1. ఆపధ్భాంధవుడై ఆదుకుంటున్న బాబా
2. సర్వదా అండగా ఉంటూ కాపాడుతున్న బాబా
3. 'భయపడకు, నేను నీతోనే ఉన్నాను'
ఆపధ్భాంధవుడై ఆదుకుంటున్న బాబా
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు మహేష్. శ్రీసాయినాథునికి, మా ఇంటి ఇలవేల్పు శ్రీ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామికి నమస్కరిస్తూ; బ్రహ్మాండనాయకుడు శ్రీ సాయిబాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒకరోజు మా ఇంట్లో ఏడాదిన్నర వయస్సున్న మా అక్క కొడుకు ఆడుకుంటూ అన్నం తింటున్నాడు. హఠాత్తుగా వాడు ఎటు వెళ్ళాడో గానీ, ఇంట్లో ఎక్కడ చూసిన కనపడలేదు. మేమందరం చాలా కంగారుపడి ఇంటి బయట, చుట్టూ పక్కన ఇళ్లలో వెతుకుతున్నాము. మా అమ్మ రోడ్డు మీదకి వెళ్ళి వెతకసాగింది. అయినా వాడెక్కడా కనపడలేదు. అప్పుడు నేను, "నా మేనల్లుడు త్వరగా కనిపించేలా చేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. నేను బాబాను వేడుకుని ఒక నిమిషం కూడా కాలేదు, అమ్మ మా ఇంటినుండి కొంచం దూరంగా వెళ్లేసరికి అక్కడొక ఇంటి దగ్గర బాబు కనిపించాడు. కేవలం బాబా దయవలనే అంత త్వరగా బాబు కనిపించాడు.
2021, నవంబర్ 6న మా కుటుంబం, ఇంకా కొంతమంది మా బంధువులు కలిసి ఒక వ్యాన్‌లో మొక్కులు చెల్లించడం కోసం వేములవాడ, కొమురవెల్లి యాత్రలకు బయలుదేరాము. ఆ వ్యాన్ డ్రైవర్‌కు సరిగా డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రయాణంలో మాకు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడు నేను, "బాబా! మేము అందరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, కొమురవెల్లి మల్లిఖార్జునస్వామిల దర్శనం మంచిగా చేసుకుని, మొక్కులు చెల్లించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకునేలా దయ చూపండి" అని అనుకున్నాను. అంతవరకు ఇబ్బందులను ఎదుర్కుంటూ ప్రయాణాన్ని సాగిస్తున్న మాకు బాబాకు మొక్కుకున్నంతనే తరువాత ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కొమురవెల్లి చేరుకుని దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నా కడుపులో విపరీతంగా నొప్పి మొదలయ్యింది. అప్పుడు నేను, "ఈ నొప్పి నుండి కాపాడు బాబా" అని మనసులో అనుకున్నాను. వెంటనే నొప్పి తగ్గటం ప్రారంభమై 2, 3 నిమిషాల్లో పూర్తిగా తగ్గింది. బాబా అనుగ్రహంతో రెండు యాత్రలు పూర్తి చేసుకుని క్షేమంగా ఇల్లు చేరుకున్నాము. ఈ విధంగా బాబా మమ్మల్ని ఆపధ్భాంధవుడై ఆదుకుంటున్నారు. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని ఆదుకోండి బాబా. సాధారణంగా మా ఇంట్లో అందరం కలిసి బాగానే ఉంటాం బాబా. కొన్ని సందర్భాల్లో మాత్రం నాన్న రాత్రి వేళల్లో తాగి నాతో, అమ్మతో గొడవ పడుతుంటారు. నాన్న తాగుడు మానేసి అమ్మతో, ఇంకా మా అందరితో కలిసి ఆనందంగా జీవించేలా అనుగ్రహించండి బాబా. ఇంకా మీపై భారమేసి, మీ అనుగ్రహంతో ఒక వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను బాబా. నా జీవితాన్ని సెటిల్ చేసే బాధ్యత మీదే బాబా. నా జీవితం అనే పగ్గాలను మీకు అందించాను. ఇంక నన్ను నడిపించే పూర్తి బాధ్యత మీదే దేవా. మమ్మల్ని మీరు ఆదుకుంటారనే పూర్తి నమ్మకం నాకు ఉంది బాబా. లవ్ యు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సర్వదా అండగా ఉంటూ కాపాడుతున్న బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మూసానపల్లి నిరంజనరెడ్డి. మాది ఆదోని ప్రక్కన ఒక చిన్న గ్రామం. నేను బెంగుళూరులో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. బాబాతో నా అనుబంధాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి సాయిబాబా భక్తుడిని. నా సద్గురువైన సాయిబాబా కష్ట సమయంలో నాకు అండగా నిలబడి ఎన్నోసార్లు సహాయం చేశారు, ఎంతో మేలు చేసారు. 2009లో క్యాన్సర్ చికిత్స నిమిత్తం మా అమ్మని కిడ్వాయిలోని క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించాము. ఆ సమయంలో నా వద్ద డబ్బులు లేక చాలా ఇబ్బందిపడ్డాము. పైగా మేము హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికే ఆపరేషన్ కోసం పేషంట్లు క్యూలో ఉన్నందున మా అమ్మకి తొందరగా వైద్యం అందే పరిస్థితి ఏ మాత్రమూ లేదు. మాకు ఏమీ అర్థంకాక సహాయం కోసం బాబాను ప్రార్థించాము. ఆయన దయవల్ల ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మా తమ్ముడుకి ఒక సివిల్ ఇంజనీరుతో బాగా పరిచయముంది. ఆ ఇంజనీరు కిడ్వాయి హాస్పిటల్లో డాక్టరుగా పనిచేస్తున్న తన సన్నిహిత స్నేహితునికి ఫోన్ చేసి మాట్లాడాడు. అంతే, మూడు రోజుల్లో అమ్మని అడ్మిట్ చేసుకున్నారు. డబ్బులు కూడా బాబా అనుగ్రహం వల్ల సమయానికి ఇ.ఎస్.ఐ ద్వారా సమకూరడంతో వారంలోపే అమ్మకి ఆపరేషన్ జరిగింది. మా కన్నా రెండు నెలలు ముందు నుంచి ఆపరేషన్ కోసం వేచి చూస్తున్న చాలామంది 'వారమైనా గడవక ముందే మీ అమ్మకు అపరేషన్ ఎలా చేసార'ని వాపోయారు. డబ్బుకి, ఆపరేషన్‌కి ఎటువంటి సమస్యలు లేకుండా బాబానే కాపాడారు. ఆ సమయంలో నేను, మా అక్క అమ్మకోసం ఎంత తల్లడిల్లిపోయామో, కష్టపడ్డామో ఆ శిరిడీ సాయిబాబాకే తెలుసు. ఇప్పటికీ నేను ఆనాడు బాబా మాపై చూపిన అనుగ్రహాన్ని తలచుకుంటూ ఉంటాను. ఆపరేషన్ అయినాక మా అమ్మ దాదాపు 11 సంవత్సరాలు జీవించారు. అలాగే మా పెద్దపాప విషయంలో, 'నేను మీకు తోడున్నాన'ని గుర్తు చేశారు బాబా. నా విషయంలో కూడా సర్వదా అండగా ఉంటూ నన్ను కాపాడుతూ వస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని, మీ మేలును నేను ఎప్పుడూ మరచిపోను తండ్రి".
చివరిగా సాయిభక్తులందరికీ ఒక విన్నపం: 'మనం బాబా పాదాలకు నమస్కరించి, "నువ్వే మాకు దిక్కు" అని సర్వస్యశరణాగతి వేడటమే మనం చేయాల్సింది. బాబా మన వెంటే ఊంటారు. అందుకు నేనే సాక్ష్యం. మనం బాబా మీద ఎంత నిష్ఠ కలిగి ఉంటే అంత మేలు ఆయన నుండి పొందుతాము'.
'భయపడకు, నేను నీతోనే ఉన్నాను'
అందరికీ నమస్తే. భక్తులు బాబాతో తమకున్న అనుభవాలను పంచుకోవడానికి అనువుగా ఈ బ్లాగును ఒక వేదికగా అనుగ్రహించిన బాబాకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, నవంబర్‌లో ఒకరోజు మా చిన్న తాతగారి భార్య ఆరోగ్యం బాగలేకపోతే మేము ఆమెను చూడటానికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఆమె మాట్లాడుతుంది కానీ, ఏమీ తినట్లేదు. నాకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి 'తనకు ఏమైనా అవుతుందేమో, మైలు లాంటివి వస్తాయేమో!' అని లోలోపల భయంగా ఉండి బాబాను వేడుకున్నాను. తరువాత అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు బస్సులో నా ఫోన్ చూసుకుంటే, మా వదిన దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అన్ని మిస్స్డ్ కాల్స్ చూసి, 'ఏదో విషయం లేకపోతే అన్ని సార్లు ఎందుకు కాల్ చేస్తార'ని నాకు చాలా భయమేసి, "బాబా! నేను భయపడుతున్నట్లు ఏమీ లేకుండా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అలాంటిదేమీ జరగలేదు.
తరువాత కార్తీకమాసం సందర్భంగా నేను మా కుటుంబసభ్యులతో కలిసి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలో పాల్గొన్నాను. పూజ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి నా మనస్సు చెదిరి చాలా ప్రతికూల ఆలోచనలు రాసాగాయి. సుబ్రహ్మణ్యస్వామి మహిమ(శక్తిసంపన్నుడు) గల దేవుడు అయినందున నేను చాలా భయపడి, "బాబా! నాకు ఏ ఇబ్బంది లేకుండా కాపాడండి" అని బాబాని ప్రార్థించాను. అప్పుడు నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఒక సైటులో, "భయపడకు, నేను నీతో ఉన్నాను" అనే బాబా మెసేజ్ కనిపించింది. అది చూసి నేను చాలా సంతోషించాను. తరువాత వారి ఆశీర్వాదంతో నేను ప్రశాంతంగా మిగిలిన అన్ని పూజావిధులు పూర్తి చేసాను. మరుసటిరోజు, "నీ ప్రయాణమంతా నేను నీతోనే ఉన్నాను" అనే మరో సందేశం ద్వారా నాకు మరోసారి తాము నాతోనే ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈవిధంగా బాబా ఎల్లప్పుడూ నా విషయంలో శ్రద్ధ వహిస్తూ నన్ను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om sai ram today I started sai Divya pooja for 5 weeks. With his blessings I want to complete that vrata.Baba you are my guru. I love you tandri. You are only my hope. Om sai ram��❤❤❤
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sri sai naathaaya namaha
ReplyDeleteBaBa Naa flat manchi rate ki ammudu poyetattu chudu baba
ReplyDelete