ఈ భాగంలో అనుభవం:
- సాయి వర్షించే కరుణని ఎంతని వర్ణించను?
సాయినాథునికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. సాయి వర్షించే కరుణని ఎంతని వర్ణించను? నాకు మా అమ్మవాళ్ళు పసుపు-కుంకుమ కింద ఒక చిన్న ఇల్లు ఇచ్చారు. మేము దానిని అద్దెకి ఇచ్చాం. ఒక కుటుంబం 6, 7 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మొదట 5 సంవత్సరాలు అద్దె బాగానే ఇచ్చారు కానీ, ఆ తర్వాత అద్దె సరిగా ఇచ్చేవారు కాదు. ఆ ఇంటికి దగ్గరలో మా మేనమామవాళ్ళు ఉంటే, వాళ్ళకి వి షయం చెప్పి, అద్దె సంగతి చూడమని చెప్పాము. అయితే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఏవో కారణాలు చెపుతూ అద్దె ఇవ్వకుండా దాదాపు 18 నెలలు గడిపివేశారు. ఇంకా మేము విసిగిపోయి ఇల్లు ఖాళీ చేయమని చెప్పాము. తర్వాత కూడా వాళ్ళు ఈ నెల, తర్వాత నెల అంటూ 6 నెలలు గడిపేశారు. మొత్తం 2 సంవత్సరాలకు పైగా అద్దె ఇవ్వలేదు, ఇళ్లు కూడా ఖాళీ చేయలేదు. చివరి 6 నెలలు నేను బాబాని, "వాళ్ళు అద్దె ఇచ్చి, ఇల్లు ఖాళీ చేసేలా చూడండి" అని వేడుకుంటూ చాలాసార్లు వాళ్ళకి ఫోన్ చేసి నెమ్మదిగా అడిగాను. వాళ్ళు వినలేదు. చివరికి నేను ఎంత విసిగిపోయానంటే, 'అద్దె లేకపోతే పోయింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే చాలు' అనుకున్నాను. 2026, ఫిబ్రవరి నెల చివరి వారంలో ఒకరోజు మావారికి బాగా కోపం వచ్చి ఫోన్లో, "ఒక్క రోజులో ఇళ్లు ఖాళీ చేయాలి. లేదంటే ఊరుకోను" అని గట్టిగా చెప్పారు. దాంతో బాబా దయవల్ల వాళ్ళు "అద్దె ఇవ్వడానికి కొంత సమయం కావాలి. పక్క కాలనీలోనే ఉంటామ"ని చెప్పి ఇల్లు ఖాళీ చేశారు. వాళ్ళు వెళ్లి 4 నెలలు అయింది, వేరే వాళ్ళు అద్దెకు దిగారు. కానీ ముందు అద్దెకు ఉన్నవాళ్లు ఇంకా అద్దె బకాయి డబ్బులు ఇవ్వలేదు. ఆ విషయం గురించి బాబాని అడిగితే, "నీ డబ్బు ఎక్కడికీ పోదు, ప్రశాంతంగా ఉండు" అని వస్తుంది. బాబా చెప్పారు కదా! ఏదో ఒకరోజు వాళ్ళు ఆ డబ్బు ఇస్తారని నమ్ముతున్నాను. ఇంకా బాబా దయ. మనకేది మంచిదో ఆయనకి తెలుసు కదా! "ధన్యవాదాలు బాబా".
2026లో మా పాప పదో తరగతి పరీక్షలు వ్రాసింది. తను బాగానే చదువుతుంది కానీ, పరీక్షల సమయంలో టెన్షన్ పడింది. నేను తనకి మంచి మార్కులు రావాలని అనుకున్నాను. బాబా దయతో తనకి 95% మార్కులు వచ్చాయి. తర్వాత మేము పాపని ఇంటర్మీడియట్ చదువుకోసం హాస్టల్లో చేర్పించాం. తను వెళ్ళేటప్పుడు ఇష్టంతోనే వెళ్ళింది కానీ, మొదటిసారి ఇంటి నుండి దూరంగా వెళ్ళడం వలన బెంగతో రెండు రోజులు తిండి, నిద్ర లేకుండా ఏడ్చింది. ఇంట్లో మా పరిస్థితి అందుకు భిన్నం కాదు, మేము కూడా చాలా బాధపడ్డాం. 3వ రోజు నేను బాబా దగ్గరకి వెళ్ళి, "పాప భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. పాప ఏడవకుండా మంచిగా చదువుకోవాలి. అలాగే మా బాధ కూడా తగ్గాలి" అని వేడుకున్నాను. అంతే! మంత్రం వేసినట్లు ఆ సాయంత్రానికి పాప, "నేను సంతోషంగా ఉన్నాను. ఫ్రెండ్స్ దొరికారు" అని చెప్పింది. మాకు కూడా బాధ తగ్గింది. రెండు నెలల నుంచి తను సంతోషంగా చదువుకుంటుంది. ఇది ఖచ్చితంగా బాబా కరుణ.
ఒకరోజు పాప కాలేజీవాళ్ళు 2 రోజులలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి అని చెప్పారు. కానీ మేము అప్పటికి పాప 10వ తరగతి చదివిన స్కూల్ నుండి తన సర్టిఫికెట్లు తీసుకోలేదు. అదీకాక పాప చదివింది CBSE కావడం వలన,స్టేట్ బోర్డు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంది. నేను ఇదంతా 2 రోజులలో అవదు అనుకున్నాను. కానీ అసాధ్యం సుసాధ్యం చేయడానికి మన తండ్రి బాబా ఉన్నారు కదా! ఆయన మీద భారమేసి నా ప్రయత్నం నేను చేశాను. బాబా దయవల్ల ఒకటిన్నర రోజులో అన్ని సర్టిఫికెట్లు తీసుకోవడం, కాలేజీలో సబ్మిట్ చేయడం అయిపోయింది. "శతకోటి కృతజ్ఞతలు బాబా. మీరు మాతో ఉండడం ఎన్నో జన్మల పుణ్య ఫలం సాయిదేవా!".
2026, జూలై నెల చివరి వారంలో ఒకరోజు మా మేనేజర్ ఒక విషయం చెక్ చేసి, కన్ఫర్మ్ చేయమని నాతో చెప్పింది. కానీ నేను మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన సదరు వ్యక్తి అందుబాటులో లేకపోవడం వలన గంటలోపు చెక్ చేసి చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను చెప్పేలోపు తను, 'నేను కావాలని ఆ విషయం చెప్పకుండా దాచాన'ని నన్ను తప్పుగా అర్థం చేసుకొని వేరే పని మీద నేను ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు కోపంగా మాట్లాడింది. "నా వలన ఏదైనా పొరపాటు జరిగిందా?" అని అడిగినా కూడా ఏం చెప్పలేదు. అదీకాక తను చెప్పిన పని విషయంలో ఏం జరిగిందో చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వేరే విషయంలో మెసేజ్ చేస్తే, దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అలా 3 రోజులు గడిచిపోయాయి కానీ, పరిస్థితి మారలేదు. పైఅధికారి కోపంగా ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో అందరికీ తెలిసిందే! నేను ఆ సమయంలో ఎంత మానసిక వేదన అనుభవించానో బాబాకి తెలుసు. ఆ బాధలో సచ్చరిత్రలో చదివిన ఒక సంఘటన గుర్తు వచ్చింది. అదేమిటంటే, కాకమహాజనికి ఇతను యజమాని అని ఒకరిని బాబాకి చూపిస్తే, "అతని యజమాని వేరే ఉన్నారు" అని బాబా అంటారు. ఆ విషయం గుర్తొచ్చి, 'నా యజమాని బాబా మాత్రమే అని నాకు తెలిసి కూడా నేనెందుకు బాధపడాలి. జరిగినదానిలో నా తప్పు ఎంతమాత్రమూ లేదు. కాబట్టి అంతా బాబా చూసుకుంటారని' అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. 4వ రోజు 'జరిగిన విషయం తనకి మెసేజ్ చేస్తే బాగుంటుందేమో! తను రిప్లై ఇవ్వకపోయినా తనకి విషయం తెలుస్తుంది కదా!' అనిపించింది. వెంటనే బాబాని చీటీల వేసి, 'మెసేజ్ చేసి చెప్పాలా? వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పాలి?' అని అడిగాను. అందుకు బాబా 'మెసేజ్ చేయమని' చెప్పారు. సరేనని జరిగిన విషయం క్లుప్తంగా మెసేజ్ పెట్టాను తనకి. తను అది చూసి రిప్లై ఇవ్వలేదు. నేను బాబా చూసుకుంటారని వదిలేసాను. 5వ రోజు అనగ 2026, జూలై 28న ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ముందుగా బాబా గుడికి వెళ్ళి, "పరిస్థితి సరిచేయండి బాబా" అని వేడుకున్నాను. అలాగే దత్తస్వామిని కూడా వేడుకున్నాను. బాబా దయ చూపారు. నేను ఒక ఆఫీసు విషయంగా, అలాగే గురుపౌర్ణమి సందర్భంగా సెలవు కావాలని మెసేజ్ చేస్తే, తను మామూలుగా మాట్లాడింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా ఏదైనా సరిచేయగలరు. "శతకోటి కృతజ్ఞతలు బాబా. జన్మజన్మాంతరాలలో నాకు తోడుగా ఉండండి సాయి".

ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDelete