ఈ భాగంలో అనుభవం:
- అన్నీ వింటూ సమాధానమిచ్చే బాబా
సద్గురు సాయినాథునికి, సాయిభక్తులకు నమస్కారములు. నా పేరు రాధ. మేము హైదరాబాద్‌లో ఉంటాము. రోజూ ఈ బ్లాగ్ చదువుతూ వుంటే నాకు సాయి చేసిన లీలలు అన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు నాకు జరిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటున్నాను. 2021 వరకు మేము అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళం. అద్దె ఇళ్లలో ఉండే కష్టాల గురించి వేరే చెప్పనవసరం లేదు. నేను అన్నీ భరిస్తూ వుండేదాన్ని. నాకు దేవుడిపైన నమ్మకం ఉండబట్టి, ఇంటికి దగ్గరలో ఏ గుడి వున్నా తప్పకుండ వెళ్తుండేదాన్ని. మాకు దగ్గర్లో బాబా కూడా గుడి ఉండటంతో ప్రతి గురువారం వెళ్తుండేదాన్ని. అలా ఒకరోజు బాబా గుడికి వెళ్ళినప్పుడు నా మనసులో, "బాబా! మాకు సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉంది. కానీ ఎన్ని చూసినా నచ్చట్లేదు. ఈసారి మేము చూసే ఇల్లు నచ్చాలి. నడవగలిగే దూరంలో మీ గుడి కూడా వుండాలి" అని కోరుకున్నాను. అంతే! 3 నెలలు లోపు సొంత ఇంటికోసం ఒక లక్ష అడ్వాన్స్ ఇచ్ చాము. ఆ ఇంటికి నడవగలిగే దూరంలో ఏకాంతంగా బాబా కూడా ఉంది. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? ఇది కదా బాబా లీల!. కానీ నేను బాబాని కోరుకున్నానన్న విషయం మర్చిపోయా ను. ఇది నా దురదృష్టం అనుకోవాలి. "సాయినాథా! నన్ను క్షమించండి. మీ భక్తుల ముందు మీకు క్షమాపణలు చెపుతున్నాను తండ్రీ".
మాకు ఒక బాబు. చిన్నప్పటినుండి వాడికి దగ్గు వచ్చిందంటే చాలు, చాలా నీరసంగా అయిపోతాడు, 2 నుండి 3 కిలోల బరువు తగ్గిపోతాడు. అందుకే వాడికి దగ్గు వస్తుందంటే నేను భయపడిపోతాను. 2026, జూన్ నెలలో వాడికి దగ్గు మొదలైంది. నేను ఇంచుమించుగా ఆ సమయంలోనే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ చదవటం మొదలుపెట్టాను. భక్తుల అనుభవాలలో ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళు ఊదీ నీళ్లలో కలుపుకొని తాగి, బాబాని వేడుకున్నామని, ఫలితంగా ఆరోగ్యసమస్యలు తీరుతున్నాయని చదివి నేను కూడా ఒకరోజు రాత్రి ఊదీ నీళ్లలో కలిపి మా బాబు చేత తాగించి, తన నుదుటన కూడా పెట్టాను. అంతే! 3 రోజులుగా వస్తున్న దగ్గు మరుసటిరోజుకి తగ్గిపోయింది. బాబాని నమ్ముకుంటే భవసాగరాన్ని దాటిస్తారని నాకు చాలా ఆనందమేసింది.
ఒకరోజు నేను ఈ బ్లాగ్ ఓపెన్ చేయగానే, "రా.. వచ్చి నా దర్శనం చేసుకో!" అని వచ్చింది. అలాగే ఇంకోరోజు నేను బాబాని ఒక కోరిక నిమిత్తం అడిగితే, "అన్నదానం చేయి" అని వచ్చింది. సరే రేపు ఎలాగు గురువారం కదా! ఇంట్లో వంట చేసి గుడి దగ్గర పంచుదామని అనుకున్నాను. మర్నాడు దద్దోజనం చేసి బాబా గుడికి వెళ్లి, దర్శనం చేసుకొని అందరికీ దద్దోజనం పంచాను. తర్వాత ఇంటికి వస్తూ దారిలో, "బాబా! మీ దర్శనానికి వచ్చాను కదా! అది మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలుసని నాకు తెలిసేలా చేయండి బాబా" అని అనుకున్నాను. బాబా లీల చూడండి! కొంతసేపటికి తర్వాత నేను ఎప్పటిలానే భక్తుల అనుభవాలు చదువుదామని బ్లాగ్ ఓపెన్ చేసాను. బ్లాగు ఓపెన్ అవుతూనే, "నువ్వు నా దర్శనానికి వచ్చావు. ఇంకా నేను నీ గురించి ఆలోచించాలి" అని వచ్చింది. నేను ఒక్కసారిగా షాకయ్యాను. నా ఒళ్ళంతా పులకరించిపోగా ఆనందంతో సాయికి నమస్కరించాను. ఇంకా అప్పటినుండి నాకు అన్నీ సాయే అనుకొని ఆయన నామస్మరణ చేస్తున్నాను.
ఇప్పుడు చెప్పబోయేది చిన్న అనుభవమే అయినా మన మనసులో అనుకున్న మాటలు వింటారు, వాటికి సమాధానం కూడా చెప్తారని మరోసారి బాబా ఋజువు చేసారు. 2026, జూలై నుండి నేను బాబానే నా గురువుగా కొలుచుకోవాలని నిర్ణయించుకొని ఫోన్లో వాల్ పేపర్ పెట్టకుందామని బాబా ఫోటోలు వెతుకుతుంటే ఒక బ్లాక్&వైట్ ఫోటో కనిపించింది. నేను దాన్ని వెంటనే వాల్ పేపర్‌గా పెట్టేసుకున్నాను. అదేరోజు సాయంత్రం అలా కూర్చోని ఫోన్లో బాబా వాల్‌పేపర్ చూస్తుంటే, బాబా పదాలకు ఏదో అయినట్లు నాకనిపించి, "అయ్యో బాబా! ఏంటి మీ పదాలు ఇలా అయిపోయాయి? అని ఒక నిమిషం పాటు బాధపడ్డాను. ఆ తర్వాత చదువుదామని బ్లాగు ఓపెన్ చేశాను. అంతే! అక్కడ, "ఈ పాదాలు చాలా పురాతనమైనవి.." అని సాయి వచనం వుంది. నా సందేహానికి బాబా సమాధానమిచ్చారని చాలా సంతోషించాను. బాబా మనసులో అనుకున్న దాన్ని కూడా విని ఇలా సమాధానమిస్తారని నాకు అప్పుడు అర్ధమయింది. అంతేకాదు, సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్నీ అని స్పష్టంగా అర్థమైంది. నేను ఇంతకాలంగా సాయినాథుని గుడికి వెళ్తూ ఉన్నాను కానీ, 'సాయే నా సద్గురువు' అని తెలుసుకోవటానికి ఇంత సమయం పట్టింది. అయితే ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ఆనందిస్తున్నాను. అలాగే నాకు తెలియకుండానే సాయినాథుడు ఎన్నో చేసారని తెలుసుకొని ఇన్నిరోజులు బాబాని మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను.
ఏదైనా జరిగితేకాని దేవుడు గుర్తు రాడని అంటారు. అదే నా జీవితంలో ఇప్పుడు అనుభవమైంది. విషయమేమిటంటే, నేను ఇదివరకు ఉద్యోగం చేసేదాన్ని. ఆ ఉద్యోగం నాకు సాయి భిక్ష. కానీ ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత దానిలో ఉన్న టెన్సన్స్ వల్ల నాకు ఏమీ గుర్తు ఉండక బాబాని అశ్రద్ద చేసాను. అందుకేనేమో 2026, మేలో లేఆఫ్ కారణంగా నన్ను ఉద్యోగం నుండి తీసేసారు. "బాబా! భక్తులందరి ముందు మీకు క్షమాపణ చెప్తున్నాను. నేను చేసిన తప్పులు మన్నించి నాకు క్షమాభిక్ష పెట్టు తండ్రీ, ఉద్యోగం లేకపోతే, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు తండ్రీ. దయుంచి నేను కోరుకునే ఉద్యోగం నాకు ప్రసాదించు తండ్రీ".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment