చాలామందికి మృత్యుంజయమంత్రమంటే మహామోజు! కారణం, మృత్యుంజయ మంత్ర పునఃశ్చరణ(జపం) చేత మృత్యువు దరిచేరదనే విశ్వాసం! కొంచం శాస్త్రపరిభాషలో చెప్పాలంటే అది ‘అకాల మృత్యుహరణమ’ని! (ఏది సకాలమో యేది అకాలమో ఎట్లా నిర్ణయించడం?– అంటే, అది వేరే విషయం!) ఈ విశ్వాసం ప్రధానంగా మన మహర్షులు ‘మృత్యువు’, ‘మృత్యుంజయము’ అనే పదాలు ఏ ఉద్దేశ్యంతో వాడారో తెలియకపోవడం వల్ల కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మృత్యుంజయమంత్రాన్ని జపించి మరణం లేకుండా చేసుకొన్న వారెవ్వరైనా వున్నారా? మరైతే, మృత్యుంజయమంత్రం యొక్క అర్థం, దాని పునఃశ్చరణ యొక్క పరమార్థం, కీలకం ఏమై వుంటుంది?
ఈ విషయాన్ని వివరించే ముందు అసలు మృత్యుంజయ మంత్రమేమిటో తెలుసుకొందాం!
“త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్థనమ్
ఊర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”
- అన్నదే ఆ మంత్రం. “మేలైన తావి గలిగినట్టియు, లౌకికము వైదికము యైన పుష్టిని పెంపొందించునట్టియు యైన ఆ మూడుకన్నుల దేవర(పరమశివుని)ను పూజింతుము. తొడిమనుండి విడివడిన దోసపండువలె మృత్యువునుండి బయటపడెదము గాక!” అన్నది ఆ మంత్రం యొక్క భావం. ఈ మంత్రాన్ని భస్మధారణమప్పుడు (విభూతి పెట్టుకొనేప్పుడు) విధిగా స్మరిస్తారు. ఈ మంత్రం యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి (కంచి పెద్దస్వామి) వారంటారు:
“ఈశ్వరుడు తక్క తక్కినదంతయు మృతమే. మృతమనగా చచ్చునది అని అర్థం. మరణం మరుజన్మకు బీజకారణం. మరుజన్మలేక మరగి పోవుటకు అమృతమని పేరు. అమృతముగా నుండునదొక్క దైవమే! మృతులమగు మనకు అమృతస్థితి నీయగల శక్తి ఆయనకు కలదు. దుఃఖించుచు మనము చనిపోయిన, మనకు దుఃఖించెడి జన్మమే కలుగును. ఆనందముగా ప్రాణత్యాగము కావించుచో అట్టి స్థితికి అమృతమని పేరు. మృతముగాక అమృతము నొసగునది ముక్కంటి. ... మోక్షమనగా విడివడుట. తగులుకొన్నవాడు తగులుబాటు నుండి తప్పించుకొనుటయే మోక్షము. ఉర్వారుకమనగా దోసకాయ. దోసకాయ పండినచో ఏ శ్రమ లేకుండా అనాయాసముగా తొడిమనుండి తొలగి తీగ ప్రక్కనే పడియుండును. తొడిమకు పండుకు యున్న ఎడము సైతం తెలియదు. గాలి బలముగా వీచి, తీగలు కదలాడినపుడు మాత్రము కన్నులకు తెలియును. ఇట్టి సులభమోక్షము – ఉర్వారుక మోక్షము – కావలెననియే వేదమందలి ప్రార్థన”.
- “నా ముర్షద్ (గురువు) నన్ను ఈ దేహంనుండి ఏనాడో విడుదల చేశాడు” అని శ్రీసాయిబాబా చెప్పింది ఇటువంటి జీవన్ముక్తి గురించే. ఒక సందర్భంలో బాబా అన్నారు. “నన్ను ప్రసవించినప్పుడు తనకు కుమారుడు కలిగినందుకు నా తల్లి ఎంతో ఉప్పొంగిపోయింది. నా మటుకు నాకు ఆమె సంతోషము చూసి ఆశ్చర్యం వేసింది. నిజానికి నన్ను ఆమె కన్నదెప్పుడు? అసలు నాకు పుట్టుక వున్నదా? అంతకు ముందు మాత్రం నేను లేనా?” - అని. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. “జాతస్యహి మరణం ధృవం”. అయితే, జననమే లేని శ్రీసాయికి మరణం మాత్రం ఎక్కడిది? 1886లో తాను అల్లా దగ్గరకు వెళుతున్నాననీ, మూడురోజుల వరకు నిర్జీవమైన తన దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగంచేసి, మూడురోజుల తర్వాత తిరిగి తన దేహంలో ప్రవేశించి, ఆ తరువాత సుమారు 32 సంవత్సరాలు అదే దేహంతో సంచరించిన శ్రీసాయి కన్నా మృత్యుంజయుడెవరు? బాబా యొక్క మృత్యుంజయత్వం కేవలం తన దేహానికే పరిమితం కాదు. అన్ని విధాల ఆశలు పూర్తిగా వదులుకొని, ఇక జీవించడం అసంభవం అనుకొన్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. మాలన్ బాయి వంటివారిని మరణించిన తరువాత కూడా తిరిగి బ్రతికించారు! తమ భక్తులను మృత్యువునుండి రక్షించే సందర్భాలలో ఏదో అదృశ్యశక్తితో ఘర్షణ పడుతున్నట్లు తిడుతూ, బెదిరిస్తూ, అదిలిస్తూ బాబా చేసిన వింతచర్యలు – తన భక్తుడయిన మార్కండేయుని ప్రాణం రక్షించడానికి ఆ ముక్కంటి మృత్యుదేవతతో పోరాటానికి సిద్ధమయ్యాడని చెప్పే పురాణకథలను స్మృతికి తేకమానవు. బాబా మృత్యుంజయుడు కనుకనే, “నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది” అని హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటికీ తు.చ. తప్పకుండా నెరవేరుస్తున్నారు. అందుకే (శ్రీసాయిభక్తులకు) శ్రీసాయినాథుని కన్నా మృత్యుంజయుడెవ్వరు? సాయినామాన్ని మించిన మృత్యుంజయ మంత్రమేమున్నది?
Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
ఓం సాయిరాం! సర్వం సాయి రామార్పాణమస్తు
ReplyDeleteSai Baba! 🙏🙏🙏🙏🙏
ReplyDeleteom sai very nice massage.mrujaya mantra is nice to meditate
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏