సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 657వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. పరీక్షించినా, చివరికి అనుగ్రహించిన బాబా 
  2. సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజుకే మాయం!

పరీక్షించినా, చివరికి అనుగ్రహించిన బాబా 


యు.ఎస్.ఏ. నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


అందరికీ సాయిరామ్! నేను బాబా కుమార్తెలలో ఒకరిని. ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా భర్త ఆరోగ్య విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2020, జూలైలో అకస్మాత్తుగా నా భర్తకి చెవిలో నొప్పితో పాటు ఛాతీ దగ్గర ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా రాత్రివేళల్లో సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నానని బాధపడేవారు. సమస్య ఛాతీ దగ్గర కావడం వల్ల నేను చాలా భయపడ్డాను. అయినప్పటికీ, దానంతట అదే తగ్గిపోతుందని నేను మొదట్లో అంత శ్రద్ధ చూపలేదు. కానీ పరిస్థితి మరింత దిగజారేసరికి 'సమస్య ఏమై ఉంటుందో' అని నాకు చాలా కంగారుగా అనిపించింది. ఒకవైపు తను ఊపిరి తీసుకోలేకపోతున్నారు, హాస్పిటల్‌కి వెళదామంటే కరోనా సమయం కావడం వలన భయం. కానీ వేరే మార్గంలేక మావారు అత్యవసర పరిస్థితి కింద అపాయింట్‌మెంట్ తీసుకుని క్లినిక్‌కి వెళ్లారు. ఆ సమయమంతా నేను, "నా భర్త ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళనకర వార్త వినకూడద"ని బాబాను ప్రార్థిస్తూ గడిపాను. 'ఆర్తిగా పిలిస్తే సాయి తక్షణం పరుగున వస్తార'ని మనందరికీ తెలుసు. క్లినిక్‌లో మావారికి భయపడేంత పెద్ద సమస్యేమీ లేదని కొన్ని మందులిచ్చి, వాటిని వాడమని చెప్పారు. వెంటనే మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది విని నాకు చాలా ఉపశమనంగా అనిపించింది.


మావారు మందులు వాడటం ప్రారంభించారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. దాంతో ఈసారి మావారు మా ఫ్యామిలీ డాక్టరు వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో యు.ఎస్.ఏ లో కరోనా చాలా ఎక్కువగా ఉండటం వలన భయంతో నేను హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తప్పనిసరై మావారు వెళ్లారు. డాక్టరు మావారిని పరీక్షించి, అనుమానించేంతగా ఏమీ లేదని చెప్పి, కొన్ని మందులిచ్చి వాడమన్నారు. మావారు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పగా అప్పటివరకు బాబా నామస్మరణ చేస్తున్న నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మావారు ఆ మందులు వాడటం ప్రారంభించారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి. దాంతో, 'మందులు వాడుతున్నా మావారి ఆరోగ్యం ఎందుకు మెరుగుపడట్లేదు? కారణం ఏమైంటుంది?' అని నాలో ఆందోళన మొదలైంది. మరోసారి మావారు డాక్టరు వద్దకు వెళ్లారు. డాక్టరు వేరే మందులు వాడమని సూచించి, “అవి కూడా పనిచేయకపోతే ఎండోస్కోపీ అపాయింట్‌మెంట్ తీసుకోండి, అసలు లోపల ఏమి జరుగుతుందో చూద్దాం” అని అన్నారు. అది తెలిసి నేను చాలా కలతచెందాను. అసలే కరోనా సమయం, పదేపదే హాస్పిటల్స్‌కి వెళ్లలేము. ఒకవేళ సమస్య పెద్దది అయితే పరిస్థితి ఏమిటని చాలా కంగారుగా అనిపించింది. ఇక్కడ యు.ఎస్.ఏ.లో ఎండోస్కోపీ అంటే పెద్ద ప్రక్రియ. అది పూర్తి కావడానికి రోజులో సగం సమయం పడుతుంది. పైగా మావారికి ఎనస్థీషియా ఇస్తారు. ఆ స్థితిలో తను కారు డ్రైవ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను మావారితో వెళ్లాలి. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళని హాస్పిటల్ లోపలికి అనుమతించరు. కాబట్టి వాళ్ళని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాలి. కరోనా వల్ల ఎవరినీ  సహాయం అడగలేను. ఇలా రకరకాల ఆలోచనలు, భయాలతో నేను నా తండ్రి సాయి వద్దకు పరుగెత్తి, "ఈ పరిస్థితి నుండి  మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు" అని దీనంగా వేడుకున్నాను.


తరువాత నాకు సాయి దివ్యపూజ చేయాలనిపించి, 5 వారాల పూజ ప్రారంభించాను. దాంతో పాటు సచ్చరిత్రలోని 13వ అధ్యాయం పారాయణ, ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులోని భక్తుల అనుభవంలో చూసిన 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రం జపించసాగాను. రెండవ వారంలో నేను మావారిని "ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగాను. తన నోటినుండి మునుపటి సమాధానమే విని నాకు భయమేసినప్పటికీ సాయి నాకు సహాయం చేస్తారనే బలమైన నమ్మకం కూడా ఉంది. 'బాబా మనల్ని పరీక్షిస్తారేమోగానీ ఎన్నడూ మోసగించరు' అని మనకి తెలుసు కదా! 4వ వారంలో మావారిని అడగడానికి కూడా చాలా భయపడినప్పటికీ సాయిపై నమ్మకంతో "ఇప్పుడు ఎలా అనిపిస్తుంద"ని అడిగాను. మావారు, "నా ఛాతీలో ఇబ్బంది పోయింది. కానీ చెవినొప్పి మాత్రం కొంచెం ఉంది" అని చెప్పారు. అది వింటూనే చెప్పలేని సంతోషం కలిగి ఆనందభాష్పాలతో నా సాయికి నమస్కరించాను. 


"సాయీ! నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, నా మనోభావాలను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. నా భర్తకున్న ఆ చిన్న సమస్యలను కూడా తీసివేసి దయతో తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. బాబా! మీకు తెలుసు, నేను ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నాను. దయచేసి త్వరలోనే దానికి పరిష్కారాన్ని చూపించి నాకు మానసిక ప్రశాంతతను అనుగ్రహించండి. ప్లీజ్ సాయీ! నేను మీపై ఆధారపడి దూరంగా ఉంటున్నాను. దయచేసి సర్వవేళల్లోనూ మా చుట్టూ ఉంటూ మమ్మల్ని రక్షించండి. కఠిన సమయంలో మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమతో ఆశీర్వదిస్తున్న మీకు ధన్యవాదాలు సాయీ! ఈ కరోనా సమయంలో దయచేసి మీ బిడ్డలందరినీ దీవించండి. చివరిగా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటానని మీకు మాటిచ్చి ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా!" 


ఓం సాయిరాం!


సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజుకే మాయం!


సాయిబంధువులందరికీ, బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీలత. నేను అనుభవిస్తున్న ఒక అనారోగ్య సమస్యను బాబా ఏ విధంగా తీర్చారో ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 


ఒక సంవత్సరకాలంగా నేను "గ్యాస్ట్రిక్" సమస్యతో బాధపడుతున్నాను. దానివలన ఛాతీలో చాలా నొప్పిగా ఉండేది. చాలా మందులు వాడాను కానీ ఎలాంటి గుణం కనిపించలేదు. 2020, నవంబరు 26న ఈ బ్లాగు నా కంటపడింది. అందులో ప్రచురితమైన "సాయిభక్తుల అనుభవమాలిక" చదువుతుంటే నా కళ్ళనుండి కన్నీళ్లు కారిపోయాయి. ఆ స్థితిలోనే నేను, "నా ఆరోగ్య సమస్యను తగ్గించండి బాబా, నా సమస్య తీరితే నేను కూడా నా అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. సంవత్సరకాలంగా అనుభవిస్తున్న బాధ మరుసటిరోజు నుండి ఎటుపోయిందో తెలియలేదు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతకాలంగా ఎన్ని మందులు వాడినా నయంకానిది ప్రార్థించినంతనే బాబా అనుగ్రహించారు. "సాయీ! మీ చరణాలకు శతకోటి నమస్కారములు. నేను ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన మీకు తెలుసు తండ్రీ. దానినుండి కూడా నాకు విముక్తిని ప్రసాదించండి బాబా!"


ఓం సాయిరామ్!



6 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram baba ma amma ki problem cure cheyi thandri pleaseeee thandri

    ReplyDelete
  4. un know om sai ram.bless my brother it is his birth day.with health

    ReplyDelete
  5. ఓం సాయిరాం!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo