సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాధాకృష్ణమాయి - మూడవభాగం



సద్గురు సేవే పరమధర్మంగా తరించిన ఆయీ 

రాధాకృష్ణమాయి బాబా పట్ల పూర్తి అంకితభావంతో ఉండేది. ఆమె శిరిడీ వచ్చేనాటికి, బాబాకు సంపూర్ణ శరణాగతి చెందిన బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే భక్తుడు మసీదును, చావడిని, బాబా లెండీకి వెళ్ళే దారులను శుభ్రపరుస్తుండేవాడు. నెమ్మదిగా ఆయీ అతను చేసే ఆ సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవడం ప్రారంభించింది. ఆ విషయమే ఆమె ఇలా చెప్పింది: "ఆ రోజుల్లో బాబా లెండీబాగ్‌కు వెళ్ళే దారిలోనూ, చావడి వద్దా నేవాస్కర్ పరిశుభ్రం చేస్తుండేవాడు. నేవాస్కర్ చేసే ఆ పనిని క్రమంగా నేను నా చేతిలోకి తీసుకున్నాను. అతను మరణించిన తరువాత ఆ పనినంతా నేనొక్కదాన్నే చేయటం మొదలుపెట్టాను. గ్రామస్థులు వచ్చేపోయే దారిలో రెండువైపులా మలవిసర్జన చేస్తూ, వారి పిల్లలను కూడా మలవిసర్జనకు కూర్చోబెట్టేవారు. చెత్త పడేసేవారు. ఆ చెత్తనూ, మలాన్నీ నేవాస్కర్ లాగానే పూర్తిగా నేనే శుభ్రం చేస్తుండేదాన్ని. ఒకసారి నేను బాగా జ్వరపడ్డాను. అది చలిజ్వరం. దాంతో చాలా నీరసపడిపోవటం వల్ల నేను నిద్రిస్తున్నాను. అప్పుడు బాబా నా దగ్గరకొచ్చి, నా నుదుటిపై ఊదీ పెట్టి, 'ఇంతగా శ్రమపడకు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో!' అని అన్నారు”. ఆయీకి తాను చేసే సేవలో ఎంత శ్రద్ధ అంటే, ఊడ్చి, నీళ్ళు చల్లిన తరువాత ఆ ప్రదేశంలో తన అడుగు కూడా పడకుండా చూసుకొనేది. అర్థరాత్రి దాటాక దీక్షిత్ వాడా వెనుక ఉన్న బావి నుండి నీళ్లు తెచ్చి ద్వారకామాయిలోని రెండు కుండలు నింపేది.

బాబా కిళ్లీలను ఎంతగానో ఇష్టపడేవారు. రాత్రీపగలూ ఏ వేళలోనైనా కిళ్ళీలు నమిలేవారు. ముస్లిం సాయిభక్తుడైన కొండాజీ లాల్‌భాయ్ షేక్ వందలాది కిళ్ళీలను బాబాకు సమర్పించేవాడు. బాబా తరచూ కొంతమంది భక్తులపై ఆ కిళ్ళీలను విసిరి, తినమనేవారు. వాళ్లతోపాటు తాము కూడా ఒక కిళ్ళీ తినేవారు. ఆ తర్వాత కొంచెం నీళ్లు త్రాగేవారు. రాధాకృష్ణమాయి శిరిడీ వచ్చినప్పటినుండి ఆ సేవను తానే చేయసాగింది. ఆమె కిళ్ళీలను తయారుచేసి బాబా భోజనానంతరం పంపేది. ఆ పద్ధతిని సంస్థాన్ ఇప్పటికీ కొనసాగిస్తోంది.

శిరిడీలో ఆరతి సంప్రదాయాన్ని ప్రారంభించినది శ్రీతాత్యాసాహెబ్ నూల్కరే అయినప్పటికీ తెరవెనుక ఉండి అందుకు రూపకల్పన చేసింది మాత్రం రాధాకృష్ణమాయియే. శ్రీసాయిబాబాకు ఆరతి చేసే ఆచారం ఆమె మనసులో పురుడుపోసుకున్నదే. ఆమే నిజమైన ప్రత్యక్ష అనుసంధాన కర్త. అతి తక్కువ సమయంలోనే ఆమె శిరిడీలో భక్తి వ్యక్తీకరణలో కొత్త ఒరవడులను ప్రవేశపెట్టింది. పండరీపురంలో విఠలుని ఆరాధించే అన్ని ఆడంబరాలు, అలంకారాలతో తన సాయివిఠల్‌ను పద్ధతిగా ఆరాధించాలన్నది ఆమె మనసులోని కోరిక. దాదాపు అదే తన జీవితాశయంగా మలుచుకుంది. ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ఆమె అవిశ్రాంతంగా శ్రమించేది. ఆ ప్రయత్నాలలోనే ఆమె బాబాకు సామూహిక ఆరాధనను ప్రారంభించింది. బాబా చావడికి వెళ్లినరోజు శేజ్ ఆరతి, కాకడ ఆరతి ప్రారంభించి, ఎంతో బాధ్యతగా ఆ ఆరతులు సమయానికి జరిగేలా చూసుకొనేది. ఛత్రచామరాలు మొదలైన వైభవాలను కూడా తీసుకొచ్చింది. బాబా చావడిలో నిద్రించేటప్పుడు చోప్‌దార్ల లల్కారీ సంప్రదాయం, సంగీత వాయిద్యాలతో భజన, గుర్రం, జెండాలు మొదలైన హంగులన్నీ ఆయీ ప్రయత్నాల కారణంగానే సమకూరాయి. అయితే తన ప్రయత్నాలకు బాబా అనుమతి పొందడం మాత్రం ఆమెకు ఎప్పుడూ కష్టమయ్యేది. ఎందుకంటే, తరువాతి కాలంలో బాబా కొన్ని కారణాల వల్ల ఆమె విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఆమెను తమ దరిదాపుల్లోకి రావడానికి కూడా బాబా అనుమతించేవారు కాదు.

1910వ సంవత్సరంలో మొదటిసారి బాబాను దర్శించి, అప్పటినుండి ఎప్పుడు శిరిడీ వెళ్ళినా ఆయీ ఇంటిలోనే బసచేసే సాయిభక్తుడు రేగే, "నాకు తెలిసినంతవరకు రాధాకృష్ణమాయి బాబా ముందుకు వెళ్ళేది కాదు" అని చెప్పాడు. రేగే చెప్పిన దానిని బట్టి 1910లో లేదా అంతకుముందే రాధాకృష్ణమాయిని తమ ఎదుటకు రాకుండా బాబా నిషేధించినట్లు అర్థమవుతుంది. అయితే, ఖచ్చితంగా ఎప్పుడు, ఏ కారణం చేత బాబా ఆమెను నిషేధించారన్న స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. కానీ కాస్త లోతుగా అధ్యయనం చేసినట్లయితే, సమర్థ సద్గురువైన బాబా తమ భక్తుల యోగ్యతను అనుసరించి వారికి వివిధ రకాల సాధనా పద్ధతులను విధించేవారని అర్థమవుతుంది. ఉదాహరణకు బాబా ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్‌తో, “కాకా! నువ్వు నీ వాడా పైఅంతస్తులోనే ఉండు. అక్కడికి, ఇక్కడికి తిరగకు. జనసందోహంతో మనసును కలవరపరిచే ఇక్కడికి (మసీదుకి) కూడా రావద్దు" అని ఆదేశించి, అతనిని శిరిడీలోనే తొమ్మిది నెలల పాటు ఏకాంతవాసంలో ఉంచారు. అలాగే, భార్య మరణంతో విరక్తి చెంది కుటుంబ భారాన్ని కొడుకుకి అప్పగించి శిరిడీ వచ్చి బాబా పాదాలను ఆశ్రయించిన బాలారామ్ మాన్కర్ అనే భక్తుని ఆధ్యాత్మికోన్నతికోసం బాబా అతనికి 12 రూపాయలిచ్చి, సతారా జిల్లాలోని మచ్ఛీంద్రగఢ్ వెళ్లి, అక్కడ రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమని ఆదేశించారు. అలాగే, "ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు; ఖండోబా కృప లభిస్తుంది" అని ఉపాసనీని ఆదేశించారు బాబా. అదేవిధంగా రాధాకృష్ణమాయి యొక్క పారమార్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొనే బాబా ఆమెను తమ ఎదుటకు రాకుండా నిషేధించి ఉండవచ్చు. అయినా బాబా ఆమెను కేవలం తమ ముందుకు రావద్దని నిషేధించారేగానీ, శిరిడీ విడిచి వెళ్ళిపొమ్మనిగానీ, తమకు సంబంధించిన విషయాల్లో కల్పించుకోవద్దనిగానీ ఆదేశించలేదు. ఆయీ కూడా తన సద్గురువైన బాబా వాక్కు పట్ల ఉన్న గౌరవంతో నేరుగా వారిని దర్శించే ధైర్యం ఎప్పుడూ చేసేది కాదు. అయినప్పటికీ తనదైన రీతిలో ఇతర భక్తుల ద్వారా తన ఉనికిని చాటుకునేది. చావడి ఊరేగింపు, శ్రీరామనవమి వేడుకలు, గోపాలకాలోత్సవం, ప్రతిరోజూ ఆరతుల నిర్వహణ మొదలైన ఎన్నో సంస్థాగత వేడుకల వెనుక ఆమె పనితీరు అదృశ్యంగా ఉండేది. ఇతరులు 25 సంవత్సరాలలో కూడా సాధించలేనిది ఆమె కేవలం 8 సంవత్సరాలలోనే సాధించింది. ఆమె తన సేవ, నిరంతర శ్రమలతో సంస్థాన్‌కి  ప్రస్తుత రూపాన్ని తీసుకొచ్చింది.

తాము నివసించే మసీదు శిథిలావస్థలో ఉన్నా బాబా ఎన్నడూ పట్టించుకోలేదు. భక్తులు తమంతట తాము ఆయన వద్దకు వచ్చి మసీదు మరమ్మతులు చేస్తామని తమ కోరికను వెలిబుచ్చినప్పుడు కూడా శని, హనుమాన్ మందిరాలను చూపించి వాటికి మరమ్మతులు చేయించమని చెప్పేవారేగానీ మసీదును పునరుద్ధరించమని ఏనాడూ బాబా కోరలేదు. 1911లో రాధాకృష్ణమాయి ఎంతో శ్రమకోర్చి ఇతర భక్తుల సహాయంతో మసీదులో రాళ్ళను పరిపించింది. అందుకోసం అవసరమైన ఇసుక, సున్నం మొదలైన ముడిపదార్థాలను భక్తులతో తెప్పించి, బాబా చావడిలో నిద్రించిన రాత్రి ఆ పనులు పూర్తి చేయించింది. అంతేకాదు, మసీదు ఆవరణలో వెదురు కర్రలతో హద్దు ఏర్పాటు చేసి, ప్రతిరోజూ ఆవుపేడతో అలికి శుభ్రంగా ఉంచేది. మసీదు గోడలను ఆవుపేడతో అలికి అందంగా అలకరిస్తుండేది. బాబా ప్రతిరోజూ 'లెండీ'కి వెళ్ళి వస్తుండేవారు. ఆ సమయంలో బాబాకు ఎండ తగలకూడదని రాధాకృష్ణమాయి సాటి సాయిభక్తులతో కలసి ఆ దారి పొడవునా వంపుగా ఉండే ఇనుప స్థంభాలు పాతించి, వాటికి ఇనుపతీగలు బిగించి పందిరిలా ఏర్పాటు చేసి వాటిపై అందమైన లతలను ప్రాకించింది. నిత్యం వాటికి నీరుపెట్టి, వాటి పెరుగుదల విషయంలో శ్రద్ధ వహించేది. తన వద్ద ధనం లేకపోయినప్పటికీ మసీదును, చావడిని అందంగా అలంకరించిన ఘనత కూడా ఆమెదే. భక్తులు ప్రేమతో ఎన్నో రకాల కానుకలను బాబాకు సమర్పిస్తుండేవారు. అటువంటి కొంతమంది భక్తుల ద్వారా ప్రతినిత్యం బాబాను పూజించటానికి అవసరమయ్యే దీపాలు, గంట, పూజాపళ్లెం మొదలైన ఇతర సామాగ్రి అంతా ఆయీ సేకరించింది. అయితే బాబా మాత్రం ఎల్లప్పుడూ వాటిపట్ల ఉదాసీనంగా ఉండేవారు, వాటి భద్రత గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. ఆయీనే ఎంతో శ్రద్ధతో వాటిని తన అధీనంలో భద్రపరిచేది.
రాధాకృష్ణమాయి బాబా సేవలో తాను ఉండటమేకాక తోటి భక్తులను కూడా బాబా సేవలో నిమగ్నపరిచేది. ఆమెలో బాబాపట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణా వుండేవి. శిరిడీ గ్రామస్థులు మొదలుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ ఆమెను ఎంతగానో గౌరవించేవారు. ఆమె ఏదైనా చెబితే, కోటీశ్వరుడైన బూటీ దగ్గరనుండి వామనరావు, పురంధరే మొదలైన భక్తులందరూ ఆమె సూచనలను ఆదేశాలుగా భావించి వాటిని అమలుపరచడానికి ఆసక్తి కనబరిచేవారు. ఏ ఒక్కరూ ఆమె చెప్పినదాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. వామనరావు పటేల్ (సాయిశరణానంద) తనను తాను బాబాకు అర్పించుకున్న అంకిత భక్తుడు. బాబా మాట అతనికి వేదవాక్కు. ఒకసారి బాబా అతనితో, "నువ్వు ఈ ద్వారకామాయిని జాగ్రత్తగా చూసుకొనే విధంగానే రాధాకృష్ణఆయీ కుటీరాన్ని చూసుకోవాలి" అని అన్నారు. బాబా ఆజ్ఞను శిరసావహించి, ‘బాబాకు గొప్ప భక్తురాలైన ఆయీ ఒక 'యోగిని' అనీ, ఆమెను సేవించడం గొప్ప ధర్మమ’నీ తలచాడు వామనరావు. ఆమె ప్రోత్సాహంతో తాను చేసిన సేవ గురించి అతనిలా చెప్పాడు:

"బాబా ఆజ్ఞతో నేను రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాను. సేవ చేసేందుకు నాకలా అవకాశం లభించింది. మొదట్లో ఆయీ చెప్పినట్లు ఉదయంపూట బాబా ఫలహారం చేసే వెండిపాత్రలను మట్టితో తోమకుండా, బయటనుంచి పేడ తెచ్చి నేనే శుభ్రం చేసేవాణ్ణి. బాబా లెండీతోటకు బయలుదేరాక అక్కడికి వెళ్ళమని ఆయీ నన్ను ఆదేశించేది. ఆమె ఆజ్ఞానుసారం బాబా లెండీతోటకు వెళ్ళటానికి రోడ్డుమీదకు వెళ్ళినప్పుడే నేనక్కడికి వెళ్ళేవాణ్ణి. చాలాసార్లు ఆమె గది తలుపులు తెరిచేందుకు చాలా ఆలస్యమయ్యేది. అప్పుడు నేను లెండీకి ఆలస్యంగా వెళ్ళేవాడిని. అనేకసార్లు సకారణంగానో, అకారణంగానో ఆయీ నాపై తిట్లవర్షం కురిపించేది. అయితే నా మనసులో మాత్రం ‘ఆమె సేవ చేసేందుకే బాబా నన్ను ఆమె వద్దకు పంపార’న్న దృఢవిశ్వాసం ఉండేది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ మానరాదని ఏది ఏమైనా ఆ తిట్లను సహించి ఎంతో ఓర్పు వహించేవాణ్ణి. బాబా ఆ నిర్ణయం మీదే నన్ను దృఢంగా ఉంచారు. 

బాబా లెండీ నుండి వచ్చాక బాబా కూర్చొనే గట్టూ, పరుపూ, దిండూ చక్కగా అమర్చటంలో సాయపడుతుండేవాడిని. ఒకసారి అలా సాయపడుతున్నప్పుడు రాధాకృష్ణమాయి నాతో తగవుపడింది. ఆ తరువాత రెండు మూడ్రోజులు నేను ఆ సేవ చేయలేదు. ఇంతలో ఎవరో బాబాకు ఆకుపచ్చ రంగు సిల్కు జెండాలను కర్రలతో సహా బహుకరించారు. సాఠేవాడా నుండి బాబా లెండీతోటకు వెళ్ళే మార్గంలో వీధికి ఇరువైపులా దగ్గర దగ్గరగా గుంటలు త్రవ్వి, అందులో జెండాలు పాతిపెట్టే పని రాధాకృష్ణమాయి ప్రారంభించింది. రెండు మూడ్రోజుల తరువాత ఆ పని నాకు అప్పగించబడింది. అలా చాలారోజుల వరకూ నేనా పనిని చేసి దాన్ని పూర్తిచేశాను. ఈ బాధ్యత నా తలపై ఉండటంతో ఉదయం ఫలహారానంతరం బాబా దర్బారులో కూర్చునేందుకు అవరోధం ఏర్పడటంతో నా మనసుకి బాధ కలిగేది. అందువల్ల ఒకరోజు ఈ పనిని అలాగే వదిలేసి బాబా దర్బారులో కూర్చున్నాను. అప్పుడు బాబా నన్నేమీ అనలేదుగానీ, నన్ను దర్బారులోంచి లేపేశారు. దాంతో, జెండాలు పాతే కార్యక్రమం బాబా అనుమతితోనే రాధాకృష్ణమాయి ప్రారంభించిందనీ, ఆ సేవను మాని బాబా దర్బారులో కూర్చోవటం గొప్ప విశేషమని భావించటం నా పొరపాటనీ నేను తెలుసుకున్నాను. వెంటనే వెళ్లి జెండాలు పాతే పని మొదలుపెట్టాను. ఉదయంపూట వెళ్ళి బాబా దర్బారులో కూర్చోవాలనే ఆలోచనను తిరిగి నేను ఎన్నడూ చేయలేదు.

కొద్దిరోజుల తరువాత సాయంకాల వాహ్యాళి నుండి బాబా తిరిగి వచ్చాక, తాత్యాకోతేపాటిల్ బాబా దగ్గరకు రావటానికి ముందో తరువాతో నాకు గుర్తులేదుగానీ, ధునిలో సాంబ్రాణి వేయటమనే కార్యక్రమాన్ని రాధాకృష్ణమాయి నాచేత మొదలుపెట్టించింది. అయితే ఆ తరువాత ఏదో కారణంతో ఆమె నాతో తగవులాడి, ధూపం వేసే పనిని నాచేత చేయించటం ఆపేసి మరెవర్నో ఆ పనికోసం పంపటం మొదలుపెట్టింది. రెండ్రోజుల తరువాత బాబా ఆ వ్యక్తిని కోప్పడి, ధూపం వేయటం నుంచి అతన్ని తప్పించారు. సరిగ్గా అదేరోజు సాయంకాలం ఆయీ తన పొరపాటును గ్రహించి నేను చేస్తున్న సేవను మరొకరికివ్వటం తన తప్పేనని ఒప్పుకొని, మరుసటిరోజునుండి ఆ పనిని నాకే అప్పగించింది. ఆ రకంగా ఆ సేవ తిరిగి నాకే దక్కింది.

పైన చెప్పిన నిత్యసేవే కాకుండా నేను ప్రతిరోజూ తప్పనిసరిగా మశీదును శుభ్రపరచేవాడిని. పర్వదినాల్లోనే కాక వారానికొక్కసారి మశీదును కడిగి పేడతో అలికేవాళ్ళం. అలాగే ఉత్సవాల సందర్భాల్లో మట్టిగోడలూ, విరిగిన కిటికీలూ మరమత్తులు చేసి శుభ్రంగా అలికేవాళ్ళం. ఈ పనులన్నీ కూడా ఒక్కోసారి అందరితోపాటో, లేకపోతే ఆయీ, నేనూ కలిసో బాబా చావడికి వెళ్ళేరోజు రాత్రి ఎవరూ లేని సమయంలో చేసేవాళ్ళం. చావడి నుండి గురుస్థాన్ వరకూ వీధిలో గుంటలు త్రవ్వి వాటిలో చిన్న కమ్మీలు పెట్టి వాటిమీద ఇనుప జల్లెడ ఏర్పరచేవాళ్ళం. అలా తయారైన ఆర్చీల మీద చెట్ల తీగలు పెంచే పనిని రాధాకృష్ణమాయి నాతో కలిసి మొదలుపెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం బాబా లెండీబాగ్‌కి వెళుతుండగా చూసిన రాధాకృష్ణమాయి, ‘ఈ ఆర్చీలు బాబా నడిచే మార్గంలో కూడా ఉంటే బాగుంటుంది’ అనుకున్నది. మేము దారిలో కొన్నిచోట్ల సున్నం వేసేవాళ్ళం. ఈ పనికోసం ఒకసారి సభామండపంలో పెద్దరాయి (బాబా కూర్చున్న రాయి) ఉన్న చోటులో సున్నమూ, కుంచెలూ తెచ్చి పెట్టుకున్నాం. రాధాకృష్ణమాయి వెనకాల సున్నం కలుపుకున్న తొట్టి ఉంది. తొట్టి ముందు నేనున్నాను. ఒకరిద్దరు పిల్లలు సున్నంలోని కుంచెను తీసుకుని సున్నాన్ని అటూ ఇటూ కెలికి క్రింద పోశారు. అయితే నేను శూన్యమనస్కుడనై అదంతా చూస్తూ నిలుచున్నాను. అంతలో రాధాకృష్ణమాయి జరుగుతున్నది గమనించి పట్టరాని కోపంతో నా చెంపపై రెండు దెబ్బలు వేసి, “ఆ పిల్లలు సున్నమంతా అలా నాశనం చేస్తుంటే నీకు కళ్ళు కనిపించటం లేదా?” అన్నది. నన్నలా కొట్టినందుకు ఆమె బహుశా పశ్చాత్తాపపడి ఉండవచ్చు. ఎందుకంటే, నేను నా గదికి వెళ్ళిన వెంటనే ఆమె కూడా నా వెనుకే వచ్చి నన్ను పలకరించింది.

ఒకసారి ప్యాకింగులో వచ్చిన చిన్న చిన్న అందమైన కాగితం ముక్కలతో పువ్వులు చేసి, వాటితో హారాలు తయారుచేసే పనిని రాధాకృష్ణమాయి నాకు అప్పగించింది. నాకు సమయం చిక్కినప్పుడు ఆ పనిని నా గదిలో కూర్చొని చేస్తుండేవాడిని. ఈ హారాలన్నిటినీ రాధాకృష్ణమాయి సంతోషంగా చావడి మూలల్లో అలంకరించేది. గుఱ్ఱం కోసం సజ్జలు నానబెట్టి వాటిని దంచే పనిని నేను గంటల తరబడి చేసేవాడిని. పదకొండు నెలలు శిరిడీలో ఉన్న తరువాత నేను ముంబాయి వెళ్లి, మళ్ళీ మే నెలలో శిరిడీ వెళ్ళేటప్పటికి అక్కడ వట్టివేళ్ళ తడికలు తయారుచేసే పని జరుగుతోంది. రాధాకృష్ణమాయి ఆ పనిని నాకు నేర్పింది. ఈ పని కూడా నేను చాలా చేశాను. ఏదైనా పని నాకు రాకపోతే రాధాకృష్ణమాయి నన్ను ప్రేమగా తనవద్ద కూర్చోపెట్టుకొని ఆ పనిని నేర్పించేది. ఉపయోగించగా మిగిలిన కొవ్వొత్తులలోని కొవ్వుని మళ్ళీ కరిగించి మూసలో పోసి కొవ్వొత్తులు తయారుచేసే పనిని నేను కొన్నిరోజులు చేశాను. ఒక్కోసారి సేవచేసే సమయంలో కొన్ని వస్తువులు నా చేతుల్లో విరగటాలు, పగలటాలు కూడా జరిగేవి. ఒకసారి మశీదులోదో లేక చావడిలోదో ఒక గాజు డోమ్ నా చేతుల్లో పగిలింది. మరోసారి రాధాకృష్ణమాయి అలమరా శుభ్రం చేసేటప్పుడు గాజు జాడీనో లేక దాని మూతో నా చేతుల్లో పగిలిపోయింది. క్రొత్త జాడీ తెచ్చిద్దామనే ఉద్దేశ్యంతో నేను ఆ జాడీని దాచిపెట్టాను. శ్రీవామనరావు నార్వేకర్‌ని నా డబ్బుతో క్రొత్త జాడీ, గాజు డోమ్ తెమ్మని అర్థించాను. ఈ మాట ఆయన రాధాకృష్ణమాయితో చెప్పేశాడు. అలా చేయటానికి ఆమె అంగీకరించకపోవటం వల్ల నేను ఊరుకున్నాను.

ఒకసారి నేను ఒక విచిత్రమైన మానసికస్థితిలో ఉన్నాను. ఆరోజు బాబా స్నానానికి సిద్ధమవుతుండగా రాధాకృష్ణమాయి నా రెండు భుజాలమీదా తువ్వాలు వేసి 'పద' అన్నది. నేనక్కడికి వెళ్ళేటప్పటికి బాబా స్నానం పూర్తిచేసి నిలుచొని ఉన్నారు. భక్తులు ఆయన శరీరాన్ని తుడుస్తున్నారు. కానీ నేనో చెట్టులాగా శూన్యమనస్కుడినై అలాగే నిలబడిపోయాను. ఎవరో ఒకతను నేను అన్యమనస్కంగా ఉండటాన్ని చూసి నా భుజం మీదున్న తువ్వాలును తీసుకుని బాబాను తుడవటం ప్రారంభించాడు. నా భుజాల మీద తువ్వాలు పెట్టిన రాధాకృష్ణమాయి ఉద్దేశ్యం అప్పుడర్థమైంది నాకు. నేను తువ్వాలు తీసుకొని కేవలం మసీదుకు వెళ్ళటం కాదు, బాబా శరీరాన్ని నా చేతులతో తుడిచి సేవచేసుకోవాలన్నదే ఆమె ఉద్దేశ్యం. కానీ అప్పుడు నేనున్న మానసికస్థితిలో సేవచేసే సాధనమూ, సేవచేసే సమయమూ వచ్చి కూడా బాబాకు సేవ చేసుకోలేకపోయాను".

ఈవిధంగా రాధాకృష్ణమాయి బాబాకు అవసరమైనది చేస్తూ, ఇతర భక్తులతో చేయిస్తూ పగలురాత్రి తేడా లేకుండా రోజంతా బాబా సేవలో నిమగ్నమై ఉండేది.

source: దేవుడున్నాడు లేదంటావేం?

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo