రాధాకృష్ణమాయి బాబాకు అవసరమైనది చేస్తూ, ఇతర భక్తులతో చేయిస్తూ పగలురాత్రి తేడా లేకుండా రోజంతా బాబా సేవలో నిమగ్నమై ఉండేది. మార్గాలను శుభ్రపరచడం, మన్ను, గులకరాళ్లు తొలగించడం, జంతువుల, పిల్లల మలాన్ని ఎత్తి పారవేయడం, గుంతలు త్రవ్వి మొక్కలు నాటడం, మట్టి, ఆవుపేడతో నేలను అలకడం, కట్టెలు కొట్టడం, షాండ్లియర్లను శుభ్రపరచడం, మసీదును శుభ్రపరచడం, రంగురంగుల కాగితాలతో పువ్వులు, జెండాలు తయారుచేయడం, శిరిడీకి వచ్చే ఉత్సవ పతాకాలను, చిహ్నాలను శుభ్రపరచడం, శ్రీరామనవమి పండుగ సందర్భంగా మశీదులో ఉయ్యాల ఏర్పాటుచేయడం, గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినోత్సవం జరుపుకోవడం మొదలైన బాధ్యతలను ఆమె ఇతర భక్తుల సహాయంతో నెరవేర్చేది.
కొన్ని సేవలలో మాత్రం వంతులు లేవు:
రాధాకృష్ణమాయి ఎన్నో సేవలలో భక్తుల సహాయం తీసుకొనేది. కానీ కొన్ని పనులను మాత్రం తానొక్కతే చేసేది. నిజానికి ఆ పనులలో ఇతరుల జోక్యాన్ని ఆమె అస్సలు సహించేది కాదు. మసీదులో రెండు మట్టికుండలు ఉండేవి. ఆ కుండలు ఎప్పుడు, ఎలా నిండేవో, వాటిని ఎవరు నింపేవారో ఎవరూ గమనించలేకపోయారు. బాబా సన్నిధిలోని ఆ నీళ్ళను భక్తులు ఎంతో పవిత్రజలంగా భావించి సేవించేవారు. కొంతమంది భక్తులు తాము పేదరికం నుంచి బయటపడటానికి ఆ నీటిని గ్లాసులో నింపుకుని తమ ఇళ్ళకు తీసుకొనిపోయేవారు. ప్రతిరోజూ రాధాకృష్ణమాయి స్వయంగా ఆ కుండలను నీళ్లతో నింపేది. ఆ పనిలో ఆమె ఎవరి సహాయాన్నీ తీసుకునేది కాదు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా ఆ పని చేయడానికి ముందుకొస్తే, అందుకు ఆమె అభ్యంతరం చెప్పేది. దీక్షిత్ వాడా వెనకభాగంలో ఒక బావి ఉండేది. ఆ బావినుండే ఆయీ అదృశ్యరూపంలో నీళ్లు తీసుకొచ్చి ఆ మట్టికుండలు నింపేదని భక్తులు విశ్వసించేవారు. 1916లో రాధాకృష్ణమాయి కుటీరంలో వామనరావు పటేల్ బసచేశాడు. అప్పుడొకరోజు అతనికి తెల్లవారుఝామున 3 గంటలకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో ఆయీ అక్కడ కనిపించకపోవడంతో అతను ఆందోళన చెంది ఆమెకోసం వెతకడం మొదలుపెట్టాడు. దీక్షిత్ వాడా వెనుకనున్న బావి వద్ద ఆమె కుండలను నీటితో నింపడం చూసి, పరుగున వెళ్లి, "దయచేసి నన్ను మీకు సహాయం చేయనివ్వండి" అని అడిగాడు. అందుకు ఆమె, "నువ్వు వెళ్ళి నిద్రపో, నాకు ఎటువంటి సహాయమూ అవసరం లేదు" అని చెప్పింది.
ఒకరోజు తెల్లవారుఝామున రాధాకృష్ణమాయి బాబా నడిచే దారిని శుభ్రపరచడం వామనరావు చూశాడు. దారిలో ఉన్న చిన్న చిన్న రాళ్లను, కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువుల మలాన్ని చేతులతో ఎత్తి పారేయడంలో ఏమాత్రం సంకోచం గానీ, అసహ్యం గానీ ఆమెకు అనిపించేవి కావు. అది చూసిన వామనరావు, "నా బాబా పవిత్ర పాదాలు ఈ నేలను తాకుతాయి. ఆ స్పర్శకు నేల మృదువుగా ఉండాలి. ఆ నేలను శుభ్రం చేసే వ్యక్తి ఎంతో భాగ్యశాలి అవుతాడు. కాబట్టి నేను కూడా ఆ పవిత్రకార్యంలో పాలుపంచుకోవాలి" అని అనుకున్నాడు. ఆ మరుసటిరోజు అతను త్వరగా నిద్రలేచి, ఆయీకి చెప్పకుండా, చీపురు తీసుకొని ఆ మార్గాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న రాళ్లను ప్రక్కకు తీసి దారంతా శుభ్రం చేస్తూ కొంతదూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసి, అంతవరకూ తాను శుభ్రం చేసిన మార్గమంతా రాళ్లు, మట్టిగడ్డలతో నిండి ఉండటం గమనించి నిశ్చేష్టుడయ్యాడు. మళ్ళీ మళ్ళీ అతను ఆ మార్గాన్ని శుభ్రం చేసి అలసిపోయాడు, కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అదంతా ఎవరు చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు. కొన్నిరోజుల తరువాత రాధాకృష్ణమాయి కుటీరంలో కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ, డాక్టర్ పిళ్ళై తదితర భక్తులు భోజనం చేస్తున్నప్పుడు తాత్యాపాటిల్ తన అనుభవాన్నిలా వివరించాడు: "ఒకరోజు నాకు, రాధాకృష్ణమాయికి మధ్య గొడవ జరిగింది, దానివల్ల ఆమెకు చాలా కోపమొచ్చింది. ఆ కోపాన్ని ఆమె చాలా వింతగా వ్యక్తపరచింది. ఆ గొడవ జరిగిన తరువాత నేను పొలానికి వెళ్లి నా పనిలో నిమగ్నమయ్యాను. హఠాత్తుగా కొన్ని రాళ్ళు ఎగిరొచ్చి నా మడమలపై పడసాగాయి. దాంతో నేను తీవ్రంగా గాయపడ్డాను. అయితే ఆ రాళ్లను ఎవరు విసురుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే ఆ తరువాత ‘అదంతా రాధాకృష్ణమాయి చేసిన మాయ’ అని తెలుసుకున్నాను" అని చెప్పాడు. తాత్యా అనుభవం ద్వారా, 'ఆరోజు తానంతగా శుభ్రపరచినప్పటికీ మార్గం శుభ్రం కాకపోవడానికి కారణం రాధాకృష్ణమాయి యోగక్రియేననీ, ముందుగా ఆమె అనుమతిని తీసుకోలేదు కాబట్టి తాను ఆ పని చేయడం ఆమెకు ఎంత మాత్రమూ ఆమెకు ఆమోదయోగ్యం కాద'నీ వామనరావు గ్రహించాడు.
శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లు:
శిరిడీలో 1897 నుండి 1911 వరకు శ్రీరామనవమినాడు ఉరుసు ఉత్సవము జరుగుతుండేది. ఆరోజున పగలు హిందువులకు పవిత్రమైన జెండా ఉత్సవము, రాత్రులందు మహ్మదీయులకు పవిత్రమైన చందనోత్సవము జరుగుతుండేవి. ఇరుమతాలవారు కలసిమెలసి ఎట్టి అరమరికలు లేకుండా ఆ ఉత్సవాలలో పాల్గొంటుండేవారు. రాధాకృష్ణమాయి శిరిడీ వచ్చినప్పటినుండి ఆ ఉత్సవాలకు సంబంధించి మసీదులో చేయవలసిన ఏర్పాట్లను, భక్తుల అవసరాలను స్వయంగా తానే చూసుకొనేది. బయటపనులు తాత్యాకోతేపాటిల్ చూసుకొంటుండేవాడు. 1912 నుండి పై ఉత్సవములతో పాటు ఉత్సవాన్ని తొమ్మిది రోజులు నిర్వహించడం (చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు), శ్రీరామజన్మోత్సవం, హరిదాసుల భగవత్ సంకీర్తన (హరికథ) వంటి విశేష సంస్కరణలను ఆయీ తీసుకొచ్చింది. మసీదులో నిరంతరము ధుని వెలుగుతుండటం వలన గోడలు మసిపట్టి ఉండేవి. ఉత్సవానికి ముందు బాబా చావడిలో నిద్రించే రాత్రి ఆయీ ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ బయటపెట్టి, ధుని కారణంగా మసీదు గోడలకు పట్టిన మసినంతా శుభ్రంగా కడిగి, సున్నము వేయించేది. ఉత్సవానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధపరిచేది. అంతేకాదు, శిరిడీని అందంగా అలంకరించడంలో ఆమె చేసిన కృషి ప్రశంసనీయం. ఉత్సవ సమయంలో ఆమె నివాసం భక్తులతో కిటకిటలాడుతుండేది. వారందరి అవసరాలను ఆమె చూసుకుంటుండేది. 1912లో శ్రీరామజన్మోత్సవం సందర్భంగా ఆయీ ఒక ఊయలను మసీదులో వ్రేలాడదీసింది. కీర్తన ముగిశాక భక్తులు తన్మయులై జయకారాలతో, నృత్యగీతాదులతో గులాల్ పైకి ఎగురవేశారు. అనుకోకుండా అది బాబా కళ్ళలో పడడంతో ఆయన కోపంతో అందరినీ తిట్టసాగారు. బాబా ఆ కోపంలో అక్కడ కట్టివున్న ఊయలను ముక్కలు చేస్తారేమోనని ఆయీ భయపడి, వెంటనే ఆ ఊయలను విప్పేయమని వెనుకనుండి కాకామహాజనితో చెప్పింది. ఆమె చెప్పినట్లే ఊయలను విప్పటానికి మహాజని మెల్లగా ముందుకు జరిగాడు. బాబా పట్టరాని కోపంతో కాకామహాజని మీదకు ఉరికారు. కొంతసేపటి తరువాత బాబా శాంతించాక ఊయలను విప్పడానికి అనుమతి కోరినప్పుడు, "అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు? ఇంకా దాని అవసరముంది కదా!" అన్నారు బాబా. బాబా ఊరికే ఏదీ అనరు. ‘మరి ఆ అవసరమేమిటి?’ అని ఆలోచించగా, 'బాబా చెప్పింది నిజమే! ఉత్సవం ఇంకా సమాప్తి కాలేద'ని వారికి స్ఫురించింది. శ్రీరామజన్మోత్సవం జరిగిన మరునాడు గోపాలకాలా ఉత్సవం జరిగితేనేగానీ ఉత్సవం సంపూర్ణం కాదు. ఇలా బాబా సన్నిధిలో జరిగే ప్రతి విషయంలోనూ రాధాకృష్ణమాయి ప్రమేయముండేది.
1913లో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నామసప్తాహమును కూడా రాధాకృష్ణమాయి ప్రారంభించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఆమే స్వయంగా చేసేది. భక్తులు వంతులవారీగా వచ్చి ఆ ఏర్పాట్లలో పాల్గొంటుండేవారు. రాధాకృష్ణమాయి కూడా తెల్లవారుఝామున నామసప్తాహంలో పాల్గొంటుండేది. శ్రీరామనవమి రోజున బాబా భక్తులకు సొంఠ్‌వడ (పంజిరి) ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. ఆ ప్రసాదాన్ని రాధాకృష్ణమాయి స్వయంగా తానే తయారుచేసేది. చాలారోజుల ముందు నుండే ఆమె ఆ ప్రసాదం తయారీకి చేయవలసిన పనులను ప్రారంభించి, ఎండిన అల్లం (సొంఠి), మెంతులు, గసగసాలు, కొబ్బరి, వాము బాగా ఎండబెట్టి, వేయించి, పొడి చేసి సిద్ధంగా ఉంచుకునేది. ఉత్సవం సందర్భంగా భారీఎత్తున అన్నసంతర్పణ కూడా జరిగేది. అందుకు అవసరమైన భోజనపదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలోనే తయారయ్యేవి. ఆమెతో సహా ఎందరో సాయిభక్తులు తమంతటతామే ఆ వంటపనులలో నిమగ్నమయ్యేవారు. రానురానూ ఈ ఉత్సవం అభివృద్ధిచెంది నేడు శిరిడీలో మహావైభవంగా జరుగుతోంది. ఈ విధంగా శిరిడీలో జరిగే కార్యక్రమాలకు, శిరిడీ వైభవానికి రాధాకృష్ణమాయియే మూలకారకురాలు.
బాబాపట్ల ఉన్న భక్తిప్రేమల వలన బాబా సేవలో ఏ కష్టానికీ ఆయీ చలించేదికాదు. అందుకు అద్దంపట్టే ఒక సన్నివేశాన్ని జస్టిస్ యం.బి.రేగే ఒక లేఖలో ఇలా వ్రాశాడు: "1914వ సంవత్సరం గురుపూర్ణిమ వేడుకలకు నేను హాజరవగలనో లేదోనని మొదట సందేహించాను. అయినప్పటికీ సమయానికి నేను శిరిడీ వెళ్లగలిగాను. నేనింకా అక్కడికి చేరుకోకముందే బాబా తమ భిక్ష నుండి ప్రతిరోజూ మామూలుగా పంపే ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని రాధాకృష్ణమాయికి పంపారు. దాంతో, ఆమెకు నేను శిరిడీ వస్తున్నట్లు అర్థమై, ఆ విషయాన్ని అందరికీ చెప్పింది. ఆమె ఇంటిలో వంట మొదలైంది. సరిగ్గా ఉదయం 9 గంటలకు నేను అక్కడికి చేరుకున్నాను. సాధారణంగా వంట ఆయీ ఇంటిలోనే జరిగేది. కానీ, “నువ్వు రాకపోయివుంటే వేరే ఎక్కడైనా వంట ఏర్పాట్లు చేసేదాన్ని” అని ఆమె నాతో చెప్పింది. అంతలో వంట చేస్తున్న వాళ్ళు మసాలా ద్రవ్యాలు నూరడానికి ఒక రాయి కావాలని అడిగారు. రాయిని ఇంటిలోకే తీసుకొస్తే మంచిదని తలచి నేను, ఆయీ కలిసి అతికష్టం మీద ఒక పెద్దరాయిని కదిలించాము. దాన్ని ఆయీ ఇంటి ద్వారం వద్దకు తీసుకొచ్చేసరికి పురంధరే వచ్చి సహాయం చేయబోయాడు. ఆ ప్రయత్నంలో రాయి ఒకవైపుకు ఒరిగి నా చేయి నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో హఠాత్తుగా ఆయీ ఆ రాయిని తనవైపుకు లాక్కుంది. దాంతో ఆమె కుడిచేతి చూపుడువేలు రెండుముక్కలయ్యేంతగా నలిగిపోయింది. ఆమెకు ఎంత బాధ కలిగివుంటుందో ఎవరైనా ఉహించవచ్చు. కానీ ఆయీ మాత్రం ఏమీ జరగనట్లు ఒక గుడ్డముక్కను నూనెలో తడిపి రక్తం కారుతున్న ఆ వేలికి చుట్టి వంటలో సహాయం చేయడానికి వెళ్ళింది. పనులన్నీ పూర్తయిన తరువాత ఆమె నన్ను పిలిచి, "నొప్పి చాలా తీవ్రంగా ఉంది, తోటలోకి వెళ్లి ఏడవాలని ఉంది" అని అన్నది. దాంతో ఇద్దరమూ తోటలోకి వెళ్ళాము. అక్కడ ఆమె అరగంటపాటు తనివితీరా ఏడ్చింది. తరువాత మేము తిరిగి మా సాధారణ పనులలో పడ్డాము. ఆమెకు తన శరీరంపై ఎంతటి నియంత్రణ! సద్గురు సేవలో బాధ, సంతోషాల పట్ల ఎంతటి ఉదాసీనత!"
బాబా – ఆయీలకు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ:
బాబాపట్ల ఉన్న అంతులేని ప్రేమతో రాధాకృష్ణమాయి వారి ప్రతి అవసరాన్నీ తెలుసుకొని ఎంతో శ్రద్ధగా సమకూర్చేది. అందుకే ఏ చిన్న అవసరమొచ్చినా, సమస్య ఎదురైనా అందరూ ఆమెనే సంప్రదించేవారు. ఒకసారి పురందరే తన కుటుంబంతో శిరిడీ వెళుతున్నప్పుడు, శ్రీమతి తర్ఖడ్ రెండు పెద్ద నల్లని వంకాయలను శ్రీమతి పురందరే చేతికి ఇచ్చి, ఒక వంకాయతో భరీత్ (వంకాయ వాడ్చి నూరిన పచ్చడి), రెండవదానితో వంకాయ వేపుడుకూర చేసి బాబాకు భోజనంలో వడ్డించమని కోరింది. మొదటిరోజున పురందరే భార్య వంకాయతో భరీత్ చేసి, మిగతా పదార్థాలతోపాటు దానిని కూడా బాబా భోజనపళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ భరీత్ తిని, వెంటనే తమకు వంకాయ వేపుడుకూర కావాలనే కోరికను వెలిబుచ్చారు. శిరిడీలో బాబా భోజన ఏర్పాట్లను చూసే రాధాకృష్ణమాయికి ఏం చేయాలో తోచలేదు. అది వంకాయలు దొరికే కాలం కూడా కాదు కనుక, శిరిడీలాంటి గ్రామంలో వంకాయలు దొరకడం కష్టం. అందువల్ల, ఆమె అక్కడున్న ఆడవారిని అడిగి, వంకాయ భరీత్ తెచ్చింది శ్రీమతి పురందరే అని తెలుసుకుని, పరుగున ఆమె వద్దకు వెళ్ళి, వంకాయలు ఇంకా ఉన్నాయేమోనని అడిగింది. అప్పుడామె తన దగ్గర ఇంకొక వంకాయ ఉందనీ, దానితో మరునాడు వంకాయ వేపుడుకూర చేసి బాబాకు సమర్పించాలని ఉంచినట్లు చెప్పింది. అప్పుడు రాధాకృష్ణమాయి ఆమెతో, బాబా అప్పటికప్పుడే తమకు వంకాయ వేపుడుకూర కావాలన్నారని చెప్పి, ఆ వంకాయను తీసుకెళ్ళి, త్వరత్వరగా వేపుడుకూర చేసి బాబా కొరకు పంపింది. బాబా ఆ వంకాయకూర వడ్డించేవరకు వేచి చూసి, దానిని స్వీకరించిన తరువాతే తమ భోజనం ముగించి లేచారు. బాబా, తమ భక్తులపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తీకరించడమే కాకుండా, తమ భక్తుల భక్తి, ప్రేమలను తాము స్వీకరించినట్లు తెలియచేసే అద్భుతమైన సంఘటన ఇది.
బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడేవారు. ఆ వ్యాధి వలన ఆయన భోజనం చాలా తక్కువగా తీసుకునేవారు. రోజూ మధ్యాహ్నంపూట లక్ష్మీబాయిషిండే తీసుకువచ్చే పాయసం మాత్రమే కొద్దిగా తింటుండేవారు. అందువలన బాబా రోజురోజుకీ నీరసించిపోతుండటంతో రాధాకృష్ణమాయి తట్టుకోలేక సాయిశరణానందకి ఒక లేఖ వ్రాసింది. "వామన్! బాబా ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మధ్యాహ్నంపూట పాయసం తప్ప ఏమీ తినటం లేదు. వారికిద్దామంటే ఇక్కడ మంచి చిక్కటి పాలు కావలసినన్ని దొరకటం లేదు. అందువల్ల నువ్వు రోజుకు సుమారు ఎనిమిది శేర్ల పాలిచ్చే కాఠియావాడీ ఆవును పంపితే చాలా బాగుంటుంది. ఇది బాబాకు ఉత్తమమైన సేవ అవుతుంది. ఒకవేళ అలాంటి ఆవు దొరికినట్లైతే గనక తాత్యాపాటిల్‌కి కూడా ఒక ఆవు కావాలట, అతనికోసం కూడా ఒక ఆవును కొను. అందుకోసం కావలసిన డబ్బును ప్రస్తుతం నువ్వు ఏర్పాటు చేయి. తరువాత నేను నీకిస్తాను" అని వ్రాసింది. ఆ సమయంలో అతని వద్ద డబ్బులేక తన చెల్లెలి చిన్నపూసల బంగారు గొలుసును అమ్మేసి రెండు ఆవులను కొని శిరిడీ పంపించాడు. ఆ ఆవు పాలను ఆయీ రోజూ బాబాకు నివేదించేది. అది ఆమెకు బాబాపట్ల ఉన్న ప్రేమ.
బాబా కూడా ఆమెపట్ల అంతే ప్రేమాదరాలు చూపేవారు. ఆమె శిరిడీ వచ్చినప్పటినుండి తాము ప్రతిరోజూ భిక్షకి వెళ్లొచ్చాక షామా ద్వారా ఆమెకు రొట్టె, కూర మొదలైనవి బాబా పంపుతుండేవారు. అంతేకాదు, ప్రతిరోజూ సాయంత్రం లక్ష్మీబాయిషిండే రొట్టె, కూర బాబాకు నివేదిస్తుండేది. బాబా కొంచెం తిని, మిగిలినది ఆమె ద్వారా రాధాకృష్ణమాయికి పంపుతుండేవారు. ఆ విధంగా ఆమె బాబా భుక్తశేషాన్నే భుజిస్తుండేది. అప్పుడప్పుడు రాత్రిపూట కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటీ లేదా ఇతర భక్తులు తమ ఆహారాన్ని తెచ్చి రాధాకృష్ణమాయితో పంచుకునేవారు. అందువలన ఆమెకు వంట చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రోజులో ఉదయంపూట ఒక్కసారే ఆమె బాబా కోసం అల్పాహారం తయారుచేయడానికి వంట చేసేది. ఆమె ధరించే తెల్లని వస్త్రాలను కూడా బాబానే ఆమెకు పంపుతుండేవారు. ఆ వస్త్రాలను ఆమె ఎంతో అమూల్యమైనవిగా భావించి ధరిస్తుండేది. అంతకుమించిన అవసరాలేమీ ఆమెకు లేనందున వేటినీ సమకూర్చుకొనవలసిన అవసరం ఉండేదికాదు. ఆమె మరణించేంతవరకు బాబా ఆమెకు అన్నవస్త్రాలు సమకూరుస్తూ, ఎవరూ లేని ఆమెకు అన్నీ తానయ్యారు. అంతటి భాగ్యురాలామె.
తరువాయి భాగం వచ్చేవారం ...
source: దేవుడున్నాడు లేదంటావేం?, శ్రీ సాయి సచ్చరిత్ర,
Jai Sairam
ReplyDeleteSri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊
ReplyDeleteOm sai ram baba ee gadda ni karginchu thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeletejai sai ram
ReplyDelete