుగా విస్తరించింది. నాథ, మహానుభావ, దత్త సాంప్రదాయాలు వీనిలో ముఖ్యమైనవి.

ఈ ఉపశాఖలలో దత్తాత్రేయులవారిని ప్రధానంగా ఆరాధించే దత్తసాంప్రదాయం మహారాష్ట్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహ సరస్వతీస్వామి వారివల్ల విఖ్యాతమైంది. ఈ సాంప్రదాయకులను ‘దత్తుల’ని అంటారు. ఇది ప్రధానంగా యోగమార్గానికి సంబంధించినది. పురాణేతిహాసాలు దత్తాత్రేయులవారిని యోగనాధుడనే పేర్కొన్నాయి. దత్తాత్రేయులవారు వివిధ కాలాల్లో, వివిధ ఆధ్యాత్మిక మార్గాలను ప్రవర్తిల్లజేయడానికి వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తుంటారనేది యీ సాంప్రదాయకుల విశ్వాసం. ఇది భాగవత సాంప్రదాయంలో చెప్పబడ్డ విష్ణుఅవతార సిద్ధాంతానికి (‘సంభవామి యుగేయుగే’) ప్రతిరూపం. “గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః” అన్న శాస్త్ర (స్కాందపురాణ) వచనానుసారం పరిపూర్ణ సద్గురుతత్త్వమైన దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడుగా భావించి తదనుగుణంగా ఆయన మూర్తిని రూపకల్పన చెయ్యటం జరిగింది. అందుకే దత్తమూర్తి మూడుతలల మూర్తి అయ్యాడు. అయితే, ఇది దత్త సాంప్రదాయం ఒక ప్రత్యేకశాఖగా రూపొందుతున్న కాలంలో జరిగిందే. ఎందుకంటే భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మ, మార్కండేయ పురాణాలేవీ దత్తాత్రేయుల వారిని త్రిమూర్త్యాత్మకుడుగా పేర్కొనడం లేదు! అత్రి అనుసూయలకు విష్ణు అంశంలో దత్తాత్రేయులు జన్మించారని మాత్రం కొన్ని పురాణాలు చెబితే, మరికొన్ని పురాణాలు అత్రిఅనసూయలకు మొత్తం ముగ్గురు కుమారులనీ, వారిలో విష్ణ్వాంశలో దత్తస్వామి, రుద్రాంశలో దుర్వాసముని, బ్రహ్మాంశలో చంద్రుడు జన్మించారని చెబుతున్నాయి. దత్తసాంప్రదాయాల్లో దత్తమూర్తిని పరదైవంగా ఉపాసించడం ప్రారంభమైన తరువాతే దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడిగా (మూడుతలల మూర్తిగా) భావనచేసి ఆరాధించడం ఆరంభమైంది. ఈ గురుసాంప్రదాయం బహుళప్రచారం పొందిన ఫలితంగా, అందరు సద్గురువులను (వారిలో వ్యక్తమైన సిద్ధి, పరిపక్వత దృష్ట్యా) దత్తాత్రేయుల వారి అంశావతారాలుగానో, పూర్ణావతారాలుగానో భావించడం మహారాష్ట్రదేశంలో ఆచారమైంది. ఈ దృష్ట్యానే శ్రీసాయిబాబాను కూడా దత్తావతారంగా అక్కడ భావిస్తారు. అంతే తప్ప శ్రీసాయిబాబా తాము దత్తావతారమని ఎక్కడా ఎన్నడూ ప్రకటించలేదు. సర్వదేవతాస్వరూపాలు తానే అని నిరూపణ ఇచ్చిన బాబా, కొందరు దత్తభక్తులకు తానే దత్తమూర్తినని కూడా నిదర్శనమిచ్చారు, అంతే!

మహారాష్ట్ర దేశంలో దత్తోపాసన నాథసాంప్రదాయంతో ప్రారంభమై, శ్రీపాదశ్రీవల్లభుల తరువాత ఒక ప్రత్యేక ఉపాసనా సాంప్రదాయంగా రూపుదిద్దుకొని, తరువాత శ్రీనృసింహసరస్వతీస్వామి (శ్రీగురుని) వల్ల ప్రఖ్యాతమైంది. ఈ నాథ దత్తసాంప్రదాయాలతో బాటు, మహానుభావ సాంప్రదాయమనేది మహారాష్ట్ర దేశంలో బాగా వేళ్ళూనుకొన్న సాంప్రదాయం. శ్రీగోవింద ప్రభువుచే ప్రారంభించబడినదని చెప్పబడే యీ పంథా, చక్రధరుల వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. మొదట భాగవత సాంప్రదాయాన్ని పూర్తిగా అవలంబించి, శ్రీకృష్ణుడినొక్కడినే పరాదైవతంగా ఆరాధించిన యీ పంథా తర్వాతికాలంలో దత్తోపాసనను కూడా స్వీకరించింది. భగవద్గీత, భాగవతము, చక్రధరులు రచించిన ‘సూత్రపాఠము’ తప్ప, కడకు వేద ప్రామాణ్యాన్ని కూడా ఈ పంథా అంగీకరించకపోవడం వల్ల, వర్ణాశ్రమ వ్యవస్థ (కుల వ్యవస్థ)ను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఆ కాలంలో యీ పంథా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై, ఎన్నో విమర్శల అపనిందల పాలైంది.

ఛాందస వైదికాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరిన నాథసాంప్రదాయానికి, పూర్తిగా వేదప్రామాణ్యాన్నే త్రోసి పుచ్చిన మహానుభావ పంథాకు స్ఫూర్తినిచ్చి ఎంతో ప్రభావితం చేసిన దత్తాత్రేయయోగ సాంప్రదాయం తరువాత కాలంలో పరమఛాందసమైన వైదిక కర్మకాండకు నెలవైంది!  ఎన్నో చారిత్రక కారణాలకు తోడు యీ పరిణామానికి ఒక కారణం – ‘శ్రీగురుచరిత్ర’!!

శ్రీనృసింహసరస్వతిస్వామి (c 1378-1458) నిర్యాణానంతరం సుమారు ఒక శతాబ్దం తరువాత (1538 ప్రాంతంలో) గంగాధర సరస్వతి అనే ఒక దత్తభక్తుడు మరాటీభాషలో యీ గ్రంథాన్ని రచించాడు. తాను శ్రీగురుని అనుమతితో ఆ గ్రంథం వ్రాస్తున్నానని శ్రీగంగాధర సరస్వతి వ్రాసిన ఒక్కమాట ఆధారంగా, గంగాధరుని శ్రీనృసింహ సరస్వతీ స్వామి వారి సమకాలికునిగా కొందరు చేసిన నిర్ణయం సరైనది కాదు. గంగాధరుని ‘అనుమతి’ ప్రసక్తి కేవలం గ్రంథరచనా సాంప్రదాయానికి సంబంధించినదే. 1854 -1914 మధ్యకాలంలో జీవించిన శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామి కూడా శ్రీగురుచరిత్రను సంస్కృతభాషలోకి అనువదిస్తూ, తాను దత్తస్వామి ‘ప్రత్యక్ష’ ఆజ్ఞ మేరకు ఆ గ్రంథరచన చేస్తున్నానని వ్రాసారు. అంతేకాక, శ్రీనృసింహ సరస్వతిస్వామికి ఐదుతరాల తర్వాత గంగాధరుడు జన్మించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి కూడా. దీనివల్ల స్పష్టమయ్యేదేమంటే, గంగాధరసరస్వతి స్వయంగా శ్రీగురుని ముఖఃతా వారి బోధను వినే అవకాశంలేదు. అంతకుముందు సిద్ధముని అనే దత్తభక్తుడు రచించాడని చెప్పబడే చిన్న సంస్కృత గ్రంథం ఆధారంగానూ, తాను కర్ణాకర్ణిగా విన్న విషయాల ‘ఆధారంగా’ను శ్రీపాద శ్రీవల్లభుల (c 1323-53) యొక్క, శ్రీగురుని యొక్క జీవిత విశేషాలను గ్రంథస్తం చేసాడు శ్రీగంగాధరసరస్వతి.

హిందూ-ముస్లిం మతాల సమైక్యతసాధనకు కృషి చేసిన ఆధ్యాత్మిక ఉద్యమాలలో దత్తసంప్రదాయానికి చెందిన నాథపంథీయులు, శ్రీనృసింహసరస్వతీస్వామి వారివల్ల ప్రభావితులైన దత్తపంథీయులు వున్నారు. అయితే, శ్రీనృసింహసరస్వతీస్వామి అనంతరం ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రలలో నెలకొన్న సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఇస్లాం మతప్రాబల్యాన్నరికట్టి, సనాతన హైందవధర్మాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొందరు ఉద్యమించారు. ఆ ఉద్యమం ‘మహారాష్ట్ర ధర్మం’ పేర తరువాత ప్రఖ్యాతమైంది. దత్తపంథీయులు కూడా ఆ ఉద్యమాలచే ప్రభావితులయ్యారు. ఆ కాలంలో రచింపబడ్డ శ్రీగురుచరిత్ర ‘మహారాష్ట్ర ధర్మాన్ని’ ప్రతిపాదించిన ప్రథమ గ్రంథమని చెప్పవచ్చు. సామాజిక ప్రతిఘటనా రూపమైన ఈ ‘మహారాష్ట్ర ధర్మోద్యమం’ తరువాత కాలంలో శ్రీసమర్థ రామదాసస్వామివారి స్ఫూర్తితో పరాకాష్ఠ నందుకుంది. అందుకనే, శ్రీగురుని జీవితవిశేషాలను గ్రంథస్తం చేయడంతో బాటు వివిధ పురాణాలనుండి వ్రతప్రాయశ్చిత్త మహిమ, కర్మకాండ ప్రాశస్థ్యాన్ని వర్ణించే విషయాలను తనకు తోచిన విధంగా ఎంపిక చేసి, శ్రీగురునినోట చెప్పించాడు శ్రీగంగాధరసరస్వతి. గంగాధరుడు తన శ్రీగురుచరిత్రలో శ్రీగురుని నోట పలికించిన ‘బోధ’ యథాతథంగా కొన్ని పురాణగ్రంథాలలో మనకు కనిపిస్తుంది.

శ్రీగురుచరిత్రలోనే చెప్పబడినట్లు మహమ్మదీయులను (రజకుల వంటి) శూద్రులను ఆదరంతో శిష్యులుగా స్వీకరించిన శ్రీగురుడు కుల వ్యవస్థను ప్రోత్సహించాడనటం హాస్యాస్పందం. సతీసహగమనం వంటి దురాచారాల ప్రశంస, రుద్రాక్షమహిమ వంటి బాహ్యాచారాడంబరాల పొగడ్త, కృశ్చచాంద్రాయణాది ప్రాయశ్చిత్త కర్మల, వివిధవ్రతవిధానాల స్తోత్రము, వర్ణాశ్రమ ధర్మాల (కులవ్యవస్థ) సమర్ధన, పాతివ్రత్య మహిమ, స్త్రీ నింద, వివిధ బాహ్య శౌచ ప్రక్రియల వివరణ, కర్మకాండ మొదలయినవన్నీ శ్రీగురుని నిజబోధ అయ్యే అవకాశం లేదు. అర్థరహితమైన ఆచార కర్మకాండలకు వ్యతిరేకంగా ప్రవర్ధిల్లిన భాగవతసాంప్రదాయంలో జనించి, వైదికాచారకాండను, కులవ్యవస్థను తీవ్రంగా నిరసించిన నాథసాంప్రదాయాన్ని, వేదప్రమాణాన్నే త్రోసిరాజని, పరమ ‘అవైదిక’ మతంగా గణుతికెక్కిన మహానుభావపంథాను ప్రభావితం చేసిన దత్తసాంప్రదాయం శ్రీగురుచరిత్రలో (పైన) పేర్కొన్న అంశాలకు ఆలంబనమెలా కాగలదు?

అంతేకాక, దత్తాత్రేయులవారు వాతరశనఋషి సాంప్రదాయానికి చెందినవాడని ప్రతీతి. వాతరశనులు ‘శ్రమణుల’ని శ్రీమద్భావగవతము స్పష్టంగా పేర్కొంటున్నది, “వాతరశనాయ ఋషియః శ్రమణా....”. జైనులు శ్రమణులు; బౌద్ధమతంపై కూడా శ్రమణుల ప్రభావం వుంది. ఈ శ్రమణులు పరమ అవైదికులుగా పురాణేతిహాసాలలో ప్రసిద్ధి. ఈ శ్రమణమతం వేదప్రామాణ్యాన్ని అంగీకరించదు; వైదిక కర్మకాండను నిరసిస్తుంది; కులవ్యవస్థను తూర్పారబడుతుంది. ఈ విధంగా చూచినా ‘శ్రీగురుచరిత్ర’లో గంగాధర సరస్వతిచే శ్రీగురుబోధగా చెప్పబడ్డ అంశాలు నిజమైన దత్తసాంప్రదాయంలో ఇమడవు.

అలాకాదు, సర్వవైదికాచారాలను విసర్జించిన అవధూతతత్త్వం, పరమ ఛాందసమైన కర్మకాండపరమైన సంప్రదాయం – ఈ రెండూ దత్త సాంప్రదాయమనే నాణానికి బొమ్మబొరుసుల వంటివని కొందరు ప్రవచిస్తారు. ఇది కేవలం పైన చెప్పిన ఆధ్యాత్మిక తిరోగమన ధోరణిని సమర్థించే వంచనాశిల్పంలో భాగమే తప్ప, దీనికి ఏ విధమైన నిర్దిష్ట శాస్త్రాధారం లేదు. అత్రిమహర్షి యే ‘పుత్రకామేష్టి’ వంటి యాగమో చేసి దత్తమూర్తిని పుత్రుడుగా పొందలేదు. వాతాశనుడై (ప్రాణాయామం ద్వారా) అత్రిమహర్షి చేసిన తపోయోగ ఫలితంగా దత్తమూర్తి ఆవిర్భవించాడు. అత్రి సాంప్రదాయానికి దత్తుడై దత్తాత్రేయుడైనాడు. మహాతపస్విగ, సిద్ధుడుగ, యోగనాథుడుగ, సర్వబాహ్యాచారవర్జితుడైన అవధూతగ, (కొన్నిచోట్ల) మద్యమాంస మైధునముల వంటి అవైదిక (తాంత్రిక) విధానాలలో మగ్నమైనవాడుగ మనకు పురాణేతిహాసాలలో దత్తాత్రేయులవారు దర్శనమిస్తారు. యదుమహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలయిన వారికి దత్తాత్రేయులవారు చేసిన బోధలో కూడా ఎక్కడా కర్మకాండ కనిపించదు. భక్తి, జ్ఞాన, యోగ మార్గాల త్రివేణీ సంగమమే దత్త సాంప్రదాయం. పైన పేర్కొన్న ఆధారాల దృష్ట్యా శ్రీగురుచరిత్రలో శ్రీగురుని బోధనలుగా చెప్పబడ్డ విషయాలు మూల దత్తసంప్రదాయానికి విరుద్ధమైనవనీ, అవి కేవలం గంగాధర సరస్వతి (పురాణోక్తంగా) చేసిన స్వకపోలకల్పలేననీ స్పష్టమవుతుంది.

అయితే, మరి శ్రీనృసింహసరస్వతీస్వామివారి యథార్థబోధ ఏమై యుండాలనే ప్రశ్న పైన చేసిన చర్చ యొక్క పర్యవసానంగా కలగడం సహజం. శ్రీగురుని బోధనలు కూలంకషంగా విని, ఆయనచే ఉపదేశం పొంది, ఆయన సన్నిధిలో సాధనచేసి పరిపూర్ణులైన ప్రత్యక్ష శిష్యుల ద్వారా తప్ప శ్రీగురుని యదార్థబోధ తెలిసే అవకాశం లేదు. అటువంటి వారిలో శ్రీజనార్దనస్వామి ఒకరుగ మనకు కనిపిస్తున్నారు. (మహారాష్ట్రకు చెందిన) ప్రముఖ పండితుడు-పరిశోధకుడుయైన ప్రొఫెసర్ G.S.ఘురే(Prof. G.S.Ghurye) యీ విషయంగా, “హిందూ-మహమ్మదీయుల మధ్య సామరస్య సాధన దత్తసంప్రదాయ ముఖ్య లక్షణమనేది స్పష్టం. సంత్ జనార్దనస్వామి, ఆయన శిష్యులైన ఏకనాథుడు తదితరులు అసలైన దత్తసంప్రదాయానికి ప్రతినిధులు. అయితే, యీ సంప్రదాయం శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహసరస్వతీస్వామి వార్ల వల్ల ప్రజాబాహుళ్యంలో బహుళ ప్రచారాన్ని పొందింది” అంటారు. సంత్ ఏకనాథ్ మహరాజ్ గురువుగా శ్రీజనార్దనస్వామి ప్రఖ్యాతుడు. శ్రీజనార్దనస్వామి మొదట భోగలాలసునిగా వుండి, శ్రీనృసింహసరస్వతిస్వామివారి బోధనలచే ప్రభావితుడై, పరివర్తన చెంది, శ్రీగురునిచే (గాణుగాపూరులోని ఔదుంబర వృక్షఛాయలలో) దత్తోపాసనలో ఉపదేశం పొంది, ఆయన సన్నిధిలోనే సాధనచేసి పరిపూర్ణుడైనాడని చెప్తారు. ఈనాటికీ మహారాష్ట్రదేశంలో దత్తాత్రేయులవారి అంశావతారంగా ఆరాధింపబడే ఈయన తరువాత దేవగిరిలో స్థిరపడ్డాడు. ఏకనాధుడు అతి పిన్న వయస్సులో శ్రీజనార్దనస్వామిని ఆశ్రయించి, ఆయన సన్నిధిలో శిక్షణలో ఎన్నో ఏళ్ళు ఆధ్యాత్మికసాధనలలో గడిపాడు. శ్రీజనార్దనస్వామి మొదట ఏకనాథునికి దత్తోపాసనలో ఉపదేశమిచ్చి సాధన చేయించారు. ఏకనాథునికి ఎన్నోసార్లు ఒక ముస్లిం ఫకీరు (అవధూత) రూపంలో దత్తాత్రేయ సాక్షాత్కారం కూడా కలిగిందని చెప్తారు. ఆ పైన శ్రీజనార్దనస్వామి ఏకనాథునికి కృష్ణోపాసనను విధించారు. అంతేకాదు! దత్తసాంప్రదాయానికి మూలకందమైన భాగవతసాంప్రదాయాన్ని తిరిగి ప్రవర్తిల్లచేయడానికో, మరే కారణంగానో శ్రీమద్భాగవతం పై వ్యాఖ్యను రచించమని ఏకనాథుని ఆదేశించాడు. ఆ ఆదేశఫలితమే ఏకనాథ భాగవతము. మహానుభావపంథాలోవలే, శ్రీజనార్దన ఏకనాథులలో కూడా ‘శ్రీకృష్ణ-దత్తాత్రేయ’ ఉపాసనల సమన్వయం కనిపిస్తుంది. దత్తోపాసనను కాకుండా, శుద్ధమైన కృష్ణభక్తిని ప్రవర్తిల్లచెయ్యమని శ్రీజనార్దనస్వామి ఏకనాథునికి చేసిన ఆదేశానికి శ్రీనృసింహ సరస్వతిస్వామి ఆమోదము ఆదేశము తప్పక ఉండి ఉండాలి. ఎందుకంటే, శ్రీజనార్దనస్వామి, శ్రీనృసింహసరస్వతి రచించారని చెప్పబడే ఎన్నో అభంగాలు భక్తితత్త్వంతో తొణికిసలాడుతుంటాయి. వాటి ఆధారంగా చివరకు కొందరు పండితులు శ్రీనృసింహసరస్వతి, శ్రీజనార్దనస్వామివార్లు ఇద్దరూ పాండురంగ భక్తపరంపరకు చెందిన వార్కరీ సాంప్రదాయానికి చెందిన వారని కూడా భావిస్తున్నారు! ఉదాహరణకు, ప్రముఖ మరాఠీ సాహిత్యపరిశోధకుడు డాక్టర్. ప్రభాకర్ మాచ్వే ఇలా అంటారు: “నామదేవుని అనంతరకాలంలో ప్రభవించిన సంతకవులలో నరసింహ సరస్వతి, జనార్దన స్వామి వున్నారు. వారిరువురూ వార్కరీ పంథ్ కు చెందినవారు. వారు రచించారని చెప్పబడే భక్తిగీతాలు ఎన్నో లభిస్తున్నాయి.”

ఈ దృష్ట్యా దత్తసాంప్రదాయ హృదయం, బోధనల యొక్క పరాకాష్ఠ మనకు ఏకనాథుని రచనలలో ముఖ్యంగా ఏకనాథ భాగవతంలో లభించగలదు. కులమత దురభిమానాన్ని, వ్యర్థ ఆచారకాండను నిరసిస్తూ, సార్వజనీనమైన శుద్ధ భక్తిజ్ఞానాలను బోధిస్తున్నది ఏకనాథ భాగవతం. శ్రీసాయిబాబా తన భక్తులను పారాయణ చెయ్యమని విధించిన గ్రంథాలలో మొట్టమొదట పేర్కొనవలసింది ఏకనాథ భాగవతమేనన్న విషయం కూడా గమనార్హం.

అయితే కుశాభావు అనే భక్తునికి శ్రీగురుచరిత్ర పారాయణను శ్రీసాయిబాబా ఎందుకు విధించినట్లు? - అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.

సాయిబాబా ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కుశాభావుకు శ్రీగురుచరిత్ర పారాయణ విధించారో నన్న విషయాన్ని తెలియజేసే బాబా ఆదేశం యొక్క పూర్వాపరాలు దాటవేసి, ఊరకే 'శ్రీసాయినాథుడు కుశాభావు అనే భక్తునిచే 108 సార్లు పారాయణ చేయించిన అద్భుత గ్రంథం' - అని కొందరు ప్రచారం చేస్తున్న మాట వాస్తవమే. కానీ, శ్రీసాయి ఏ సందర్భంలో అలా ఆదేశించారో తెలుసుకొంటే, ఆ ప్రచారంలోని వాస్తవం అర్థం కాగలదు. 

కుశాభావు అసలు పేరు కృష్ణాజీ కాశీనాథ్ జోషి. అతడు చిన్నతనంలోనే దత్తమహరాజ్ అనే గురువును ఆశ్రయించి, దత్తోపాసన యోగాభ్యాసంలో శిక్షణ పొందాడు. కొంతకాలానికి తన సాధన లక్ష్యాన్ని మరచి, తన గురువుద్వారా మారణ వశీకరణాది క్షుద్రవిద్యలను సాధించే మంత్రాలు పొంది, వాటి సాధనలో నిమగ్నమయ్యాడు. కొన్ని సిద్ధులు ప్రదర్శించడం నేర్చాడు కూడా. అయితే కుశాభావు గురువైన దత్తమహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోతూ, అతణ్ణి శ్రీసాయిబాబాను ఆశ్రయించమని ఆదేశించాడు. తన గురువు ఆదేశానుసారం కుశాభావు శిరిడీ వెళ్ళాడు. సిద్ధుల ప్రదర్శన ఆపుతానని అతడు ప్రమాణం చేస్తేగానీ బాబా అతడిని మసీదులో అడుగిడనివ్వలేదు. ఆపైన, అతణ్ణి మసీదులో ఒక మూల కూర్చుని, రోజంతా శ్రీసమర్థ రామదాసస్వామి రచించిన దాసబోధను పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు బాబా. అంతకు మించి మరే ఉపదేశము చెయ్యలేదు. అలా అతడు సుమారు మూడు సంవత్సరాలు శిరిడీలో వున్నాడు. ఒకసారి బాబా అతడితో, “ఆ మూడుతలల మనిషిని చూడు!” అన్నారు. ఆమాటకు బాబా తనను గాణుగాపూరు వెళ్ళి, దత్తపాదుకలు దర్శించి రమ్మన్నారని అర్థం చేసుకొని, కుశాభావు గాణుగాపూరు వెళ్ళాడు. అప్పటినుండి ప్రతిఏటా గురుపూర్ణిమకు, మాఘపూర్ణిమకు (ఏటా మొత్తం రెండుసార్లు) గాణుగాపూరు సందర్శించడం నియమంగా పెట్టుకొన్నాడు కుశాభావు. ఒకసారి అతడు అలా గాణుగాపూరు బయలుదేరుతుంటే బాబా అతడిని గాణుగాపూరులో గురుచరిత్రను 108 సార్లు పారాయణ చెయ్యమని ఆదేశించారు. అతడు గాణుగాపూరులో 10-11 మాసాలుండి ఆ పారాయణ విధిని పూర్తిచేసాడు. బాబా వద్దకు రావడానికి ముందే దత్తోపాసనలో ఉపదేశం పొందిన ఒక దత్తోపాసకునికి గాణుగాపురంలో ఆ క్షేత్రసాంప్రదాయానుసారం శ్రీగురుచరిత్ర పారాయణ చేసుకొమ్మని చెప్పారు బాబా. 

శ్రీగురుచరిత్రలో చెప్పబడ్డ శ్రీగురుని, శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర- లీలలకు తప్ప, దానిలోని ఛాందస ఆచారకాండకు తన ఆమోదం లేదని ఆ కుశాభావుకే స్పష్టంగా చెప్పడానికా అన్నట్లు, ఏకాదశి రోజున ఉపవాసనియమం విధించుకొన్న అతడి చేత ఒక ఏకాదశి నాడు ఉల్లిపాయలు కూడా (పట్టుబట్టి) తినిపించారు శ్రీసాయి. అంతేకాదు! శ్రీగురుచరిత్ర పారాయణ నియమం గల దత్తపంథీయుడైన కుశాభావుకు తప్ప మరింకెవ్వరికీ శ్రీగురుచరిత్ర పారాయణ చెయ్యమని బాబా ఆదేశించలేదు!

శ్రీసాయిబాబా చరిత్ర చదివితే శ్రీసాయి బోధించిన, ఆచరించిన తత్త్వం శ్రీగురుచరిత్రలో చెప్పబడ్డ అర్థరహిత ఆచారకాండకు విరుద్ధమని ఇట్టే బోధపడగలదు. ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ప్రభవించిన అన్ని మతసాంప్రదాయలకు చెందిన మహాత్ముల, సద్గురువుల చరిత్రలను సాధకులందరూ అవశ్యం చదువవలసిందే. అందులో వారు ఎన్నుకొన్న సద్గురుమూర్తి యొక్క చరిత్రను తప్పక విధిగా పారాయణ చెయ్యాలి. సాయిభక్తులకు సాయినాథుడే సద్గురువు, దైవం, సాధన, గమ్యం! సాయిభక్తులకు శ్రీసాయిచరిత్రే నిజమైన గురుచరిత్ర! అందుకే, శ్రీహేమాద్పంతు విరచిత శ్రీసాయిసచ్చరిత్ర యొక్క ఉపోద్ఘాతం ఇలా ఉద్బోధిస్తున్నది: “శ్రీగురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపైనాధారపడి యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము. దాని నాచరణలో బెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు గూడా దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీసాయిసచ్చరిత్ర విషయమట్టిది కాదు. కనుక, శ్రీసాయిసచ్చరిత్రమును యీనాటి ‘గురుచరిత్ర’యని చెప్పవచ్చును.” (చూ. శ్రీసాయిసచ్చరిత్ర, ఉపోద్ఘాతము). అవకాశముంటే, శ్రీసాయి చూపిన బాటకు చెప్పిన బోధకు విరుద్ధం కాని మహాత్ముల బోధనలు, చరిత్రలు శ్రద్ధాజిజ్ఞాసలతో చదువుకొనవచ్చు. “పనిచేయి! సద్గ్రంథాలు చదువు! దేవుని నామం ఉచ్ఛరించు!” అన్నది శ్రీసాయి ఉపదేశము. పరమోత్కృష్టమైన సద్గురుభక్తిని ప్రబోధించే శ్రీగురుచరిత్ర వంటి ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలను సద్గురుపథంలో పయనించే వారందరూ జిజ్ఞాసతో అవశ్యం పఠించవలసిందే! ఆ గ్రంథాలలో సద్గురునాథుడైన శ్రీసాయినాథునికి అనన్యంగా శరణుపొందడానికవసరమైన అవగాహనను పెంపొందించుకొనే అంశాలను వివేకంతో గ్రహించాలి! అలా గ్రహించి, ఆ గ్రంథాలలో శ్రీసాయిలీలాప్రబోధాలకు సమన్వయపడని అంశాలను మనసునుండి నిష్కర్షగా విసర్జించగలగాలి. అలాంటి విచక్షణాయుతమైన సద్గ్రంథపఠనం వల్ల, బాబానే అన్నట్లు, “భక్తులు పరిశుద్ధులౌతారు. భగవంతుడు ప్రసన్నుడై భవబంధాలను తొలగిస్తాడు!” అంతేకానీ, శ్రీసాయితత్త్వానికి విరుద్ధమైన విషయాలను ‘పారాయణ’ పేరుతో తలకెక్కించుకొని, అవి సమన్వయపడక, అనవసర భావసంఘర్షణకు లోనవడం అవివేకం! అంతేగాదు! శ్రీసాయిబాబా చూపిన శుభ్రమార్గంలో త్వరితగతిన పురోగమించడానికి అదొక ఆటంకం కూడా!

((ఆయా సాధకుల గురుసాంప్రదాయానుసారం వారికి తగు ఆదేశాలనిచ్చి, వారివారి మార్గాలలో సాధకులను ప్రోత్సహించేవారు బాబా. కుశాభావుకు బాబా చేసిన ఆదేశం అటువంటిదే. ఇది సాయిని సద్గురువుగ, పరదైవంగా భావించే సాయిభక్తులకు వర్తించదు.))

((శ్రీసాయి సచ్చరిత్రలో ఉటంకించబడ్డ శ్రీసాఠే స్వప్నానుభవం మాటేమిటనే సందేహం యీ సందర్భంగా కొందరకు కలుగవచ్చు! శ్రీసాఠేను శ్రీగురుచరిత్ర పారాయణ చెయ్యమని శ్రీసాయిబాబా ఆదేశించలేదు. ఆ గ్రంథపారాయణ విధిని శ్రీసాఠే తనకు తానే విధించుకొని ఒక సప్తాహం పారాయణ పూర్తి చేసాడు. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో బాబా ఆ గ్రంథాన్ని వివరిస్తున్నట్లు దర్శనమైంది. దానర్థమేమనీ, తానింకా పారాయణ కొనసాగించాలా? వద్దా?౼అని బాబానడుగమని శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ కు ఉత్తరం వ్రాసాడు శ్రీసాఠే. ఎవరికి వారు విధించుకున్న యే నియమాన్నయినా, దానిపట్ల భక్తిశ్రద్ధలు పెంపొందించి, ద్విగుణీకృతమైన దీక్షతో వారి నియమాలను కొనసాగించేట్లు చేసేవారు బాబా. కుశాభావు విషయంలో జరిగింది కూడా ఇదే! శ్రీసాఠే ప్రశ్నకు సమాధానంగా, అతడిని పారాయణ ఇంకా కొనసాగించమని చెప్పారు బాబా! ఇక్కడ మరొక్క విషయం. పైన పేర్కొన్న సంఘటనలోని ‘సాఠే’ బొంబాయికి చెందిన వ్యాపారి; ఆయన శిరిడీలో వాడాను నిర్మించిన సన్నిహితసాయిభక్తుడైన శ్రీH.V.సాఠే కాదు!. 

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తి సాధన రహస్యం - సద్గురు సన్నిధిలో సాధన – దాని తత్త్వశోధన


సద్గురు సన్నిధిలో సాధన – దాని తత్త్వశోధన

శ్రీసాయిబాబా వంటి సమర్థ సద్గురుమూర్తి యొక్క సన్నిధి ప్రభావం సాధకుని అంతరంగంలో ఎటువంటి మార్పులు కలుగజేస్తుందో పరిశీలిద్దాం! అది ప్రత్యక్ష (భౌతిక) సాన్నిధ్యం కావచ్చు, లేదా పరోక్షమైన దివ్యసన్నిధి కావచ్చు! సద్గురు కృపావిశేష ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే ఆ మౌనరాగం యొక్క శృతిలయవిన్యాసాలు అవగతం కావాలంటే, ముందు మన అంతరంగం యొక్క స్వరూపస్వభావాలేమిటో కొంచెంగానయినా అవగహనమవ్వాలి కదా? సరి!

మన అంతరంగం ఒక కొలనువంటిదనుకొంటే, అందులోని నీరే మనలోని ఎఱుక లేదా చైతన్యం. సహజంగా నిశ్చలంగా ఉండే నీటిపై గాలి వీచడమో, ఏదైనా వస్తువులు బయటనుండి నీటిలో పడటమో జరగడం వలన చలనం కలిగి, ఆ చలనం అలల (తరంగాల) రూపంలో వ్యక్తమవుతుంది. అలానే బాహ్యజగత్తులోని వివిధ వస్తువుల, వ్యక్తుల, సంఘటనల పట్ల (వల్ల) మన ‘ఎఱుక’లో జరిగే వివిధ ప్రతిస్పందనలే అలలు అలలుగా మన మనస్సులో చెలరేగే ఆలోచనలు. ఆ బాహ్య విషయాలనే ప్రేరణలు కొలనులోనికి విసరబడ్డ మట్టిబెడ్డలవలె నీటి ఉపరితలాన్ని (మనస్సును) తాకి అలల సుడులు (ఆలోచనలు) రేపి, కొలను అట్టడుగుకు (హృదయంలోకి) చేరుకొని (విషయవాసనల రూపంలో) పేరుకుపోతాయి. నీటి (మనస్సు) ఉపరితలాన్ని తాకే వస్తువు (విషయప్రేరణ) యొక్క పరిమాణం, వేగాన్నిబట్టి అది సృష్టించే అలల తరంగదైర్ఘ్యం, వేగం ఆధారపడి వుంటాయి. ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు ఒక్కసారిగ వెంటవెంటనే మనస్సును తాకడం వల్ల అవి సృష్టించే సుడుల నుండి బయలుదేరే కెరటాలు ఒకదానితో ఒకటి కలసి మరో సరిక్రొత్త కెరటంగా రూపుదిద్దుకోవచ్చు; లేదా రెండుకెరటాలు పరస్పర విరుద్ధంగా ఢీకొని వాటి బలాన్ని కోల్పోనూవచ్చు! ఈ బాహ్య విషయప్రేరణలు సామాన్యంగా మన మనస్సుయొక్క మెలకువ స్థితిలోనే (జాగ్రదావస్థలోనే) మనకనుభవమౌతాయి. కనుక మెలకువ స్థితి యొక్క అంచు – అంటే, మెలకువకు నిద్రకు మధ్యనుండే సంధి – కొలను గట్టు వంటిదన్నమాట.

మెలకువ స్థితిలో మన మనస్సనే కొలనులో పడ్డ విషయప్రేరణలు సృష్టించిన అలలు ఒడ్డుకుచేరి, గట్టును ఢీకొని వెనక్కు ప్రతిస్పందిస్తాయి. అలా వెనక్కు ప్రతిస్పందించే అలల ప్రకంపనలే మనకనుభవమయ్యే కలలు (స్వప్నాలు)! ఒడ్డును ఢీకొనే అలల స్వరూపస్వభావాల మీద, వాటి వేగాన్ని బట్టి, వెనక్కు మరలే ప్రతికంపన ఆధారపడి వుంటుంది. అందుకనే జాగ్రదావస్థలో మనకు కలిగే అనుభవాల ‘నీడల’ మాదిరి కలలు మనకనుభవమవుతుంటాయి. ఈ కంపన – ప్రతికంపనల మధ్య నీరు (మనస్సు) తన సహజస్థితియైన స్థిరత్వం కోసం చేసే ప్రయత్నమే ‘సుషుప్తి’. వివిధ విషయాల ప్రేరణల వల్ల చెలరేగిన అలలతో అల్లకల్లోలంగా వుండే కొలనులా వుంటుంది సామాన్యంగా మన మనఃస్థితి. నీటి ఉపరితలం అలలతో అల్లకల్లోలంగా వున్నప్పుడు కొలనుయొక్క అడుగు స్పష్టంగా కనిపించనట్లే, చిత్తవృత్తుల తెరల మాటున అంతరంగపు అట్టడుగు పొరలలో చిరకాలంగా పేరుకొని పోయిన విషయవాసనలు మనకవగతం కావు.

ఈ స్థితిలో సద్గురు కృపావిశేషం వల్ల, జన్మాంతర ఋణానుబంధంవల్ల సాధకుడు ఆర్తితో సద్గురు సన్నిధిచేరి, ఆయనను ఆశ్రయిస్తాడు. అలా సద్గురు సన్నిధిని ఆర్తితో ఆశ్రయించే ‘అవసరం’ కలగడానికి దోహదం చేసే వివిధ సంఘటనలు అనుభవాలే ‘నిజానికి’ సద్గురు 'ప్రభావంవల్ల' మన అంతరంగంలో జరిగే ‘సాధన’ యొక్క మొదటిదశ! ప్రత్యక్షంగా సద్గురువును ఆశ్రయించడానికి ముందు జరిగే యీ ‘దశ’ సాధనలో ఒక దశగా మన ఎఱుకలోనికి రాదు. మన దృష్టిలో సద్గురువును ఆశ్రయించడంతోనే ‘సాధన’ మొదలయినట్లు లెక్క. కానీ, సద్గురు దర్శనానికి ‘దారితీసే’ పరిస్థితులను తమ దివ్యశక్తిచే మలచడంలో శ్రీసాయి వంటి సద్గురుమూర్తి ప్రసాదించే ‘మార్గదర్శకత్వం’ పూర్తిగ ఆ సద్గురుమూర్తికే ఎఱుక. “నా భక్తుణ్ణి నేనే ఎన్నుకొంటాను!” “నా భక్తుడు ఎంత దూరాన వున్నా – పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు – రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను. ఎవరూ వారంతటవారుగ నా వద్దకు రారు!” అని శ్రీసాయిబాబా చెప్పిన మాటల్లోని పరమార్థం ఇదే!

ఆర్తితో సద్గురు సన్నిధిని చేరగానే, సచ్చిదానంద స్వరూపమైన సద్గురు సన్నిధాన ప్రభావం వల్ల మన అంతరంగంలో సాగే కల్లోలం తక్షణం శాంతించి, అంతఃకరణ స్థిరత్వాన్ని పొందుతుంది. ఇదే సాధారణంగా మహాత్ముల సన్నిధిలోకి అడుగిడగానే మనకనుభవమయ్యే శాంతి ఆనందాలు, భద్రతాభావము! ఆ అనుభవం వల్ల సద్గురు సన్నిధిన చేరిన వ్యక్తి సద్గురువు పట్ల మరింతగా ఆకర్షింపబడతాడు. శ్రీసాయిబాబా, భగవాన్ శ్రీరమణమహర్షివంటి సద్గురుమూర్తులను దర్శించిన భక్తులందరికీ ఈ శాంతి ఆనందాలు ‘కొట్టొచ్చినట్లు’ అనుభవమయ్యేవి. ఈ అపూర్వ శాంతి ఆనందాలను గూర్చి శ్రీ జి.యస్.ఖాపర్డే, శ్రీమతి తార్కాడ్ మొదలైన భక్తుల స్మృతులు శ్రీసాయి చరిత్రలలో చూడవచ్చు. ఇది సద్గురు సన్నిధిలో సాధకుడు పొందే రెండవ దశ.

అలా సద్గురు సాన్నిధ్యానికి ఆకర్షింపబడ్డ భక్తుడు, మరికొంతకాలం ఆ శాంతి ఆనందాలను అనుభవిస్తూ, వాటిని సుస్థిరం చేసుకుందామనే తపనతో సద్గురు సాన్నిధ్యంలోనే వుంటూ ‘సాధన’ చేసుకోవాలని తలుస్తాడు. గురుకృప వుంటే అలా సద్గురు సాన్నిధ్యంలో వుండాలనే తలంపు నెరవేరుతుంది కూడా! కానీ, ఆ దివ్య సన్నిధిలో కొంతకాలం గడిపేసరికి, క్రమంగా సాధకుని అంతరంగంలో ఎప్పుడూ లేనంత భావతీవ్రతతో రకరకాల కోరికలు, విషయవాంఛలు, ప్రాపంచిక వ్యామోహాలు చెలరేగి, మనస్సు తిరిగి చంచలమవుతుంది! శాంతి ఆనందాల స్థానే ఏదో తెలియని హృదయవేదన చోటు చేసుకోనారంభిస్తుంది. మనసు ఓ పట్టాన ధ్యానంలో నిలువదు. ధ్యాస విషయానుభవాలవైపుకు లాగుతుంటుంది. మొదట బాగా జరుగుతూండిన జపధ్యానాలు అసలు జరగకుండా పోతుంటాయి. ఎందుకో అర్థం కాదు! చాలావరకు జయించేశామని 'అనుకొంటుండిన' కామము, కోపము, అసూయ మొదలయిన మనోవికారాలు ఇనుమడించిన భావతీవ్రతతో మనస్సును ఆక్రమించుకొంటాయి. నానారకాల ‘అపవిత్రపు’టాలోచనలు మనసులో తొంగిచూస్తుంటాయి. “ఛీ! ఛీ!! ఇదేమిటి? పవిత్ర సద్గురు సన్నిధిలో కూడా ఇటువంటి పాడుఆలోచనలు వస్తున్నాయే! నా అంతటి పాపాత్ముడు మరొకడుంటాడా?” అని తనను తాను ఛీదరించుకుంటాడు. చిత్తంలో తలెత్తే చెత్త ఆలోచనలను అణచివేయడానికి ప్రయత్నించేకొద్దీ, అవి రెట్టింపు బలంతో పైకి తన్నుకొస్తుంటాయి. 'ఆత్మసాక్షాత్కారం కోసం కూర్చుంటే నా పాపాత్మస్వరూపం ఇలా నగ్నంగా సాక్షాత్కరిస్తున్నదేమిటి?' అని కించపడతాడు.

ఒకవైపు తాను సాధింపదలచుకొన్న ఉన్నత లక్ష్యం; మరోవైపు విజృంభించిన మనో ‘బలహీనతల’ బలం! ఈ రెండింటి సంఘర్షణలో సాధకుడు నలిగిపోతాడు. తన స్థితి తనకే దుర్భరంగా తోస్తుంది. ఈ దుర్భరస్థితిలో సాధకుని అంతరంగంలో సాగే సంతాప సంఘర్షణా రూపమైన ‘మథనమే’అసలైన తపస్సు! ఈ సంఘర్షణ ఎంత తీవ్రంగా సాగితే సాధకుని స్థితి అంత దుర్భరంగా దుస్సహంగా తయారవుతుంది. ఈ దుర్భరస్థితి సాధకుని శ్రేయస్సుకేనని తెలిసిన సద్గురువుకు మాత్రం అతని ‘స్థితి’ ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది! సద్గురువు యొక్క ఆ సంతోషాన్ని గమనించిన సాధకుడు మాత్రం తన గురుదేవుడు తన బాధను అర్థం చేసుకోవడంలేదనీ, తన పరిస్థితి ‘పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణసంకటం’లా వుందని ఇంకా కృంగిపోతాడు.

వాసనల యీ హఠాద్విజృంభణకు కారణమేమిటి? కొలనులోని నీటి ఉపరితలం పైన అలల ఉధృతి (చలనం) తగ్గి నిశ్చలంగా అయ్యేకొలదీ, కొలను అడుగు స్పష్టంగా గోచరించడమేగాక, అంతకు ముందు అడుగున పేరుకొని వున్న కుళ్ళు నెమ్మదిగా పైకి తేలడం మొదలవుతుంది. ఇదే యీ దశలో సాధకుని అంతరంగంలో కూడా జరిగేది. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తుల విషయంలో అంతర్గతమైన వాసనలు ఒక్కసారిగా – కట్టలు త్రెంచుకొని ప్రవహించే వరద నీటిలా – అతి ఉధృతమైన వేగంతో వెలికి వస్తాయి. ఆ ఉధృతికి మనస్సుపై సామాన్యంగా వుండే అదుపు కోల్పోయి, చూచేందుకు వారు మనఃస్థిమితం తప్పినవారిలా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఇది తాత్కాలికం! చాలా అరుదుగా జరిగే విషయం! వాసనలు బహిర్గతమయ్యే వేగం తగ్గగానే, అంతకు ముందుకంటే ఎక్కువ స్థిరమైన నిర్మలమైన వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకుంటారు. స్వభావసిద్ధంగా మనసులో బలంగా ఏర్పడ్డ కోరికలు, వాసనలు సహజరీతిన బహిర్గతం కానివ్వకుండా బలవంతంగా త్రొక్కిపట్టి, బాహ్యంగా దానికి భిన్నమయిన మరో వ్యక్తిత్వాన్ని (personality) వ్యక్తంచేస్తూ, పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వపు ధోరణుల సంఘర్షణలో వ్యవహరించే వ్యక్తుల్లోనే సామాన్యంగా పైన చెప్పిన ‘ఉధృతపరిణామం’ కనిపిస్తుంది.

స్వభావసిద్ధంగా మనసులో బలంగా ఏర్పడ్డ కోరికలు, వాసనలు సహజరీతిన బహిర్గతం కానివ్వకుండా బలవంతంగా త్రొక్కిపట్టి, బాహ్యంగా దానికి భిన్నమయిన మరో వ్యక్తిత్వాన్ని (personality) వ్యక్తంచేస్తూ, పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వపు ధోరణుల సంఘర్షణలో వ్యవహరించే వ్యక్తుల్లోనే సామాన్యంగా పైన చెప్పిన(ఇక్కడ పైన అంటే నిన్నటి భాగంలో) ‘ఉధృతపరిణామం’ కనిపిస్తుంది. క్రమంగా ప్రాపంచిక వాసనల బలం పెరిగి, తన లక్ష్యం పట్ల శ్రద్ధ-దీక్ష క్షీణించడం ప్రారంభమవుతుంది. ‘ఎప్పుడెప్పుడు సద్గురు సన్నిధినుండి బయటపడదామా!’ - అని మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది. సాధనలో మనసు నిలువక, తిరిగి లౌకికవ్యవహారాలు చేపట్టానని చెప్పుకోడానికి అవమానం కనుక, సద్గురు సన్నిధినుండి బయటపడేందుకు అవసరమైన ఉపాయాలు కారణాలు వెతుక్కొంటాడు. అంతకు ముందు జ్ఞప్తికి రాని ధర్మాలు, సాంసారిక బాధ్యతలు - కర్తవ్యాలపట్ల హఠాత్తుగా ‘కళ్ళు తెరుస్తాడు’. వాటికి తానే అనివార్యమనే ప్రాముఖ్యాన్నిచ్చి, సద్గురువు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యపు కక్ష్యనుండి రాకెట్ వేగంతో బయట పడతాడు. కాదు! బయట పడ్డానని భావిస్తాడు. కానీ, సద్గురుని ప్రేమ పంజరం నుండి బయట పడ్డాననుకునే ఆ సాధకుడనే పిచ్చుక, తన కాలికి సద్గురు కృపావీక్షణమనే దారం కట్టబడివున్నదని గ్రహించడు. సర్వత్రా నిండివున్న సద్గురు అనుగ్రహశక్తి సాధకుణ్ణి తిరిగి సాధన కక్ష్యలోకి రప్పించే పరిస్థితులను కల్పించసాగుతుంది. సామాన్యంగా ఎక్కువ శాతం సాధకులు ఈ దశలోనే శ్రద్ధాయుతమైన సాధనకు తాత్కాలికంగా దూరం అవుతారు.

సద్గురువు సశరీరులుగా వుంటే ఇంకో ప్రమాదం కూడా వుంది! బాహ్యంగా సద్గురు సన్నిధినుండి దూరంగా పోలేని పరిస్థితులే వుంటే, - హృదయాంతరాళాల లోపలి పొరలనుండి బహిర్గతమవుతున్న విషయవాసనా ప్రకోపం వల్ల – మనసు సద్గురుసన్నిధిలోనే తన లౌకికవాసననల అభివ్యక్తీకరణకు పరిస్థితులు కల్పించుకునేందుకు ఆయత్తమౌతుంది. అందుకే సద్గురుమూర్తులను ఆశ్రయించిన ఎందరో సాధకులు క్రమంగా తాము అక్కడకొచ్చిన లక్ష్యం మరచిపోయి సాటి భక్తులతోటి వర్గపోరాటాలతో మత్సరాలతో, (సంస్థలుంటే) సంస్థాగతమైన వ్యవహారాలలో తలదూర్చి ‘ఆధ్యాత్మిక రాజకీయాల్లో మునిగి’పోతారు. శ్రీసాయి వంటి సద్గురుమూర్తుల సన్నిధిలో జరిగే ఈ వాసనా చక్రభ్రమణ విజృంభణాన్ని తట్టుకొని ‘శ్రద్ధా సబూరీలతో' ఎంతవరకు తనను తాను నిలువరించుకోగలడోనన్న దానిపై సాధనలో జయాపజయాలు ఆధారపడి ఉంటాయి!

శ్రీఉపాసనీబాబాను తరచు తమ దర్శనానికి కూడా మసీదుకు రాకుండా ఖండోబా ఆలయంలోనే ఏకాంతంగా ‘ఊరక కూర్చోమని’ బాబా ఆదేశించిన కారణాలలో ఇదీ ఒకటి. అయినా, ఈ విషయంలో సాయిభక్తులకు మాత్రం ఎటువంటి భయానికి తావులేదు. ఎందుకంటే, తన 'భక్తుని ఎన్నటికీ పతనం కానివ్వననీ', (ఆంతర్యంలోగానీ, బాహ్యంగాగానీ) 'అతడు తనకెంత దూరానవున్నా – సప్తసముద్రాల కావలవున్నా – పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు – తమ వద్దకు రప్పించుకొంటాననీ' కదా బాబా ఇచ్చిన హామీ! ఇకనేమి? (ఉపాసనీబాబా విషయంలో జరిగినట్లు) సద్గురు కృపాబలం వల్ల తప్పనిసరైతేనేమి, సాధకుని వివేకబలం వల్లనైతేనేమి, తన లక్ష్యశుద్ధిని కాపాడుకొని సద్గురు సన్నిధిలో సాధన కొనసాగిస్తే ఈ వాసనాక్షయపర్వంలో నాల్గవ అధ్యాయం ఆరంభమౌతుంది. ఈ దశలో సాధకుడు తన ప్రయత్నం ఒట్టి భ్రమేననీ, నిజానికి తన సాధనను నడిపించేది సద్గురుకృపాహస్తమేననీ స్పష్టంగా గ్రహిస్తాడు.

శ్రీసాయిబాబా వంటి సమర్థ సద్గురువు తన దివ్యశక్తిచేత సాధకుని అంతరంగంలో పేరుకొనివున్న మలిన వాసనలను కొన్నిదివ్యానుభవాల ద్వారా నిర్మూలిస్తాడు. ఎన్నో జన్మలు కఠోరతపస్సు చేసినా క్షాళనకాని ఎన్నో మలిన విషయవాసనలను సద్గురువు కేవలం తన కృపావిశేషంతో మటుమాయం చేస్తాడు. బాబా తమ లీలాప్రబోధాల ద్వారా సద్భావనలు మన అంతరంగపు లోతులలో నాటుకొనేలా ఎలా చేయగలరనేది శ్రీసాయిబాబా చరిత్ర చదివితే ఇట్టే అవగతమవుతుంది. ఇక అంతఃకరణ మాలిన్యాన్ని శుద్ధి చేసేందుకు సద్గురువు సామాన్యంగా ఎన్నుకొనేది, వివిధ ‘స్వప్నానుభవాలు’, దివ్యదర్శనాలు. ఎందుకంటే, నిద్రావస్థలోను, సరైన ధ్యానస్థితిలోను సాధకుని అహంకారం బలహీనంగా పలుచగా వుండి, సద్గురు ప్రభావాన్ని నిరోధించకుండా గ్రహించి, ఆయన సంస్కరణ కార్యాన్ని సుగమం చేస్తుంది.

జాగ్రదావస్థలో కలిగిన అనుభవాల ప్రతికంపనలే కలల (స్వప్నాల) రూపంలో మనకవగతమవుతాయని ముందు తెలుసుకొన్నాము. కానీ, సామాన్యంగా మనకొచ్చే స్వప్నాలు మన విషయవాసనలను ఇంకా బలపరచి, వాటిని భద్రంగా హృదయపులోతుల్లోకి నెట్టివేస్తాయి. కానీ, సద్గురుసన్నిధిలో సాధకునికి అనుభవమయ్యే స్వప్నాలు అతని అంతరాళపు లోపలి పొరలలో దాగిన వాసనలను బయటికి నెట్టి, వాటిని నిర్మూలిస్తాయి. అటువంటి దివ్యానుభవం కలిగిన తరువాత సాధకుని మనఃస్థితిలోను, ఆలోచనాధోరణిలోను, దృక్పథంలోను పెద్ద మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒక్కోసారి ఆ స్వప్నానుభవాలు సాధకునికి భౌతికంగానూ, తన చుట్టూవున్న పరిస్థితులలోను కూడా మార్పులు కలుగజేస్తుంది. భీమాజీ పాటిల్ కు వచ్చిన ప్రమాదకరమైన క్షయరోగాన్ని బాబా రెండు స్వప్నానుభవాల ద్వారా నివారించిన లీల మొదలైనవి ఇందుకుదాహరణలు. అదే మనో చాంచల్యరూపాలైన సాధారణ స్వప్నాలకు, గుర్వనుగ్రహం వల్ల కలిగిన దివ్యస్వప్నాలకు ఉన్న తేడా. ఉప్పుకప్పురాల వలే అవి చూచేందుకు ఒకేలా వున్నా, అనుభవించి చూస్తే కానీ వాటి రుచులలోని తేడా బోధపడదు. ఈ కారణంగానే మహాత్ముల దర్శనానికి, వారి సమాధిస్థానాలయిన పవిత్రక్షేత్రాలకు వెళ్ళినపుడు కనీసం మూడు రోజులైనా ‘నిద్రచేయాలనే’ నియమం పెద్దలు విధించినది.

అయితే ఇక్కడ ఇంకొక్కమాట! సద్గురు సాన్నిధ్యంలో దీర్ఘకాలం వుంటూ సాధన చేసుకొనేవారిలోనే యీ సాధన పరిణామ దశలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. ఇతరుల్లో యీ పరిణామం అంత స్పష్టంగా గమనికకు రాదు. కొందరి విషయంలో, వారివారి వాసనాబలం దృష్ట్యాగానీ, మరే కారణంచేత గానీ, ఆ సాధకునిలోని కొన్ని వాసనల క్షయం భౌతికానుభవాల ద్వారానే జరగాలనేది సద్గురుని సంకల్పమయితే, తదనుగుణమయిన పరిస్థితులు కల్పించబడి ఆయా అనుభవాలద్వారానే వాసనాక్షయమవుతుంది. ఈ దశలో అత్యున్నత స్థితికి చేరిన సాధకులు, సద్గురు భక్తులు కూడా ఇంద్రియ భోగలాలసతకు, ధనవ్యామోహానికి, కీర్తికాముకత్వానికి లోనయినట్లు కనిపిస్తారు. ప్రపంచంవారిని యోగభ్రష్ఠులుగా పరిగణిస్తుంది. అయితే, ఎవరు వాస్తవంగా యోగభ్రష్టులో, ఎవరు వాసనాక్షయ సాధనమైన యోగంలో వున్నారో గ్రహించే యోగ్యత, సామర్థ్యం, అధికారం – సాయి వంటి పరిపూర్ణ సద్గురు మూర్తులకే తప్ప అన్యులకు అసాధ్యం!

ఈ సందర్భంలో మరో విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. పైన వివరించిన సద్గురు సన్నిధి ప్రభావం గురించి చదివిన తరువాత, అటువంటి ప్రభావం శ్రీసాయి సశరీరులుగా వున్నప్పుడు వుండేదేమోగానీ, యీనాడు శిరిడీలో అంతటి ప్రభావం వుంటుందా?– అనే సందేహం కొందరు సాయిభక్తులకు కలుగవచ్చు. సరైన రీతిలో శ్రీసాయిసచ్చరిత్ర చదువని వారికి, శ్రద్ధతో శిరిడీ దర్శించనివారికి మాత్రమే కలిగే సందేహమిది! ఎందుకంటే సమాధి అనంతరం మరింత ముమ్మరంగా తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తాననీ, 'పిలిస్తే పలుకుతాననీ, తలిస్తే దర్శనమిస్తాననీ' బాబా చేసిన ప్రతిజ్ఞలు నిత్యసత్యాలని అసంఖ్యాక సాయిభక్తుల అనుభవం. అంతేకాదు! శిరిడీ దర్శించిన వేలాది భక్తులకందరకూ సామాన్యంగా కలిగే అనుభవం ఒకటున్నది. అది ‘కాలగతి’ (Passing of time) స్ఫురణకు రాకపోవడం! అక్కడున్నన్ని రోజులు (వారం పదిరోజులయినా) మన సమస్యలు, ప్రాపంచిక బంధాలు, బాధ్యతలు గుర్తుకురావు. రోజులు క్షణాల్లా దొర్లిపోతాయి. “అరె! మనం శిరిడీ వచ్చి అప్పుడే ఇన్ని రోజులయిందా? నిన్నమొన్న వచ్చినట్లుందే!” అని శిరిడీ వదలి వెళ్ళేరోజు సామాన్యంగా అందరూ అనుకోవడం కద్దు! చూచేందుకు ఇది చాలా చిన్న విషయంగా కనిపించినా, సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన విషయమని అవగతమవుతుంది. అహంకారపు లోపలి పొరలు బలహీనమయితే గాని, ‘కాలగతి’ స్ఫురణకు రాకుండా పోదు. నిర్వికల్ప సమాధిలో మాత్రమే కాలగతి పూర్తిగా స్ఫురణకు రాకుండా పోతుందని యోగశాస్త్రం చెబుతున్నది. ఆ స్థితికి కూడా అతీతమయిన స్థితిలో వున్న శ్రీసాయియొక్క సన్నిధి ప్రభావం వల్లనే శిరిడీలో మనం ఆ అనుభవం యొక్క అంచులు రుచి చూస్తాం! ఇది సామాన్యంగా మన గుర్తింపుకు రాకుండానే జరిగిపోయే విషయం. కేవలం ఆయన సన్నిధి ప్రభావం వల్లనే మన వంటి పామరులకు కూడా రోజులు క్షణాల్లా గడిచినపుడు, శ్రీసాయి తన వయస్సు లక్షల సంవత్సరాలని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? శిరిడీలో శ్రీసాయిసన్నిధి నిత్యసత్యం; ఆయన కృపారసం కుండపోతగా ఇప్పటికీ వర్షిస్తూనే వుంది. సాయిలీలాప్రబోధం నిరంతరం కొనసాగుతూనే వుంది!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo